మోడీకి పటేల్ ఆమోదం ఉండేది కాదు -పటేల్ బయోగ్రాఫర్


Rajmohan Gandhi

బి.జె.పి ప్రధాని పదవి అభ్యర్ధి నరేంద్ర మోడీని సర్దార్ పటేల్ తన వారసుడిగా ఆమోదించి ఉండేవారు కాదని పటేల్ జీవిత చరిత్ర రచయిత రాజ్ మోహన్ గాంధీ వ్యాఖ్యానించారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ నిర్వహించే ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ మోహన్ గాంధీ మోడిని తన సైద్ధాంతిక వారసునిగా ఆమోదించకపోగా ముస్లింల పట్ల ఆయన వ్యవహరించిన తీరుపట్ల ఎంతో ఆవేదన చెందేవారని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీకి మనవడు కూడా అయిన రాజ్ మోహన్ గాంధీ భారత దేశ మొట్టమొదటి హోమ్ మంత్రి బయోగ్రఫీకి రచయిత.

2002 నాటి గుజరాత్ మారణకాండ సందర్భంగా మోడి తన ‘రాజధర్మాన్ని’ నిర్వర్తించినట్లుగా పటేల్ భావించి ఉండేవారు కాదని రాజ్ మోహన్ అన్నారు. గుజరాత్ అల్లర్ల అనంతరం ఆ రాష్ట్రం పర్యటించిన అప్పటి ప్రధాని వాజ్ పేయ్ ఇదే మాట అన్నారు. ‘రాజధర్మం’ నిర్వహించడంలో మోడి విఫలం అయ్యారని ఆయన నరేంద్ర మోడిని విమర్శించారు.

“భారత దేశ రాజ్య ధర్మ నిర్వాహకునిగానే కాక గుజరాత్ నుండి వచ్చిన వ్యక్తిగా కూడా పటేల్ చాలా నిరాశకు గురయ్యేవాడన్నది అనుమానం లేకుండా చెప్పొచ్చు. గుజరాత్ లో ఇలాంటి ఘోరం జరగాల్సింది కాదని ఆయన చాలా బాధపడి ఉండేవారు. ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం దానిని నివారించకుండా ఉన్నందుకు చాలా విచారానికి గురయ్యేవారు” అని రాజ్ మోహన్ గాంధీ ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో వ్యాఖ్యానించారని ది హిందు తెలిపింది.

బి.జె.పి మద్దతుదారులు గానీ, లేదా మోడీయే స్వయంగా గానీ పటేల్ కు సైద్ధాంతీక వారసునికి చెప్పడం, చెప్పుకోవడం అంటే పటేల్ ను సరిగా అర్ధం చేసుకోకపోవడమేనని తీర్మానించారు రాజ్ మోహన్. అది పటేల్ కు తప్పుడు ప్రాతినిధ్యం ఇవ్వడమే అని కూడా ఆయన అన్నారు.

“మోడి, పటేల్ సాధించిన ఇమేజ్ స్ధాయికి చేరితే అది చాలా గొప్ప విషయమే. కానీ రెండు కారణాల రీత్యా ఆయన కిందనే ఉన్నారు. గాంధీ శిష్యుడిగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గొడుగు కింద పటేల్ వృద్ధి చెందారు. కానీ మోడి ఆర్.ఎస్.ఎస్ గొడుకు కింద తన కెరీర్ ను నిర్మించుకున్నారు. అక్కడే తేడా ఉంది. అంతే కాకుండా పటేల్ ఒక వ్యక్తిగా ఎల్లప్పుడూ బృందం నిర్మాతగా (team builder) ఉన్నారు; ఆయన నిత్య జీవితంలోని ఇతరులు కూడా ప్రముఖ వ్యక్తులే. మోడి అలాంటి వారా కాదా అన్నది…. ఆయన అలా ఉంటే బాగుండేది” అని రాజ్ మోహన్ అర్ధోక్తిలోనే అసలు విషయం చెప్పారు.

నరేంద్ర మోడి తన చుట్టూ ఉన్నవారిని ఎవరూ ఎదగనివ్వరన్న విమర్శ అందరికి తెలిసినదే. తానే సుప్రీంగా ఉండాలన్న మోడి ధోరణి వల్లనే విశ్వ హిందూ పరిషత్ లాంటి ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్ధల నాయకులతోనూ ఆయనకు అనేక విభేదాలు ఏర్పడ్డాయి. ఈ విభేదాలు ఎంత తీవ్ర స్ధాయిలో ఉన్నాయంటే ఆర్.ఎస్.ఎస్. భజరంగ దళ్ లాంటి సంస్ధలు కూడా ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారని పత్రికలు చెప్పేంతగా. అద్వానితో ఆయన విభేదాల విషయం అందరికీ తెలిసిన విషయమే. గురువును కూడా పూర్వపక్షం చేయగల ప్రతిభ మోడిదయితే బృందంలో ఒకరిగా దేశ నిర్మాణానికి పూనుకోవడం పటేల్ వ్యక్తిత్వం. అనగా మోడీకి, పటేల్ కూ నక్కకూ నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉందన్నమాటే!

పటేల్ ను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందన్న ఆరోపణను మాత్రం రాజ్ మోహన్ గాంధీ అంగీకరించారు. పటేల్ మరణం తర్వాత 63 యేళ్ళ పాటు ఆయనను కాంగ్రెస్ వెనకకు నేట్టిందని రాజ్ మోహన్ వ్యాఖ్యానించారు. నెహ్రూ అనంతరం ఇందిరా, సంజయ్, రాజీవ్, సోనియా, ఇప్పుడు రాహుల్ గాంధీలు వారసులుగా అవతరిస్తూ వచ్చారనీ, కానీ పటేల్ పిల్లలు మాత్రం ఆయన అధికారం నుండి ఎటువంటి ఫలితాలూ పొందలేదని రాజ్ మోహన్ అన్నారు.

పటేల్ పిల్లలు ఆయన వారసత్వం ద్వారా అధికారం అనుభవించినట్లయితే పటేల్ ను కాంగ్రెస్ గుర్తించినట్లు అని రాజ్ మోహన్ చెబుతున్నట్లు కనిపిస్తోంది. అదే నిజమైతే ఆయనతో విభేదించాల్సి వస్తుంది. నెహ్రూ-గాంధీ వంశ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు కాంగ్రెస్ ను విమర్శించడం మాని పటేల్ వంశ వారసత్వానికి అధికారం అప్పగించలేదని ఆక్షేపించడం సరైన విమర్శ కాబోదు.

పటేల్ తాను కాంగ్రెస్ వాదిని అయినందుకు గర్వించేవారని రాజ్ మోహన్ మరో ముఖ్య విషయం చెప్పారు. ప్రధాన మంత్రి పదవికి గాంధీ, నెహ్రూను ఎంపిక చేయడం పటేల్ కూడా ఆహ్వానించి ఆమోదించారని, ఆ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించారని ఆయన తెలిపారు. పటేల్, నెహ్రూ కంటే 14 సంవత్సరాలు పెద్దవారని, అంతే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అందుకే నెహ్రూ ఎంపిక సరైందని పటేల్ భావించారని తెలిపారు. నెహ్రూ అప్పటికే అంతర్జాతీయంగా ఖ్యాతి గడించి ఉన్నారని కూడా రాజ్ మోహన్ గుర్తు చేశారు.

1947 నాటి మత కల్లోలాల సందర్భంగా ఆర్.ఎస్.ఎస్ పోషించిన పాత్రను పటేల్ మెచ్చుకున్నారని, కానీ గాంధీ హత్యతో ఆయన వైఖరి పూర్తిగా మారిపోయిందని రాజ్ మోహన్ తెలిపారు. అప్పటి నుండి ఆయన హిందూత్వ సంస్ధకు తీరని వ్యతిరేకిగా మారారని, శత్రువుగా మారడం ఒకటే తక్కువని రాజ్ మోహన్ స్పష్టం చేశారు.

కాబట్టి మోడి అభిమానులు చరిత్రకు తమకు నచ్చిన రీతిలో భాష్యం చెప్పుకోవడం ఇకనైనా తగ్గించుకోవాలి. పచ్చి కాంగ్రెస్ వాదిగా నిలవడమే కాక కాంగ్రెస్ మనిషిని అయినందుకు ఆయన గర్వించారు కూడానని పటేల్ బయోగ్రఫీ రాసిన వ్యక్తి స్వయంగా చెబుతున్నా విషయాన్ని వారు గుర్తెరగాలి. మోడి చెప్పినట్లుగా పటేల్ ప్రధాని అయి ఉన్నట్లయితే భారత దేశ గమ్యం ఇప్పటికంటే భిన్నంగా ఏమీ ఉండేది కాదని రాజ్ మోహన్ మాటలను బట్టి భావించవచ్చు. నెహ్రూ భారతం అయినా, పటేల్ భారతం అయినా భారత దేశపు సగటు జీవికి మాత్రం తేడా ఏమీ లేదన్నది ప్రత్యేకంగా చెప్పాలా?

3 thoughts on “మోడీకి పటేల్ ఆమోదం ఉండేది కాదు -పటేల్ బయోగ్రాఫర్

  1. శేఖరు గారు,
    నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అభ్యర్దిత్వం దేశ ప్రజాస్వామికత్వానికి, లౌకీకత్వనికి పట్టిన దుస్తితిగా ఈ రోజు వచ్చిన ది “హిందు ” ఎన్‌. రాం గారి వ్యాసాన్ని తెనుగించగలరు.

  2. పటేల్ కు మొడీకీ సారం రీత్యా ఏమీతేడా లేదు. పైన ఏవొ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తప్పితె. ఆయన హొం మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణా పొరాటం జరుగుతుంది సైన్యాలు చిత్రహింసలు ఆపమని సుంధరైయ్య లాంటి వాళ్ళు కొరారు. ఆయన ఏ మాత్రం పట్టించుకొకుండా నాజీ పద్దతులు పాటించాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s