చాలా కాలంగా బ్యాంక్సీ వీధి చిత్రాల సందడి కళా ప్రియులకు కరువైపోయింది. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ II సింహాసనం అధిష్టించి 60 యేళ్ళు పూర్తయిన సందర్భంగా బాల కార్మికుడు బ్రిటిష్ పతాకాన్ని మిషన్ పై కుడుతున్న బొమ్మను గీసిన తర్వాత మళ్ళీ బ్యాంక్సీ జాడ లేదు. మళ్ళీ ఇన్నాళ్లకు “Better Out Than In” శీర్షికతో అక్టోబర్ నెల అంతా న్యూయార్క్ నగరంలోని పలు చోట్ల వీధి చిత్రాలు గీసి పలువురు కళా ప్రియులకు విస్మయానందాలను పంచి పెట్టాడు బ్యాంక్సీ.
ప్రభుత్వాల ఆధారిటీ మెచ్చని గ్రాఫిటీతో ప్రపంచ స్ధాయి సెలబ్రిటీగా మారిన బ్యాంక్సీ నిజానికి ఎలా ఉంటాడో ఇప్పటికీ ఎవరికీ తెలియక పోవడం ఆశ్చర్యం అనిపించినా నిజం. మొదట్లో బ్యాంక్సీ వీధి చిత్రాలను అరాచకంగా అభివర్ణించిన బ్రిటిష్ ధనిక వర్గాలు, ప్రాపర్టీల యజమానులు ఇప్పుడు బ్యాంక్సీ తమ గోడలను కనికరిస్తే అదే పదివేలని భావిస్తున్నాయి. ఆయన సంపాదించుకున్న క్రేజ్ అలాంటిది.
గ్రాఫిటి నగరాన్ని క్షీణింప జేస్తుంది అని న్యూయార్క్ నగర మేయర్ బ్లూమ్ బర్గ్ ప్రకటించినప్పటికీ బ్యాంక్సీ గీసిన గ్రాఫిటీని కాపాడుకోవడానికి ఆయా ప్రాపర్టీల యజమానులు సెక్యూరిటీని నియమించుకోవడం కింది ఫొటోల్లో చూడవచ్చు. అంతేనా? జనం కూడా వేలం వెర్రిగా ఎగబడుతూ బ్యాంక్సీ గీసిన వీధి చిత్రాలు మాయం అయ్యేలోపు తమ కెమెరాల్లో బంధించడానికి పోటీ పడడం కూడా ఫొటోల్లో చూడవచ్చు.
న్యూయార్క్ పోలీసులు బ్యాంక్సీ కోసం అనేక చోట్ల కాపలా కాసినప్పటికీ ఆయనను పట్టుకోవడంలో విఫలం అయ్యారని స్ధానిక పత్రికలు ప్రచురించిన వార్తలను బట్టి తెలుస్తోంది. ఆధారిటీని గేలి చేసే సునిశిత హాస్యం, రాజకీయ, సాంస్కృతిక విమర్శనాయుత చెమక్కులు, నాలుగైదు గీతల్లో కొండంత అర్ధాన్ని, సందేశాన్ని ఇచ్చే పెయింటింగ్ లను కింద చూడవచ్చు. ఈ ఫోటోలలో కొన్ని బ్యాంక్సీ వెబ్ సైట్, మరికొన్ని ‘ది అట్లాంటిక్’ పత్రికలు అందించాయి.
బ్యాంక్సీ బొమ్మలను మళ్ళీ చూడటం చాలా బాగుంది. ఈ చిత్రాలను చెరిపేసే ప్రయత్నం పెరిగినకొద్దీ వాటికి క్రేజ్ పెరగటం ఖాయం..
ఒక్కో బొమ్మను క్లిక్ చేసి, పెద్దదిగా చేసి చూస్తే వీటి ప్రత్యేకత తెలుస్తోంది. వీటన్నిటిలోనూ సిమెంట్ రాళ్ళతో కూర్చిన ‘స్ఫింక్స్ ’ బొమ్మ ప్రత్యేకంగా ఉంది!
మరే! స్పింక్స్ బొమ్మని ఇలా కూడా చెయ్యొచ్చని చెప్పడం ఒక్క బ్యాంక్సీకే చెల్లింది. ఆయన ఏది చేసినా సంచలనమే. ఆయన గీతల్ని కాపాడుకోడానికి గార్డులను కాపలా పెట్టుకోవడం గమనించారా? They are literally worried that Banksy’s graffiti would be destroyed by some miscreants. బ్యాంక్సీని miscreant గా చెప్పిన బాపతు వాళ్ళే ఇలా కాపలాకి దిగడం వెనుక బ్యాంక్సీ సాగించిన ప్రమాదకరమైన, ప్రతిఘటనాత్మక ప్రయాణం ఉన్నదంటే విస్తుపోక తప్పదు.