ఆయన పేరు ఎన్ పీతాంబర కురుప్. వయసు 73 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద మనిషి. మళయాళంలో కురుప్ అంటే అర్ధం ఏమిటో తెలియదు గానీ తెలుగు అర్ధానికి తగినట్లుగా వ్యవహరించి వార్తలకెక్కాడు. అవడానికి పార్లమెంటు సభ్యుడే అయినా తాను నైతికంగా కురూపినే అని ఆయన నిరూపించుకున్నాడు. సినీ నటి శ్వేతా మీనన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అసభ్య కూతలు కూసి భారత పార్లమెంటు సభ్యులు కొందరు ఏ స్ధాయిలో ఉంటారో మరోసారి ధ్రువపరిచాడు.
శ్వేతా మీనన్ మళయాళం సినీ పరిశ్రమలో ఉన్నత స్ధాయిలో ఉన్న నటి అని పత్రికల ద్వారా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కొల్లాంలో జరిగిన ‘ప్రెసిడెంట్స్ ట్రోఫీ బోట్ రేస్’ సందర్భంగా ప్రముఖులు అక్కడికి చేరారు. శ్వేతా మీనన్ మైకులో ఏదో చెబుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ సందర్భంగా ఒక వైపు నుండి ఆమె దగ్గరకు వచ్చిన పీతాంబర కురుప్ ఆమెను తాకుతూ ఏదో వ్యాఖ్యానించడం, ఆ వెంటనే శ్వేతా మీనన్ మొఖం కోపంతో మాడినట్లు మారిపోవడం వీడియోలో కనిపిస్తోంది. మరో చోట కూడా ఆయన అనవసర చొరవ చూపిస్తూ ఆమెను తాకడం కనిపిస్తోంది.
వీడియోను ఈ లింక్ లో చూడగలరు.
సంఘటన అనంతరం శ్వేతా మీనన్ తాను ఎదుర్కొన్న అసభ్య ప్రవర్తన గురించి కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విలేఖరులకు తెలిపింది. త్వరలో ముఖ్యమంత్రి ఉమెన్ చాంది కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. “ఒక మహిళగా వివక్షకు గురయినట్లుగా, అగౌరవానికి గురయినట్లుగా నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రికి త్వరలో ఫిర్యాదు చేస్తాను” అని శ్వేతా మీనన్ తెలిపారు. మంగళవారం ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె చెప్పారని ది హిందు తెలిపింది.
శ్వేతా మీనన్ ఆరోపణలను కురుప్ తిరస్కరించాడు. నెపాన్ని ఎన్నికల మీదికి నెట్టాడు. “ఎన్నికలు సమీపిస్తున్నందున దీనిని రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదుగా పరిగణించాలి. నేను రాజకీయవేత్తను కాబట్టి ఇలాంటి దారుణమైన దాడి నాపై జరగవచ్చన్న ఆలోచనే నాకు బాధ కలిగిస్తోంది” అని పీతాంబర వాపోయాడు. రాజకీయ నాయకుడు కాబట్టి తాను చేసే వంకర పనులను ‘రాజకీయ ప్రేరేపితం’ గా కొట్టిపారేసే అవకాశం తమకు దక్కుతుందని ఆయన భావించడం మహిళాలోకానికి బాధ కలిగించే విషయం కాదా?
శ్వేతా మీనన్ తన భర్త శ్రీవల్సన్ మీనన్ తో కలిసి సినీ పరిశ్రమ ప్రముఖులను, పరిశ్రమ సంఘాల నాయకులను కలిసి ఫిర్యాదు చేశారు. కోచి లోని AMMA సంఘ నాయకులను వారు కలిసి ఫిర్యాదు చేశారు. తాము ఇప్పటికే ఫిర్యాదు తయారు చేశామని, దానిని ముఖ్యమంత్రికి ఈ మెయిల్ చేయడమే మిగిలి ఉన్నదని శ్వేత భర్త తెలిపారు. సినీ పరిశ్రమ నుండి తమకు అండగా ఉంటామన్న హామీ లభించిందని భార్యా భర్తలు తెలిపారు.
అయితే తన పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించింది శ్వేత మీనన్ విలేఖరులకు చెప్పలేదు. ఆ వివరాలన్నీ తన ఫిర్యాదులో పేర్కొన్నానని ఆమె తెలిపారు. తన ఫిర్యాదును కలెక్టర్ అసలు పట్టించుకోకపోవడం తనను బాధించిందని ఆమె తెలిపారు. కలెక్టర్ మోహన్ మాత్రం తనను శ్వేతా మీనన్ అసలు కలవనే లేదని చెబుతున్నారు. మాట మాత్రంగా గానీ, లిఖిత పూర్వకంగా గానీ తనకు ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు. శ్వేతా మీనన్ కలెక్టర్ వివరణను తిరస్కరించారు.
“నేను తనతో మాట్లాడలేదని కలెక్టర్ చెప్పారు. ఆయన నన్ను ఒక వ్యక్తిగానే విఫలం అయ్యేలా చేశారు” అని శ్వేతా మీనన్ ఆక్షేపించారు. తాను రాజకీయాలు చేయడం లేదని తన ఫిర్యాదును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఆమె తెగేసి చెప్పారు.
ఇదిలా ఉండగా కొల్లాం నుండి ఒక పోలీసు బృందం కోచిలో ఉన్న శ్వేతా మీనన్ వద్దకు వచ్చి ఫిర్యాదు తీసుకున్నారు. ఒక మహిళా సర్కిల్ ఇనస్పెక్టర్ తో కూడిన 9 మంది పోలీసు బృందం ఆమె నుండి స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు. స్టేట్ మెంట్ రికార్డు చేస్తుండగా ఆమె విలపించారని తెలుస్తోంది. ఫిర్యాదు, స్టేట్ మెంట్ లలోని వివరాలు చెప్పడానికి పోలీసులు నిరాకరించారని పత్రికలు తెలిపాయి. కొల్లాం ఎం.పి కురుప్ తో పాటు మరో వ్యక్తి పేరును ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు అనధికార వార్తలను ఉటంకిస్తూ తెలిపాయి.
“Politics is the last resort for the scoundrels” అని జార్జి బెర్నార్డ్ షా అన్నారని ప్రతీతి. దాన్ని అబద్ధం అని నిరూపించేవారు దుర్భిణి వేసి వెతికినా కనిపించకపోవడం ప్రజల దౌర్భాగ్యం.
sir, Srilanka ku manaku shetruthvam emiti .please explain.
సినిమా రాజకీయాలు సన్నివేశపరంగా రక్తిని కట్టిస్తాయి కానీ, వాస్తవంలో విరక్తిని కలిగిస్తాయి. దక్షిణాది సినిమా పరిశ్రమలో ముఖ్యంగా నాయకీమణుల రాజకీయ తహతహలకు హద్దులు లేవు. ఆంధ్రా రాజకీయాలలో ప్రముఖ యువనాయకుడు పార్టిలో చేరి గతంలో వృద్ధనాయకుడి పార్టీలో ప్రముఖ స్థానాన్ని పొంది, నేడు విచ్చలవిడిగా విమర్శించే ఆ తారామణి నాలికకు నరం లేదని నిరూపించింది. రోజాలైనా, శిరోజలైనా పోషణుంటేనే రాణిస్థాయి .