ఏంజెలా ఫోన్ ట్యాపింగ్: సాక్ష్యానికి స్నోడెన్ రెడీ


జర్మనీ ఛాన్సలర్ సెల్ ఫోన్ సంభాషణలపై అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం నిర్వహించిందన్న ఆరోపణలపై అమెరికా – జర్మనీల మధ్య వాదోపావాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సాక్ష్యం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్, జర్మనీ ప్రభుత్వానికి తెలిపాడు. అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తి పలకాలన్న షరతు మీద స్నోడెన్ కి రాజకీయ ఆశ్రయం ఇచ్చినప్పటికీ అమెరికా – జర్మనీల మధ్య మరింత దూరం పెంచే అవకాశాన్ని రష్యా కాలదన్నకపోవచ్చు.

ఏంజెలా మెర్కెల్ సెల్ ఫోన్ సంభాషణలను ఎన్.ఎస్.ఏ రికార్డు చేసిందన్న ఆరోపణలను పాక్షికంగా తిరస్కరించింది. ఏంజెలా సెల్ ఫోన్ పై తాము నిఘా పెట్టడం లేదనీ, భవిష్యత్తులో కూడా నిఘా పెట్టబోమనీ అమెరికా ప్రకటించింది. అయితే ఇప్పటివరకూ నిఘా పెట్టిందీ లేనిదీ చెప్పడానికి అమెరికా నిరాకరించింది. దానితో అసలు విషయాన్ని అమెరికా పరోక్షంగా అంగీకరించినట్లయింది. జర్మనీ మాత్రం అమెరికా అబద్ధాలు చెబుతోందని ప్రకటించింది. తమ వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది.

ఈ నేపధ్యంలో సాక్ష్యం చెప్పడానికి తాను రెడీ అని ఎడ్వర్డ్ స్నోడెన్ తనకు లేఖ రాశాడంటూ జర్మనీ లోని ప్రతిపక్ష గ్రీన్ పార్టీ నాయకుడు హాన్స్-క్రిస్టియన్ స్త్రోబెలే పత్రికలకు తెలిపారు. స్నోడెన్ రాసిన లేఖను ఆయన విలేఖరులకు చూపారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సాక్ష్యం ఇచ్చేందుకు స్నోడెన్ సూత్ర రీత్యా అంగీకారం తెలుపుతూ లేఖ రాశారానీ, ఈ లేఖ జర్మనీ పార్లమెంటును ఉద్దేశిస్తూ రాసిందేనని స్ట్రోబెల్ తెలిపారు. అయితే స్నోడెన్ ను వెంటాడి వేధించే పనిలో అమెరికా బిజీగా ఉన్నందున ఆయన జర్మనీకి స్వయంగా రాలేని పరిస్ధితిలో ఉన్నారనీ, ఈ సమస్యను పరిష్కరిస్తే స్నోడెన్ జర్మనీకి స్వయంగా వచ్చి సాక్ష్యం చెబుతారని ఆయన తెలిపారు.

జర్మనీ పార్లమెంటు సభ్యుడు కూడా అయిన స్ట్రోబెలే మాస్కోకు ప్రయాణం చేసి గత గురువారం (అక్టోబర్ 31) ఒక రహస్య ప్రదేశంలో స్నోడెన్ ను కలిశారని ది హిందు తెలిపింది. “తనకు చాలా విషయాలు తెలుసని ఆయన స్పష్టం చేశారు” అని స్ట్రోబెలే జర్మనీలోని ప్రభుత్వ టి.వి చానెల్ ఏ.ఆర్.డి తో మాట్లాడుతూ చెప్పారని పత్రిక తెలిపింది. జర్మనీ ప్రభుత్వాన్ని, ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నూ ఉద్దేశిస్తూ స్నోడెన్ రాసిన లేఖను స్ట్రోబెల్ విలేఖరులకు చూపారు.

“వాస్తవాన్ని బైటపెట్టడానికి తాను బాధ్యతాయుతంగా సహకరిస్తానని” స్నోడెన్ తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే “అమెరికా ప్రభుత్వం తీవ్ర స్ధాయిలో, స్ధిర నిశ్చయంతో తనను వెంటాడుతూ పీడిస్తున్నందున జర్మనీకి రాలేని పరిస్ధితుల్లో ఉన్నాను” అని స్నోడెన్ లేఖలో పేర్కొన్నాడు. “ఈ సమస్య పరిష్కరించినట్లయితే మీ దేశంలో మీతో మాట్లాడడానికి నేను ఎదురు చూస్తున్నాను” అని ఆయన రాశారు.

జర్మనీ వెళ్ళినట్లయితే, అమెరికా పీడనతో పాటుగా రష్యా ఇచ్చిన తాత్కాలిక రాజకీయ ఆశ్రయాన్ని సైతం వాదులుకోవాల్సిన ప్రమాదాన్ని స్నోడెన్ ఎదుర్కుంటాడు. పుతిన్ విధించిన షరతు ప్రకారం రష్యాలో ఉన్నంతకాలం స్నోడెన్, అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదు. రష్యా వదిలి వెళితే రష్యా ఆశ్రయాన్ని వదులుకోక తప్పదని రష్యాలో స్నోడెన్ లాయర్ అనతోలి కుచేరేనా కూడా తెలిపాడు. అయితే రష్యా నుండి సాక్ష్యం ఇవ్వొచ్చని ఆయన సూచించాడు.

“ఏ దేశం అయినా ఎడ్వర్డ్ ను కొన్ని ప్రశ్నలు అడగాలని భావిస్తే, ఆ దేశం ఆ ప్రశ్నలను ఇక్కడికి పంపవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలా లేదా అన్నది స్నోడెన్ ఇక్కడి నుండే నిర్ణయం తీసుకుంటారు” అని అనతోలి రష్యన్ ప్రభుత్వ వార్తా సంస్ధ ఇటార్-టాస్ తో అన్నారని ది హిందు తెలిపింది.

అయితే పుతిన్ విధించిన షరతులు ఎలా ఉన్నప్పటికీ అమెరికా – జర్మనీ ల మధ్య దూరం పెంచే అవకాశాన్ని రష్యా ఎలా వదులుకుంటుంది. నలభై యేళ్ళ ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా-ఐరోపాల కూటమిని ఒంటి చేత్తో నిలువరించిన రష్యా, ఇప్పటికీ ఆ దేశాల నుండి భౌగోళిక రాజకీయ రంగంలో పోటీ ఎదుర్కొంటోంది. ఒకప్పటి రష్యా మిత్ర దేశాలయిన తూర్పు యూరప్ దేశాలను అంతర్జాతీయ రౌడీ మిలట్రీ కూటమి అయిన నాటో లో చేర్చుకుంటూ రష్యాను ఒంటరిని చేసి తన చెప్పుచేతుల్లో ఉంచుకోవడానికి అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు చేయని ప్రయత్నం లేదు.

చివరికి ఒకప్పటి సోవియట్ రష్యాలో భాగం అయిన మధ్య ఆసియా దేశాలను కూడా నాటో లో చేర్చుకుని రష్యా పెరడు వరకూ తన మిలట్రీ ప్రాబల్యాన్ని విస్తరించి తద్వారా రష్యా ప్రాంతీయ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు జార్జియాను రెచ్చగొట్టి రష్యా ప్రాబల్యంలోని ప్రాంతాలను ఆక్రమింపజేసింది. కానీ రష్యా ప్రతి ఎత్తుగడలతో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల ఎత్తుగడలు పారలేదు. జార్జియా యుద్ధంలో జార్జియాను చావు దెబ్బ తీసి పశ్చిమ దేశాలకు ‘ఇక చేసింది చాలు’ అని చాచి కొట్టినట్లు చెప్పింది.

తూర్పు యూరప్ దేశాలలో మిసైల్ రక్షణ వ్యవస్ధ నెలకొల్పడం మీద కూడా అమెరికా-రష్యాల మధ్య అంతర్జాతీయంగా ఘర్షణ జరుగుతోంది. తూర్పు ఐరోపా దేశాలలో మిసైల్ రక్షణ వ్యవస్ధను నెలకొల్పితే వాటిని వెంటనే నాశనం చేస్తానని రష్యా హెచ్చరిస్తోంది. ఈ లోపు తూర్పు యూరప్ బదులుగా అలాస్కాలో వాటిని నెలకొల్పుతానని, ఉత్తర కొరియా నుండి మిసైల్ ప్రమాదం ఎదుర్కోడానికి అలాస్కాలో మిసైల్ రక్షణ వ్యవస్ధ బలగాలను పెంచుకుంటామని అమెరికా ప్రకటించింది.

ఈ నేపధ్యంలో నాటో సభ్య దేశాల మధ్య చీలికలు తెచ్చే అవకాశం వస్తే దానిని రష్యా వదులుకుంటుందా అన్నది అనుమానమే. స్నోడెన్ కు తగిన రక్షణాలు ఏర్పాటు చేస్తామని జర్మనీ నుండి హామీ వచ్చినట్లయితే, తన షరతులను సడలించుకునయినా స్నోడెన్ జర్మనీ వెళ్లడానికి రష్యా అనుమతించవచ్చు. అయితే జర్మనీ అంత ధైర్యం చేస్తుందా అన్నది అనుమానమే. కానయితే సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడడం ద్వారా జర్మనీ ప్రభుత్వాన్ని స్నోడెన్ ఇరుకున పెట్టింది మాత్రం వాస్తవం!

One thought on “ఏంజెలా ఫోన్ ట్యాపింగ్: సాక్ష్యానికి స్నోడెన్ రెడీ

  1. మనదేశంలోనే కాదు ప్రపంచమంతటా ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తాయో లేదో తెలియదు కానీ, టెలిఫోన్ కనబడిన చోటేల్లా ట్యాపింగ్ గణగణలతో రాజకీయ పదవుల దుమారాలకు దూరాభారాలు లేకుండాపోతున్నాయి. సాంకేతిక విజ్ఞతావిలువలు సామాన్యుడికి మృగతృష్ణ కానీ రాజకీయాలకు మేధోమదనం. స్కాములుతో మొదలయ్యి స్కీముల మీదుగా స్క్రీనుల వెనుక లైంగిక కార్యకలాపాలవరకు చల్లకొచ్చి ముంత దాచే రీతిలో నల్లధనాన్ని పోగుచేసుకుని సామాజిక విలువలకు పొగబెడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు రాజకీయాలను ముడిపెట్టి అన్యాయాలకు అద్దంపడుతున్నారు. ఒకొక్కసారి న్యాయ వ్యవస్థ కూడా ఈ అవస్థకు తట్టుకోలేక తటస్థంగా నిలిచే సంఘటనలు ఇటీవల కాలంలో కోకొల్లలు. ఫోన్ ట్యాపింగ్ కు ఎల్లలు లేవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s