అన్ని వైపుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో అమెరికా తన తప్పును పరిమితంగానే అయినా అంగీకరించింది. కొన్ని కేసుల్లో అతిగా గూఢచర్యం నిర్వహించామని, వాటిని సవరించుకుంటామని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కేర్రీ ఒప్పుకున్నాడు. కానీ తాము అమాయకులను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఆయన చెప్పుకొచ్చాడు. జర్మనీ ఛాన్సలర్, భారత ప్రధాన మంత్రిలతో సహా 35 దేశాల అధిపతుల ఫోన్ సంభాషణలను రికార్డు చేసినందుకు అన్నివైపుల నుండి దాడి, ఒత్తిడి తీవ్రం ఐన నేపధ్యంలో ఈ ఒప్పుకోలు వెలువడింది. అయితే ఇంటర్నెట్ గూఢచర్యం మానుకుంటామని మాత్రం అమెరికా చెప్పడం లేదు.
అమెరికా ఒప్పుకోలు ఒక విధంగా అనూహ్య పరిణామం. అదే సమయంలో అనివార్య పరిణామం కూడా. అమెరికా మాట చెల్లుబాటు క్రమ క్రమంగా పడిపోతున్న వాతావరణంలో అమెరికా ఇలాంటి అనుభవాలు మరిన్ని ఎదుర్కోబోతోంది. అసలు ఒప్పుకోలు అన్నది దానికదే అమెరికా ప్రాభవ పతనానికి మరో సూచన. ఆర్ధికంగా ఎలాగూ కుదేలయింది. రాజకీయంగా కూడా ప్రపంచ వ్యవహారాల్లో దాని మాట చెల్లుబాటు కాని పరిస్ధితి పెరుగుతోంది. ఆ పరిణామం వేగంగా కూడా జరుగుతోంది. గతంలో, కనీసం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, అమెరికా ఈ మాత్రం తన తప్పు ఒప్పుకున్న ఉదాహరణలు మనకి కనిపించవు లేదా తక్కువ. ఆధిపత్యాన్ని రుజువు చేసుకోవాల్సిన సందర్భాల్లో వెనక్కి తగ్గిన ఉదాహరణలు అసలే కనిపించవు.
సిరియా విషయంలో అమెరికా భయంకరమైన ఎదురు దెబ్బ తిన్నది. ఒబామా, ఇతర అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య వర్గాలకూ ప్రస్తుతం సిరియా ఒక పీడకల. ‘సిరియాపై దాడి చేస్తాం’ అని ప్రకటించిన తర్వాత అమెరికా, ఐరోపాలు ఆ ప్రకటన నుండి వెనక్కి తగ్గడం అంటే వారి పరువు పోయినట్లే. బహుశా వారికి సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ప్రతి రోజూ కలలో కనబడుతూ పరిహాసంగా, బిగ్గరగా నవ్వుతూ ఉండి ఉండాలి. ఈజిప్టులో తమ మద్దతు ఉన్న ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వాన్ని కాపాడుకోలేకపోవడం కూడా అమెరికా ఆధారిటీని దెబ్బతీసింది.
సౌదీ అరేబియా మరోవైపు నుండి అమెరికాను కుళ్లబోడుస్తోంది. సిరియాలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది సౌదీ అరేబియాయే. అమెరికా మద్దతుతో సౌదీ రాచరికం ప్రపంచవ్యాపితంగా అనేక ఉగ్రవాద సంస్ధలను పోషిస్తోంది. సౌదీ చమురు వెలికితీతలో అమెరికా కంపెనీలది పైచేయి. అలాంటి సౌదీ అరేబియా ఈజిప్టు ప్రభుత్వాన్ని కూలదోయడానికి అక్కడి సైన్యానికి సహకరించడమే కాక భారీ ధనసహాయం ఇచ్చింది. సిరియాపై దాడి నుండి వెనక్కి తగ్గినందుకు అమెరికాపై పీకల్దాకా కోపం పెంచుకుని ఉన్నది.
ఆ కోపంతోనే ఐరాస భద్రతా సమితిలో తాత్కాలిక సభ్యత్వం ఇవ్వజూపినప్పటికీ తిరస్కరించింది. అమెరికాతో సంబంధాలను సమీక్షించుకుంటామని కూడా గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. సౌదీని దారికి తెచ్చుకోడానికి అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలు సఫలం అయినట్లుగానీ, కనీసం అవుతాయని గానీ సంకేతాలేమీ లేవు. అమెరికాకు దూరం జరుగుతున్న సంకేతాలు మాత్రం ప్రబలంగానే కనిపిస్తున్నాయి.
ఈ పరిస్ధితుల్లో వెల్లడి అయిన స్నోడెన్ పత్రాలు అమెరికా నైతిక స్ధైర్యాన్ని చావు దెబ్బ తీసాయి. అవకాశం దొరికినప్పుడల్లా ‘స్వేచ్ఛా మార్కెట్ ఎకానమీని ఎలా కాపాడుకోవాలో’ కరుడు గట్టిన ఐరోపా ఫ్రీ మార్కెట్ దేశాలకు కూడా లెక్చర్లు దంచే అమెరికా ఇప్పుడు అదే ఐరోపా దేశాల నుండి ప్రజల మానవహక్కులను, వారి ఏకాంత హక్కులనూ ఎలా కాపాడాలన్న విషయంలో హితోపదేశాలు వినాల్సిన పరిస్ధితిలో పడిపోయింది.
‘Open Government Partnership Annual Summit’ పేరుతో లండన్ లో ఈ రోజు (గురువారం, అక్టోబర్ 31) జరిగిన కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జాన్ కెర్రీ ఇంటర్నెట్ గూఢచర్యం విషయంలో అమెరికా అతిగా ప్రవర్తించిందని అంగీకరించాడు. అయితే కొన్ని కేసుల్లోనే అలా జరిగిందని చెప్పుకున్నాడు. తద్వారా మిగిలిందంతా అవసరమే అని ఆయన పరోక్షంగా చెప్పాడు. తమ గూఢచర్యం వలన అమాయకులు ఎప్పుడూ ఇబ్బందులు పడలేదని కూడా ఆయన చెప్పుకున్నాడు.
“ఈ (గూఢచర్యం) క్రమంలో అమాయకులను ఇబ్బంది పెట్టడంలేదని నేను మీకు హామీ ఇస్తున్నాను. కానీ సమాచారం సేకరించడానికి ప్రయత్నం జరిగిన మాట నిజమే. అవును, కొన్ని కేసుల్లో తగని విధంగా మరీ అతిగా వెళ్ళినమాటా నిజమే. అయితే మా అధ్యక్షుడు ఈ విషయంలో స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యకలాపాలను పూర్తిగా సమీక్షించాలని, తద్వారా ‘తాము ఇబ్బంది పడ్డామని’ ఎవరూ అనుకోకుండా ఉండేలా తగిన స్పష్టత ఇవ్వాలనీ ఆయన ప్రయత్నిస్తున్నారు” అని కెర్రీ చెప్పుకొచ్చాడు. మిలియన్ల మంది ప్రజలపై గూఢచర్యం చేస్తున్నామన్న ఆరోపణలను మాత్రం ఆయన తిరస్కరించాడు.
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సెల్ ఫోన్ సంభాషణలను వింటున్న ఆరోపణలను కూడా అమెరికా ఇలాగే తిరస్కరించింది. కానీ అమెరికా తిరస్కరణలను జర్మనీ ఆమోదించలేదు. తమ వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని జర్మనీ ప్రకటించింది. అమెరికా గూఢచర్యం విషయం చర్చించడానికి యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్ళి వచ్చారు కూడాను. అయితే ‘సింగడు పోనూ పొయ్యేడు, రానూ వచ్చేడు’ అన్న తరహాలోనే ఈ చర్చలు జరిగాయనీ, కేవలం ఐరోపా దేశాల ప్రజలను సంతృప్తిపరచడానికి మాత్రమే ఈ చర్చలు జరిగాయి తప్ప అమెరికా గూఢచర్యంలో ఐరోపా ప్రభుత్వాలు కూడా భాగస్వాములని విశ్లేషకులు, ఆయా దేశాల గూఢచార సంస్ధల మాజీ నేతలు విశ్లేషించారు.
ఈ చర్చల నాటకాలు ఆడకపోతే ఐరోపా దేశాల ప్రజలు అమెరికా ఇంటర్నెట్ కంపెనీల నుండి దూరంగా జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి గూగుల్, యాహూ, మైక్రో సాఫ్ట్ లాంటి సంస్ధలు తాము అమెరికన్ ఎన్.ఎస్.ఏ అధికారాలు కత్తిరించే చట్టం కోసం ఒత్తిడి చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు ఉమ్మడిగా ఒక ప్రకటన కూడా జారీ చేశాయి. ఇదొక వ్యాపార ఎత్తుగడ మాత్రమే అని ఐరోపా జనం గుర్తించాల్సి ఉంది.
అమెరికా గూఢచర్యం ఎదుర్కొన్న వ్యక్తుల్లో భారత ప్రధాని మన్మోహన్ కూడా ఉన్నారు. ఎన్.ఎస్.ఏ గూఢచర్యాన్ని తప్పించుకోడానికి భారత ప్రభుత్వ శాఖలన్నింటికి ఒక అంగర్గత రక్షణ వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నామని కొద్ది రోజుల క్రితం ఐ.టి మంత్రి కపిల్ సిబాల్ ప్రకటించాడు. మంత్రులు, అధికారుల సమాచార సంబంధాలను, టెలిఫోన్ సంభాషణలను రక్షించుకునే చర్యలకు ఉపక్రమించిన భారత ప్రభుత్వం తమ ప్రజలను మాత్రం గాలికి వదిలేసింది.
భారత ప్రభుత్వం, అమెరికా ఐ.టి కంపెనీల దయాదాక్షిణ్యాలకు భారత ప్రజల ఏకాంత హక్కులను వదిలిపెట్టింది తప్ప బ్రెజిల్, జర్మనీల తరహాలో అమెరికన్ ఐ.టి కంపెనీలు ఇండియాలో సర్వర్లు నిర్వహించాలని డిమాండ్ చేయడం లేదు. “న్యాయాన్యాలు విచారించకనే….. ….. …..ఇలాంటి రాజులు ఉండిననేమి, మండిననేమి?” అన్న సత్య హరిశ్చంద్ర డైలాగ్ ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవడమేనా మనం చేయగలిగింది?
*అమెరికా ఒప్పుకోలు ఒక విధంగా అనూహ్య పరిణామం*
ఇందులో ఏముంది అనుహ్యపరిణామాం? చాలా రోజుల నుంచి మీకు చెప్పాలనుకొంట్టు వాయిదావేశాను. ఏమంటే అమేరికా ని మీరు చాలా సార్లు ఎక్కువ గా అంచనా వేస్తున్నారు. అమేరికా గొప్పతనం దాదాపు కరిగిపోయింది. ఏ దేశం మునుపటిలాగా దానిని చూసి భయపడుతున్నాది? గౌరవిస్తున్నాది. కిందపడ్డ పైచేయి మాదన్నట్లు అది ప్రవర్తిస్తూంటె, దానికి భారతదేశ మీడీయా వారు ప్రజలకి వాస్తవం చెప్పకుండా వంత పాడుతున్నారు. మనదేశ మీడీయావారు న్యుయార్క్ టైంస్,వాల్ స్ట్రిట్ జర్నల్లో మన ప్రధాని,దేశం గురించి ఎదైనా వార్త వస్తే దానికి చలా ప్రాముఖ్యత ఇస్తారు. కాని ఆపేపర్లు ప్రపంచదేశలకి తగుదునమ్మా అని సలహాలు ఇచ్చే బదులు, వారి దేశంలోని వాస్తవిక పరిస్థితి వారి ప్రజలకి చెప్పుకొంటే బాగుంట్టుంది. అది మాత్రం ఆశించిన రీతిలో వారు చేయరు.
ఒక్కసారి ఆలోచించండి ప్రపంచంలో ఎదైనా దేశాంలో నగరం దివాల తీయటం విన్నామా? అది నేటి అమేరికా పరిస్థితి. ఇక ప్రభుత్వమే షట్ డౌన్ అమేరికా అంట్టు ఆఫీసులు మూసివేస్తుంది. ప్రభుత్వ ఆఫీసులు యుద్దాల వలన గాని,ప్రకృతి వైపరిత్యల వలన పనిచేయకపోవటం సహజం,అమేరికా లో ప్రభుత్వమే చేస్తుంది అపని. ఇంకొక కోణం లో చెప్పాలి అంటే ఈ సంఘటనలన్ని ఇంస్టాల్ మెంట్ దివాల లాంటివి.
ఆమధ్య బిబిసి లో రష్యాను బ్రిటిష్ వాళ్లు విమర్శించారు. రష్యా ఇంకా గతంలో జీవిస్తున్నాది. అది ఇంకా యు.యస్.యస్.ఆర్. గా భావించుకొంట్టు, గూడచర్యం ఆరోజుల్లో లాగా ఇప్పటికి కొనసాగిస్తున్నాది. అది ఇప్పుడు ఒక అగ్రరాజ్యం కాదు అని తెలుసుకోవాలి అంట్టు, అరెస్ట్ చేసిన రష్యా ఆడా గూడచారితో ఇంటర్వ్యు చూపిస్తూ ప్రోగ్రం ప్రసారం చేశారు. అమేరికా ప్రభుత్వ పరిస్థితి కూడా అంతే ! దాని విలువ, ప్రపంచం మీద పట్టు తగ్గిపోయినా మీడీయా వారి వలన ఇంకా ఉన్నట్లు భ్రమింపచేస్తున్నాది. మీరు కూడా కళ్లు తెరచి చూడండి, అర్థం అవుతుంది.
—————-
పాకిస్తాన్ రాజకీయ నాయకులు దేశంలో డ్రోన్ దాడులు జరుగుతున్నపుడు, అమేరికా ముస్లిం మతస్తుల మీద చేస్తున్న దాడిలాగా , చాలా మంది అమాయక ప్రజలౌ చనిపోతున్నట్లు చిత్రికరిస్తుంది. అమేరికా నుంచి ఆర్ధిక సహాయం అందిన వెంటనే మాట మారుస్తుంది. ఇటువంటి డబుల్ గేం దశాబ్దాలుగా ఆడుతున్న పాకిస్తాన్ దేశానికి జాన్ కెర్రి బిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయం, ఆయుధాల సహాయం ఎందుకిస్తాడో, మేధావులకే అర్థంకాని గొప్ప విషయం.
US quietly releasing $1.6 billion in military, economic aid to Pakistan Saturday, (Oct. 19 2013)
http://www.deseretnews.com/article/765640248/US-quietly-releasing-16B-in-Pakistan-assistance.html?pg=all
In a Surprise, Pakistan Says Fewer Civilians Died by Drones ( October 30, 2013 )
http://mobile.nytimes.com/2013/10/31/world/asia/pakistan-drone-strikes.html?partner=rss&emc=rss&smid=tw-nytimesworld&_r=0&
నా పైవ్యాఖ్య అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ గా అనిపించవచ్చు కూడా, కాని అమెరికా పరిస్థితి ఏమాత్రం గొప్పగా లేదు. యుద్దం చేయాలి అంటే చైనా దగ్గర అప్పుకు పోవాల్సిందే. !
అగ్రరాజ్యమనే అహంకారం అమెరికా జన్మహక్కు. ఆ హుక్కు బిగించే ప్రపంచం అవాక్కయ్యే రీతిలో తన నిక్కు,నీల్గుడు చూపిస్తుంది. సమాంతర దేశాలు ఎదురుతిరిగిన క్షణంలో మాత్రం మొక్కుబడిగా కతలేవో చెప్పి తప్పించుకుంటుంది. వర్ధమాన దేశాలు లాంటి భారత్ తదితర దేశాలుతో తన అవసరాలు తీర్చుకుందుకు శిఖరాగ్రహ సమావేశాల లాబీలల్లో ఆయా దేశాల అధిపతులను నఖశిఖపర్యంతరం అందలమెక్కించి, ఏదో ఒక నెపంతో తొక్కిపెట్టాలనేది ఒబామా రాజనీతి. వృద్ధాప్యం పదవికి చేటు అనే నానుడి ఈ సందర్భంలో గుర్తుచేసుకోక తప్పదు. అమెరికాను నెంబర్ వన్ గా ప్రపంచదేశాలలో గుర్తింపు కోసం రాజనీతి సాహసవంతుడు.