బేంక్సీ వీధి చిత్రాలు -పునః ప్రచురణ


(ఈ ఆర్టికల్ ఏప్రిల్ 29, 2012 తేదీన ప్రచురించినది. అప్పటికీ ఇప్పటికీ పాఠకులు చాలామంది మారారు. చాలామంది కొత్త పాఠకులు వచ్చి చేరారు. అద్భుతమైన వీధి చిత్ర కళాకారుడు బ్యాంక్సీని కొత్త పాఠకులకు పరిచయం చేద్దామన్న ఉద్దేశ్యంతో -బ్యాంక్సీ అంటే నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం మరి!- దీనిని పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్)

— — —

ప్రఖ్యాత బ్రిటిష్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ గీసిన వీధి చిత్రాలివి. బ్యాంక్సీ చిత్రాల్లో కొట్టొచ్చినట్లు కనపడేది ‘అధారిటేరియనిజం’ పట్ల ఆయనకి ఉన్న వ్యతిరేకత. బహుశా ఆ లక్షణం వల్లనే కాబోలు ధనికవర్గాలకూ, చట్టం అమలు చేస్తున్నాం అనుకుంటున్నవారికి బ్యాంక్సీ ‘అయిష్టుడు’ గా మారాడు.

క్యూబా గెరిల్లా పోరాటంలో పాల్గొన్న ‘ఎర్నెస్టో చే గువేరా’ రెండు ఖండాల అధికార వ్యవస్ధలని గడ గడలాడించి ప్రజా రాజకీయ రంగంలో ఎంతటి లబ్ద ప్రతిష్టుడయ్యాడో, ప్రజా కళా రంగంలో ముఖ్యంగా వీధి చిత్ర కళలో బ్రిటిష్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన బ్యాంక్సీ అంతటి ప్రతిష్ట సంపాదించాడు.

ఆయన ఆనుపానులు కనిపెట్టడానికీ, ఫొటోలు సంపాదించడానికీ పత్రికలు అనేక సంవత్సరాల పాటు విఫలయత్నం చేశాయి. స్టెన్సిల్ టెక్నిక్ తో అతి వేగంగా గోడలపై బొమ్మని చిత్రించి మాయమయ్యే బ్యాంక్సీ ని పట్టుకోవడానికి ఇంగ్లండ్ పోలీసులు ఇప్పటికీ సఫలం కాలేదు. ఆయన చేసిన నేరం ఏమీ లేదు. ధనికుల, పెత్తందారుల అధారిటీని గేలి చేస్తూ సునిశిత వీధి చిత్రాలు గీయడమే ఆయన చేసిన గొప్ప నేరం.

ఓ సారి 70 మందికి పైగా ఆర్టిస్టులను లండన్ పోలీసులు అరెస్టు చేసినా బ్యాంక్సీ మాత్రం వారికి దొరకలేదు. ఆయనయితే దొరకలేదు గానీ 2008 లో ‘డెయిలీ మెయిల్’ పత్రిక ఆయన ఫోటోలంటూ రెండు ఫోటోలను ప్రచురించింది. (అవి కింది ఫొటోల్లో ఉన్నాయి.) ఇవి తన ఫొటోలు కాదని బ్యాంక్సీ ప్రకటించినా, ప్రస్తుతానికి అవే అతని ఫొటోలుగా చలామణీలో ఉన్నాయి.

బ్యాంక్సీ 1974 లో జన్మించినట్లు పత్రికలు రాసాయి. నిజమేమిటో తెలియదు. పద్దెనిమిదేళ్ల వయసులో వీధి చిత్రం గీస్తుండగా పోలీసులు బ్యాంక్సీ బృందాన్ని వెంబడించారు. ఇతరులెలాగో కారు దాకా పరుగెత్తికెళ్ళి తప్పించుకోగా బ్యాంక్సీ ఒక పాత లారీ కింద దాక్కోవలసి వచ్చింది. కారుతున్న ఆయిల్ లో తడుస్తూండగా ఇంజన్ పైన ఉన్న స్టెన్సిల్ అక్షరాలు అతన్ని ఆకర్షించాయి. చిత్రం మొదటినుండి గంటలపాటు గీస్తూ ఉంటే పోలీసులకి దొరికిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలా దొరక్కుండా ఉండడానికి స్టెన్సిల్ టెక్నిక్ ఉపయోగపడుతుందని బ్యాంక్సీకి ఆ క్షణాల్లో తట్టింది. అప్పటి నుండీ ఆయన అదే పద్ధతి అనుసరిస్తున్నాడు.

బ్యాంక్సీ వీధి చిత్రాల్లో యుద్ధ వ్యతిరేకత, పెట్టుబడిదారీ విధానంపై నిరసన, ప్రభుత్వాల అధారిటీపై వ్యతిరేకత ప్రముఖంగా వ్యక్తమవుతాయి. తన బొమ్మలకి నినాదాలు జత చేసి అద్భుతమైన స్ఫూర్తిని బ్యాంక్సీ చూపరుల్లో నింపుతాడు. బహుశా అధికారవర్గాలకి ఇదే కంటగింపుగా ఉందేమో.

వీధి చిత్ర కళకు మద్దతుగా నిర్మించిన ఒక డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించి బ్యాంక్సీ జనవరి 2011 లో ‘బెస్ట్ డాక్యుమెంటరీ’ కేటగిరిలో అకాడమీ అవార్డుకి నామినేషన్ పొందాడు.

అనేక ప్రముఖ నగరాల్లో బ్యాంక్సీ గీసిన చిత్రాల ప్రదర్శన జరిగినా వాటిలో వేటికీ తన అనుమతి లేదని బ్యాంక్సీ ప్రకటించాడు. తన చిత్రాలు అమ్మకానికి కాదని చెప్పినా అమ్మేవారికి కొదవలేదు. బ్యాంక్సీ చిత్రాలపై బ్రిస్టల్ లొ నిర్వహించిన మ్యూజియం ముందు క్యూలు కట్టిన దృశ్యాన్ని కింది ఫొటొల్లో చూడవచ్చు. అలాగే బ్యాంక్సీకి ప్రపంచ వ్యాపితంగా కోకొల్లలుగా అభిమానులున్నారు. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది వీధి చిత్రకారులు పుట్టుకొచ్చారు.

బ్యాంక్సీకి ప్రపంచ వ్యాపితంగా విపరీతమైన పాపులారిటీ ఉంది. ఆయన పాపులారిటీ వల్లనే ఆయన గీసిన వీధి చిత్రాలు కొన్నింటిని అధికారులు చెరిపేయలేకపోయారు. ఆయన గీసే వీధి చిత్రాలకు అవి గీసిన చోటుతో సంబంధం కలిగి ఉంటాయి. ఆ చోటు తెలియకపొతే అవి సాదా సీదాగా అనిపిస్తాయి.

ఉదాహరణకి ‘నో లాయిటరింగ్’ శీర్షికన అమెరికాలో ఒక చిత్రం ఉంది. కత్రినా తుఫానులో ధ్వంసం అయిన ఒక ఇంటి గోడపై ఆ చిత్రాన్ని బ్యాంక్సీ గీశాడు. తుఫానులో బలయింది అత్యధికంగా నల్లవారే. అందువల్ల వారికి సంవత్సరాలు గడుస్తున్నా అమెరికా ప్రభుత్వం నుండి సహాయం అందలేదు. ఆ పరిస్ధితిని తెలియజేసేదే ‘నో లాయిటరింగ్’ చిత్రం.

సెక్సువల్ హెల్త్ క్లినిక్ గోడ పై నగ్నంగా వేలాడే పురుషుడి బొమ్మ కూడా అలాంటిదే. ఎ.సి మిషన్ వద్ద ఉన్న ‘ఒజోన్ ఏంజెల్’ బొమ్మ, పాలస్తీనాలో ఇజ్రాయెల్ నిర్మించిన గోడపై గీసిన ‘ఒయాసిస్సు’ బొమ్మ, అలాంటివాటిలో కొన్ని. ఫొటోల్లో చివర ఉన్నది పోర్టబుల్ టాయిలెట్లతో ‘స్టోన్ హెంజ్’ కి బ్యాంక్సీ రూపొందించిన నకలు.

5 thoughts on “బేంక్సీ వీధి చిత్రాలు -పునః ప్రచురణ

 1. ప్రజల పక్షాన నిలిచి, ప్రతికూల పరిస్థితుల్లో అద్భుత కళా సృజన చేస్తున్న బ్యాంక్సీ అంటే ఇప్పుడు ఇంకా గౌరవం, అభిమానం పెరిగాయి. ఆయన చరిత్ర చదువుతుంటే ఓ సాహస గాథలాగా ఉంది. గోడలపై వేగంగా బొమ్మలు వేసి మాయమైపోవటం సామాన్యమైన విషయం కాదు. విమర్శకూ, నిరసనకూ, అధిక్షేపణకూ తన వీధిచిత్రాలను ఇంత ప్రతిభావంతంగా, ప్రభావశీలంగా వినియోగించుకుంటున్న బ్యాంక్సీని ఎంత అభినందించినా తక్కువే!
  ఈ కళాకారుడి గురించి చదవటం, ఆయన బొమ్మలు చూడటం మీ బ్లాగు ద్వారానే!

 2. in papers we(those who like me) always read cinema news and sports news and don’t have habit of reading national n international news so ur site so useful and i request is to add more columns about business news
  in papers generally don”t read business news even we read also there is no much explanation which ur giving for every matter

 3. “స్టెన్సిల్ టెక్నిక్ తో అతి వేగంగా గోడలపై బొమ్మని చిత్రించి మాయమయ్యే బ్యాంక్సీ ని పట్టుకోవడానికి ఇంగ్లండ్ పోలీసులు ఇప్పటికీ సఫలం కాలేదు.”

  నమ్మశక్యంగా లేనంత అద్భుత వార్త ఇది. ప్రధాన రహదారుల్లో ఈ వీధిచిత్రాలను వేసినా లండన్ పోలీసులు పట్టుకోలేకపోయారా లేదా ఉప రహదారుల్లో మాత్రమే వేసి తను తప్పించుకుంటున్నాడా అని సందేహం.

  “ఆయన ఆనుపానులు కనిపెట్టడానికీ, ఫొటోలు సంపాదించడానికీ పత్రికలు అనేక సంవత్సరాల పాటు విఫలయత్నం చేశాయి.”

  ఇది మరో అద్భుతం. పాశ్చాత్య మీడియా డేగ కళ్ల నుంచి ఇన్నేళ్లపాటు తప్పించుకుని తిరగడం, సజావుగా తను చేయదల్చుకున్నది తను చేసి తప్పుకోవడం, ఎలాంటి ప్రచారానికి దూరంగా ఉండటం..
  2012లోనూ ఇలాంటివి సాధ్యపడుతున్నాయంటే దిగ్భమ కలుగుతోంది.

 4. కదండీ. ప్రచారానికి దూరంగా ఉంటూనే విపరీతమైన పాపులారిటీని సంపాదించిన ఘనత బ్యాంక్సీది. చాలా పత్రికలు ఆయన్ని “లెజెండ్ ఆఫ్ స్ట్రీట్ ఆర్ట్” గా ప్రస్తావిస్తుంటాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s