పటేల్ వారసత్వం ఎవరిది? -కార్టూన్


Patel

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్! స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి హోమ్ మంత్రిగా పని చేసి అనేక స్వతంత్ర సంస్ధానాలను భారత దేశంలో విలీనం కావడంలో ముఖ్యపాత్ర పోషించాడన్న కీర్తి సంపాదించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలకు వారసత్వం పొందే హక్కు ఏ రాజకీయ పార్టీది అన్న మీమాంస తలెత్తింది. కాంగ్రెసా? లేక బి.జె.పి యా? ఈ రెండింటిలో ఏది హక్కుదారు?

గుజరాత్ లోని పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారు పటేల్ స్మృతిలో ప్రపంచంలోనే అతి భారీ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఉద్యుక్తులు కావడంతోనూ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రధాని పదవికి పోటీ పడుతూ పటేల్ వారసత్వానికి పోటీగా మారడంతోనూ ఈ మీమాంసకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

వల్లభాయ్ పటేల్ గారు కాంగ్రెస్ నాయకుడు. కనీసం ఆర్.ఎస్.ఎస్ లో పని చేసిన వ్యక్తి కూడా కాదు. పైగా ఆర్.ఎస్.ఎస్ ను నిషేధించిన వ్యక్తి. ఆర్.ఎస్.ఎస్ పై నిషేధం ఎత్తివేయాలని కోరినపుడు ఆర్.ఎస్.ఎస్ రాజకీయాల్లోకి రాకూడదని షరతు విధించి దానికి అంగీకరిస్తేనే నిషేధం ఎత్తివేస్తానని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి. ఆర్.ఎస్.ఎస్ కు ఒక లిఖిత రాజ్యాంగం ఉండాలనీ, ఆ రాజ్యాంగం కేవలం సాంస్కృతిక కార్యకలాపాలకు మాత్రమే ఆర్.ఎస్.ఎస్ పరిమితం అయ్యేలా ఉండాలని పట్టుపట్టి అమలు చేయించిన వ్యక్తి. ఈ అంశాలపై మరో మాటకు గానీ, చర్చకు గానీ తావు లేదని గురు గోల్వాల్కర్ తో తెగేసి చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆర్.ఎస్.ఎస్ దాని రాజకీయ శాఖ బి.జె.పి ఇంకా ఇతర అనుబంధ సంస్ధలు తమవాడిగా చెప్పుకోవడం ఒక విచిత్ర పరిస్ధితి.

గాంధీ హత్యానంతరం సదరు హత్యకు బాధ్యురాలిని చేస్తూ ఆర్.ఎస్.ఎస్ ను నెహ్రూ-పటేల్ ప్రభుత్వం నిషేదించింది. గాంధీ హత్యలో ప్రత్యక్ష పాత్ర పోషించనప్పటికీ అందుకు తగిన వాతావారణాన్ని సృష్టించడానికి కారణం ఆర్.ఎస్.ఎస్ సంస్ధే అన్నది పటేల్ నిశ్చితాభిప్రాయం. ఈ కారణం తోనే గురు గోల్వాల్కర్ ను జైలులో పెట్టారు. తదనంతరం నిషేధం ఎత్తివేయాలని గోల్వాల్కర్ కోరినపుడు ఆర్.ఎస్.ఎస్ తన రహస్య పనివిధానానికి స్వస్తి చెప్పాలని, మైనర్ లను చేర్చుకోరాదని, లిఖిత రాజ్యాంగం ఉండాలని, సాంస్కృతిక సంస్ధగానే పని చేయాలి తప్ప రాజకీయాల్లోకి రాకూడదని పటేల్ షరతులు విధించారు.

ఈ షరతులను గోల్వాల్కర్ మొదట తీవ్రంగా వ్యతిరేకించారు. అన్నీ పార్టీలు మైనర్ లను వివిధ పేర్లతో చేర్చుకుంటున్నపుడు తమకు మాత్రమే నిషేధం ఎందుకని ప్రశ్నించారు. తమ పని బహిరంగంగానే జరుగుతోందని నచ్చజెప్పారు. ఇవేవీ పటేల్ అంగీకరించలేదు. చివరికి గురు గోల్వాల్కర్ తదితర నాయకులు రాజ్యాంగం రాసుకుని పటేల్ కు చూపించక తప్పలేదు. దానిని కూడా పటేల్ ఉన్నది ఉన్నట్లు అంగీకరించలేదు. అనేక సవరణలు ప్రతిపాదించారు. ఆయన సూచించిన సవరణలు చేర్చి ఆమోదించాకనే నిషేధం ఎత్తివేయడానికి పటేల్ అంగీకరించారు.

ఆర్.ఎస్.ఎస్ పని విధానం దేశంలో సెక్యులర్ వాతావరణాన్ని దెబ్బ తీస్తోందనీ, విద్వేష వాతావరణాన్ని పెంచుతోందనీ, అనేక మతాలకు నిలయమైన భారత దేశానికి అది తగదనీ పటేల్ భావించారని ఇటీవల ది హిందూ వెల్లడించిన పాత పత్రాలు, ది హిందూ ఆర్కీవ్స్ ద్వారా వెల్లడి అయింది. అయితే ఆర్.ఎస్.ఎస్ సాగిస్తున్న సాంస్కృతిక కృషిని మాత్రం ఆయన మెచ్చుకున్నారని సదరు ఆర్కీవ్స్ ద్వారా తెలుస్తోంది.

కాబట్టి ఆర్.ఎస్.ఎస్ భావాలు రాజకీయ రూపం ధరిస్తే దేశంలో తలెత్తే ప్రమాదం ఏమిటో పటేల్ ఆనాడే ఊహించారని అనుకోవాలి. ఆ ప్రమాదం ఏమిటో గుజరాత్ మారణకాండ స్పష్టంగానే చెబుతోంది. కానీ సెక్యులర్ గా తనను తాను చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ సైతం మతతత్వాన్ని పెంచి పోషించడం లోనూ, మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టడంలోనూ, అలాంటి అనేక అల్లర్లలో ప్రత్యక్ష, పరోక్ష పాత్ర పోషించడం లోనూ ఎన్నడూ వెనకబడలేదు.

ఉదాహరణకి షాబానో కేసు అనంతరం ముస్లిం మత నాయకులను సంతృప్తిపరచడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ముస్లిం మహిళల స్వతంత్రతను, ప్రజాస్వామిక, సామాజిక హక్కులను హరించే చట్టాన్ని తెచ్చారు. ఓట్ల ప్రయోజనాల కోసం బాబ్రీ మసీదు తలుపులను తెరిపించి హిందూ మతోన్మాద శక్తులు విజృంభించడానికి కారణం అయింది కూడా రాజీవ్ గాంధీయే. గుజరాత్ మారణ కాండలో అనేక చోట్ల ముస్లింల హత్యల్లోనూ, వారి ఆస్తులను ధ్వంసం చేయడంలోనూ, స్వాధీనం చేసుకోవడం లోనూ కాంగ్రెస్ నాయకులు కూడా కుమ్మక్కయ్యారని పత్రికలు వెల్లడించాయి. ఇందిరాగాంధి హత్యానంతరం సిక్కులను ఊచకోత కోయడంలో కాంగ్రెస్ పాత్రను ఎవరు విస్మరించగలరు?

కాబట్టి భారత దేశ రాజకీయ వాతావరణాన్ని మతశక్తులతో నింపి కలుషితం చేయడంలో బి.జె.పికి ఎంత పాత్ర ఉన్నదో కాంగ్రెస్ కీ అంతే పాత్ర ఉన్నది. కాకపోతే ఒకటి బహిరంగంగా చేస్తే మరొకటి లోపాయకారీగా చేస్తుంది. ఈ పార్టీలు రెండూ మతసామరస్యానికి శత్రువులే. సో కాల్డ్ వామ పక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీని సెక్యులర్ శక్తిగా చెప్పడం వారి రాజకీయ అవసరాల కోసం జరుగుతున్నదే తప్ప కాంగ్రెస్ లో సెక్యులరిజం ఏ కోశానా లేదు. సెక్యులర్ నటన ఉన్నది వాస్తవమే.

ఈ పరిస్ధితుల్లో పటేల్ కీర్తి ప్రతిష్టలకు ఎవరు వారసులు అన్న ప్రశ్నే లేదు. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదు. ఆనాడు కాంగ్రెస్ చెప్పిన ‘సోషలిస్టిక్ ప్యాట్రన్ ఆఫ్ సొసైటీ’ భావాలు కూడా ఇప్పటి కాంగ్రెస్ చెప్పడం లేదు. పైగా నెహ్రూవియన్ విధానాలకు పరమవిరుద్ధమైన నూతన ఆర్ధిక విధానాలనే కాంగ్రెస్ అమలు చేస్తోంది. ఈ నూతన ఆర్ధిక విధానాలకు ఆద్యులుగా పి.వి.నరసింహారావు-మన్మోహన్ సింగ్ లను చెబుతాము కానీ వాస్తవానికి ఆ విధానాలకు తగిన బీజం రాజీవ్ గాంధీ హయాంలోనే పడిపోయింది. 1980ల్లోనే 21 శతాబ్దంలోకి వెళ్దాం అంటూ నూతన ఆర్ధిక విధానాలకు తగిన భూమికను ఆయన ఏర్పాటు చేయడం ప్రారంభించారు.

కనుక నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ తదితర అగ్రనాయకులకు ఇప్పుడు నిజమైన వారసులంటూ ఎవరూ లేరు. సిద్ధాంత, రాద్ధాంతాల పట్ల ఆనాడు ఉన్న కనీస పట్టింపు కూడా ఇప్పుడు ఏ పార్టీకీ లేవు. పటేల్ ను ఆయన మానాన ఆయన్ని వదిలితే ఆయన కీర్తి ప్రతిష్టలను చదువుకుని తెలుసుకునే అవకాశమైనా జనానికి దక్కుతుంది. అలా కాకుండా ఆయన కీర్తిని సొంతం చేసుకుందామని పోటీ పడితే ఆయన కీర్తి వారసత్వం వీరికి దక్కకపోగా వీరి మురికి వారికి అంటినా అంటవచ్చు.

‘సర్దార్ పటేల్ గుజరాతీయుడు కనుక మావాడు’ అని మోడీ భావిస్తుంటే, ‘ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో హో మంత్రి కనుక మావాడే’ అని మన్మోహన్ భావిస్తున్నారని ఈ కార్టూన్ సూచిస్తోంది.

14 thoughts on “పటేల్ వారసత్వం ఎవరిది? -కార్టూన్

 1. ఖచ్చితంగా ఇది రాజకీయప్రయోజనాలకోసం మోడివాడుకొంటున్న విషయాన్ని తెలియజేస్తుంది!ఐతే,కాంగ్రేస్ మాత్రం తానేం తక్కువ తిన్నానా?అన్నట్టుగా ఉందివ్యవహారం!

 2. స్వాతంత్ర ఉద్యమానికి చెందిన ఏ ఒక్క నాయకుడిని కూడా ప్రాంతం పేరో లేక, కులం మతం ఆపదించడం లాంటివి చేసి తమ తమ స్వార్ధ ప్రయోజనలకు వినుయోగించుకోవడం సరి కాదు. కుల, మత, ప్రాంతాల పేరుతొ వారిని విభజిస్తే అగౌరవపరిచినట్లే. మన దేశం లో అన్ని ప్రాంతాలవారికి కుల, మతలవారికి స్పూర్తి ప్రదాతలైన ఆ నాయకులను గౌరవించే కార్యక్రమాలు చేయలి. కాని కొంత మంది ప్రయోజనాల కొరకు ఉపయోగించడం అవమానించడమే అవుతుంది .
  అంతే కాని వారసత్వాలు అంటూ ఉండవు.

 3. సుధారాణి గారూ, చక్కగా చెప్పారు.

  దేశ నాయకుల వారసత్వం ప్రజలందరికీ చెందినది. ముఖ్యంగా స్వతంత్రోద్యమ నాయకుల వారసత్వం! చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటూ దేశ నాయకుల్ని అప్రతిష్టపాలు చేయడం క్షమార్హం కాదు.

 4. సెక్యులరిజం విషయం లో బిజెపి ఎంతో, కాంగ్రెస్ అంతే అని అంట్టున్నారు కదా! మరి కమ్యునిస్ట్ పార్టిలకు మొదటి నుంచి కాంగ్రెస్ వైపు సాఫ్ట్ కార్నర్ అని అందరికి తెలుసు. దానికి కారణాలు ఎమై ఉంటాయో మీకు తెలుసా? ఆఖరికి జగన్ తో కూడా పొత్తుకు రెడి అని చదువుతున్నాం. ఇందరి విషయంలో ఎంతో సర్దుకుపోతూ, బిజెపి మీద మాత్రం కత్తిగట్టి నట్లుగా, సెక్యులరిజం ముసుగు వేసుకొని కమ్యునిస్ట్ పార్టిలు ఎందుకు దాడి చేస్తాయి ? ఆ మధ్య సీతారాం ఏచురి నమో కి వ్యతిరేకంగా అమేరికాకు రాసిన లేఖలో సంతకం పెట్టాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆయ్నదానిని ఖండించాడు. అది చివరికి ఏమని తేలింది? సీతారాం ఏచురి సంతకం పెట్టారాలేదా?

 5. సెక్యులరిజం విషయంలో బి.జె.పి, కాంగ్రెస్ లకి తేడా లేదన్నది నా అభిప్రాయం. సి.పి.ఎం, సి.పి.ఐ ల అభిప్రాయం అది కాదు. ఆ పార్టీలు కాంగ్రెస్, బి.జె.పి ల మధ్య తేడాలు చూస్తాయి. అది వారి రాజకీయ అవసరం అని కూడా ఆర్టికల్ లో చెప్పాను.

  బి.జె.పి మాత్రం తక్కువా? ఆర్.ఎస్.ఎస్ తదితర సంస్ధలు కమ్యూనిస్టు పార్టీలపైన కత్తిగట్టినట్లు దాడి చేస్తాయి కదా? ఇరు పక్షాల మధ్య సిద్ధాంతాల్లోనే తేడా ఉంది కాబట్టి ఆ వైరుధ్యాలు సహజం.

  రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ ‘లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్’ పొజిషన్ లో ఉంటుంది. (ఇంకా సాధారణ పరిభాషలో చెప్పాలంటే లిబరల్ అని కూడా చెప్పొచ్చు.) బి.జె.పి పూర్తిగా కుడిపక్షం. అంటే మితవాద అతివాదం లేదా right extremisim. వామ పక్షానికి కుడి పెడగా కనపడితే, లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్ సమీపంగా ఉంటుంది. ఆ మేరకు భావాల్లోనూ కాస్త దగ్గరితనం కనపడుతుంది.

  కానీ ప్రజల దృక్కోణం నుండి చూసినపుడు అంతిమ పరిశీలనలో, సమాజం విప్లవకరంగా మారే దశలో, ఈ సో-కాల్డ్ వామ పక్షం, లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్, సెంటర్, రైట్ ఆఫ్ ది సెంటర్ (ఇక్కడికి చేరడానికి బి.జె.పి శాయశక్తులా ప్రయత్నిస్తోంది), రైట్ (కుడి), right extremism… ఇలా అన్నీ ఒకే చోటికి చేరి ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడతాయి. అందుకే శ్రామిక ప్రజల ప్రయోజనాలను కాంక్షించేవారు వీరి మధ్య తాత్వికమైన తేడా చూడరు. కేవలం రాజకీయపరమైన తేడా మాత్రమే (అది కూడా కొన్ని సందర్భాల్లోనే) చూస్తారు.

  అకడమిక్ దృక్కోణంలో మీకు ఈ వివరణ ఇచ్చాను. సంతకం విషయం సి.పి.ఎం వారిని అడగడమే బెటర్. వారి మాటలు నమ్మలేకపోతే మీరు ఊహించిన వాస్తవాలు వెలువడేవరకూ ఎదురు చూడాల్సిందే.

 6. ఈ సారి బి.జె.పి. కూటమి అధికారం లో కి వస్తే పి.వి. నరసిం హా రావు గారి కి భారత రత్న ఇవ్వటం ఖాయం. దానికి మిగతా ప్రాంతీయ పార్టీలు అడ్డు చెప్పవు. అలా పి వి వారసత్వం కూడా బిజెపి వాళ్లు తీసుకొంటారు. ఆ సమయానికి అడ్డు చెప్పటానికి కాంగ్రెస్ పార్టి ఉంట్టుందో లేదొ చూడాలి మరి.

 7. In Andhra University’s Foundation Course I year book, it is written that there were 554 princely states in India. Hyderabad, Junagarh and Kashmir were the only states that refused to join the
  Indian Union. Rulers of Hyderabad and Junagarh were Muslim. In Junagarh, 75% of the people were Hindu and 75% of the population of that state wanted to merge their state in to the Indian Union and the Nawab of Junagarh fled to Pakistan. In Hyderabad 85% of the population were Hindu but the Nizam of Hyderabad didn’t allow to collect public opinion in his state. So, Nehru and Patel had decided to use police action against the Nizam. The Maharaja of Kashmir was a Hindu but he refused to join the Indian Union because he wanted to continue his autocratic rule in Kashmir. National Conference leader Sheikh Abdullah was the person who induced Nehru to merge Kashmir in the Indian Union.

 8. ప్రవీణ్ మీకు తెలుగు అలవాటే కదా? తెలుగులో ఎందుకు రాయడం లేదు?

  చివరి వాక్యం నిజం కాదు. కాశ్మీరు స్వతంత్రం కోసం డిమాండ్ చేసినందుకే షేక్ అబ్దుల్లాను నెహ్రూ పదిహేడేళ్లు జైల్లో పెట్టించాడు. ఫ్లెబిసైట్ జరిపిస్తానని నెహ్రూ అబ్దుల్లాకు మాట ఇచ్చినందున తాత్కాలిక విలీనానికి అబ్దుల్లా అంగీకరించాడు. అది కూడా కేవలం మూడు శాఖల్ని మాత్రమే భారత ప్రభుత్వం చేతుల్లో ఉంచి మిగిలినవన్నీ స్వతంత్ర దేశం తరహాలోనే పాలించుకున్నారు. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులు కూడా మొదట కాశ్మీర్ కి ఉన్నాయి. అనంతరం నెహ్రూ మాట తప్పి కాశ్మీరీలను మోసం చేశాడు. ఇదీ జరిగిన సంగతి.

 9. Kashmir’s National Conference was founded against the autocracy and it had close relations with Nehru. Read the history again. Even if Sheik Abdullah had wished independent Kashmir, I cannot support his idea because I don’t like disintegration of a federation. Sri Lanka is not a federal republic in sense though it has two primary ethnic groups in it’s population. Therefore, I supported LTTE but the case of India is different.

 10. In 1947, the British parliament had enacted a bill granting independence to countries named India and Pakistan. They didn’t grant independence status to any specific princely state. Hence, all the 554 princely states had been the parts of Indian Union. Nehru and Patel applied their force only on 3 states. They are Hyderabad, Junagarh and Kashmir.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s