పటేల్ విగ్రహానికి కాణీ విదల్చని మోడి


Modi-Manmohan

దేశంలోని ఛానెళ్ల నిండా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం గురించి ప్రకటనల రూపంలో మారుమోగి పోతోంది. పటేల్ విగ్రహంతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి బొమ్మ కూడా ఆ ప్రకటనల్లో కనిపిస్తోంది. విగ్రహ నిర్మాణం మొత్తం ఆది నుంచి అంతం వరకూ తానే నెత్తి మీద వేసుకుని మోస్తున్నట్లుగా సదరు ప్రకటనల్లో మోడి బిల్డప్ ఇస్తున్నారు.

తీరా చూడబోతే ఈ మెమోరియల్ నిర్మాణం కోసం తన పదేళ్ళ పాలనలో నరేంద్ర మోడి ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఆయన ముందు ముఖ్యమంత్రిగా పని చేసిన కేశూభాయ్ పటేల్ ఈ మెమోరియల్ నిర్మాణానికి ప్రధాన రూపకర్త అనీ, నిధులు ఇచ్చింది కూడా ఆయనేననీ, ఇందులో మోడికి ఇవ్వాల్సిన క్రెడిట్ వీసమెత్తు కూడా లేదనీ సర్దార్ పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారు చెబుతున్న వాస్తవం!

సర్దార్ పటేల్ గురించిన విశేషాలతో నిర్మించిన మ్యూజియం ను మంగళవారం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మన్మోహన్, ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఒకే వేదికను పంచుకున్నారు. మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు చెప్పిన మరో సంగతి ఏమిటంటే మ్యూజియం ప్రారంభం సందర్భంగా వేదిక పైన ఆసీనులయ్యే అవకాశం మోడికి వచ్చిందంటే అది ప్రధాని మన్మోహన్ సింగ్ చలవేనట! ప్రధాన మంత్రే పట్టుబట్టకపోతే ప్రారంభోత్సవ కార్డులో ఆయన పేరే ఉండేది కాదని, ప్రతి దశలోనూ మోడి పేరు ఉండేలా ప్రధాని పదే పదే అడిగి మరీ శ్రద్ధ తీసుకున్నారని ట్రస్ట్ ఛైర్మన్, కేంద్ర మంత్రి దినేష్ పటేల్ వెల్లడించారు.

స్వతంత్ర భారతావానికి మొట్టమొదటి హోమ్ మంత్రిగా పని చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు ‘ఉక్కు మనిషి’ గా పేరు. ఆయన వల్లనే అనేక స్వతంత్ర సంస్ధానాలు భారత దేశంలో విలీనం అయ్యాయనీ, ఆయనే లేకపోతే భారత దేశం ఈ రోజు ఉన్నట్లు కాకుండా ముక్కలు చెక్కలుగా ఉండేదనీ చెబుతుంటారు. ఈ ప్రచారంలో ఆర్.ఎస్.ఎస్, బి.జె.పి, వాటి అనుబంధ సంస్ధలు అందరికంటే ముందుంటాయి.

మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా నరేంద్ర మోడి ఈ ప్రచారంలో నాలుగడుగులు గెంతారు. జవహర్ లాల్ నెహ్రూ బదులు సర్దార్ పటేల్ ప్రధాని అయి ఉంటే దేశం గమనం పూర్తిగా వేరే దిశలో ఉండేదని, అలా జరగనందుకు ఈ రోజు ప్రతి భారతీయుడూ చింతిస్తున్నాడని మోడి గారు వాకృచ్చారు. నిజమే?!

గుంటూరు జిల్లాలోని బడేపురం వీధి మొదల్లో బడ్డీ కొట్టు నడుపుతున్న తాతగారిని ఈ సంగతి కనుక్కుంటే సరిపోతుంది. లేదా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి బస్టాండు దగ్గర శనక్కాయలు అమ్ముకునే అవ్వని అడిగినా చాలు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రధాని కాకపోవడం వల్లనే మీరింకా ఈ దుస్ధితిలో ఉన్నారని చెబితే “పటేలా! ఆయనెవరు?’ అని అడుగుతారు. వినేవాళ్లు ఉన్నారు గనకనే అరవైయారేళ్ళ నుండి ఈ విధంగా జనం చెవుల్లో పూలు పెట్టగలుగుతున్నారు.

“ఆయన (పటేల్) మొట్టమొదటి ప్రధాన మంత్రి కాలేదే అని ప్రతి భారతీయుడూ పశ్చాత్తాపపడుతున్నాడు. ఆయనే మొదటి ప్రధాని అయి ఉంటే, దేశం రాత (destiny) వేరే విధంగా ఉండేది” అని మోడి అభిప్రాయం వెలిబుచ్చారు. స్వతంత్రానంతరం దేశాన్ని ఏకం చేయడంలో పటేల్ ది ప్రధాన పాత్ర అని చెబుతూ “ఆ ఐక్యత, సమగ్రత నేడు అన్నివైపుల నుండీ ప్రమాదాలు ఎదుర్కొంటోంది. ఉగ్రవాదం, మావోయిజం ప్రస్తుతం దేశ ఐక్యతకు, సంగ్రతకు ప్రమాదం కలిగిస్తున్నాయి” అన్నారు మోడి.

మరికొన్ని మోడి బంగారు వాక్కులు: ఉగ్రవాదం, మావోయిజం వైపు వెళ్ళినవారు దేశానికే గాక తమ వారికి (their own communities) కూడా భారీ నష్టం కలిగిస్తున్నారు. అలాంటి యువత వెంటనే హింసను  విడనాడి దేశాభివృద్ధిలోని ప్రధాన స్రవంతిలో భాగం కావాలి. బాంబులు, తుపాకులు ధరించిన దారితప్పిన యువత మహాత్మా గాంధీ, పటేల్ లు పుట్టిన దేశంలో ఎప్పటికీ సఫలం కాలేరు.

భారత ప్రజలు మోడిని ఒక ప్రశ్న వేయాలి. కాదు, కాదు, అనేక ప్రశ్నలు వేయాలి. స్వామీ ఆసీమానంద, స్వామిని ప్రజ్ఞా సింగ్… తదితరులంతా బాంబులు ఎందుకు చేతబట్టారు? మాలెగావ్ పేలుళ్లు ఎందుకు జరిగాయి? గుజరాత్ మారణకాండ ఎందుకు జరిగింది? మత కల్లోలాలు జరిగినప్పుడల్లా వేలాది అమాయక ముస్లింలు, హిందువులు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నట్లు? 2 సీట్ల నుండి 200 సీట్లకు ఎగబాకాలన్నా, గుజరాత్ ముఖ్యమంత్రిత్వం మీదుగా ప్రధాన మంత్రిత్వానికి ప్రయాణం కట్టాలన్నా సవా లక్ష వంకలతో మతకల్లోలాలను రెచ్చగొట్టడం తప్ప మరో మార్గం ఎందుకు లేకపోయింది?

అంతే కాదు. ఈ దేశ మూల వాసులయిన గిరిజనుల భూముల్నీ, గుడిసెల్నీ, కొండలనూ, గుట్టలనూ, అడవులనూ అన్నింటినీ లాక్కొని తరిమి కొట్టడానికి సాయుధ ఖాకీచకులను ఉసి గొల్పుతున్నది ఎందుకని? అత్యాధునిక మారణాయుధాలు ఇచ్చి వారికి కోబ్రాలనీ, నల్ల పిల్లులనీ, వేట కుక్కలనీ పేర్లు పెట్టి అమాయక గిరిజనంపైకి పంపేది ఎందుకని? వారి కాళ్ళ కింద దాగిన ఖనిజ సంపదలను విదేశీ బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడానికి కాదా? దేశ పర్యావరణానికి సహజ రక్షకులయిన అడవి బిడ్డలను బైటికి తన్ని తగలేస్తే ప్రకృతి సృష్టించే పెను విధ్వంసానికి గురయ్యేది ఈ దేశ ప్రజలు కాదా?

కూడంకుళం అణు కర్మాగారం తమ కడుపుపై తన్నుతుందని, తమ నోటికాడ కూడు లాక్కుంటుందని భయభ్రాంతులవుతున్న మత్స్యకారులను మెప్పించడం మాని దేశద్రోహం కేసులు నమోదు చేసి వేధిస్తే వారు ఏం చేయాలి? ప్రభుత్వాలు నడిపే పెద్ద మనుషులే రణవీర్ సేన్ లాంటి అగ్రకుల భూస్వామ్య ప్రైవేటు సైన్యాలను పెంచి పోషిస్తుంటే ఆప్తులను, కుటుంబాలను కోల్పోయి నిస్సహాయులై విలపించే దళితులు ఏం చేయాలి? ‘సల్వా జుడుమ్’ (శాంతి యాత్ర) పేరుతో గిరిజన యువకులకే ఆయుధాలు ఇచ్చి వారిలో వారే కొట్టుకు చచ్చే అమానవీయ నీతిని అమలు చేస్తూ ప్రశాంత ఆదివాసీల జీవనంలో అశాంతి జ్వాలలు రగిలిస్తున్న ప్రభుత్వాల పాలనలో ఆదివాసీలు ఏం చేయాలి?

“గోధ్రా దహనకాండకు ప్రతీకారంగానే హిందువులు ‘చర్యకు-ప్రతిచర్య’ సూత్రాన్ని అమలు చేస్తున్నారు” మీరు నిర్లజ్జగా చాటితే అది మహాత్మా గాంధీ గారి అహింసా సిద్ధాంతమేనా? మహాత్మా గాంధీ “ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపించు” అన్నారే గానీ “ఒక చర్యకు అనేక రెట్లు ప్రతీకార చర్యలకు తెగబడు” అని చెప్పలేదే? పదవి కోసం, అధికారం కోసం, సీట్ల కోసం ఆ గుడి అనీ, ఈ మసీదు అనీ తగాదాలు రగిలించి సొమ్ము చేసుకొమ్మని చెప్పింది ఎవరు?

ఎర్రకోట సింహాసనం కోసం పులి గారు హఠాత్తుగా శాకాహారం కబుర్లు మొదలుపెడితే జనం నమ్మాలీ?!

10 thoughts on “పటేల్ విగ్రహానికి కాణీ విదల్చని మోడి

 1. గాంధి బొమ్మను పెట్టుకుని భారత స్వతంత్ర పాలనను చెప్పుకుంటూ కుటుంబ పాలనతో ప్రజలకు బోడిగుండును చూపుతోంది. రాజకీయ వితరణలో విరాళాలకు తావు లేదు టెండర్లకు తప్ప. గతంలో మోడి కాణి రాల్చలేదని స్వ్ల్పకాల వ్యవధిని చూపితే వేళ్ళు పాతుకుపోయి లంచాల లోతుకుపోయి, స్కాముల బురదలో పొర్లే యు.పి.ఏ. కార్యకర్తలనుంచి మంత్రివర్యులు దాకా ఖద్దరు ముసుగులోఖపడ్దార్తో పార్టీ నిధులను స్వాహచేస్తూ జనాలకు రిక్త హస్తం అభయహస్త రీతిలో చూపుతూ మాయమ్మ సోనియమ్మనే సొల్లు నాయకులు లేరా? యువ, వృద్ధ నాయకులైనా పార్టీ సేవలో ఉడుతాభక్తితో ఉధృతంగా మేయడానికి తప్ప దేశాన్ని ఉద్ధరించేదేముంది?

 2. i dont comment about the content in your article, but can you please change title, Patelji is not a begger waiting for KANIs.I understood your meaning, but this kind of language will be used for people, who are waiting for some kind of help from others. Patelji is not waiting for any help and i think if he is alive he dont want the statue also.

 3. “గుంటూరు జిల్లాలోని బడేపురం వీధి మొదల్లో బడ్డీ కొట్టు నడుపుతున్న తాతగారిని ఈ సంగతి కనుక్కుంటే సరిపోతుంది. లేదా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి బస్టాండు దగ్గర శనక్కాయలు అమ్ముకునే అవ్వని అడిగినా చాలు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రధాని కాకపోవడం వల్లనే మీరింకా ఈ దుస్ధితిలో ఉన్నారని చెబితే “పటేలా! ఆయనెవరు?’ అని అడుగుతారు. వినేవాళ్లు ఉన్నారు గనకనే అరవైయారేళ్ళ నుండి ఈ విధంగా జనం చెవుల్లో పూలు పెట్టగలుగుతున్నారు.”

  Ina gunturu, vijayawada vallaki emi thelusu, patel ji emichesadu ani… Ippudu meru untunnare Hyderabad lo… Hyderabad lo unna tahani, avani adugandi… cheputharu… patel ji ante…

  Ina me manasulo, patel ji, “UKKU MANISHI” ani peru konukkunadu ani anukuntanu…

 4. “Ina gunturu, vijayawada vallaki emi thelusu, patel ji emichesadu ani…”

  నరేష్ గారూ, నేనన్నదీ అదే గదా!

  కానీ మోడీ అలా అనడం లేదు. పటేల్ ప్రధాని కాలేదే అని ప్రతి భారతీయుడూ బాధపడుతున్నాడని ఆయన కనిపెట్టారు. కాబట్టి మీరు మోడీకి చెప్పాలి. ‘ప్రతి భారతీయుడుకీ ఆ బాధ లేదు లెండి. కేవలం హైద్రాబాద్ లోని వారికి మాత్రమే ఆ బాధ ఉన్నదీ’ అని.

  ఇంతకీ, నేను ఉండేది కూడా హైద్రాబాద్ లో కాదు. కోస్తాలో ఏదో ఒక మూల ఉంటున్నాను.

 5. ఒక విగ్రహం గురించి మరి ఇంకో విషయం గురించి చర్చ చేపట్టే టప్పుడు అవి అందరికి విజ్ఞానదాయకంగా వుండాలి కానీ రాజికీయ లబ్ది కాంక్షించి ప్రసంగం చేయరాదు అంతకన్నా పెద్ద విషయాలు బోగుఘనుల లొసుగులు, స్టాంపుల లొసుగులు ఇంక చాల విషయాలు మాట్లాడవచు కానీ ఈ వెబ్ సైట్ ఏకపక్ష దోరణి చూపుతున్నది ఇది మీ సైట్ పరపతిని పరిమితం చేస్తుదని గమనించండి.

 6. mee vyasalanitilo modi , bjp ni vimrsistu rasaru gani manmohan prabhutwa avineethi gurinchi em rayaledu ..ante meeru avneethi ni samardhistunara leda congress avineetiki amudupoyara..patel pm kaledani prati bharatiyudu badha padutunadu…meeru bharateeyudu kadu kanuka badha padaka povachu..mee uddesyamlo sonia gandhi devatha ..meedi online yellow media …

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s