తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదులుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోసారి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తాజాగా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము కేంద్రాన్ని కోరామని, ఒక్కో పార్టీ నుండి ఒక్కరే ప్రతినిధిగా పిలవాలని కూడా చెప్పామని సి.పి.ఐ నాయకులు నారాయణ గారు విలేఖరులకు ఈ రోజే చెప్పడం విశేషం. వారి డిమాండ్ మేరకే షిండే ప్రకటన వచ్చిందా లేక కాకతాళీయంగా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం చర్చించడానికి వచ్చే వారమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని షిండే ఈ రోజు ఢిల్లీలో ప్రకటించారని పి.టి.ఐ తెలిపింది. జి.ఓ.ఎం (Group of Ministers) నవంబర్ 7 తేదీన సమావేశం కావాలని ఇప్పటికే నిర్ణయం జరిగింది. ఆ సమావేశం లోపుగానే అఖిలపక్ష సమావేశం జరగవచ్చని షిండే సూచించినట్లు తెలుస్తోంది. “జి.ఓ.ఎం విధి, విధానాల (terms of reference) కు సంబంధించిన వివిధ అంశాలను చర్చించి తగిన సూచనలు తీసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాము” అని షిండే తెలిపారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి దాదాపు ప్రధాన పార్టీలన్నీ రెండు గొంతుకలతో మాట్లాడుతూ ప్రజలను అయోమయంలో ముంచి ఎన్నికల స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకునే కృషిలో తలమునకలై ఉన్నాయి. ఎన్.జి.ఓ ల సమ్మె విరమణతో సీమాంధ్ర రాజకీయ నాయకుల కప్పదాటు ప్రకటనలు, వీరావేశాలు, ఆత్మ స్తుతి – పరనింద లు… తదితర రణగొణ ధ్వనులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అఖిల పక్ష సమావేశం ప్రకటనతో ఈ ధ్వనులు మరొకసారి చెలరేగే అవకాశం కనిపిస్తోంది.
కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ అఖిలపక్షం ఎందుకని తెలంగాణ టి.డి.పి ప్రశ్నిస్తోంది. తెలంగాణ ఏర్పాటును జాప్యం చేయడానికే అఖిలపక్షం అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని మోత్కుపల్లి, దయాకర్ లాంటి టి.టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. సి.పి.ఐ నేత నారాయణ మాత్రం తమ డిమాండ్ అంగీకరించినందుకు సంతోషం ప్రకటిస్తూ ఒక పార్టీ నుండి ఒక్కరినే ఆహ్వానించాలని మరోసారి కోరారు. అఖిలపక్ష సమావేశాన్ని ఆహ్వానిస్తున్నామని టి.కాంగ్రెస్ ప్రకటించింది. అయితే సీమాంధ్రలో వివిధ పార్టీల స్పందన ఏమిటో ఇంకా తెలియలేదు.
టి.వి9 ప్రకారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి లేఖ రాసినందునే మళ్ళీ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. మళ్ళీ అఖిలపక్ష సమావేశం జరపాలని ఈ రోజు (అక్టోబర్ 30) జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ప్రధాని సూచించారని, రాజ్యాంగం ప్రకారం విభజన జరగడం లేదంటూ ముఖ్యమంత్రి లేఖ రాయడమే దానికి కారణమని చానెల్ చెబుతోంది. కోర్ కమిటీ సమావేశం నుండి బైటికి వచ్చిన షిండే అఖిలపక్ష సమావేశం విషయాన్ని విలేఖరులకు చెప్పారని ఛానెల్ తెలిపింది.
జి.ఓ.ఎం కు నిర్దేశించిన విధి, విధానాలపై చర్చించడానికే అఖిలపక్ష సమావేశం అని షిండే చెబుతుండగా తెలంగాణ టి.డి.పి నాయకుల ప్రకటనలు అందుకు అనుగుణంగా లేవు. తెలంగాణను జాప్యం చేయడానికే సమావేశం అని ఒకరు, పార్టీలు ఇప్పటికే అభిప్రాయం చెప్పాక మళ్ళీ సమావేశం ఎందుకని మరొకరు చెప్పడం అంటే షిండే ప్రకటన వారికి సరిగా అర్ధం కాలేదని అనుకోవాలా? తెలంగాణ కావాలా వద్దా అని అడగడానికి కాదు కదా అఖిలపక్షం? కేవలం జి.ఓ.ఎం కి నిర్దేశించిన విధి, విధానాలపై చర్చకే సమావేశం అని చెప్పాక కూడా తలాఒక అర్ధం తీస్తూ ప్రజల్ని గందరగోళంలో పడేయడం ఎందుకు?
సి.ఆర్.పి.ఎఫ్ మాజీ అధిపతి కె.విజయ్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్ధాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. సదరు కమిటీ సభ్యులు ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కూడా. ఇప్పటికే పలు దఫాలుగా వివిధ శాఖలతో సమావేశం అవుతూ సమాచారం సేకరిస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో షిండే ప్రకటనపై అనుమానాలు పెంచడం అర్ధరహితం.
హైద్రాబాద్ లో ఉన్న టాస్క్ ఫోర్స్ వివిధ నిపుణులతోనూ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ సమావేశాలు జరుపుతోంది. ఆస్తులు, అప్పుల విభజన; పాలనా వ్యవస్ధల విభజన తదితర అంశాలపై అది సమాచారం సేకరిస్తోంది. వివిధ ప్రభుత్వ సంస్ధల సమాచారం సేకరిస్తోంది. విద్యుత్, నీటి వనరులు, ఆర్ధికం, ప్రణాళికా కమిషన్ తదితర విభాగాల మంత్రిత్వ శాఖల కార్యదర్శులు జి.ఓ.ఎం కి సమర్పించడానికి నివేదికలు తయారు చేసే పనిలో నిండా మునిగి ఉన్నారు. ఆస్తుల విభజనకు సంబంధించి వివిధ అవకాశాలను వారు సూచనల రూపంలో అందజేయనున్నారు. వారు ఆంధ్ర ప్రదేశ్ లోని తమ తమ విభాగాల కార్యదర్శులతో సంప్రదించి వివరాలు సేకరిస్తూ నివేదికలు తయారు చేస్తున్నారు. నవంబర్ 5 లోపు జి.ఓ.ఎం కు నివేదికలు ఇవ్వడానికి వారు వేగంగా పని చేస్తున్నారని పత్రికలు చెబుతున్నాయి.
ది హిందూ పత్రిక ప్రకారం అందుబాటులో ఉన్న వనరులపై సమాచారం ఇవ్వాలని విజయ్ కుమార్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులను కోరారు. మాజీ డి.జి.పి లను పిలిపించుకుని వివిధ అంశాలపై సలహాలు సూచనలు కోరారు. అయితే టాస్క్ ఫోర్స్ పిలిచిన ముగ్గురు డీజిపిల్లో అరవిందరావు గారు ఒక్కరే హాజరయ్యారని తెలుస్తోంది. స్పెషల్ పోలీస్, గ్రే హౌండ్స్, సి.ఐ.డి, గూఢచార యంత్రాంగం తదితర విభాగాల సిబ్బంది విభజన విషయమై ఆయన సూచనలు ఇచ్చారని, ఆయా విభాగాల సామర్ధ్యం దెబ్బతినకుండా ఉండేలా విభజన జరగాలని ఆయన సూచించారని పత్రిక తెలిపింది.
మిగిలిన ఇద్దరు డి.జి.పిల్లో ఒకరయిన ఆంజనేయ రెడ్డి గారు సమావేశానికి హాజరు కాకపోవడానికి విచిత్రమైన కారణం చెప్పారని తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయే ప్రసక్తే లేదని, విభజన జరగనికాడికి విభజనానంతర భద్రతా సమస్యలపై చర్చించడం ఎందుకంటూ ఆయన రాలేదని పత్రిక తెలిపింది. మరో మాజీ డి.జి.పి హెచ్.జె.దొర ఎందుకు హాజరు కాలేదో వివరాలు వెల్లడి కాలేదు. రాష్ట్ర విభజన జరిగాక తలెత్తే శాంతి భద్రతల సమస్యలపై బుధవారం చర్చలను టాస్క్ ఫోర్స్ బృందం కేటాయించారని తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వారు సోనియా గాంధీ కి కృతజ్ఞతలు చెప్పే పేరుతో జిల్లాలవారిగా బహిరంగ సభలు నిర్వహిస్తూ పండుగ వాతావారణంలో మునిగి తేలుతున్నారు. సీమాంధ్రలో ఇప్పటికీ అక్కడక్కడా నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. విభజన ప్రక్రియ ఎంత త్వరగా ఒక కొలిక్కి వస్తే రాజకీయుల నాటకాల నుండి ప్రజలకు అంత త్వరగా విముక్తి లభిస్తుంది. ప్రక్రియ పూర్తి కావడం కొన్ని సంవత్సరాలు పట్టినా విభజన ఖాయం అన్న వాతావరణాన్ని అన్ని పార్టీలు పూర్తి ఆమోదంతో తీసుకురావాల్సిన అగత్యం ఇంకా మిగిలే ఉంది. అప్పటిదాకా సీమాంధ్ర ప్రజలకు తిప్పలు తప్పవు.
political drama
పక్ష(వాత)పాతం తో పీడింపబడే ఈ అఖిలపక్షం కధా,కమామీషు అటు విభజన ఇటు సమైక్యనాయకులకు నిజానికి అర్ధం కాని విషయం. కేంద్ర సంకేతాలకు అర్ధంతెలియక ఎవరికివారే భాష్యం చెపుతూ బతుకుని రాజకీయాలకు దూరంగా, సంపాదనకు అతీతంగా, వ్యావత్తులేక రాష్ట్ర రాజకీయ నాడి వ్యవస్థను, పాలనాధికారాన్ని చిన్నాభిన్నం చేసి, రాజకీయ నాయకులను ఆచేతనవస్థలో దిగజార్చి వాళ్ళు తమాష చేస్తుంటే వీళ్ళు జీర్ణించుకోలేక పైత్యం ప్రకోపించి ఎవరికివారు సొల్లు రాజకీయాలను కక్కుతున్నారు. కొసమెరుపేమిటంటే, తెలుగు పూతరేకల పొరలను తీసే ఆరటంలో సగానికి చిరిగిన రాష్ట్రాన్ని ఎలా పంచాలో తెలియక కుక్కలు చింపిన విస్తరిలా చేసి ఊర కుక్కలను ఉసిగొలిపి నాలిక దొరదపెట్టే రీతిలో వాక్కోమంటున్నారు, నాక్కోమంటున్నారు. తమాషా వారిది, ఆషామాషి రాష్ట్రానిది. తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, జమ్మూ నాయకుల చేతిలో ఆశాంతం రాష్ట్రాన్ని పెట్టి, వాళ్ళిష్టం వచ్చినట్లు నాకుతుంటే దమ్ములేని మన నాయకులను లొట్టలేస్తూ కూర్చోపెట్టారు. వ్యక్తిత్వంలేక అధికార వ్యామోహంతో ప్రజలను భ్రమపెట్టే ఫలితానికి భవిష్యత్తు బుద్ధిచెపుతుంది. రాజకీయ వ్యసనానికి ఇది పరాకాష్ట, భారతదేశ వ్యవస్థకు అప్రదిష్టను ఆపాదించే అవస్త.