విభజన గీతా మకరందం


-రచన: పైడి తెరేష్ బాబు (పైడి శ్రీ)

మ్యాచ్చోహి ఫిక్సింగహ కిం కరిష్యోపి జగద్విదితహతహ
తీర్మాణాం అవిశ్వాసపి రక్షతి ప్రతిపక్షాం అనుభవిష్యతి

అపార్థా!

గతమున మేసిన దొంగగడ్డి కారణమున, చిప్పకూడు ఎచట తినవలసి రావచ్చునో యను భయము వలన, కేంద్ర, రాష్ట్ర పాలకపక్షముతో లోపాయికారీ మాచ్ ఫిక్సింగులకు పాల్పడి, శాసనసభయందు అవిశ్వాస తీర్మానము వీగిపోవునటులజేసి, ప్రజాకంటక ప్రభుత్వమును కాపాడిన ప్రధాన ప్రతిపక్షము వారే… మాచ్ ఫిక్సింగుల గురించి నేడు విమర్శించుచున్నారు. ఇది చిత్రములలోకెల్ల భళారే విచిత్రము. రథము దిగి కాస్సేపు పగలబడి నవ్వుకొందము. రమ్ము.

అయ్యో కుయ్యో మొర్రో [ఇది అస్తిత్వవేదనా నాదము]

***               ***               ***

ఏకాం హి ద్వయో ఏకహ! ఏకాద్వయో త్రయంబకరాం!
త్రయోదశాంచ ద్వాదశహ! రిమోటాస్త్రాం ప్రయోగామ్యహం !

అపార్థా!

రెండు ఒకట్లు ఒకటి యని, ఒక రెండ్లు మూడు యని, మూడు ఒకట్లు పదమూడున్నర యని, పదమూడు ఒకట్లు పన్నెండుంబాతిక యని దేనికి తోచిన కథనము అది ప్రచురణము, ప్రసారము చేయుచున్నది. ఏ పత్రిక, ఏ చానల్ కథనము ఎట్లేడ్చిననూ బకరా వలె నమ్మక, రెండు ఒకట్లు రెండే యను గణిత సూత్రముననుసరించి రెండు రాష్ట్రముల ఏర్పాటు తప్పదను సత్యమును నీవు విశ్వసింపుము.

కొన్ని పత్రికలకు, చానళ్ళకు రెండో ఎక్కము కూడా సరిగా రాదను వాస్తవమును మరింత బలముగా విశ్వసించి వాటిపై రిమోటాస్త్రము ప్రయోగించు సమయమాసన్నమైనదని గుర్తించుము.

టంగ్ టంగ్ టంగ్ టట్టంగ్ టంగ్ [ఇది ప్రాధమిక పాఠశాల ఘంఠారావము మరియూ పరమశుంఠా నాదము]

***               ***               ***

రణాన్నినాదోపి కరామి శంఖనాదస్య హేతుబద్ధహ పరిగణనాం
కారణోపి మూలాంచ విస్మరస్య మూలశంకో నాద వినిపిష్యాం

అపార్థా!

రణమునకు కారణములు, కారణములకు మూల కారణములు ఆధారములగుచున్నవి. ఇరుపక్షములు కలిగిన రణమునందు మ్రోగు శంఖము సమరశంఖారావమగును. మూలకారణములు విస్మరించి ఏక పక్షముగ మ్రోగు శంఖము మూలశంకా రావమగును [మొలలు మున్నగు వ్యాధి విశేషములతో కూడిన మిక్కిలి బాధాకరంబగు ఆర్తనాదము]

కోట్లఖర్చుతో కూడుకొనిన వోట్ల వ్యూహములకు మరికొన్ని నెలల వ్యవధి కలదు. కావున జనసమీకరణములు చేయుట మాని విభజన సమీకరణముల గురించి యోచింపుము. పదమూడు జిల్లాల ప్రత్యేక రాష్ట్రము కొరకు పోరాడుము.

హమ్మా నాయనా దేవుడా తండ్రీ [ఇది మూలశంకా నాదము]

***               ***               ***

సమైక్యో జీవిత యపి మొత్తుకస్య విభాజిత పాలనం రహతి
విభజనోపి విముక్తస్య కహే ఏకతాం రహే పాలకానాం దుర్మతి

అపార్థా!

సమైక్యముగా ఉండెదమని మొత్తుకున్నపడు విభజించి పాలింతురు. విభజించి పాలించమని అడిగినపుడు సమైక్యముగా ఉండుడందురు.

కావున, పాలకులెప్పుడైనను దుర్మతులే ననియూ సర్వకాల సర్వావస్థలయందు వారు ప్రజా వ్యతిరేక విధానములనే పాటింతురను సత్యమును నీవు గ్రహించుము. ప్రజానుకూల నిర్ణయము ప్రకటించి అద్దానిని అమలు చేయు విషయమై కాలయాపన చేయుట వెనుక గల స్వార్ధ రాజకీయములను పసిగట్టుము.

టటటటాం టుయ్యుం టుక్కూం [ఇది వి+పరిణీత వీణా నాదము]

***               ***               ***

(ఈ శ్లోకములకు సెంట్రల్ యూనివర్సిటీ (ప్రొఫెసర్?) శివరామ కృష్ణ గారు ఇచ్చిన అభినందనా పూర్వక వివరణ కూడా చూడండి. -విశేఖర్)

“విభజన గీతా” మకరందం ! !

బాగా పేరుపొందిన, విలక్షణమైన (సంభాషణా) శైలి కలిగిన వ్యక్తులను మాత్రమే మిమిక్రీ చేయడానికి వీలు అవుతుంది. అలాంటి ధ్వన్యనుకరణనే ప్రేక్షక శ్రోతలు పోల్చుకొని ఆనందించ గలుగుతారు. అల్లాగే సాహిత్యంలో కూడ శక్తివంతమైన, ప్రత్యేకమైన శైలి కలిగిన రచనను అనుకరించి నప్పుడే ఆ ‘అనుకరణ రచన’ సఫలమవుతుంది.

తేరేష్ బాబు గారి “విభజన గీత” (వి.గీ.) కూడ అలాంటి అనుకరణాత్మక అధిక్షేప రచన, అధిక్షేపాత్మక అనుకరణ రచన. ఇక్కడ అనుకరణ కేవలం హాస్యం కోసం కాదు, అధిక్షేపం కోసం. అనుకరణ, అధిక్షేపాలు సమాన స్థాయిలో నిర్వహింపబడిన మంచి రచన “వి.గీ.”

మణిప్రవాళ భాషలో, ‘అసంస్కృతా’న్ని సంస్కృతంగా భాసింప జేయడం, ఘంటశాల వారి ‘గీత’ శ్లోక భావాలలోని సరళ గ్రాంధిక భాషను యధాతథంగా పట్టుకోవడం, ఘంటశాల వారి గంభీర స్వరాన్ని తలపింప జేయడం మొదలైనవి ఈ ‘వి.గీ.’ లోని కొన్ని విశేషాలు. ‘వి.గీ.’ లోని ‘గీత’—–తెలుగుపదం (విభజన రేఖ) గాను, సంస్కృతపదం (గానం చేయబడినది అనే అర్థంలో) గాను ఏక కాలంలో అన్వయం కలిగి ఉండడం నామకరణంలోని నైపుణ్యం.

‘సమైక్యాంధ్ర’ అల్లరుల విన్యాస వల్లరులను చూసి ఆందోళనకు గురి అవుతున్న సగటు తెలంగాణ పౌరునికి, తెలంగాణవారి ప్రజాస్వామ్య హక్కును గుర్తించకుండా ‘అన్యథా’ భావిస్తున్న సగటు ఆంధ్ర పౌరునికి “అపార్థా” అనే సంబోధన వర్తిస్తున్నది. “అపార్థా” అనే సంబోధనలోనే ‘పార్థుడి’ నీ, ‘అపార్థా’ న్నీ స్ఫురింపజేశారు.

వ్యంగ్యం, హాస్యం ప్రధానంగా కనిపిస్తూ, పదునైన అధిక్షేపాన్ని నింపుకున్న అర్థవంతమైన ‘గీత’ ఇది. గులాబీ ముల్లు లాగా కనిపిస్తుంది. కాని దాని కింద సూటిగా గుండెల్లో గుచ్చుకునే పిడిబాకులు ఉన్నాయి. ఆత్మవంచనలు, నగ్నసత్యాలు, కఠోర వాస్తవాలే ఆ కరవాలాలు.

‘జన సమీకరణలు’, ‘విభజన సమీకరణలు’ లాంటి యమకాలు, ‘మూల శంకారావాలు’, లాంటి అనుకరణ పదబంధాలు మొదలైనవి తేరేష్ బాబు గారి సద్యః స్ఫూర్తికి తార్కాణాలు.

నిర్దిష్ట భావజాలం, ఆలోచనలలో, అభిప్రాయాలలో స్పష్టత, వ్యంగ్య రచనా వైభవం, నిజాయితీ, నిర్భీతి మొదలైన అంశాల సమ్యక్ సమ్మేళనం ఈ ‘విభజన గీత’. పైడి తేరేష్ బాబు గారికి అభినందనలు, ధన్యవాదాలు. (రాస్తే ఇంకా విశేషాలు చాలా ఉన్నాయి.)

3 thoughts on “విభజన గీతా మకరందం

 1. అవతరణ వితరణల మధ్య నలిగిన తెలుగు ముఖ్యమంత్రి కిరణం
  అధిష్టానం తికమకలతో నిరాశ నిట్టూర్పుల ప్రసంగిత హృదయం!
  సంకోచ వ్యాకోచాలలో సమైక్యత భావనలలో ఏదో తెలియని వేదన
  ఎన్.జీ.ఓ. నాయకుని ప్రసంగాలలో ప్రతిస్పందించే సమైక్య భావన!
  రాటుదేరిన రాజకీయలలో నిర్లిప్తత, రాలుగాయి ప్రసంగాలలోబలం
  జనాలు, భజనలు, విభజనలతో తెలుగు భవిష్యత్తు అతలాకుతలం!

 2. శేఖర్ గారు. తెరేశ్ గారు అమరులయ్యారట. దళిత కవిగా తెలుగు కవిత్వంలో తెరేశ్ బాబు గారిదో ప్రత్యేక స్థానం.
  ఆయన మృతి వార్త తెలియగానే మీరు బ్లాగ్ లో పెట్టిన ఈ పోస్టు గుర్తొచ్చింది. …ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s