ఐ.ఎం.ఎఫ్ అంటే అలిగితిమి, ఆర్.బి.ఐదీ అదే మాటాయె!


భారత ఆర్ధిక వృద్ధి రేటు అంచనాను ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు లు తగ్గించినందుకు భారత ప్రభుత్వం తీవ్ర స్ధాయిలో ఉడుక్కుంది. ఎంతగా ఉడుక్కుందంటే, అసలు ఐ.ఎం.ఎఫ్ ఆర్ధిక అంచనా పద్ధతులను మార్చిపారేయాలని మన ఆర్ధిక మంత్రి చిదంబరం నేరుగా ఐ.ఎం.ఎఫ్ (వాషింగ్టన్) సమావేశాల్లోనే డిమాండ్ చేసేంతగా. తీరా చూడబోతే మన ఆర్.బి.ఐ కూడా భారత వృద్ధి రేటును దాదాపు ప్రపంచ బ్యాంకు అంచనాకు దరిదాపుల్లోనే ఉంచింది. 2013-14 లో ఇండియా వృద్ధి రేటు 4.7 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు  అంచనా వేయగా ఆర్.బి.ఐ నియమించిన వృత్తిగత ఆర్ధికవేత్తలు 4.8 శాతం ఉంటుందని ఈ రోజు (అక్టోబర్ 28) ప్రకటించారు. చిదంబరం గారు ఎరికోరి తెచ్చుకున్న కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ షాకుల మీద షాకులు ఇస్తుంటే పాపం ఆయన నోటి నుండి మాటే కరువయినట్లుంది.

ఆర్.బి.ఐ నియమించిన వృత్తిగత అంచనాకారుల (professional forecasters) ప్రకారం భారత ఆర్ధిక వ్యవస్ధ 2013-14 ఆర్ధిక సంవత్సరంలో 4.8 శాతం మాత్రమే వృద్ధి చెందుతుంది. అనగా GDP growth rate 4.8 శాతం ఉంటుందని అర్ధం. ఆర్.బి.ఐ గతంలో ఈ రేటు 5.7 శాతం ఉంటుందని అంచనా వేసింది. దానిని ఇప్పుడు 4.8 శాతానికి తగ్గించుకుంది.

తమ అంచనా తగ్గడానికి ప్రధాన కారణం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో నెలకొన్న వర్తుల పరిస్ధితులే (cyclic conditions) అనీ, భారత దేశంలో నెలకొన్న పరిస్ధితులు వాటిని తీవ్రం చేశాయని ఆర్.బి.ఐ వివరించింది. “మొదటి త్రైమాసికం (2013-14 Q1) లో వృద్ధి రేటు గత 17 త్రైమాసికాలలో కెల్లా అతి తక్కువ స్ధాయి 4.4%కి పడిపోయింది. ఈ లెక్కన 2013-14 సంవత్సరంలో కూడా గత సంవత్సరం మాదిరిగానే ఉంటుంది. ఈ యేడు మొదటి అర్ధ భాగంలో వృద్ధి తక్కువగానే ఉన్నప్పటికీ రెండో అర్ధ భాగంలో పుంచుకోవచ్చు. నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే అధికంగా వర్షపాతం ఇచ్చిన నేపధ్యంలో వ్యవసాయ వృద్ధి మెరుగవడం, క్షీణించిన రూపాయి విలువ వలన ఎగుమతులు పెరగడం… కారణాల వలన ద్వితీయార్ధంలో వృద్ధి మెరుగవుతుందని భావిస్తున్నాం” అని ఆర్.బి.ఐ తెలిపింది.

గత యేడు భారత స్ధూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు (GDP Growth Rate) 5 శాతం మాత్రమే నమోదయింది. ఈ యేడు దానికంటే తగ్గి 4.8 శాతం వృద్ధి చెందుతుందని ఆర్.బి.ఐ చెబుతోందన్నమాట! చిన్న చిన్నవే అయినా స్ధిరమైన చర్యలు తీసుకుంటే భారత ఆర్ధిక వృద్ధికి ఢోకా ఉండదని ఆర్.బి.ఐ జోకొడుతోంది. “భారత ఆర్ధిక శక్తిని వినియోగంలోకి తేవాలంటే ఓం ప్రధమం తీసుకోవలసిన చర్య: స్ధూల ఆర్ధిక వ్యవస్ధలో స్ధిరత్వాన్ని తేవడం. అందులో విఫలం అయితే భారత వృద్ధి రేటు చిరకాలం పాటు కూలిపోతుంది” అని ఆర్.బి.ఐ పేర్కొంది.

ఆయనే ఉంటే… అన్నట్లు స్ధూల ఆర్ధిక వ్యవస్ధ స్ధిరంగా ఉండడం కోసం ఏమి చేయాలో చెప్పాలి కదా? ఉన్న సమస్యను తిరగేసి, మరగేసి ఎన్నిసార్లు చెప్పినా సమస్య అదే కదా! స్ధూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు ఆశించిన స్ధాయిలో లేకపోవడం సమస్య. అలా లేదంటే ఆర్ధిక వ్యవస్ధలో తీవ్ర ఒడుదుడుకులు ఉన్నాయనే అర్ధం. అనగా స్ధిరత్వం లేదని అర్ధం. మరి, “స్ధిరత్వం రావాలంటే స్ధిరత్వం ఉండాలి” అనడంలో ఏమిటి అర్ధం?

ఈ పరిస్ధితుల్లోనే ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి రేటు 2013-14 లో 4.7 శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు అక్టోబర్ 16 తేదీన ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు కొద్ది నెలల క్రితం ఇది 6.1 శాతం ఉంటుందని అంచనా వేసింది. అంటే 1.4 శాతం మేర తన అంచనా తగ్గించేసింది.

ఐ.ఎం.ఎఫ్ యేమో మన వృద్ధి రేటు ఈ యేడు 3.75 శాతమే ఉంటుందని ‘ప్రపంచ ఆర్ధిక అంచనా’ (World Economic Outlook) ను ప్రకటిస్తూ తెలియజేసింది. ఐ.ఎం.ఎఫ్ పూర్వ అంచనా 5.6 శాతం. ఐ.ఎం.ఎఫ్ అంచనాను మన ఆర్ధిక మంత్రి చిదంబరం తీవ్ర స్ధాయిలో విమర్శించారు. కొద్ది నెలల తేడాలోనే ఇంత భారీగా అంచనా ఎలా తగ్గుతుందని ఆయన ప్రశ్నించారు. వాషింగ్టన్ డి.సి లో అక్టోబర్ 13 తేదీన జరిగిన ఐ.ఎం.ఎఫ్ ప్లీనరీ సమావేశంలో ఆయన మహా యాష్ట పోయారు.

“ఉదాహరణకి ఇండియా వృద్ధి రేటు తీసుకోండి. జులై నాటి WEO (World Economic Outlook) నివేదికలో 5.6 శాతం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు దాన్ని తీవ్రంగా తగ్గించేసి 3.8 శాతం అంటున్నారు. గౌరవపూర్వకంగా నేనొకటి అడుగుతాను. జులై-సెప్టెంబర్ మధ్యలోనే ఐ.ఎం.ఎఫ్ సేకరించిన, మా వద్ద లేని, తన అంచనాను తీవ్రంగా తెగ్గోసుకోవాల్సిన పరిస్ధితికి నెట్టిన సమాచారం ఏమిటిట? ఇటువంటి నిరాశాపూరితమైన అంచనాను మేము స్వీకరించడం లేదు. అసలు వృద్ధి రేటు అంచనా కోసం ఐ.ఎం.ఎఫ్ అనుసరించే పద్ధతినే ఒకసారి సమీక్షించుకోవాలని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఐ.ఎం.ఎఫ్ అంచనాలు తరచుగా వాస్తవ వృద్ధితో పోలిస్తే చాలా తేడాగా ఉంటున్నాయి” అని ఐ.ఎం.ఎఫ్ ను చీల్చి చెండాడినంత పని చేశారు చిదంబరం.

చిదంబరం మాత్రమే కాదు. భారత ప్రధాని ఆర్ధిక సలహా మండలి ఛైర్మన్, ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ కూడా అయిన రంగరాజన్ కూడా ఇండియా వృద్ధి రేటు పై ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు ల అంచనాలను తప్పు పట్టారు. “ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులు అవాంఛనీయ రీతిలో నిరాశావాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మన వృద్ధి రేటు ఈ యేడు 5 నుండి 5.5 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నాం. గతంలో 5 శాతం ఉంటుందని చెప్పాము. ఇప్పటికే అదే చెబుతున్నాం” అని రంగరాజన్ గారు అక్టోబర్ 24 తేదీన న్యూ ఢిల్లీలో జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చెప్పారు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే రంగరాజన్ నేతృత్వంలోని సలహా మండలి కూడా భారత వృద్ధి రేటును తీవ్రంగా మార్చుతూ వచ్చింది. 2013-14 కి గాను ఇండియా వృద్ధి రేటు 6.4 శాతం ఉంటుందని జులైలో చెప్పింది. సెప్టెంబర్ కి వచ్చేసరికల్లా దానిని 5.3 శాతానికి తగ్గించుకుంది. అంటే 1.1 శాతం! ఐ.ఎం.ఎఫ్ కి ఏ సమాచారం లభిస్తే వృద్ధి రేటు అంచనా తగ్గించారని చిదంబరం ఒక పక్క అడుగుతున్నారు. కానీ ఆయన ప్రధాని ఆర్ధిక సలహా మండలిని కూడా ఆ ప్రశ్న వేయాలి. వారికి ఏ సమాచారం దొరికితే వృద్ధి రేటును 6.4% నుండి 5.3% కి తగ్గించారు. పైగా ఆ 5.3% వద్ద కూడా ఇప్పుడు నిలబడడం లేదు. ఒక పక్క 5 నుండి 5.5 శాతం వృద్ధి ఉంటుందని చెబుతూనే మరోపక్క గత యేడు లాగానే 5 శాతం వృద్ధి ఉంటుందని చెబుతున్నారు.

ప్రపంచ బ్యాంకు చెప్పింది 4.7 శాతం. ఆర్.బి.ఐ అంచనా 4.8 శాతం. రంగరాజన్ సలహా మండలి అంచనా 5 శాతం. ఈ అంకెల మధ్య ‘నిరాశావాదం’ అని ఆరోపించవలసినంత తేడా ఉన్నదా? వారిది నిరాశావాదం అయితే మనది కాకుండా ఎలా పోతుంది?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s