పన్నులు ఎగవేయడమే కార్పొరేట్ నీతి!


బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు సంక్షోభ కాలాల్లో కూడా లాభాలు ఎలా సాధిస్తాయి? డబ్బు లేదు మొర్రో అంటూ ప్రభుత్వాలు అప్పుల మీద అప్పులు తెచ్చేది ఈ కార్పొరేట్ కంపెనీల దగ్గర్నుండే. దేశ ఆర్ధిక వ్యవస్ధ మొత్తాన్ని నిర్వహించే ప్రభుత్వం దగ్గర లేని డబ్బు పెట్టుబడిదారీ కంపెనీలకు ఎక్కడి నుండి వస్తుంది? కార్మికుల వేతనాలనూ, సౌకర్యాలను నానాటికీ కుదిస్తూ లాభాలు పోగేసుకోవడం కంపెనీల ప్రధాన మార్గం. లాభాలు పోగేసుకోవడంలో వాటికి ఉన్న రెండో ప్రధాన మార్గం పన్నులు ఎగవేయడం. దీనినే ముద్దుగా ‘టాక్స్ ప్లానింగ్’ అని అవి పిలుచుకుంటాయి. అమెరికాలో అది పెద్ద కార్పొరేట్లుగా పేరుపొందిన కంపెనీల్లో 60 వరకు పన్ను చట్టాలను అక్రమంగా దాటవేసి లాభాలు గుంజుకుంటున్నాయని చెబితే నమ్మి తీరాలి.

వెరిజాన్ కంపెనీ అనేది అమెరికాలో అతి పెద్ద టెలిఫోన్ కంపెనీ. అమెరికా మొత్తాన్ని కేబుల్స్ ద్వారా అనుసంధానం చేసిన కంపెనీ ఇది. ఈ కంపెనీకి డబ్బుకు ఏ మాత్రం కొదవ ఉండదు. కానీ పన్నులు ఎగవేయడంలో మహా దిట్ట. న్యూస్ కార్ప్ అనేది భారీ వార్తల కంపెనీ. అనేక వార్తా సంస్ధలు, టాబ్లాయిడ్లు, దినపత్రికలు, ఛానెళ్లు దీని సొంతం. ఆస్ట్రేలియాకు చెందిన రూపర్డ్ మర్డోక్ (స్టార్ ఛానెళ్ల యజమాని) దీని యజమాని. తన పత్రికల ద్వారా, ఛానెళ్ల ద్వారా జనానికి నీతులు చెప్పడంలో ఈయన ముందు వరసలో ఉంటాడు. అనేకమంది సెలబ్రిటీలు, కంపెనీల నాయకులు, ప్రభుత్వాధినేతలు, చివరికి చిన్న పిల్లలకు కూడా చెందిన సెల్ ఫోన్లను హ్యాక్ చేసి అందులో సమాచారాన్ని దొంగిలించి సంచలన వార్తలు ప్రచురించి సొమ్ము చేసుకున్న కుంభకోణంలో దొరికిపోయిన పెద్ద మనిషి కూడా ఈయన. న్యూస్ కార్ప్ కూడా పెద్ద ఎత్తున పన్నులు ఎగవేసి లాభాలు ప్రకటిస్తుంది.

ఇలాంటి కంపెనీలు దాదాపు 60 వరకూ గత సంవత్సరం ఒక్క పైసా కూడా పన్ను కట్టకుండా ఎగవేయగలిగాయని యు.ఎస్.ఏ టుడే పత్రిక వెల్లడి చేసింది. ఇది సాధించడానికి కంపెనీలు కొత్త కొత్త సృజనాత్మక మార్గాలు కనిపెడుతున్నాయని సదరు పత్రిక విశ్లేషించింది. కొత్త చట్టాలు రూపొందుతున్నపుడే పెద్ద ఎత్తున లాబీయింగు జరిపి స్వేచ్ఛగా దూరిపోగల కంతలు (లూప్ హోల్స్) చట్టాల్లోనే ఏర్పాటు చేయించుకోవడం కంపెనీలకు వెన్నతో పెట్టిన విద్య.

అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం విధించే గరిష్ట ఆదాయ పన్ను 35 శాతం. ఈ అంకెను చూస్తే కార్పొరేట్ కంపెనీలకు మా చెడ్డ చిరాకు. అయితే చట్టంలో ఇంత భారీగా కనిపించే ఆంకె, వసూలు దగ్గరకొచ్చే సరికి అనేక కేసుల్లో చిన్నబోతే, మరిన్ని కేసుల్లో పూర్తిగా అదృశ్యం అయిపోతుంది. ఉదాహరణకి డేటా స్టోరేజి మాధ్యమాలను తయారు చేసే అది పెద్ద సీ గేట్ కంపెనీ మార్కెట్ విలువ 15.9 బిలియన్ డాలర్లు కాగా అది చెల్లించిన పన్ను రేటు మధ్య తరగతి పన్ను చెల్లింపుదారు కంటే తక్కువేనని యు.ఎస్.ఏ టుడే తెలిపింది. ఇంతకీ కంపెనీ కట్టిన పన్ను ఎంత శాతమో పత్రిక కూడా చెప్పలేదు. బహుశా సిగ్గుపడి ఉండాలి.

29.5 బిలియన్ల మార్కెట్ విలువ కలిగిన ‘పబ్లిక్ స్టోరేజ్’ (ప్రపంచంలో అతి పెద్ద డిజిటల్ సెల్ఫ్ స్టోరేజ్ కంపెనీ) కూడా అతి తక్కువ పన్ను చెల్లించిన జాబితాలో ఉంది. ఇంకా బహుళజాతి ఇన్సూరెన్స్ కంపెనీ మెట్ లైఫ్ (53.9 బిలియన్లు), మందుల కంపెనీ రిజెనరాన్ ఫార్మాస్యూటికల్స్ (29.6 బిలియన్లు), వెంటాస్ (19.3 బిలియన్లు), ఎగిలెంట్ టెక్నాలజీస్ (16.9 బిలియన్లు) మొదలైన కంపెనీలు కూడా పన్ను ఎగవేత జాబితాలో ఉన్నాయి. బ్రిటిష్-హాలండ్ సెల్ ఫోన్ సేవల కంపెనీ ఐడియాను కొనుగోలు చేసిన వోడా వోన్ మన దేశానికి 50,000 కోట్ల రూపాయల పన్ను ఎగవేసిన సంగతి ప్రస్తావించుకోవడం అసందర్భం కాదు.

తమ ఉత్పత్తులకు జరిగే చెల్లింపులను విదేశాలకు తరలించడం అనేది పన్నులు ఎగవేయడానికి బహుళజాతి కంపెనీలు అనుసరించే ఎత్తుగడల్లో ముఖ్యమైనదిగా మారింది. ఉదాహరణకి ఒక కంపెనీ ముడి ఉత్పత్తులు తయారు చేయడానికి తక్కువ పన్నులు అమలులో ఉన్న విదేశాల్లో అనుబంధ కంపెనీలు స్ధాపించవచ్చు. ఆ తర్వాత ఒరిజినల్ కంపెనీ తమ అనుబంధ కంపెనీ నుండి అసలు ధర కంటే ఎక్కువగా భారీ రేట్లకు ఆ ముడి సరుకులను కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టిస్తుంది. తద్వారా ఖర్చు ఎక్కువ చూపించి ఆచరణలో భారీ లాభాలు జమ చేసుకుంటుంది.

ఫైనాన్స్ వనరులను కూడా విదేశాలకు తరలించడం ద్వారా పన్నులు ఎగవేయడం మరో మార్గం. ఈ మార్గాన్ని మూసివేయడానికి కృషి చేస్తున్నామని అమెరికా ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా చెబుతోంది. కానీ కంపెనీల ఒత్తిడితో అది ఆచరణ తర్వాత సంగతి, అసలు చట్టం రూపమే దాల్చలేదు. ఈ ఒక్క మార్గం ద్వారానే అమెరికా కంపెనీలు ఎగవేసిన పన్ను గత సంవత్సరం 300 బిలియన్ డాలర్లు. ఈ మొత్తం ఈ సంవత్సరం భారత దేశ బడ్జెట్ లో దాదాపు మూడో వంతు.

ప్రఖ్యాత అమెరికన్ ఐ.టి కంపెనీ యాపిల్ వద్ద ఒక్కోసారి అమెరికా ప్రభుత్వం దగ్గర నిలవ ఉన్న డబ్బు కంటే ఎక్కువ డబ్బు కలిగి ఉంటుంది. దానికి కారణం పన్ను ఎగవేయడానికి అది అనుసరించే వినూత్న మార్గాలే. చైనాలో దొరికే చౌక శ్రమను పూర్తి స్ధాయిలో దోపిడి చేసే ఈ కంపెనీ ప్రపంచం నిండా అనేక పేపర్ కంపెనీలను స్ధాపించి పెద్ద మొత్తంలో పన్ను ఎగ్గొడుతుంది. ఈ సంగతి అమెరికా కాంగ్రెస్ కమిటీయే స్వయంగా విచారణ చేసి నిగ్గు దేల్చింది. యాపిల్ కంపెనీ స్ధాపించిన అనేక అనుబంధ కంపెనీల్లో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేరని కాంగ్రెస్ కమిటీ విచారణలో తేలింది.

ఈ పద్ధతిలో యాపిల్ ఎగవేసిన పన్ను 9 బిలియన్ డాలర్లని గత మే నెలలో బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ తెలిపింది. యాపిల్ కంపెనీని కదిలిస్తే అమెరికాలో అందరికంటే ఎక్కువ పన్నులు -6 బిలియన్లు- కట్టింది తామేనని చెబుతోంది. అంటే కట్టిన పన్ను కంటే ఆగవేసిన పన్ను 150 శాతం ఎక్కువన్నమాట! అమెరికాలో అతి పెద్ద పన్ను ఎగవేతదారు యాపిల్ కంపెనీయే అని రిపబ్లికన్ పార్టీ సెనేటర్ జాన్ మెక్ కెయిన్ అభివర్ణిస్తే ఆశ్చర్యం ఏముంది?

తమాషా ఏమిటంటే ఈ అనుబంధ కంపెనీలు ఏ ప్రభుత్వం కిందికి రాకపోవడం. అంటే ఏ దేశానికీ అవి పన్నులు కట్టే అవసరం ఉండదు. యాపిల్ కంపెనీ ఐర్లాండ్ లో మూడు అనుబంధ కంపెనీలు స్ధాపించింది.  యాపిల్ సంపాదించిన లాభాల్లో 60 శాతం సొమ్ముని ఈ మూడు కంపెనీల కిందనే ఉంచబడింది. పన్ను ఎగవేతదారులకు స్వర్గంగా ఐర్లాండ్ కు పేరు. అక్కడి ప్రభుత్వమే ఇలాంటి ఎగవేతదారులపై ఆధారపడి బతుకుతోంది మరి! అమెరికాలో అయితే 35 శాతం పన్ను కట్టే యాపిల్ అనుబంధ కంపెనీ ఒకటి ఐర్లాండ్ లో 2 శాతం మాత్రమే చెల్లిస్తోంది. యాపిల్ అనుబంధ కంపెనీల్లో కొన్ని ఏ దేశ ప్రభుత్వం కిందికి రావు. అవి స్టేట్ లెస్ కంపెనీలు. ఏ ప్రభుత్వం కిందికీ రాని కంపెనీలను స్ధాపించే అవకాశం పెట్టుబడిదారీ కంపెనీలకు వచ్చిందంటే ఆ అవకాశం ఇచ్చిన ప్రభుత్వాలు పెట్టుబడిదారీ కంపెనీలతో ఎంతగా చెట్టాపట్టాలు వేసుకున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ఇందులో ఐర్లాండ్ డే తప్పుగా కనిపిస్తున్నప్పటికీ అమెరికా పాలకుల లోపాయకారీ సహకారం లేకుండా ఇది జరగడం సాధ్యం కాదు. అంతెందుకు యాపిల్ కంపెనీ పైన విచారణ చేస్తున్నందుకు అనేక మంది సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు పార్టీలకు అతీతంగా నిరసన తెలియజేశారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. యాపిల్ కి చెందిన విదేశీ ఖాతాల్లో 102 బిలియన్ డాలర్లు మూలుగుతున్నాయని కాంగ్రెస్ కమిటీ నిర్ధారించింది. దాని అనుబంధ కంపెనీలను ఘోస్ట్ కంపెనీలుగా కమిటీ అభివర్ణించింది. 

పన్ను ఎగవేతదారుల్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఒకటి. అది విదేశాల్లో స్ధాపించిన అనుబంధ కంపెనీల ద్వారా 2011లో 2.43 బిలియన్ డాలర్లు పన్ను ఎగవేసిందని సెనేట్ కమిటీ ఒకటి నిగ్గు దేల్చింది. అదే సంవత్సరంలో మైక్రో సాఫ్ట్ చెల్లించిన పన్ను 3.11 బిలియన్లు. అంటే చెల్లించిన పన్నుల్లో ఎగవేసిన పన్ను దాదాపు 80 శాతం. 35 శాతం పన్నుకు బదులు నికరంగా 13.4 శాతం పన్ను మాత్రమే మైక్రో సాఫ్ట్ చెల్లించింది. ఐర్లాండ్, ప్యూర్టోరికో, సింగపూర్ లాంటి దేశాల్లో అనుబంధ కంపెనీలు స్ధాపించడం ద్వారా అది ఈ ఫీట్ సాధించింది.

అమెరికా సెనేట్ నియమించిన ఒక కమిటీ ప్రకారం అమెరికా కంపెనీలు తమ ఆదాయంలో 60 శాతం భాగాన్ని విదేశాల్లోనే ఉంచుతూ అమెరికా పన్నులు ఎగవేస్తున్నాయి. ఈ మొత్తం 1.7 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని సదరు కమిటీ తేల్చి చెప్పింది. ఈ డబ్బు గనక అమెరికాకు తిరిగి వెళితే ఆ దేశ ద్రవ్య లోతు భారీ మొత్తంలో తగ్గిపోతుంది. జనాన్ని పన్నులతో బాదాల్సిన అగత్యం ఉండదు. పొదుపు విధానాలతో ప్రజలను వేధించాల్సిన అవసరమూ ఉండదు. అంతెందుకు, ఆరోగ్య భీమా పధకానికి కేవలం కొద్ది బిలియన్ల ఖర్చు ఆపడం కోసం అమెరికా ప్రభుత్వాన్ని మూసేయాల్సిన పరిస్ధితి వచ్చేది కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s