బొగ్గు కుంభకోణం విషయంలో సి.బి.ఐ తనను విచారించదలుచుకుంటే దానికి అడ్డంకులేమీ లేవని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొట్ట తొలిసారి నిన్న ప్రకటించారు. 2జి కుంభకోణంలో అనుమానాలు కమ్ముకున్నా ‘నాకు తెలియదు, నాకు సంబంధం లేదు’ అంటూ తప్పించుకున్న ప్రధాని బొగ్గు కుంభకోణంలో ‘విచారణకు సిద్ధం’ అని ప్రకటించినందుకు దేశ ప్రజలు సంతోషించాలా లేక ఎన్ని ఆరోపణలు వచ్చినా చూరు పట్టుకుని వేలాడుతున్నందుకు సిగ్గుపడాలా?
మన్మోహన్ సింగ్, భారత దేశపు అత్యున్నత నేర విచారణ సంస్ధకు సమర్పించిన ఆహ్వానానికి వాస్తవంగా ఎన్ని అడ్డంకులు ఉన్నాయో ఈ కార్టూన్ సూచిస్తోంది. పెట్టవలసిన అడ్డు గోడలన్నీ నిర్మించుకున్నాకనే ఆహ్వాన పత్రం అందజేసిన ప్రధాని తన నిజాయితీ ఏపాటిదో ఆహ్వానంలోనే నిరూపించుకున్నారు.
చైనా పర్యటనకు వెళ్ళిన ప్రధాని మన్మోహన్ స్వదేశానికి తిరిగి వస్తూ గురువారం ప్రత్యేక విమానంలో విలేఖరులతో మాట్లాడారు. “దేశ చట్టాలకు నేను అతీతుడిని ఏమీ కాను. సి.బి.ఐ గానీ, ఆ మాటకొస్తే ఎవరైనా సరే, నన్ను ఏమన్నా అడగదలచుకుంటే అడగొచ్చు. దాయడానికి నాదగ్గర ఏమీ లేదు” అని అన్నారు. ఈ విధంగా ‘సి.బి.ఐ విచారణ చేసుకోవచ్చు’ అని చెప్పడం ప్రధాని మన్మోహన్ కి ఇదే మొదటిసారి.
భారత దేశపు తొలితరం పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటయిన బిర్లా కుటుంబ వారసుడు కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ లు ఒడిశా బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ సి.బి.ఐ చార్జి షీటు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
పి.సి.పరేఖ్ పైన చార్జి షీటు నమోదు చేయడం పట్ల కాగ్ మాజీ అధికారులు అత్యంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు బొగ్గు కుంభకోణాన్ని వెలికి తీసిందే పరేఖ్ కాగా ఆయనపైనే అభియోగాలు నమోదు చేయడం చాలా దురదృష్టకరం అని వారు వ్యాఖ్యానించారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ ను బొగ్గు కుంభకోణం విషయంలో విచారించడానికి సి.బి.ఐ ఎంతగా కట్టుబడి ఉన్నదో పరేఖ్ పై అభియోగాలు మోపడం బట్టే అర్ధం అవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు కేసే లేని దగ్గర కేసులు మోపడం ద్వారా నిరూపణలకు నిలబడని విచారణకు సి.బి.ఐ సిద్ధపడిందని, తద్వారా ఆరోపణల నుండి పెద్దలను తప్పించేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని వారు విశ్లేషిస్తున్నారు. అనగా పరేఖ్ నిజాయితీని తన డిఫెన్స్ గా ప్రధాని వినియోగించుకోదలిచారా?
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సిఫారసు కారణంగానే తాము కుమార మంగళం కంపెనీ ‘హిందాల్కో’ కు బొగ్గు గనులు కేటాయించామని ప్రధాని తెచ్చుకుంటున్న మరో డిఫెన్స్. ఈ డిఫెన్స్ ద్వారా ఒక కాంగ్రెస్ వ్యతిరేక ముఖ్యమంత్రిని ప్రధాని ముగ్గులోకి లాగారు. ఒడిషా గిరిజనుల భూములను పశ్చిమ బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేయడంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న నవీన్ పట్నాయక్ ‘నిజాయితీపరుడు’గా ముద్ర సంపాదించడమే ఒక విషాధం కాగా ఆయన గారి సో-కాల్డ్ నిజాయితీని సైతం ప్రధాని డిఫెన్స్ గా తెచ్చుకోవడం మరో విషాధం.
‘ఇలాంటి అనేక విషాధ కధలకు మన్మోహన్ పాలన నిలయం’ అంటే అతిశయోక్తి కాబోదు!
ఇదే మాట ప్రధానితో అంటే “అది నిర్ణయించాల్సింది చరిత్రకారులే” అంటూ మరో మేధో గుంపును ముగ్గులోకి లాగారు మన్మోహన్. 2జి నుండి బొగ్గు కుంభకోణం వరకూ అనేక కుంభకోణాలు మీ పాలనపై సుదీర్ఘ నీడ పడవేశాయి కదా? అన్న ప్రశ్నకు “అది నిర్ణయించాల్సింది చరిత్రకారులు. నా విధి నేను నిర్వర్తిస్తున్నాను. పదేళ్ళ నా ప్రధానమంత్రిత్వం ఎటువంటి ప్రభావం కలిగిస్తుందన్న విషయంలో తీర్పు ఇవ్వాల్సింది చరిత్రకారులే” అన్నారాయన.
మరయితే ప్రజల పాత్ర ఏమీ లేనట్టేనా? 2014 ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతున్నాం కాబట్టి బాధ్యతను ప్రజలపై ఉంచడానికి బదులు చరిత్రకారులపై ఉంచుతున్నారా? ఇంతకీ ప్రధాని మన్మోహన్ చరిత్ర రాయడానికి అడ్వాన్స్ పుచ్చుకున్న ఆ చరిత్రకారుడు ఎవరై ఉంటారు చెప్మా?
స్కాములు,స్కీముల మధ్య 2G, KG బొగ్గుల నడుమ సిగ్గుఎగ్గులేని
ప్రభుత్వం మసిపూసిన అధికారదాహంతో ప్రతిష్టను బూడిదచేస్తోంది!!
స్పందనకు అభినందనలు.