కారుతోలే హక్కుకోసం సౌదీ మహిళల పోరాటం


ప్రజల చైతన్యం ‘వెర్రి’ తలలు వేస్తే తన బతుకు ఏమవుతుందో సౌదీ రాచరికానికి బాగానే తెలుసు. ప్రపంచంలోనే సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత కలిగిన అమెరికా తోడు నిలవగా రాచరిక ప్రజాస్వామ్యం అనబడే విచిత్ర వ్యవస్ధను నెట్టుకొస్తున్న సౌదీ రాచరికానికి మహిళల ‘గొంతెమ్మ’ కోరికల పట్ల ఈ మధ్య మహా దిగులు పట్టుకుంది. రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన ‘Women2Drive’ ఉద్యమాన్ని అరెస్టులతో అణచివేసిన సౌదీ ప్రభుత్వం అది మళ్ళీ తలెత్తడంతో గంగ వెర్రులెత్తుతోంది. సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో మహిళల కారు తోలకానికి వెల్లి విరుస్తున్న మద్దతును చట్టాలతో అణచివేస్తామని ప్రకటిస్తోంది.

కాగా సిరియాపై దాడిని ఉపసంహరించుకోవడమే కాక తన బద్ధ శత్రువు ఇరాన్ తో నెయ్యానికి సైతం అమెరికా సిద్ధపడుతోందని అనుమానిస్తున్న సౌదీ అరేబియా నిరసన స్వరం పెంచడంతో దానికి ప్రతిగానే సోషల్ నెట్ వర్క్ లు పనిగట్టుకుని పి.ఆర్ కార్యక్రమాలకు తెగబడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ నిధులతో సి.ఐ.ఏ నిర్వహించే ప్రభుత్వేతర సంస్ధ ‘ఫ్రీడం హౌస్’ Women2Drive ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.

ఈ రోజు (అక్టోబర్ 26, 2013) ‘Women2Drive’ ప్రచార దినంగా సౌదీలోని కొన్ని స్వచ్ఛంద సంస్ధలు ప్రకటించాయి. ఈ ప్రచారంలో భాగంగా సౌదీ మహిళలు కారు నడపాలని పిలుపు ఇచ్చాయి. సౌదీ అరేబియాలో మహిళలు కారు నడపడం నిషిద్ధం. ప్రజల్ని మత మౌఢ్యంలో ఉంచడానికి సౌదీ రాచరిక ప్రభుత్వం మత గురువులను సాకుతూ వారి మాటలనే చట్టాలుగా అమలు చేస్తుంది. సౌదీ సమాజంలో మహిళలు వాహనాలు నడపడంపై ఉన్న అనధికార నిషేధాన్ని 1990 నవంబర్ లో ప్రభుత్వం డిక్రీగా మార్చివేసింది.

సౌదీ అరేబియాలో సున్నీ ముస్లిం మత సుప్రీం నేత ‘గ్రాండ్ ముఫ్తి’ ఒక ఫత్వా జారీ చేశాడు. మహిళల కారు తోలకాన్ని ఈ ఫత్వా ద్వారా రద్దు చేసేశాడు. మహిళలు కార్లు తోలితే వారు ‘ఉద్రేక వాతావరణాన్ని’ సృష్టిస్తారని ఫలితంగా సమాజంలో అరాచకం రాజ్యమేలుతుందని ఆయన తన ఫత్వాలో సెలవిచ్చారు. ఈ ఫత్వా ఆధారంగా అప్పటి హోమ్ మంత్రి ప్రిన్స్ నయేఫ్ బిన్ అబ్దులాజీజ్ మహిళల కారు తోలకాన్ని నిషేధిస్తూ డిక్రీ జారీ చేశాడు.

ఈ చట్టాన్ని ధిక్కరిస్తూ అప్పుడే సౌదీ మహిళలు కార్లు నడిపారు. తమ దేశంలో మకాం వేసిన అమెరికా మహిళా సైనికులు స్వేచ్ఛగా కార్లు నడుపుతుంటే మత పెద్దలు విధించిన నిషేధం తమకు ఆ సౌకర్యాన్ని నిరాకరించడం పట్ల వారు నిరసన తెలిపారు. 47 మంది మహిళలు ప్రభుత్వ చట్టాన్ని ధిక్కరిస్తూ ఒక పెద్ద కార్ల ఊరేగింపు నిర్వహించారు. సౌదీ ప్రభుత్వం ఆగ్రహించి తీవ్ర చర్యలు తీసుకుంది. కార్లు తోలిన మహిళలను అందరినీ అరెస్టు చేసింది. వారి ఉద్యోగాలను ఊడబెరికింది. అసలు ప్రయాణాలే చేయకుండా నిషేధించింది.

సదరు గ్రాండ్ ముఫ్తి 1999లో కాలం చేయగా ప్రిన్స్ నయేఫ్ బిన్ 2012 జూన్ లో కాలం చేశారు. కానీ వారు జనంపై రుద్దిన డిక్రీ మాత్రం కొనసాగుతోంది. 2005లో కింగ్ అబ్దుల్లా పదవి స్వీకరించినప్పుడు ‘మహిళలు కారు తోలే రోజు వస్తుంది’ అని ప్రకటించాడు. ఆయన గారి ప్రకటన అలాగే ఉంది గానీ మహిళా తోలరి (డ్రైవర్) లను మాత్రం అరెస్టు చేయడానికే ఆసక్తి చూపుతున్నాడు. 2011లో ఇంటర్నెట్ లో ప్రారంభం అయిన ‘Women2Drive’ ప్రచారోద్యమం డా. మదేహ ఆల్-అజ్రౌష్ అరెస్టుతో సద్దుమణిగింది. ఆమె మరి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కారు తోలడంతో కొన్నిరోజులు కటకటాల వెనుక గడపవలసి వచ్చింది. అనంతరం ఆమె యు.ఏ.ఇ కి వెళ్ళిపోయినట్లు కొన్ని పత్రికలు తెలిపాయి.

గత సెప్టెంబర్ నుండి ఈ ప్రచారోద్యమం మళ్ళీ ఊపందుకుంది. సౌదీ రాజు కింగ్ అబ్దుల్లా మహిళలకు మరిన్ని హక్కులు కల్పించడానికి సుముఖంగా ఉన్నాడని, కొందరు మహిళలు కారు తోలిన వీడియోలు యూ ట్యూబ్ లో ప్రత్యక్షం అయినా పోలీసుల నుండి చర్యలు లేకపోవడంతో ఉద్యమ మద్దతుదారులు ధైర్యం తెచ్చుకున్నారని బి.బి.సి తెలిపింది. ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్ లోనూ ఈ ప్రచారానికి వేలాది మంది మహిళలు, పురుషులు మద్దతు తెలిపారని సి.ఎన్.ఎన్, బి.బి.సి లాంటి వార్తా సంస్ధలు చెబుతున్నాయి. సౌదీ ప్రజలు అనేకమంది సామాజిక వెబ్ సైట్లలో చురుకుగా ఉంటారని ఫలితంగా ఈ ప్రచారానికి అంతర్జాలంలో విస్తృత ప్రచారం లభించిందని అవి తెలిపాయి.

అయితే సౌదీ ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చోలేదు. కింగ్ అబ్దుల్లా మహిళలకు హక్కులు కల్పించడానికి సుముఖంగా ఉన్నారన్న ప్రచారాన్ని పూర్వపక్షం చేస్తూ శనివారం కారు తోలిన మహిళల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని ప్రకటించింది. హోమ్ మంత్రి మన్సూర్ ఆల్-టర్కీ ఈ మేరకు ప్రకటన జారీ చేశాడు. “చట్టాన్ని ఉల్లంఘించినవారు ఎవరైనా సరే -వారు ప్రదర్శకులయినా, మహిళా తోలరులయినా- వారిని చట్టం తీవ్రంగా పరిగణిస్తుంది” అని ఆల్-టర్కీ అన్నాడని సి.ఎన్.ఎన్ తెలిపింది. అయితే ప్రభుత్వం వాస్తవంగా ఎలాంటి చర్య తీసుకునేది ఇంకా స్పష్టం కాలేదని సి.ఎన్.ఎన్ తెలిపింది.

ఫేస్ బుక్ లో Women2Drive ఉద్యమానికి మద్దతు ప్రకటించిన మహిళలకు, కార్యకర్తలకు హోమ్ శాఖ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కొందరు మహిళలు చెప్పడం విశేషం. శనివారం గానీ, ఆ తర్వాత గానీ మహిళలు కారు తోలాడానికి వీలు లేదని ఫోన్ చేసినవారు బెదిరించారని వారు తెలిపారు. ఈ వార్తను మొదట ఖండించిన హోమ్ శాఖ అనంతరం నిజమే అని చెప్పిందని సి.ఎన్.ఎన్ చెబుతోంది. “శనివారం చట్టం పూర్తిగా అమలు చేస్తాము అని హోమ్ శాఖ ప్రకటించింది. దీని అర్ధం ఏమిటో చెప్పడానికి హోమ్ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు కార్యకర్తలకు ఫోన్ చేసిన మాట వాస్తవమే. ఇది మహిళా తోలరులకు, నిషేదిత ప్రదర్శనలకు పాల్పడినవారికీ వర్తిస్తుంది” అని ఆల్-టర్క్ తమకు చెప్పాడని సి.ఎన్.ఎన్ తెలియజేసింది.

‘Women2Drive’ ప్రచారోద్యమాన్ని అనేకమంది మహిళలు తిరస్కరించడం గమనార్హం. పశ్చిమ దేశాల్లో చదువుకుని అక్కడి సంస్కృతిని వంటబట్టించుకున్న కొద్ది మంది ధనిక వర్గాల వారే ఇలాంటి ప్రచారానికి పాల్పడుతున్నారని, సౌదీ సమాజం విలువలను గౌరవించే ఉద్దేశ్యం వారికి లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక మత పెద్ద అయితే మహిళలను కారు తోలకం నుండి నిషేదించడానికి ఒక విచిత్ర కారణం చెప్పాడు. షేక్ సలే ఆల్-లోహేదాన్ అనే సున్నీ గురువు ప్రకారం ‘మహిళలు కారు తోలితే వారి అండాశయం దెబ్బతింటుంది. ఫలితంగా పిల్లలు అంగవైకల్యంతో పుడతారు.’ వైద్య వృత్తిని కూడా మత గురువులే చేపడితే ఇక జనానికి ఒనగూరే ప్రయోజనాలు ఏమిటో ఆల్-లోహేదాన్ మతి మాలిన శాస్త్రం చెప్పకనే చెబుతోంది.

“ఒక మహిళ ఎవరన్నా కారు తోలినట్లయితే ఆమె పైన ప్రతికూల మానసిక ప్రభావం పడుతుంది… కారు తోలకం వల్ల మహిళ అండాశయం దానంతట అదే ప్రభావితం అవుతుందని, పొత్తికడుపును పైకి నెడుతుందని వైద్య పరిశోధనల్లో తేలింది. అదే పనిగా కారు తోలిన మహిళలకు అనేక వైద్య సమస్యలతో పిల్లలు పుడుతున్నారని మేము కనుగొన్నాము” అని ఆల్-లోహేదాన్ ప్రకటించారు. సౌదీలో మహిళలు కారు తోలనే తోలనప్పుడు ఆయన గారు ఎవరిపైన పరిశోధన చేశారో తెలియాల్సి ఉంది. పైగా అదే పనిగా కారుతోలిన మహిళలు సౌదీ అరేబియాలో ఎక్కడ తగిలి ఉంటారు?

మత గురువులు, సాధువులు, పూజారులు… తదితర మత పెద్దలు మత బోధనలు మానుకుని చరిత్ర, రాజకీయాలు, వైద్యం తదితర శాస్త్రాల్లో చొరబడితే విధ్వంసక పరిణామాలు తధ్యమని ఎన్ని దేశాల చరిత్రలు చూపలేదు? పాలస్తీనాలో జెరూసలేం వివాదం మొదలుకొని భారత దేశంలో బాబ్రీ-రామజన్మ భూమి వివాదం వరకు అనేక వివాదాలు రావణ కాష్టంలా రగులుకొని ప్రజల దుంప తెంచాయి.

ఇదంతా ఒక ఎత్తయితే అమెరికా-సౌదీ అరేబియాల మధ్య పెరుగుతున్న దూరం ఫలితంగా సౌదీ ప్రజల్లో అసంతృప్తిని పెంచడానికి పశ్చిమ దేశాలు కృషి చేస్తున్నాయని అందులో భాగంగానే తాజా వివాదం అని కొందరు సూచించడం మరొక ఎత్తు. సిరియాలో కిరాయి తిరుగుబాటును పెంచి పోషిస్తున్న దేశాల్లో సౌదీ అరేబియాది ప్రధాన పాత్రం. బిలియన్ల కొద్దీ డాలర్లు తగలేస్తూ షియా ఇరాన్ కు మద్దతుగా నిలిచిన బాషర్ అస్సాద్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి సౌదీ అరేబియా సున్నీ రాచరిక ప్రభుత్వం కంకణం కట్టుకుంది.

అయితే అమెరికా తన ఆశలకు విరుద్ధంగా సిరియా దాడి నుండి వెనక్కి తగ్గడం, ఇరాన్ అధ్యక్షుడితో ఒబామా నేరుగా టెలిఫోన్ సంభాషణలు జరపడం సౌదీ రాజుకు ససేమిరా నచ్చలేదు. ఫలితంగా ‘మధ్య ప్రాచ్యంలో అమెరికాతో తమ సంబంధాలను పునఃపరిశీలిస్తామని సౌదీ హెచ్చరిస్తోంది. అమెరికా మద్దతు ఉన్న ఈజిప్టులోని ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వాన్ని కూల్చడంలో ప్రముఖ పాత్ర పోషించిన సౌదీ అరేబియా ఇప్పుడు “ఇరాన్ తో సంబంధాలు పునరుద్ధరించుకుంటే అమెరికాకు దూరంగా జరుగుతాము” అని స్పష్టంగా చెబుతోంది.

సౌదీ ని దారికి తెచ్చుకోడానికి అక్కడ ‘అరబ్ వసంతం’ లాంటి అసంతృప్తులకు అమెరికా మెల్లగా ఆజ్యం పోస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. సి.ఐ.ఏ కనుసన్నల్లో నడిచే ‘ఫ్రీడం హౌస్’ సంస్ధ మహిళా కారు తోలరి ఉద్యమానికి బహిరంగ మద్దతు ఇవ్వడం దీనికి సాక్ష్యంగా చెబుతున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని అమెరికా మారిన ప్రాధామ్యాలకు తల ఒగ్గకపోతే మరిన్ని అసంతృప్తులు చెలరేగడం తధ్యమని వారు చెబుతున్నారు. అయితే అమెరికాకు మునుపటి లాగా అలాంటి శక్తి ఉన్నదా అన్నది అనుమానమే. ఆర్ధిక వనరులు నానాటికీ కుదించుకుపోతున్న పరిస్ధితుల్లో కృత్రిమ తిరుగుబాట్లను పోషించే పరిస్ధితి అమెరికాకు లేదనే చెప్పవచ్చు.

అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహాలు ఏమైనప్పటికీ సౌదీ మహిళల హక్కులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉన్నది.

8 thoughts on “కారుతోలే హక్కుకోసం సౌదీ మహిళల పోరాటం

 1. if % of muslims in america exceeds 10% ( now it is < 1%), few bomb blasts occur there like india then the real game starts. then america spill real venom on islam through the power of media. in uk that spark started now, number of uk citizens protesting against secularism , sharia, muslim immigration. whatever it may, all the best to saudi women. JAI HO. now protesting for car, i wish they will protest against veil, sharia law, polygamy in future

 2. జీవితాశయానికి ఆండాశయం అడ్డుపెట్టి ఆడ వాళ్ళను సౌది ప్రభుత్వం ప్రతిఘటిస్తుంటే ఈడ ఇండియాలో అడ్డులేని ఆశయాలను కలిగియున్నా మన మహిళలు భావ స్వాతంత్రాన్ని కోల్పోతున్నామని అసంఘటిత కార్యకలాపాలకు కాలు దువ్వుతారు. అతివృష్టి, అనావృష్టికి ఇదొక చక్కని నిదర్శనం.

 3. ‘Islamphobia,’ it seems, is a lucrative business.
  American-based groups promoting an anti-Muslim worldview took in more than $119 million in revenue between 2008 and 2011, a new report by the Council on American-Islamic Relations has found.
  Titled Legislating Fear: Islamophobia and its Impact in the United States, the report divided the purveyors of propaganda against Islam into two categories: an inner core comprised of approximately 37 groups “whose primary purpose is to promote prejudice against or hatred of Islam and Muslims,” and an outer core consisting of 32 more groups whose “work regularly demonstrates or supports Islamophobic themes.”
  One of the groups in the inner core is ACT! For America, a nonprofit founded by Lebanese American journalist Brigitte Gabriel, who argues that practicing Muslims should not be eligible to hold public office in the United States.
  http://www.nydailynews.com/news/national/anti-muslim-groups-rake-millions-u-s-article-1.1461566
  ———————————————————————————————————————-
  just imagine what type of prejudices america will create with its power of media, money and comtrol over world if muslim population increases certain threshold. interestingly islam is spreading in america very fastly or it may be some gimmick by above said groups to alert americans.

 4. “తోలరి” పదానికి బదులు చోదకులు అనే పదం వాడచ్చు కద.. ఆ పదం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తోంది

 5. నాగ శ్రీనివాస గారు, కధా రచయిత, తమిళనాట తెలుగు భాషోధ్యమ కార్యకర్త అయిన స.వెం.రమేష్ గారు చెప్పిన మాట అది. అది తెలుగులో వాడుకలో ఉన్న పదమే. ‘కారు తోలడం’ అని దాదాపు అన్ని చోట్లా వాడుతారు. కాకపోతే పుస్తకాల్లో వాడరు. పుస్తకాలకు వచ్చేసరికి సంస్కృతం నుండి అరువు తెస్తారు. తెలుగు ఉండగా సంస్కృతం మనకెందుకు? దక్షిణాదిలో మరే భాషకి లేనన్ని పదాలు తెలుగులో ఉన్నాయని రమేష్ చెబుతారు. ఆంగ్లం, సంస్కృతంల పుణ్యమాని అవి పుస్తకాలకు ఎక్కడం లేదు.

 6. తోలడం అనె పదం నాకు తెలిసినదే.. తోలరి అనేదే కొంచెం కొత్తగా అనిపించింది… ఐనా దానితొ నాకేమీ ఇబ్బంది లేదులెండి చదవడానికి .. జస్ట్ మాములుగా చెప్పాను అంతే…..

 7. చదువరి, ద్రిమ్మరి… తరహాలోదే తోలరి. మీరన్నట్లు రాతకు (చదువుకు కూడా) కొత్త పదమే అనుకుంటాను. ఎక్కడో ఒక చోట మొదలు కావాలి కదా మరి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s