ఎన్.ఎస్.ఎ గూఢచర్యం: 10 దిగ్భ్రాంతికర మార్గాలు -వీడియో


అమెరికా గూఢచార సంస్ధ ‘నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ’ ని అమెరికా, ఐరోపాల్లో ‘నో సచ్ ఏజన్సీ’ అని కూడా అంటారు. దానర్ధం అంత లో ప్రొఫైల్ లో ఉంటుందా సంస్ధ అని. ప్రపంచ వ్యాపితంగా అది సాగిస్తున్న విస్తారమైన గూఢచర్యం (స్నోడెన్ పుణ్యమాని) లోకానికి తెలిసాక ఎన్.ఎస్.ఎ అంత లో ప్రొఫైల్ లో ఎందుకు ఉంటుందో జనానికి తెలిసి వచ్చింది. ఎన్.ఎస్.ఎ గూఢచర్యంలోని దిగ్భ్రాంతికరమైన 10 పద్ధతులను ఈ వీడియో వివరిస్తోంది.

ఈ వీడియో ప్రధానంగా గూగుల్ పై కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. అందుకే మైక్రో సాఫ్ట్ వీడియో సర్వీస్ కంపెనీ ‘బింగ్ వీడియోస్’ దీనిని ప్రముఖంగా ప్రచారంలో పెట్టింది. నిజానికి మైక్రో సాఫ్ట్ కంపెనీ, గూగుల్ కంటే ముందే ఎన్.ఎస్.ఎ తో చెట్టాపట్టాలు వేసుకుంది. ఎన్.ఎస్.ఎ కోసం తన ఆపరేటింగ్ సిస్టమ్ లలోనూ, ఆఫీస్ తదితర ప్రోగ్రామ్ లలోనూ ప్రత్యేకంగా బలహీనతలను సృష్టించి మరీ సహకారం అందజేసింది మైక్రో సాఫ్ట్. మైక్రో సాఫ్ట్, గూగుల్, యాహూ, యాపిల్ తదితర బహుళజాతి ఐ.టి కంపెనీల్లో దేనినీ నమ్మడానికి వీలు లేదని స్నోడెన్ పత్రాలు వెల్లడి చేశాయి.

కాకపోతే గూగుల్ డేటా చౌర్యం మరీ పచ్చిగా, సిగ్గు లేకుండా జరుగుతుంది. ఆ మధ్య ఒక యాండ్రాయిడ్ ఆప్ డెవలపర్ ఒక సంగతి బయటపెట్టాడు. ఆప్ (అప్లికేషన్) ను అభివృద్ధి చేసినందుకు తనకు నెల నెలా అందుతున్న మొత్తంతో పాటు ఆప్ వినియోగదారుల పూర్తి వ్యక్తిగత వివరాలు కూడా తనకు గూగుల్ స్టోర్ పంపించడంతో ఆయన ఖంగు తిన్నాడు. ఆయన ఈ సంగతి బయటపెట్టడంతో వినియోగదారులు కొంతమంది కోర్టుకు వెళ్లారు. వారికి గూగుల్ చెప్పిన సమాధానం చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం.

గూగుల్ ప్రకారం, స్నోడెన్ పత్రాల వెల్లడి తర్వాత కూడా తన ఆప్స్ ని వినియోగదారులు ఉపయోగిస్తున్నారంటే వాళ్ళు తమ వ్యక్తిగత ఏకాంతాన్ని, భద్రతను గూగుల్ ఎక్స్ ప్లాయిట్ చేయడానికి కూడా అంగీకరిస్తున్నట్లే అర్ధం అట! గూగుల్ ఉచిత సర్వీసులు వాడుకున్నందుకు గానూ వినియోగదారులు తమ వ్యక్తిగత ఏకాంతాన్ని త్యాగం చెయ్యక తప్పదట! కన్నంలో వేలుతో దొరికాక బహిరంగం గానే బరితెగించడానికి గూగుల్ సిద్ధపడిపోయిందన్నమాట! తస్మాత్ జాగ్రత్త!

ఇక 10 మార్గాల సంగతికి వస్తే, అవి:

10. (టెర్రరిస్టు) అనుమానితులకు 3 డిగ్రీల దూరంలో (అంటే?) ఉన్నవారందరి సమాచారాన్ని ఎన్.ఎస్.ఎ సేకరిస్తుంది. 260 కాంటాక్టులు కలిగి ఉన్న అనుమానితుడి ఫోన్ ద్వారా 4,569,760,000 (దాదాపు 4.57 బిలియన్లు) మంది ఫోన్ల పైన నిఘా పెట్టవచ్చు. -ది గార్డియన్ (సోర్స్)

9. ప్రైవసీ చట్టాల నుండి తప్పించుకోడానికి వాళ్ళు నేరుగా సంభాషణలను సేకరించడానికి బదులు మెటా-డేటాను సేకరిస్తారు. ఒక ఫోన్ నుండి ఏయే నెంబర్లకు కాల్స్ వెళ్ళాయి, ఏయే నెంబర్ల నుండి ఆ ఫోన్ కు కాల్స్ వచ్చాయి, ప్రతి కాల్ కు పట్టిన సమయం… ఇవన్నీ రికార్డు చేస్తారు. -ద రిజిస్టర్

8. ఎలక్ట్రానిక్ గూఢచార ప్రోగ్రామ్ లలో ప్రిజం అతి ముఖ్యమైన ప్రోగ్రామ్. సామాజిక వెబ్ సైట్లలో (ఫేస్ బుక్, గూగుల్, యాహూ, అమెజాన్ మొ.వి) ఉన్న సమాచారాన్ని వినియోగించి ఇది గూఢచర్యానికి పాల్పడుతుంది. 6 నెలల్లో 18,000 ఫేస్ బుక్ ఖాతాలు (వాస్తవం కంటే ఇది చాలా చిన్న సంఖ్య -విశేఖర్) దీని వల్ల ప్రభావితం అయ్యాయి. -వికీ లీక్స్, ది గార్డియన్, ఫేస్ బుక్

7. అమెరికా గుండా వచ్చి వెళ్ళే కమ్యూనికేషన్స్ అన్నింటినీ ఎన్.ఎస్.ఎ వైర్ ట్యాప్ (సముద్రంలో నుంచి వెళ్ళే కేబుల్స్ దగ్గరే కాపు కాసి అవసరమైన పరికరాలను అక్కడే ఏర్పాటు చేసుకుని ఆ కేబుల్స్ గుండా వెళ్ళే సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకోవడం -వి.ఎస్) చేసింది. ఇలా మిలియన్ల కొద్దీ కాల్స్ నుండి డేటా తవ్వకాలు జరిపే కార్యక్రమాన్ని 9/11 టెర్రరిస్టు దాడుల తర్వాత జార్జి బుష్ ప్రభుత్వం ప్రారంభించింది. (అక్రమ గూఢచర్యానికి టెర్రరిజం సాకు చూపడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతోంది -వి.ఎస్) -ద న్యూయార్క్ టైమ్స్, ద వాషింగ్టన్ పోస్ట్

6. మీ ఫోన్ లేదా కంప్యూటర్ కి అమర్చి ఉన్న కెమెరా, మైక్రో ఫోన్ లను వాళ్ళు దూరం నుండే ఆన్ చేయగలరు. దీనిని రోవింగ్ బగ్ అంటారు. ఫోన్ ని ఆఫ్ చేసినప్పుడు కూడా వాళ్ళు మీ సంభాషణలను వినగలరు. -ఎబిసి న్యూస్ (ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్)

5. వాళ్ళు గూగుల్ లాంటి కంపెనీలతో చాలా దగ్గరగా కలిసి పని చేస్తారు. యాండ్రాయిడ్ ఫోన్ లలో (తమ గూఢచర్యానికి దోహదపడే) కోడ్ ని చొప్పించడం ఈ సహకారంలో భాగం. అంటే ప్రపంచంలో అమ్ముడవుతున్న ఫోన్ లలో 70 శాతం ఎన్.ఎస్.ఎ చొప్పించిన కోడ్ లను కలిగి ఉన్నాయి. (యాండ్రాయిడ్ ఫోన్ల బదులు విండోస్ ఫోన్లు కొనాలని చెప్పడం అన్నమాట! -వి.ఎస్) -బిజినెస్ వీక్

4. మిలియన్ల మంది ఫోన్ల ఎన్ క్రిప్షన్ ను ఛేదించడానికి వాళ్ళు దాదాపు 255 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. (డిజిటల్ తాళాలుగా పని చేసే) ఎన్ క్రిప్షన్ వ్యవస్ధలలో బలహీనతలను చొప్పించడానికి కూడా వాళ్ళు కృషి చేశారు. దొంగచాటుగా చొరబడడానికి వీలుగా ఉత్పత్తుల డిజైన్లలో సైతం మార్పులు చేయడానికి వాళ్ళు కంపెనీలను ప్రభావితం చేశారు. -ది గార్డియన్

3. (అమెరికా) ట్రెజరీ డిపార్టుమెంట్ తయారు చేసిన ‘స్విఫ్ట్’ అనే ప్రోగ్రామ్ అనుమానితులు మరియు విదేశీయుల (టెర్రరిస్టులు కానవసరం లేదు -వి.ఎస్) ఆర్ధిక లావాదేవీలపై నిఘా పెడుతుంది. ఇందులోకి అమెరికా పౌరులను కూడా ఈడ్చుకురావడానికి వీలుగా ఈ ప్రోగ్రామ్ ని విస్తరించారని స్నోడెన్ పత్రాలు వెల్లడించాయి. -డిస్కవరి

2. MITM -MAN IN THE MIDDEL- దాడులను కూడా ఎన్.ఎస్.ఎ నిర్వహిస్తోంది. గూగుల్ లాంటి వెబ్ సైట్లలాగా కనిపిస్తూ వినియోగదారులు ఆ వెబ్ సైట్లకు అప్పగించే సమాచారం అంతటినీ వాళ్ళు సేకరించి ఆ తర్వాత దానిని అసలు వెబ్ సైట్లకు చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. (దీనినే అంతర్జాలంలో ఫిషింగ్ అంటారు -వి.ఎస్) –సినెట్

1. ప్రేమ సంబంధాల పైన కూడా ఎన్.ఎస్.ఎ నిఘా పెట్టింది. LOVEINT (LOVE INTELLIGENCE) సేకరణ చాలా అరుదుగా జరుగుతుందని, ఎప్పుడన్నా తటస్ధిస్తే గనుక కఠిన శిక్షలు ఉంటాయని వాళ్ళు చెప్పారు. ఎన్.ఎస్.ఎ స్వయంగా 3,000 సార్లకు పైగా ఈ విషయంలో ఏకాంత హక్కులను ఉల్లంఘించింది. -ది వాల్ స్ట్రీట్ జర్నల్

3 thoughts on “ఎన్.ఎస్.ఎ గూఢచర్యం: 10 దిగ్భ్రాంతికర మార్గాలు -వీడియో

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s