చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ చైనాతో ఏకంగా 9 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాణిజ్య పరమైన ఒప్పందాలు మాత్రం ఏదీ కుదిరినట్లుగా పత్రికల్లో సమాచారం లేదు. అయితే తన చైనా పర్యటన గొప్పగా విజయవంతం అయినట్లు ప్రధాని ప్రకటించిచారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించారని, ఆయనను సంతోష పెట్టడానికి చైనా పెద్దలు వివిధ రకాలుగా ప్రయత్నించారని పత్రికలు రాశాయి. సరిహద్దు తగాదాల విషయంలో ఇరు దేశాలలో ఏదీ అవతలివారిపై మిలట్రీ సామర్ధ్యాలను ప్రయోగించరాదని ఒట్టు పెట్టుకోవడంతో పాటు అవతలి వారి సరిహద్దు పెట్రోలింగ్ పై నిఘా పెట్టరాదని ఇరు పక్షాలు అంగీకరించాయి.
భారత ప్రధానితో పాటు రష్యా ప్రధాని కూడా చైనా పర్యటనలో ఉండడం ఒక విశేషం. కాగా చైనాతో రష్యా భారీ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోగా ఇండియాతో మాత్రం రక్షణ, సరిహద్దు ఒప్పందాల వరకే పరిమితం అయింది. వీసా నిబంధనలను పరస్పరం సరళీకరించుకోవడానికి తగిన ఒప్పందం కోసం చైనా ఎదురు చూడగా ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఆర్చరీ క్రీడాకారులకు ‘స్టేపుల్డ్ వీసా’ లు ఇచ్చినందుకు గుర్రుగా ఉన్న భారత్ అందుకు అవకాశం ఇవ్వలేదు.
మన్మోహన్ సంతకం చేసిన ఒప్పందాలలో బి.డి.సి.ఏ ముఖ్యమైనదిగా కనిపిస్తోంది. సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం (బోర్డర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్) ఇరు దేశాల ప్రధానుల మధ్య తీవ్ర చర్చోపచర్చల అనంతరం మాత్రమే సాధ్యమయింది. ఈ ఒప్పందం ప్రకారం:
-
అవతలి దేశం వాస్తవాధీన రేఖ (Line of Actual Control -LAC) వెంబడి జరిపే పెట్రోలింగ్ పైన, ఎల్.ఏ.సి పైన పరస్పర అంగీకారం లేని చోట్ల, నిఘా పెట్టకూడదు లేదా వెంబడించకూడదు (not to tail).
-
ఎల్.ఏ.సి కి సంబంధించి అనుమానాలు ఉన్న చోట్ల పరస్పరం వివరణలు కోరాలి. ఇప్పటికే నెలకొల్పబడిన వివిధ యంత్రాంగాల ద్వారా సమస్య నుండి బైటపడాలి.
-
ఇరు పక్షాల్లో ఏ ఒక్కటీ అవతలి పక్షంపై తమ మిలట్రీ సామర్ధ్యాన్ని వినియోగించరాదు. బలప్రయోగం చేయడం గానీ, చేస్తానని బెదిరించడం గానీ చేయరాదు.
-
మిలట్రీ రంగంలో ఇరు పక్షాలూ విశ్వాసం పాదుకొల్పే చర్యలు తీసుకోవడం కొనసాగించాలి.
-
ఇరు దేశాల మిలట్రీ ప్రధాన కార్యాలయాల మధ్య హాట్ లైన్ నెలకొల్పుతారు.
-
4,000 కి.మీ పొడవున ఉన్న వాస్తవాధీన రేఖ పొడవునా ప్రతి సెక్టార్ లోనూ సరిహద్దు రక్షణ బలగాలు కలిసి మాట్లాడుకోడానికి సమావేశ స్ధలాలను (meeting sites) ఏర్పాటు చేస్తారు.
గత కొన్ని నెలలుగా లడఖ్ లోని డెప్సాంగ్ లోయలో దౌలత్ బేగ్ ఒల్డి సెక్టార్ లో చైనా సైనికులు పలుమార్లు చొచ్చుకు వచ్చినట్లు భారత్ ఆరోపించిన నేపధ్యంలో బి.డి.సి.ఏ కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఒప్పందం కోసం భారత ప్రధాని మన్మోహన్, చైనా ప్రధాని లీ కెకియాంగ్ ల మధ్య చరిత్రాత్మక ‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్’ లో 3 గంటలకు పైగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల అధినేతలు ఒకే సంవత్సరంలో రెండు సార్లు కలుసుకోవడం 1954 తర్వాత ఇదే మొదటిసారని పత్రికలు తెలిపాయి.
ఇతర ఒప్పందాలలో ముఖ్యమైన వాటిలో, ఇరు దేశాల సరిహద్దులను దాటి ప్రవహించే నదులకు సంబంధించి సహకారాన్ని బలీయం చేసుకోవడం ఒకటి. ఈ అంశంపై జరిగిన చర్చల గురించిన పూర్తి వివరాలను పత్రికలకు వెల్లడించలేదు. ముఖ్యమైన ప్రతినిధులు పరిమిత సంఖ్యలో మాత్రమే హాజరై జరిపిన చర్చలు మరింత ముందుకు వెళ్లాల్సి ఉందని తెలుస్తోంది.
వీసా నిబంధనలను సరళీకరించడం పైన ఎలాంటి ఒప్పందమూ జరగలేదు. ఇరు దేశాల ప్రజలు స్వేచ్ఛగా పొరుగు దేశాన్ని సందర్శించడానికి వీలుగా వీసా నిబంధనలను సరళతరం చేయాలని ఇరు దేశాలు గతంలో ఒక అంగీకారానికి వచ్చాయి. మన్మోహన్ పర్యటన సందర్భంగా ఈ అంశంపై తుది ఒప్పందం చేసుకోవాలని చైనా ఆశించింది. అయితే భారత్ అందుకు అవకాశం ఇవ్వలేదు. ఇటీవల చైనాలో జరిగిన ఆర్చరీ పోటీలకు అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం నుండి హాజరయిన ఇద్దరు క్రీడాకారులకు పూర్తి స్ధాయి వీసా కాకుండా ‘స్టేపుల్డ్ వీసా’ ఇవ్వడం దీనికి కారణం.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొంత భూభాగం తమదే అని చైనా వాదిస్తోంది. ఈ వాదనకు అనుగుణంగా అరుణాచల ప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణీకులకు పూర్తి స్ధాయి వీసాలు ఇవ్వనవసరం లేదనీ, వారు తమ దేశం వారే కనుక తాత్కాలిక వీసా ఇస్తే సరిపోతుందని చైనా అవగాహన. కానీ అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా తమ భూభాగంగానే ఇండియా పరిగణిస్తున్నందున ఈ స్టేపుల్డ్ వీసా విధానం పట్ల ఇండియా ఆగ్రహంగా ఉంది. ఆర్చరీ క్రీడాకారులకు తాత్కాలిక వీసా ఇవ్వడానికి ప్రతీకారంగా ‘వీసా సరళీకరణ’ ఒప్పందాన్ని ఇండియా వాయిదా వేసుకుంది.
అయితే వీసా నిబంధనలను సరళీకరించే ఒప్పందం ఈ రోజు కాకపోయినా రేపయినా కుదిరేదే అని భారత అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. ప్రధాని మన్మోహన్ సైతం తన ప్రసంగంలో ఈ ఒప్పందాన్ని తర్వాత తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు తప్ప రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించలేదు. పైగా చైనా ప్రయాణీకులకు వీసా నిబంధనలను సరళతరం చేసేందుకు ఇండియా కట్టుబడి ఉన్నదని కూడా ఆయన ప్రకటించారు.
భవిష్యత్తులో స్టేపుల్డ్ వీసా ఇవ్వకుండా ఉంటానని చైనా హామీ ఇచ్చిందా అన్న ప్రశ్నకు భారత విదేశీ కార్యదర్శి సుజాత సింగ్ నేరుగా సమాధానం ఇవ్వలేదని ది హిందు తెలిపింది. “అది చర్చల్లో ఉంటుంది” అని మాత్రమే చెప్పి ఊరుకున్నారామె. “ఈ సమయంలో మేము చెప్పగల వివరాలు మాత్రమే చెప్పాను” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఒకే సంవత్సరంలో తాము రెండుసార్లు కలిశామని దాన్నిబట్టే ఇరు దేశాల సంబంధాలకు తాము ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నదీ అర్ధం అవుతోందని ప్రధాన మంత్రులు ఇద్దరూ విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇలా జరగడం 1954 తర్వాత ఇదే మొదటిసారని ది హిందు తెలిపింది. తాజా ఒప్పందం ఇరు దేశాల సంబంధాలలో నూతన గతిశీలతను చొప్పిస్తుందని వారు తెలిపారు.
సరిహద్దు సమస్య పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్య. ఒక చోట భూభాగం పొందినపుడు మరోచోట కొంత భూభాగాన్ని వాదులుకోడానికి సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా ప్రతి చోటాటా తమ మాటే నేగ్గాలని ఏ పక్షం భావించినా సమస్య పరిష్కారం కాకపోగా మరింత జఠిలం అవుతుంది. వాస్తవాలను విస్మరించి మొండిగా వ్యవహరిస్తే సరిహద్దు సమస్య మరిన్ని దశాబ్దాలు కొనసాగడం తధ్యం. ప్రపంచంలో సరిహద్దు సమస్య ఉన్నచోటల్లా ఇలా ఇచ్చి పుచ్చుకోవడం ద్వారానే పరిష్కారాలు జరిగాయి తప్ప పరస్పరం భావోద్వేగాలతో ప్రజలను రెచ్చగొట్టి లేని సమస్యలను పేరబెట్టుకున్న ఉదంతాలు కనపడవు.
సున్నితమైన సమస్యలను ఓట్ల రాజకీయాలకు ఉపయోగించడంలో ఆరి తేరిన భారత రాజకీయ పార్టీలు ఈ పాఠాన్ని నేర్చుకున్నపుడే చైనా-ఇండియా, పాక్-ఇండియాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడడానికి తగిన పరిస్ధితులు ఏర్పడతాయి. ఈ సరిహద్దు సమస్యలో అమెరికా, ఐరోపా రాజ్యాలు పుల్లలు పెట్టి చలికాచుకునే దుష్ట పన్నాగాలు కూడా అంతం కావాల్సిన అవసరం ఉన్నది.