వాయు బంధంతో రష్యా చైనాలు ఇంకా దగ్గరికి


రష్యా ప్రధాని మెడ్వెడేవ్, చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్

రష్యా ప్రధాని మెడ్వెడేవ్, చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్

బ్రిక్స్ కూటమిలో భాగస్వాములయిన రష్యా చైనా దేశాల మధ్య స్నేహ సంబంధాలు పరవళ్ళు తొక్కుతున్నాయి. అతి పెద్ద ఎనర్జీ మార్కెట్ గా చైనా శరవేగంగా అవతరిస్తున్న నేపధ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద సహజవాయువు ఉత్పత్తిదారయిన రష్యాకు భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. ఈ మార్కెట్ ను సొమ్ము చేసుకునే ప్రక్రియలో భాగంగా ఇరు దేశాల మధ్యా భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. రానున్న 7 సంవత్సరాల్లో 100 బిలియన్ డాలర్ల (10 వేల కోట్లు) చమురు, సహజవాయువును రష్యా నుండి కొనుగోలు చేసేందుకు చైనా పర్యటనలో ఉన్న రష్యా ప్రధానితో చైనా ఒప్పందం కుదుర్చుకుంది. గ్యాస్ వెలికితీతకు, రవాణాకు అవసరమయిన మౌలిక నిర్మాణాలకు కూడా చైనాయే నిధులు సమకూర్చడం ఈ ఒప్పందంలోని విశేషం.

రష్యా ప్రధాని మెడ్వెడేవ్ వాణిజ్య ఒప్పందాల నిమిత్తం చైనా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఏకంగా 21 వాణిజ్య ఒప్పందాలను మెడ్వెడేవ్ చైనాతో కుదుర్చుకున్నారు. ఇందులో చైనా చమురు, సహజ వాయువు కంపెనీ సినో పెక్ కు 2020 వరకూ 100 బిలియన్ డాలర్ల మేర చమురు, సహజవాయువు సరఫరా చేసే ఒప్పందం ఒకటి. ఇరు దేశాల మధ్య ఇప్పటికే సహజవాయువు ఒప్పందం ఉన్నది. దీనిని దాదాపు 5 రేట్లు చేస్తూ తాజా ఒప్పందం కుదుర్చుకున్నారు.

నూతన ఒప్పందం ప్రకారం రష్యా సహజవాయువు కంపెనీ రాస్ నేఫ్ట్ పదేళ్ళలో 100 మిలియన్ టన్నుల క్రూడాయిల్ సరఫరా చేస్తుంది.  ప్రపంచంలోని లిస్టెడ్ ఆయిల్ కంపెనీలలో రాస్ నేఫ్ట్ కంపెనీ అతి పెద్దది. ఈ ఒప్పందం రష్యా, చైనాల స్నేహ సంబంధాలు సరికొత్త బ్రాండ్ తరహాలో అత్యున్నత స్ధాయికి చేరాయనడానికి సంకేతం అని రష్యా ప్రధాని మెడ్వెడేవ్ చైనా పౌరులతో సంభాషిస్తూ పేర్కొన్నారని జిన్ హువా వార్తా సంస్ధ పేర్కొంది.

చైనా కంపెనీ సినో పెక్ ద్వారా రాస్ నేఫ్ట్ తన చమురు సహజవాయువులను ఎగుమతి చేస్తుందని రాస్ నేఫ్ట్ అధిపతి ఇగోర్ సెచిన్ తెలిపాడు. ఎగుమతుల్లోని 30 శాతం మొత్తం ముందే చెల్లింపులు జరగడం మరో విశేషం. అంటే వాస్తవానికి ఎగుమతులు ప్రారంభం కాకుండానే ఎగుమతి చేయదలచిన మొత్తంలో 30 శాతం విలువను చైనా ముందే చెల్లిస్తుంది. ఏ చమురు కంపెనీకయినా ఇంతకు మించిన బేరం దొరకడం కలలో మాత్రమే సాధ్యపడుతుంది.

రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం చైనా వెళ్ళిన మెడ్వెడేవ్ చైనా ప్రధాని లీ కేకియాంగ్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ఆర్ధిక మంత్రులు, అధికారులు హాజరయ్యే 18 వ వార్షిక ఆర్ధిక శిఖరాగ్ర సభ కూడా జరిగింది. “ఇంధన రంగంలో సహకారం ద్వైపాక్షిక సహకారంలో కీలకమైనది. ఈ రోజు సంతకం చేసిన ఒప్పందాలు ఒక క్రమ పద్ధతిలో అమలవుతాయని ఆశిస్తున్నాను. చర్చలు ఇంకా కొనసాగుతున్న ఒప్పందాలు త్వరలో ముగుస్తాయని కూడా ఆశిస్తున్నాను” అని మెడ్వెడేవ్ బీజింగ్ లో మాట్లాడుతూ అన్నారు.

ద్రవీకరణ చెందిన సహజవాయువు (ఎల్.ఎన్.జి) విషయంలో కూడా ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. రష్యాలో స్వతంత్ర సహజ వాయు ఉత్పత్తిదారు అయిన నోవాటెక్ సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల ఎల్.ఎన్.జి ని చైనాకు సరఫరా చేయడానికి ప్రాధమిక అవగాహన కుదుర్చుకుంది. రష్యాకు చెందిన యమల్ ఎల్.ఎన్.జి, చైనాకు చెందిన పెట్రో చైనా ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ అవగాహనలో భాగస్వాములు. ఇరు కంపెనీలు డెలివరీ కాంట్రాక్టులు, ధరలపై ఇంకా ఒక అవగాహనకు రావాల్సి ఉంది. ఈ సంవత్సరాంతం లోగా ఈ విషయంలో ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారు. ఒప్పందం కుదిరితే చైనాకు సహజవాయువు కూడా రష్యా సరఫరా చేసినట్లవుతుంది. ఇంతవరకు చమురు మాత్రమే రష్యా నుండి చైనాకు సరఫరా అవుతోంది.

ప్రపంచ సహజవాయు మార్కెట్ నానాటికీ కుదించుకుపోతున్న నేపధ్యంలో చైనాతో ఒప్పందం రష్యాకు జాక్ పాట్ లాంటింది. ఇప్పటివరకూ రష్యా సహజవాయువు వినియోగంలో ఐరోపాయే అతి పెద్ద మార్కెట్. కానీ ఐరోపా ఋణ సంక్షోభం వలన అక్కడి నుండి సహజవాయువు డిమాండ్ బలహీనపడుతోంది. అమెరికా తన సహజవాయువు అవసరాలను తన సొంత ఉత్పత్తితోనే దాదాపు పూర్తిగా తీర్చుకుంటోంది. ఫలితంగా సహజవాయువు వినియోగించే ప్రధాన మార్కెట్లు పెద్దగా అందుబాటులో లేవు. అదే సమయంలో అత్యంత వేగంగా జి.డి.పి వృద్ధి చెందుతున్న చైనాలో ఇంధన అవసరాలు కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అలాంటి మార్కెట్ అందుబాటులోకి రావడంతో రష్యాకు భారీ లాభాలు చేకూరనున్నాయి.

చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ (సి.ఎన్.పి.సి), రష్యాకు చెందిన రాస్ నెఫ్ట్ సంస్ధలు మధ్య రష్యా నగరం సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన ఆర్ధిక వేదిక పైన గత జూన్ లోనే భారీ ఒప్పందం కుదిరింది. రానున్న 25 యేళ్లలో 270 బిలియన్ డాలర్ల కాంట్రాక్టు ఈ ఒప్పందంలో కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా 55 బిలియన్ డాలర్ల మేరకు అడ్వాన్స్ చెల్లింపులు కూడా రష్యా సాధించింది. ఈ మొత్తం ద్వారా రష్యాలోని టి.ఎన్.కె-బి.పి కంపెనీని రాస్ నేఫ్ట్ కొనుగోలు చేయనుంది.

అలాగే రష్యాలో రవాణా సౌకర్యాలు, హై వేలు, ఓడ రేవులు, విమానాశ్రయాలు నిర్మించడం కోసం మరో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఇవ్వడానికి చైనా అంగీకరించింది. 2020 నాటికి ఈ మొత్తాన్ని నాలుగు రేట్లు పెంచాలని కూడా ఇరు దేశాలూ ఆశిస్తున్నాయి. అదే కాలానికి ఊరు దేశాల వాణిజ్య టర్నోవర్ 100 బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

చావో యాంగ్ లో సినో పెక్ కేంద్ర కార్యాలయం

చావో యాంగ్ లో సినో పెక్ కేంద్ర కార్యాలయం

చైనా నుండి వచ్చే ప్రత్యక్ష పెట్టుబడులకు ఎలాంటి షరతులూ ఉండవు. అవి కేవలం వాణిజ్య స్వభావాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఎదుటి దేశాన్ని సబార్డినేట్ దేశంగా గుర్తించడం అనేది ఉండదు. కానీ పశ్చిమ దేశాలు ఇందుకు పూర్తిగా భిన్నం. అమెరికా, ఐరోపా దేశాలు షరతులు లేకుండా ఒక్క డాలర్ కూడా విదల్చవు. షరతులు విధించడం ద్వారా అవతలి దేశాల రాజకీయ, ఆర్ధిక హక్కులన్నింటిని స్వాధీనం చేసుకోవడం పశ్చిమ దేశాల ఎఫ్.డి.ఐ ల్లో ఒక అనివార్య భాగంగా ఉంటుంది. అవతలి దేశానికి తమ సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వకుండా చాలా జాగ్రత్త పాటిస్తాయి. కానీ అత్యంత పేద ఆఫ్రికా దేశాలతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు కూడా చైనా షరతులు విధించిన దాఖలాలు లేవు. చైనా ఒప్పందాల్లో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ తప్పనిసరిగా ఇమిడి ఉంటుంది. అందువల్ల చైనాతో వాణిజ్యం బహు లాభసాటి.

దశాబ్దాలుగా భారత పాలకులు పెంచి పోషించిన చైనా వ్యతిరేక సెంటిమెంట్లు ఆ దేశంతో లాభసాటి వాణిజ్యం ద్వారా లబ్ది పొందే అవకాశాన్ని నిరోధిస్తున్నాయి. చైనాతో వాణిజ్యం అనగానే పెద్ద ఎత్తున అభ్యంతరాలు చెప్పేందుకు ప్రతిపక్షాలు సదా సిద్ధంగా ఉంటాయి. చైనా, మార్కెట్ ఎకానమీని వాటేసుకుని దశాబ్దాలు గడిచినా అది కమ్యూనిస్టు దేశమేనని నమ్ముతున్న వాజమ్మలు అటు వామపక్షంలోనూ ఇటు మితవాద పక్షంలోనూ ఉండడంతో పరిస్ధితి ఇంకా క్లిష్టంగా మారిపోయింది.

దానితో పశ్చిమ దేశాలతో అసమాన ఒప్పందాలు చేసుకుంటూ వారి అడుగులకు మడుగులోత్తే పరిస్ధితుల్లోనే భారత పాలకులు మునిగితేలుతున్నారు. పశ్చిమ దేశాల సంక్షోభం భారత దేశం దుంప తెంచుతున్నా వాటిపై ఆధారపడడం కొనసాగుతూనే ఉంది. మనవాళ్లు కళ్ళు తెరిచేసరికి (అసలు కళ్ళు తెరుస్తారా అన్నది అనుమానమే అనుకోండి) పుణ్యకాలం కాస్తా దాటిపోతుంది.

2 thoughts on “వాయు బంధంతో రష్యా చైనాలు ఇంకా దగ్గరికి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s