అమెరికా డ్రోన్ హత్యలు యుద్ధ నేరాలే -ఆమ్నెస్టీ


CIA or Taliban!

పాకిస్ధాన్ లో అమెరికా సాగిస్తున్న డ్రోన్ దాడులు యుద్ధ నేరాల కిందికి వస్తాయని బ్రిటన్ కి చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నిర్ధారించింది. డ్రోన్ దాడులు చట్ట విరుద్ధమని వాటిలో కొన్ని యుద్ధ నేరాలు కూడానని సదరు సంస్ధ తెలిపింది. అమెరికా డ్రోన్ దాడులకు పాకిస్ధాన్ లోని కొందరు అధికారులతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్ ప్రభుత్వాలు కూడా సహకారం ఇస్తున్నాయని చెప్పడం ద్వారా ఆమ్నెస్టీ చిన్నపాటి సంచలనానికి తెర తీసింది. అమెరికా చర్యలను తప్పు పట్టడానికి ‘ఆమ్నెస్టీ’ సంస్ధ ప్రయత్నిస్తే, ఐరోపా దేశాల చర్యలను తప్పు పట్టడానికి ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్ధ ప్రయత్నిస్తుంటాయి. ఈసారి ఆమ్నెస్టీ సంస్ధ అమెరికా, ఆరోపా రాజ్యాలు రెండింటినీ తప్పు పట్టడం విశేషం.

“తర్వాత వంతు నేనేనా? పాకిస్ధాన్ లో అమెరికా డ్రోన్ దాడులు” శీర్షికతో వెలువరించిన నివేదికలో ఆమ్నెస్టీ తాజా అంశాలను పొందుపరిచింది. పాక్ భూభాగంలో అమెరికా జరిపిన మానవ రహిత విమాన దాడుల్లో అనేకమంది అమాయక పౌరులు మరణిస్తున్నారని, అందువలన ఈ దాడులు యుద్ధ నేరాల క్రిందికి వస్తాయని నివేదిక తెలిపింది. జెనీవా అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం పౌరుల ఆవాసాలపై దాడులు చేయడం, మిలట్రీ దాడుల్లో పౌరులను చంపడం యుద్ధ నేరాల క్రిందికి వస్తాయి. కానీ జెనీవా ఒప్పందాలు పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని ప్రశ్నించే మూడో ప్రపంచ దేశాలపైన పని చేయడమే తప్ప పశ్చిమ దేశాల ఉల్లంఘనలను ఏనాడూ ప్రశ్నించింది లేదు.

ప్రభుత్వేతర సంస్ధలు, పాకిస్ధాన్ ప్రభుత్వంలోని కొందరు ఇచ్చిన సమాచారం మేరకు 2004-2013 కాలంలో పాకిస్ధాన్ లో అమెరికా 330 నుండి 374 సార్లు డ్రోన్ దాడులు చేసిందని నివేదిక తెలిపింది. “ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్ధ ఈ అంకెలను ధ్రువపరిచగల పరిస్ధితిలో లేదు. కానీ వారి (ఎన్.జి.ఓలు, ప్రభుత్వంలోని వనరులు) సమాచారం ప్రకారం ఈ దాడుల్లో 400 నుండి 900 వరకు అమాయక పౌరులు మరణించారు. మరో 600 మంది తీవ్రంగా గాయపడ్డారు” అని నివేదిక తెలిపింది.

డ్రోన్ దాడుల ద్వారా నిర్దిష్ట లక్ష్యాలను చేదిస్తున్నామని అమెరికా చెబుతుంది. వీటిని ‘సర్జికల్ స్ట్రైక్స్’ అని అభివర్ణిస్తుంది. అంటే సర్జరీలలో జరిగినట్లు లక్ష్యం తప్ప ఇతర భాగాలకు దాడులవల్ల నష్టం జరగదని చెప్పడం. కానీ పాక్ ప్రభుత్వం అది సరికాదని అనేకసార్లు చెప్పింది. పెద్ద మొత్తంలో అమాయక జనం మరణిస్తున్నారని, కాబట్టి డ్రోన్ దాడులను ఆపాలని పాక్ ప్రభుత్వం చాలా సార్లు ప్రకటించింది.

“డ్రోన్ దాడుల చుట్టూ అల్లుకుని ఉండే గోప్యత కోర్టుల విచారణలకు దూరంగా లేదా మౌలిక అంతర్జాతీయ చట్టాలు ఏర్పరిచిన ప్రమాణాలకు విరుద్ధంగా చంపడానికి తగిన లైసెన్స్ ను అమెరికాకు ఇస్తున్నది. డ్రోన్ కార్యక్రమాల విషయంలో అమెరికా శుభ్రంగా బయపడాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉల్లంఘనలకు బాధ్యులను గుర్తించి శిక్షించాల్సి ఉంది” అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్ధ పాకిస్ధాన్ పరిశోధకుడు ముస్తఫా కాద్రి అన్నాడని ది హిందు తెలిపింది.

వివిధ దాడుల్లో కొన్ని వివరాలను కూడా ఎ.ఐ తన నివేదికలో పొందుపరిచింది. వాయవ్య పాకిస్ధాన్ లోని ఉత్తర వజీరిస్ధాన్ లో జనవరి 2012- ఆగస్ట్ 2013 మధ్య అత్యధికంగా 45 సార్లు అమెరికా డ్రోన్ దాడులు చేసింది. వీటిల్లో 9 దాడులను లోతుగా విచారించగా అంతర్జాతీయ చట్టాలను తీవ్రస్ధాయిలో ఉల్లంఘించినట్లు స్పష్టం అయిందని ఎ.ఐ తెలిపింది.

ఉదాహరణకి అక్టోబర్ 2012లో హెల్ ఫైర్ మిసైళ్లతో చేసిన జంట దాడిలో 68 యేళ్ళ వృద్ధురాలు మమన బీబీ చనిపోయింది. ఆమె ఉగ్రవాది కాదు. ఆ సమయంలో తమ తోటలో మనమలు, మానవరాళ్లతో కలిసి కూరగాయలు ఏరుకుంటోంది. అలాగే జులై 2012లో ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలోని ఒక పేద గ్రామంపై జరిపిన దాడిలో ఒక 14 యేళ్ళ బాలుడితో సహా 18 మంది కూలీలు చనిపోయారు.

అప్పటివరకూ పని చేసిన కూలీలు భోజనానికి ఉపక్రమిస్తుండగా డ్రోన్ ప్రయోగించిన క్షిపణుల దాడిలో చనిపోయారు. మొదట ఒక గుడారంపై క్షిపణి దాడి చేయగా కొందరు చనిపోయారు. వారిని కాపాడడానికి సమీపంలో ఉన్నవారు పరుగెట్టుకు రాగా మరిన్ని క్షిపణులతో దాడి చేయడంతో మరింతమంది చనిపోయారని ఏ.ఐ తెలిపింది. అనేకమంది చనిపోయి కూలీల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయి హాహాకారాలు చెలరేగుతుండగానే అమెరికా డ్రోన్ లు అక్కడే తిరుగాడాయని సాక్షులు చెప్పారని తెలిపింది.

“చనిపోయినవారంతా టెర్రరిస్టులని అమెరికా ప్రకటించింది. కానీ మా పరిశోధనలో ఇందుకు పూర్తి విరుద్ధమైన నిజాలు వెల్లడి అయ్యాయి. చనిపోయినవారిలో ఎవరూ పోరాటాల్లో నిమగ్నమై లేరు. ఎవరికీ ప్రమాదకరంగా వ్యవహరించలేదు. ఈ హత్యలకు ఎలాంటి న్యాయబద్ధత లేదు… ఓ కూలీల గుంపు, మనుమలతో ఉన్న వృద్ధురాలు అమెరికాకు ప్రమాదకరం అని చెబితే దానిని నమ్మడం ఏ విధంగా చూసినా కష్టమే” అని ఏ.ఐ ప్రతినిధి కాద్రి తెలిపాడు.

డ్రోన్ దాడులకు సంబంధించి పారదర్శకత అనుసరిస్తామని ఒబామా గత మే నెలలో హామీ ఇచ్చారనీ, కానీ ఆ హామీ ఇంతవరకూ ఆచరణ రూపం దాల్చలేదని ఏ.ఐ నివేదిక తెలిపింది. అమెరికా అనుసరిస్తున్న గోప్యత వలన బాధితులకు నష్టపరిహారం తదితర న్యాయం దక్కడానికి బాగా కష్టం అవుతోందని తెలిపింది. ఈ గోప్యత వల్లనే అమెరికా హత్యలకు ఎటువంటి బాధ్యత లేకుండా తప్పించుకుంటోదని తెలిపింది.

“విషాధం ఏమిటంటే పాకిస్ధాన్ గగనతలంపై ఎగిరే డ్రోన్ విమానాలు గిరిజన ప్రజల్లో ఆల్-ఖైదా, తాలిబాన్ లు కలుగజేసిన భయోందోళనలనే నింపుతున్నాయి. పాకిస్ధాన్ ఈ బాధితులకు న్యాయం చెయ్యాలి. పాకిస్ధాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్ దేశాల ప్రభుత్వాలు ఈ దాడులకు బాధ్యులైన అధికారులను విచారించాలి. మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యులు ఎవరో గుర్తించాలి’ అని కాద్రి డిమాండ్ చేశారు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధల నివేదికలు కేవలం అలంకారప్రాయం మాత్రమే. ఇవి నివేదికలు ప్రచురించడమే తప్ప వాటిని పట్టించుకునేవారే ఉండరు. ఎవరూ పట్టించుకోవడం లేదని ఈ సంస్ధలు కూడా బాధపడవు. ఇదొక నాటకం. చంపేవాడు చంపుతూనే ఉంటాడు. చంపుడు కార్యక్రమం పైన ఆడిట్ ఉందని చెప్పుకోవడానికి మాత్రమే ఈ నివేదికలు పనికొస్తాయి. కాకపోతే పశ్చిమ దేశాల దుర్నీతి ఈ మాత్రమైనా బయటకి వస్తున్నందుకు సంతోషించాలంతే.

ఆఫ్ఘన్, పాక్ లలో ఉండే తాలిబాన్ లు అమెరికాపైకి దాడికి వెళ్లలేదు. దాడి చేసిందని చెప్పే ఆల్-ఖైదా అమెరికాకి మిత్రుడే తప్ప శత్రువు కాదు. అమెరికా మద్దతుతోనే ఆల్-ఖైదా లిబియాలో ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తోంది. సిరియాలో అమాయక పౌరులను ఊచకోత కోస్తోంది. కాబట్టి ఆఫ్-పాక్ ప్రజలకు అమెరికా వల్ల ప్రమాదం ఉన్నది తప్ప వారి వల్ల అమెరికాకు ఎలాంటి ప్రమాదమూ లేదు. పశ్చిమ దేశాల దుర్మార్గాలపై పరిశోధన చేసి నివేదికలు ఇచ్చే సంస్ధలు ఇంకా అనేకం ఉన్నాయి. ఆ నివేదికలకు పశ్చిమ పత్రికలు ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. ఏ.ఐ, హెచ్.ఆర్.డబ్ల్యూ నివేదికలకు కొద్దిగా అయినా విలువ ఇచ్చి ప్రచ్గురిస్తున్నాయంటే వాటివల్ల తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలకు ప్రమాదం లేకపోవడమే దానికి కారణం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s