డబ్బు పరుపు కల తీర్చుకున్న మార్క్సిస్టు కాంట్రాక్టర్


Samar Chakraborthy3

అవటానికి ఆయన మార్క్సిస్టు పార్టీ నాయకుడు. ఆయన కలలు మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతాయి. బాగా డబ్బు సంపాదించాలని, సుఖంగా బతకాలనీ దాదాపు అందరూ కనే కలే కావచ్చు. కానీ సమాజాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్నవారు ఎలాంటి కలలు కనాలి? విప్లవం వచ్చేసిందన్న కల కాకపోయినా కనీసం విప్లవోద్యమం పురోగమిస్తోందన్న కల లేదా కోరిక కలిగి ఉండాలి. కానీ త్రిపుర సి.పి.ఏం పార్టీ నాయకుడు మాత్రం ఏనాటికయినా డబ్బు పడక పై పడుకోవాలన్న కాలతో ఎన్నాళ్లుగానో వేగిపోతున్నాడట. ఆ కోరిక తీర్చుకుని వీడియో కూడా తీయించుకున్న సదరు కార్మికవర్గ నాయకుడు వీడియో ఇంటర్నెట్ కి ఎక్కడంతో ఖంగు తిన్నాడు.

త్రిపుర రాష్ట్రంలో సి.పి.ఐ(ఎం) పార్టీయే ప్రభుత్వం నడుపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అత్యంత నిజాయితీపరుడయిన, నిరాడంబరుడయిన ప్రజా నాయకుడని సి.పి.ఎం తరచుగా చెప్పుకుంటుంది. అలాంటి ముఖ్యమంత్రి కొలువులో మార్క్సిస్టు కాంట్రాక్టర్లు ఎలా వృద్ధి చెందవచ్చో సమర్ ఆచార్జీ చక్కగా రుజువు చేశారు. టాటా కోసం సింగూరు రైతులపైనా, కమ్యూనిస్టులను ఊచకోత కోసిన వంశానికి చెందిన సలీం కంపెనీ కోసం నందిగ్రామ్ రైతుల పైనా పోలీసు తుపాకి ఎక్కుపెట్టడానికి ఏ మాత్రం వెనకాడని సి.పి.ఐ(ఎం) పార్టీ నాయకులు ఇంతకంటే భిన్నంగా ఉండడం అత్యాశే కావచ్చు.

బంకుమారి లోకల్ కమిటీ సభ్యుడయిన సమర్ ఆచార్జీని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు సి.పి.ఎం ఈ రోజు ప్రకటించింది. అనైతిక పనులకు పాల్పడినందుకు, పార్టీ ప్రతిష్టకు మచ్చ తెచ్చినందుకు, అక్రమ పద్ధతుల్లో డబ్బు సంపాదించినందుకు సమర్ ను బహిష్కరించామని దుక్లి డివిజనల్ కమిటీ కార్యదర్శి సుబ్రత చక్రబర్తి చెప్పారని పత్రికలు తెలిపాయి. తమ కమిటీ శనివారం సాయంత్రం సమావేశమై చర్చలు జరిపిందని, బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించిందని సుబ్రత చెప్పినట్లు తెలుస్తోంది.

సమర్ ఆచార్జీ వృత్తి రీత్యానే కాంట్రాక్టర్. మంచంపై డబ్బు కట్టలు పేర్చుకుని, ఆ కట్టాలపై తాను పడుకుని, తనపై కూడా మరిన్ని నోట్ల కట్టలు పేర్చుకుని ఆనందంతో పరవశిస్తుండగా తీసిన వీడియో గురువారం (అక్టోబర్ 17, 2013) వార్తా ఛానెళ్లలో ప్రసారం అయింది. ఎంత డబ్బు పిచ్చి ఉన్నా ఈ విధంగా ఆనందం పొందుతారని సాధారణ ఊహలకు అందని విషయం. సదరు వీడియోను ఎన్.డి.టి.వి వెబ్ సైట్ లో ఇక్కడ చూడవచ్చు. ఈ వార్త చివర వీడియోలోని కొంత భాగం చూడవచ్చు. 

గాలి జనార్ధన రెడ్డి లాంటి వారు దోపిడి సొమ్ముతో బంగారపు కుర్చీ చేయించుకున్నాడని, రోజుకు కొద్దిసేపయినా ఆ కుర్చీ పైన కూర్చోకపోతే ఆయనకి మనఃశాంతి ఉండదని పత్రికలు రాస్తే ‘ఛీ!’ అని ఊసి ఊరుకున్నాం. ఎందుకంటే ఆయన సమాజాన్ని మారుస్తానని ఎప్పుడూ చెప్పలేదు. కమ్యూనిస్టుననీ చెప్పలేదు. పైగా తన అక్రమ సంపాదనను కాపాడుకోడానికి ఆయన దోపిడీ వర్గాలు తమదిగా భావించే బి.జె.పినే ఆయన నమ్ముకున్నాడు. అందుకే ఛీ అని ఊరుకున్నాం. (ప్రస్తుతానికి అంతకంటే చేయగలిగింది ఏమీ లేదనుకోండి!)

కానీ సమర్ ఆచార్జీ అలాంటి వ్యక్తి కాదు. భారత దేశంలో దోపిడీ వ్యవస్ధను ప్రజాశక్తితో కూల్చి కార్మిక రాజ్యం లేదా సమ సమాజం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సి.పి.ఐ(ఎం) పార్టీలో ఆయన నాయకుడు. సమాజ మార్పు కోసం ‘అవసరమైతే’ సాయుధ పోరాటం కూడా చేయాలని రాసుకున్న పార్టీలో నాయకుడాయన. ఆయన డబ్బు పడకపై పవళించడం ఒక ఎత్తయితే, అలా పవళించి ఉండగా మైమరిచిపోతూ చెప్పిన మాటలు మరొక ఎత్తు.

“బ్యాంకు ఖాతా నుండి ఈ రోజు నేను 20 లక్షలు విత్ డ్రా చేశాను. డబ్బు పరుపు పైన పడుకోవాలని నాకు ఎన్నాళ్లుగానో కోరిక. ఆ కోరికను ఇప్పుడు తీర్చుకున్నాను” అని ఆచార్జీ వాకృచ్చాడు. తన కల గురించే కాకుండా తన పార్టీ గుట్టు కూడా ఆయన స్పష్టంగా విప్పి చెప్పాడు. “ఇతర పార్టీ సభ్యుల్లాగా నేను ఆత్మవంచన (హిపోక్రసీ) చేసుకునే రకాన్ని కాదు. వాళ్ళు భారీగా డబ్బు కలిగి ఉన్నప్పటికీ తమను తాము కార్మికవర్గంగా చెప్పుకుంటారు” అని చెబుతూ వీడియోలో కనిపించారు సమర్ ఆచార్జీ!

వీడియో విషయం అక్టోబర్ 10 తేదీనే తమ దృష్టికి వచ్చిందని సుబ్రత చక్రబర్తి చెప్పారు. డివిజనల్ కమిటీ ఆయనకు ‘షో కాజ్’ నోటీసు జారీ చేసిందనీ ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో పార్టీ నుండి బహిష్కరించామని సుబ్రత తెలిపారు. సమర్ ని బహిష్కరించడం అనివార్యమే. అది పెద్ద విషయం కాదు. కానీ, పార్టీ సభ్యుల గురించి ఆయన చెప్పిన మాటల మాటేమిటి? పార్టీ సభ్యులు డబ్బులో మునిగి తేలుతూ కూడా తమను కార్మికవర్గంగా చెప్పుకుంటూ ఆత్మ(పర)వంచన చేసుకుంటారంటూ సమర్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకులు ఏమన్నారో ఏ పత్రికలోనూ రాలేదు.

ఛోటా నాయకుడు కాబట్టి సమర్ కు బహిష్కార శిక్ష వేసి ఉండొచ్చు. కానీ సి.పి.ఎం నేతల ‘కార్మిక వర్గ దృక్పధం’ ఏమిటో వెల్లడి కావడం ఇదేమీ కొత్త కాదు. సింగూరు, నందీగ్రామ్ లు ఆ దృక్పధం బడారం ఏమిటో ‘ఆచరణలోనే’ స్పష్టంగా వెల్లడి అయింది. నిజానికి సింగూరు, నందిగ్రామ్ లకు సి.పి.ఎం పార్టీ ఏ వర్గాల ప్రజల కోసం పని చేస్తుందో ప్రముఖ బెంగాల్ మార్క్సిస్టు మంత్రి ఒకరు అనేక సంవత్సరాల క్రితమే చెప్పారు. బెంగాల్ మార్క్సిస్టు ప్రభుత్వం ‘కాంట్రాక్టర్ల కోసం, కాంట్రాక్టర్ల వలన, కాంట్రాక్టర్ల చేత’ మాత్రమే పని చేస్తున్నదని ఆరోపిస్తూ ఆయన (పేరు గుర్తులేదు) మంత్రి పదవికి రాజీనామా చేశారు.

అశోక్ మిత్ర లాంటి మార్క్సిస్టు పార్టీ  నాయకులు సైతం సి.పి.ఏం పార్టీ విధానాలను తూర్పారబట్టారు. అశోక్ మిత్ర సాధారణ నాయకుడు కాదు. భారత దేశంలో మొట్టమొదటి లెఫ్ట్ ప్రభుత్వంలో జ్యోతి బసు ముఖ్యమంత్రిత్వంలో మొట్టమొదటి ఆర్ధిక మంత్రిగా ఆయన పని చేశారు. భారత ప్రభుత్వానికి సైతం ఆయన ఆర్ధిక సలహాదారుగా పనిచేశారు. దాదాపు పార్టీలన్నీ ఆయనను రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాయి. నందిగ్రామ్ లో బెంగాల్ ప్రభుత్వం సాగించిన అరాచకాలను తీవ్రంగా విమర్శిస్తూ ‘మంత్లి రివ్యూ’ లాంటి ప్రముఖ అంతర్జాతీయ పత్రికల్లోనూ ఆయన వ్యాసాలు రాశారు.

కాబట్టి సమర్ చక్రబర్తి మొదలూ కాదు, చివరా కాదు. వర్గ పోరాట పంధా విడనాడి, వర్గ సంకర పంధా చేపట్టిన సి.పి.ఐ(ఏం) చైనాలోని పచ్చి పెట్టుబడిదారీ వ్యవస్ధను కూడా సోషలిస్టు నిర్మాణంగా చెప్పగల పార్టీ. అలాంటి పార్టీలో సమర్ చక్రబర్తిలు కాకుండా ఇంకెవరుంటారు?

10 thoughts on “డబ్బు పరుపు కల తీర్చుకున్న మార్క్సిస్టు కాంట్రాక్టర్

 1. ఆయన ఏ స్థాయి నాయకుడో చూడాలి. అయినా ఇలాంటి వారు నాయకత్వ స్థానంలోకి రాకుండా తగిన ప్రయత్నాలు చేయాలి. అలా చేయకపోతే ఆ పార్టీ త్వరగానే కనుమరుగౌతుంది. ఈ సంఘటన దురద్రుష్టకరం.

 2. తెలివికల నాయకుడు….ప్రతిపక్ష పార్టీలతోనూ చాకిరీ చేయించుకుంటాడు. అని ఎక్కడో ఎవరో నెహ్రూను ప్రశంసించినట్లు గుర్తు.
  అలా నెహ్రూ…. కమ్యూనిజం పేరుతో ఇంకెవరో దేశంలో ఉద్యమాలు సృష్టించకుండా, ఈ సీపీఎం తరహా పార్టీని సృష్టించాడు అని ఆరోపణలు కూడా ఉన్నాయి.
  కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టాల్సిన కమ్యూనిస్టులు…ఆ పార్టీకి సేవచేస్తూ తరించడం శోచనీయం. అటువంటి పార్టీలో ఇటువంటి నాయకులే ఉంటారు.
  కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వాళ్లకన్నా…కమ్యూనిజం పేరు చెప్పి దోచుకునే వాళ్లు మరింత ప్రమాదకరం.

 3. ముందుగా మనమొక విషయం స్పస్టం చేసుకొవాలి పార్టీ ఏది చేస్తె అదే సిద్దాంతం కాదు మరొలా చెప్పాలంటె పార్టీ స్తాయికి సిద్దాంతాన్ని తీసురాకూడదు. ఎందుకంటె అదింకా బుర్జువా సమాజంలొ వుంది దాంట్లొ అన్నిరకాల వ్యెక్తులూ వుంటారు. సి.పి.ఐ. విషయానికొస్తె దానిపుట్టుకే బుర్జువా పుట్టుక. దానిగురించి ప్రత్కేకంగా చెప్పుకునేది ఏమీ వుండదు. సి.పి.యం అది మొదట్లొ విప్లవకరంగానే వుంది దాదాపు 200 సంత్సరాలలొ తెలంగాణా విప్లవంతొ పొల్సగలిగింది భరతదేశంలొ లేదు. తర్వాత ఆవిప్లవాన్ని చండ్ర రాజేశ్వరావు లాంటి బుర్జువాలు వ్యెతిరేకించటం పార్టీ రెండుగా చీలిపొవటం అందరికీ తెలిసినవిషయమే.

  ప్రస్తుత సి.పి.యం పార్టీ విషయానికొస్తె దాన్ని పుర్తిగా దాన్ని ఇప్పుడు పుర్తిగా బుర్జువాలు ఆక్రమించివున్నారు. మాటల్లొ మార్కిజం వల్లిస్తూ చేతల్లొ దాన్ని పుర్తిగా పాతాళానికి తొక్కేశారు. ఆ మాటల్లొ కుడా చాలా అరుదుగా మాట్లాడతారు. ఒక పద్దతి ప్రకారం కమ్యునిజానికి అర్దాన్నే మార్చివేశారు. ఎలాగంటె కమ్యునిజమంటె కార్మికవర్గ నియంత్రుత్వం ఎర్పడి సమాజంలొని వనరులు , పెట్టుబడీ సమాజపరమై ఒక క్రమపద్దతిలొ శారీరక శ్రమకీ మేధాశ్రమకీ తేడాలు తీసేస్తూ అధికారం కార్మికవర్గమే నిర్వహించుకునే విధంగా డబ్బును తీసేస్తూ చివరికి రాజ్య యంత్రాన్ని ఎంగెల్స్ అన్నట్టు దాన్ని పురావస్తు ప్రదర్శన శాలలొ మాత్రమే చుడగలం. ఇంతజరిగితేనే కమ్యునిజం అంటాం. కాని మన బుర్జువా కమ్యునిస్టులు బుర్జువా దేశంలొని ఎదొ ఒక రాస్ట్ర్షం లొ కమ్యునిజం అనే పేరుతొ అధికారంలొకి వచ్చినంతనే అదే కమ్యునిజం అయినట్లు బాజా వాయిస్తున్నారు. త్రిపురలొ అధికారంలొ వచ్చిన తర్వాత బుర్జువా విష్లెషకుడు రవి ప్రస్తుతం ప్రపంచంలొ ఒక్క ఇండియాలొ మాత్రమే కమ్యునిజానికి బ్రమ్హరధం పట్టారని ఇది సువర్ణాక్షరాలతొ లిఖించాలని పేర్కొన్నాడు ఆ పార్టీ అదికారంలొకి వచ్చిన సందర్భంగా ఆంద్రజ్వొతిలొ పేపర్లొ ఒక వ్యెసంలొ పేర్కొన్నాడు. అంతేకాదు జగన్ జైలునుంచి విడులై వచ్చింతర్వాత అదే పేపర్లొ ఒక వ్యాసంలొ సి.బి.ఐ. మరియూ కొర్టులూ తమపని తాము చేసుకపొతాయని ఇందులొ యవరిప్రమేయం వుండదనీ జగన్ జైలులొ వున్నప్పుడు తెలుగుదేశం సి.బి.ఐ. ని పొగిడిందనీ ఇప్పుడు అదే పార్టీ విమర్శిస్తుందనీ కాబట్టి వాటిపైన యవరిప్రమేయం వుండదనీ శెలవిచ్చారు బుర్జువా కమ్యునిస్టు విష్లెషకుడు.

  ఇంక అధికారం విషయానికొస్తె ఏదైనా ఒక పదవి దొరికితేచాలు చచ్చిందాకా ఆ పదవిని వీడరు వేరేవారిని రానివ్వరు. సి.పి.యం చరిత్ర చుస్తె దారిపొడుగునా అదేకనిపిస్తుంది. జ్వొతిబసు జీవిత చరిత్రకు తెలకపల్లి రవి ముందుమాట రాశారు అందులొ ఆయన్ను ఎలా పొగిడాడంటె గతంలొకి వెళ్ళలి అంటె రాజుల కాలానికి ” జ్వొతిబసు నడుస్తున్న చరిత్ర! ఆయనలేని అంతర్జాతీయాంగా కమ్యునిజాన్ని ఊహించుకొవటం కస్టం కొందరాయనను మార్కిస్టు మొంఢిఘటం అంటారు. అంతా ఇదే దొరనిలొ సాగుతుంది. జ్వొతిబసు కుడా సంస్కణలే గొప్పవిషయమన్నట్టు చెప్పుకుపొయాడు. మార్కిజాన్ని ఒకటి రెండుచొట్లేమొ ప్రస్తావించాడు. ఆవిషయమై అవగాహన లేదని స్పస్టంగా కనిపిస్తుంది.

  శెఖర్ గారూ మీరు ఈఆర్టికల్ కు డబ్బు పరుపు కల తీర్చుకున్న మార్కిస్టు అని హెడ్డింగు పెట్టారు. వాడు మార్కిస్టు ఎలా అవుతాడు.??. దాని పక్కన అర్దం సరిపొయేవిధంగా పక్కన బుర్జువా వుంటె అర్తం సరిపొయేవిధంగా వుంటుది.

 4. రామమోహన్ గారు, మార్క్సిస్టు కాంట్రాక్టర్ అంటే ‘మార్క్సిస్టును అని చెప్పుకునే కాంట్రాక్టర్’ అని. సంధి కాలంలో అలాంటి పద ప్రయోగాలు తప్పవు మరి!

 5. చరిత్రలో మతాలు గానీ, తత్వశాస్త్రాలు గానీ,,ఏక కణ జీవులు ఎలా బహుకణ జీవులుగా వృద్ది చెందుతున్నాయో, ఒక మతాన్నుండీ బహు మతాలు, ఒక తత్వమునుండీ బహు తత్వాలు ఏర్పడుతున్నాయి! మార్క్సిజం ఒక్కటైనా దాన్ని వ్యక్తులు విడదీసుకొంటూ పోతూనే ఉన్నారు. మరి అది ఎప్పుడుపరిపక్వానికి వస్తుందో?

 6. శేఖర్ గారు,

  ఈ “మార్క్సిస్టు కాంట్రాక్టర్” చేసిన ఘనకార్యం ద్వారా మీకు అందివచ్చినదే అదునుగా సి.పి.ఎం వ్నివిధానాలను మీరు ఎండగట్టిన విధానం బాగుంది.

  చంద్రన్న కు (న్యూ డెమోక్రసీ నుంచి చంద్రన్న ఔట్ http://www.andhrajyothy.com/node/19585), ఈ “మార్క్సిస్టు కాంట్రాక్టర్” కు తేడా తెలపగలరు..

  నాయకుల/కార్యకర్తల అంతరంగిక మైన వ్యక్తిగత గోల్స్ ఏమున్నాయో ముందుగా తెలియదు. వారి ప్రవర్తన ద్వారా ఎప్పుడోకప్పుడు బయట పడతాయి. యిటువంటి వాటిని ఉదహరిస్తూ “సిథ్దాంతం” మే తప్పు అనే బావనకు రావడం సహేతుకమేనా?

 7. మీరు ఉదహరించిన వార్తలోనే చంద్రన్న వాదన ఉంది. తేడా అదే.

  నాకున్న సమాచారం మేరకు న్యూడెమొక్రసీ పార్టీ లోని రాష్ట్ర నాయకత్వం రాజకీయాలు ఆ పార్టీ కేంద్ర కమిటీ రాజకీయాలతో చాలాకాలంగా విభేదిస్తున్నాయి.

  రాష్ట్ర నాయకత్వం దృష్టిలో ప్రజలు విప్లవానికి సంసిద్ధంగా లేరు. భారత సామాజిక వ్యవస్ధ ‘నూతన ప్రజాస్వామిక విప్లవ దశ’ నుండి ‘సోషలిస్టు విప్లవ దశ’ కు పరివర్తన చెందింది లేదా ఆ మార్గంలో ఉంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెంది ‘సోషలిస్టు విప్లవ’ దశకు మారడానికి అది దోహదపడింది. దేశంలో కులం కూడా బాగా బలహీనపడిపోయింది.

  కానీ న్యూడెమొక్రసీ కేంద్ర కమిటీ + చంద్రన్న తదితరుల రాజకీయాలు ఇవి కాదు. వారి దృష్టిలో దేశం ఇంకా నూతన ప్రజాస్వామిక విప్లవ దశలోనే ఉంది. బోస్ తదితరుల రాజకీయాలు రివిజనిస్టు రాజకీయాలని మెజార్టీ సెంట్రల్ కమిటి అనేకసార్లు తీర్మానాలు చేసింది. దానితో ‘రెడ్ ఫ్లాగ్’ పేరుతో మరో పార్టీ పెట్టుకోడానికి బోస్ తదితరులు గత యేడు నుండే ప్రయత్నాలు ప్రారంభించారు. వారిని వెళ్లొద్దని చెప్పడానికి కేంద్ర కమిటీ నచ్చజెబుతూ వచ్చింది. ఈ లోపు పార్టీ డబ్బులను వాడుకున్న వ్యక్తిచేత బోస్ తదితరులు ఒక తప్పుడు ఫిర్యాదు చేయించారు. దాని ఆధారంగా చంద్రన్న పైన అభూత కల్పనలు సృష్టించి ప్రచారంలో పెట్టారు. అలా ప్రచారంలోకి వచ్చినవే మీరు చదివిన వార్త.

  చంద్రన్న పైన వచ్చిన ఆర్ధిక ఆరోపణలను కేంద్ర కమిటీ అంగీకరించలేదు. అవి నిజం కాదని భావిస్తోంది. అయితే రాష్ట్రంలో రివిజనిస్టు ముఠాకు దూరంగా ఉండడానికి పోటీ కమిటీలను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించింది. కేంద్ర కమిటి నుండి తొలగించింది తప్ప బహిష్కరించలేదు. స్నేహ సంబంధాలతో ఉందామని కేంద్ర కమిటీ, చంద్రన్న తదితరులతో చెప్పింది. కాని రివిజనిస్టు రాజకీయాలతో ఉన్న బోస్ తదితరులు విమర్శకులకు సమాధానం చెప్పలేక, సొంత క్యాడర్ నుండి వస్తున్న ఒత్తిడిని ఎదుర్కోలేక ఈ విధంగా తప్పుడు వార్తలను ప్రచారంలో పెడుతున్నారు.

  అనగా చంద్రన్న తదితరుల రాజకీయాలు, కేంద్ర కమిటి రాజకీయాలు ఒకటే. బోస్ తదితరుల రాజకీయాలే తేడా. అవి ఎంత దివాలాకోరు రాజకీయాలంటే వాళ్లే ఆ రాజకీయాల్ని తమ సొంతమని చెప్పుకోలేక సి.సి రాజకీయాలు చెప్పుకుంటున్నారు. కనీసం రాజకీయ నిజాయితీ కూడా వారికి లేదు. అలాంటివారికి అబద్ధపు ఆర్ధిక ఆరోపణలు చేయడం కష్టం కాకపోవచ్చు.

  ఈ అంశాలన్నీ చంద్రన్న వాళ్ళ పత్రిక ‘ప్రజాపంధా’ లో ఉన్నాయి.

  కాంట్రాక్టర్ ఉదంతం బైటపడక ముందు కూడా మార్క్సిస్టు పార్టీ సిద్ధాంతాన్ని, రాజకీయాలను నేను విమర్శించాను. ఆ విమర్శకూ కాంట్రాక్టర్ ఉదంతానికీ సంబంధం లేదు. నేను పెట్టని సంబంధాన్ని మీరే పెడుతున్నారు. ఒకవేళ చంద్రన్న ఆర్ధిక ఆరోపణలు నిజం అయినా మార్క్సిస్టు పార్టీ సిద్ధాంతం గొప్పదైపోదని మీరు గుర్తించాలి.

 8. “ఈ లోపు పార్టీ డబ్బులను వాడుకున్న వ్యక్తిచేత బోస్ తదితరులు ఒక తప్పుడు ఫిర్యాదు చేయించారు. దాని ఆధారంగా చంద్రన్న పైన అభూత కల్పనలు సృష్టించి ప్రచారంలో పెట్టారు.”

  నాకు చంద్రన్న గురించి గాని, బోస్ గురించి గాని ఏమీ తెలియదు. పోనీ “పార్టీ డబ్బులను వాడుకున్న వ్యక్తి” గురించి చెప్పండి. మీరు అన్నట్లు ” కానీ సమాజాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్నవారు ఎలాంటి కలలు కనాలి? విప్లవం వచ్చేసిందన్న కల కాకపోయినా కనీసం విప్లవోద్యమం పురోగమిస్తోందన్న కల లేదా కోరిక కలిగి ఉండాలి.” ఈ వేమీ ఈ న్యూ డెమోక్రసీ పార్టీ డబ్బులను వాడుకున్న వ్యక్తి కి వర్తించవా?

  నాకున్న అవగాహన వరకు.. భారతదేశ రాజకీయ పార్టీలలో కమ్యూనిస్ట్ పార్టీ (సి.పి.ఐ మినహా) కార్యకర్తలలో మాత్రమే సమనమాజ స్థాపనకోసం సామాజిక స్పృహ, సమాజిక సేవే “రాజకీయాలు” గా భావిస్తూ, ఆర్థిక అవకతవకలు పాల్పడకుండా వున్నారు (చాలా వరకు, శాతాలలో మాట్లాడుకుంటే యితర పార్టీలతో కంపేర్ చేస్తే!).

  యిటువంటి సందర్భంలో కొంత సంయవనం అవసరం. వ్యక్తిని విమర్శించవచ్చు. కానీ ఈ సందర్బంలో భూర్జువా ప్రచార మాధ్యమాల మాదిరిగా “సిద్ధాంతం” లోపంగా మిలితం చేసి మీరు చెప్పినట్లు భావిస్తున్నాను.

 9. వాసవ్య గారూ మీ ప్రయాస దేని గురించి? పార్టీ డబ్బులు వాడుకున్న వ్యక్తి గురించి నేను చెప్పడం ఏమిటి? నా ఎరుకలో ఉన్నవి చెప్పాను. ఇంకా వివరాలు కావాలంటే ప్రజాపంధా పత్రికలో ఉన్నాయి.

  మీరు బోడి గుండుకీ మోకాలికి ముడి పెడుతున్నట్లు కనిపిస్తోంది. సి.పి.ఎం నాయకుడు తన కల గురించి మాత్రమే చెప్పలేదు. సి.పి.ఎమ్ లో ఇతర నాయకుల గురించి కూడా చెప్పాడు. అది ఆయన స్వీయ అనుభవం. ఆయనకీ న్యూ డెమొక్రసీ పార్టీ నాయకుడు కాని వ్యక్తికీ ఏమిటి పోలిక?

  నేను సి.పి.ఎమ్ పార్టీ విధానాల్లో ఏది తప్పో వివిధ ఆర్టికల్స్ లో వివరించాను. మీకు వీలయితే ఆ అంశాలపైన చర్చించండి. గతంలో ఒకటి రెండు సందర్భాల్లో సి.పి.ఎమ్ విధానాల గురించి మన మధ్య చర్చ జరిగింది. కానీ మీరు అర్ధంతరంగా తప్పుకున్నారు. కానీ న్యూడెమొక్రసీ పార్టీ నాయకుడి పై ఒక ఆరోపణ కనపడగానే అదేదో బ్రహ్మాస్త్రం అయినట్లు వచ్చి పాతపాటే పాడుతున్నారు. మీకు ఏమీ తెలియదంటారు, తీర్పులు మాత్రం ఇస్తారు.

  నేను న్యూ డెమొక్రసీ పార్టీకి అపాలజిస్టును కాను. తప్పులు ఎవరు చేసినా తప్పే. సి.పి.ఎం చేస్తే తప్పు, న్యూ డెమొక్రసీ చేస్తే ఒప్పు అవదు.

  వ్యక్తుల తప్పులు, నాయకుల తప్పులు, పార్టీల తప్పులు ఇవన్నీ కొన్ని కోణాల్లో వేరు వేరు అంశాలు. మరికొన్ని కోణాల్లో పరస్పరం సంబంధం ఉన్న అంశాలు. వీటిని కలగాపులగం చేసేసుకుని బూర్జువా ప్రచార మాద్యమాలు అంటూ మీ అభిప్రాయాల్ని నాపైన రుద్దేస్తున్నారు.

  బూర్జువా ప్రచార మాద్యమాల లాగా సి.పి.ఎం పార్టీని విమర్శించకూడదు అని మీ అభిప్రాయం. నాకా అభిప్రాయం లేదు. నా విమర్శలనీ, బూర్జువా ప్రచార మాద్యమాల విమర్శలని ఒకే గాటన కట్టి చూడడం మీరు చేస్తున్న తప్పు. కాదూ కూడదంటే అది మీ అవగాహన.

  నా అవగాహనలో సి.పి.ఎం, సి.పి.ఐ లు కమ్యూనిస్టు పార్టీలు కావు. అవి రివిజనిస్టు పార్టీలు. కమ్యూనిజం పేరు చెప్పుకుంటున్న పాలకవర్గ పార్టీలు. ఆ పార్టీల ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్ధిక విధానాలు, పారిశ్రామిక విధానాలు, రాజకీయ అవగాహన… ఇవన్నీ ఆ సంగతిని రుజువు చేస్తున్నాయి. మీకు చర్చించే ఉద్దేశ్యం ఉంటే ఈ అంశాలపైన చర్చిద్దాం. సి.పి.ఎం పార్టీ ఎందుకు రివిజనిస్టు-పాలకవర్గ పార్టీయో నేను చెబుతాను. ఎందుకు కాదో మీరు చెబుతారా? చెప్పగలిగితే అది అసలు చర్చ అవుతుంది. అది మానేసి ముసుగులో గుద్దులాటకు దిగితే దానివల్ల ఏమిటి ఉపయోగం?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s