అమెరికా డ్రోన్ దాడుల్లో వందల పౌరులు బలి -ఐరాస


drone

టెర్రరిస్టుల పేరు చెప్పి అమెరికా సాగిస్తున్న చట్ట విరుద్ధ డ్రోన్ దాడుల్లో వేలాది మంది పౌరులు మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక నివేదిక పేర్కొంది. అమెరికా పైకి చెబుతున్న సంఖ్య కంటే 10 రెట్లు అమాయక పౌరులు డ్రోన్ దాడుల్లో మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక ప్రతినిధి విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఐరాస నిర్వహిస్తున్న దర్యాప్తుకు కూడా అమెరికా సహకరించడం లేదని ఐరాస ప్రత్యేక ప్రతినిధి (special rapporteur) బెన్ ఎమర్శన్ విడుదల చేసిన 24 పేజీల నివేదిక తెలిపింది. బ్రిటన్ డ్రోన్ దాడుల్లోనూ అనేకమంది అమాయకులు మరణించారని నివేదిక తెలిపింది.

ఆఫ్ఘనిస్ధాన్, యెమెన్, సోమాలియా, పాకిస్ధాన్ దేశాలలో ‘సర్జికల్ స్ట్రైక్స్’ పేరుతో అమెరికా మానవ రహిత విమానాలను ఉపయోగించి క్షిపణి దాడులు నిర్వహిస్తోంది. డ్రోన్ దాడులు అంతర్జాతీయ చట్టాలకు బద్ధ విరుద్ధం. జార్జి బుష్ కాలంలో ప్రారంభం అయిన ఈ దాడులు ఒబామా అధ్యక్షరికంలో అనేక రెట్లు పెరిగాయి. ఐరాస, మానవ హక్కుల సంస్ధలు అనేకమార్లు డ్రోన్ దాడులను నిరసించినప్పటికీ పశ్చిమ దేశాలు పట్టించుకోవడం లేదు.

ఆఫ్ఘనిస్ధాన్ లో 2011లో 294 మార్లు డ్రోన్ దాడులు చేశామని,  2012లో నవంబర్ వరకూ 11 నెలల్లో ఆ సంఖ్య 447 కు పెరిగిందని అమెరికా ఎయిర్ ఫోర్స్ నవంబర్ 2012లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 2012 దాడుల్లో కేవలం 16 మంది పౌరులు చనిపోయారని, 5 గురు గాయపడ్డారని అమెరికా అందజేసిన వివరాలను ఉటంకిస్తూ వేరే ఐరాస సంస్ధ (UNAMA) చెప్పింది. అయితే పాకిస్ధాన్ ప్రకారం 2012లో జరిగిన అమెరికా దాడుల్లో 2,200 మంది చనిపోగా, వారిలో ఒక్క డ్రోన్ దాడుల్లో మరణించినవారి సంఖ్య 400 మంది అమాయక పౌరులు ఉన్నారు.

సంప్రదాయక క్షిపణి దాడులతో పోలిస్తే మానవ రహిత విమానాలు ప్రయోగించే క్షిపణి దాడుల్లో చాలా తక్కువమంది పౌరులు మరణిస్తున్నారని అమెరికా ఎప్పుడూ చెప్పే మాట. తక్కువ మంది పౌరులు చనిపోతున్నారు కాబట్టి డ్రోన్ లతో చంపొచ్చు అన్నది అమెరికా దురహంకార వాదన. అయితే అమెరికా మిలట్రీ సలహాదారులు చెప్పిందాని ప్రకారం ఇది నిజం కాదని, డ్రోన్ దాడుల్లోనే అత్యధికంగా పౌరులు మరణిస్తున్నారని ఆయన ప్రకటించారని ఐరాస ప్రత్యేక ప్రతినిధి గుర్తు చేశారు.

‘సెంటర్ ఫర్ నావల్ అనాలసిస్’ అనే పరిశోధనా సంస్ధలో పని చేసే పరిశోధనా శాస్త్రవేత్త ల్యారీ లూయిస్ ఆఫ్ఘనిస్ధాన్ లో చేసిన పరిశోధనను ఎమర్శన్ తన నివేదికలో ప్రస్తావించాడు. ఆయన 2010 మధ్య నుండి 2011 మధ్య వరకూ ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా చేసిన వైమానిక దాడులను పరిశీలించాడు. అమెరికా మిలట్రీ రహస్య (classified) నివేదికలను పరిశీలించిన లూయిస్, ఫైటర్ జెట్ దాడుల్లో కంటే డ్రోన్ దాడుల్లో 10 రెట్లు ఆఫ్ఘన్ పౌరులు మరణించారని తేల్చాడు.

అమెరికా గానీ, బ్రిటన్ గానీ తాము చేసే డ్రోన్ దాడుల గురించి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వడం లేదని ఐరాస ప్రతినిధి తన నివేదికలో తెలిపాడు. పౌరులు మరణించినప్పుడు కూడా వివరాలు ఇవ్వడం లేదని తెలిపాడు. ఉదాహరణకి ఫిబ్రవరి 21, 2010 తేదీన ఉరుజ్గన్ రాష్ట్రంలో జరిపిన డ్రోన్ దాడిలో 23 మంది పౌరులు మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని కానీ ఈ సమాచారాన్ని దీర్ఘకాలం పాటు తొక్కిపెట్టారని తెలిపారు. డ్రోన్ దాడులకు సంబంధించి ఛేదించడానికి వీలులేని కఠినమైన దాపరిక విధానాన్ని అవలంబిస్తోందని, తమ జాతీయ భద్రత కోసమే డ్రోన్ దాడులు చేస్తున్నామన్న అమెరికా వాదన ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదని ఎమర్శన్ స్పష్టం చేశాడు. జాతీయ భద్రత సాకు చూపుతూ సమాచారం తొక్కిపెట్టడం కూడా అనుమతించలేమని పేర్కొన్నాడు.

ఎమర్శన్ నివేదికలో బ్రిటన్ కూడా ప్రముఖంగా పేర్కొనబడింది. మార్చి 25, 2011 తేదీన బ్రిటన్ చేసిన డ్రోన్ దాడిలో నలుగురు పౌరులు చనిపోగా ఇద్దరు గాయపడ్డారని, కానీ బ్రిటన్ ప్రభుత్వం ఒక్కరే చనిపోయారని ప్రకటించిందని నివేదిక తెలిపింది. బ్రిటన్ కి చెందిన ‘రీపర్’ డ్రోన్ ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం 46,000 గంటలపాటు ఎగిరి (సగటున రోజుకు 3 సార్లు) 405 క్షిపణులు ప్రయోగించిన నేపధ్యంలో మొత్తం మరణించినవారి సంఖ్యను ఊహించడానికి కూడా భయానకమే.

ఆల్-ఖైదా టెర్రరిస్టులను చంపే పేరుతో అమెరికా 2004 నుండి పాక్ భూభాగంలోకి చొరబడి డ్రోన్ దాడులు నిర్వహిస్తోంది. 2008-2010 కాలంలో సి.ఐ.ఏ తన డ్రోన్ దాడులు తీవ్రం చేసిందని ఈ కాలంలోనే అమాయక పౌరుల మరణాలు కూడా బాగా పరిగాయని ఎమర్శన్ నివేదిక తెలిపింది. 2009లో బారక్ ఒబామా మొదటిసారి అధ్యక్షుడుగా ఎన్నిక అయిన సంగతి గమనార్హం. డ్రోన్ దాడులు ఎక్కువగా జరిగే గిరిజన ప్రాంతాలు మత సంబంధిత సంప్రదాయాల ప్రకారం చనిపోయినవారిని వెంటనే పూడ్చిపెడతారనీ దానివల్ల వాస్తవ మృతుల సంఖ్య ఎప్పటికీ తెలియకుండా పోతోందని నివేదిక తెలిపింది. పాకిస్ధాన్ చట్ట సభల సభ్యులు వ్యతిరేకత తీవ్రం చేయడంతో పాక్ లో డ్రోన్ దాడులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని తెలిపింది. అయితే దాడులు తగ్గుముఖం పట్టాయి గానీ అసలుకయితే దాడులు ఆగిపోలేదు.

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్ధాన్, యెమెన్ లలో పౌరుల మరణాల సంఖ్య కొద్దోగొప్పో లభించినప్పటికీ ఇరాక్, లిబియా దాడుల్లో మరణించినవారి సంఖ్య అసలుకే లభించలేదని ఎమర్శన్ తెలిపాడు.

ఆల్-ఖైదా టెర్రరిస్టులే తమ దాడుల లక్ష్యం అని అమెరికా చెబుతున్నప్పటికీ దాని వాస్తవ లక్ష్యం వివిధ దేశాల జాతీయ శక్తులే. అమెరికా సామ్రాజ్యవాద దురహంకార దాహాన్ని వ్యతిరేకించే శక్తులను అంతం చేసి తమ నయా వలస విధానాలకు వ్యతిరేకత పొక్కకుండా చూసుకోవడం అమెరికా లక్ష్యం. ఆల్-ఖైదా పేరుతో తమ హత్యలను సమర్ధించుకోవడం అమెరికాకు అంతకంతకూ కష్టంగా మారుతోంది. ఆర్ధిక సంక్షోభ పరిస్ధితుల వలన దేశంలో యుద్ధ వ్యతిరేకత కూడా తీవ్రం అవుతుండడంతో సైనికుల అవసరం లేకుండా తమ లక్ష్యాలను సాధించుకోవలసిన అగత్యం అమెరికాకు ఏర్పడింది. ఫలితంగా రోబో విమానాల వినియోగం పెరిగిపోయింది.

ఆఫ్రికా దేశాధినేతలను, ఇరాక్, లిబియా, సిరియా లాంటి మూడో ప్రపంచ నేతలను సామూహిక విధ్వంసక మారణాయుధాలను కలిగి ఉన్నారంటూ హత్యలు చేయడానికి తెగబడుతున్న అమెరికా తాను పాల్పడుతున్న ప్రపంచ హంతక దాడులకు మాత్రం బాధ్యత వహించడానికి సిద్ధంగా లేదు. తమ రసాయన ఆయుధాలను పూర్తిగా విధ్వంసం చేయడానికి మరో 4 సంవత్సరాలు కావాలని కోరిన అమెరికా, సిరియా మాత్రం ఆరు నెలల్లో విధ్వంసం చేయాలని హుకుం ఇవ్వడం ఆటవిక నీతి తప్ప మరొకటి కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s