అమెరికా ఓడ సిబ్బంది అరెస్టు


Seman G Ohio

అమెరికన్లు ఒక్కరు కూడా లేని ‘సీమన్ గార్డ్ ఒహియో’ ఓడ సిబ్బందిని భారత పోలీసులు మొత్తానికి అరెస్టు చేశారు. అమెరికా ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ అడ్వాన్ ఫోర్ట్ కి చెందిన ఈ ఓడ సిబ్బందిలో భారతీయులు కూడా ఉన్నారు. కానీ అమెరికన్ ఒక్కరూ లేరు. బ్రిటన్, ఎస్తోనియా, ఉక్రెయిన్ తదితర దేశాలకు చెందిన సిబ్బందిని అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు, చట్ట విరుద్ధంగా డీజెల్ కొనుగోలు చేసినందుకు, భారత సముద్ర జలాల్లో అనుమతి లేకుండా ప్రవేశించినందుకు అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు.

ప్రస్తుతం కేసును తమిళనాడుకు చెందిన Q బ్రాంచ్ సి.ఐ.డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 35 అత్యాధునిక ఆయుధాలతో పాటు 5680 రౌండ్ల మందుగుండు సామాగ్రి ఓడ సిబ్బంది వద్ద పట్టుబడిందని పోలీసులు తెలిపారు. అరెస్టయినవారిలో 10 మంది ఓడ సిబ్బంది కాగా మిగిలిన 25 మంది వివిధ జాతీయతలు కలిగిన భద్రతా సిబ్బంది. తమ ఆయుధాలకు పూర్తి అనుమతి ఉన్నదని, చట్టబద్ధంగానే వాటిని సంపాదించి రిజిస్టర్ చేశామని అడ్వాన్ ఫోర్ట్ అధ్యక్షుడు చెప్పిన మాటలను తమిళనాడు పోలీసులు నమ్మలేదని అర్ధం అవుతోంది.

ట్యుటికోరిన్ ఓడ రేవుకు సమీపంలోని భారత సముద్ర జలాల్లోకి ‘సీమన్ గార్డ్ ఒహియో’ అనుమతి లేకుండా ప్రవేశించినట్లు తమిళనాడు పోలీసులు నిర్ధారించారు. ఒడలో ఉన్న ఆయుధాలకు సంబంధించి ఎటువంటి చట్టబద్ధ అనుమతి పత్రాలు అడ్వాన్ ఫోర్ట్ కంపెనీ సమర్పించలేదని వారు తెలిపారు. అనుమతి లేకుండా డీజెల్ కొనుగోలు చేయడం ద్వారా కస్టమ్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు స్పష్టం చేశారు. ఇది స్మగ్లింగ్ కిందకు వస్తుందని తెలిపారు.

దేశంలోని ప్రైవేటు వ్యక్తుల నుండి 1500 లీటర్ల డీజెల్ ను ఓడ సిబ్బంది కొనుగోలు చేశారని ఇది నిర్ధారిత నియమ నిబంధనలకు విరుద్ధమని తెలుస్తోంది. అమెరికా ఓడ భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించలేదని అడ్వాన్ ఫోర్ట్ చేస్తున్న వాదన నిజం కాదని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయుధాలకు సంబంధించిన పత్రాలు కూడా వారివద్ద లేవని తెలిపారు.

ఈ మేరకు ఓడ సిబ్బంది, గార్డులపై ఆయుధాల చట్టం 1959, నిత్యావసర సరుకుల చట్టం 1955, మోటార్ స్పిరిట్ మరియు హై స్పీడ్ డీజెల్ (అక్రమ వినియోగం, సరఫరా, పంపిణీ నిరోధం) చట్టం 1990… కింద కేసులు పెట్టామని పోలీసులు ప్రకటించారు. తీర రక్షణ దళాలు మొదట వారిని అరెస్టు చేసి తమిళనాడు పోలీసులకు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

పోలీసుల ప్రకటనతో ‘అడ్వాన్ ఫోర్ట్’ అధ్యక్షుడు విలియం వాట్సన్ చేసిన వాదన ఒట్టి వాగాడంబరమేనని, అసలు విషయాన్ని కప్పి పుచ్చడానికి ఉద్దేశించిన ప్రకటన అని స్పష్టం అయింది. ‘మా సిబ్బంది మీ నౌకలకే రక్షణ ఇస్తున్నారు. వారిని అరెస్టు చేస్తే వారి విధులు నిర్వర్తించలేరు’ అని వాట్సన్ చేసిన ప్రకటనను పోలీసులు పట్టించుకోలేదు.

ఓడ సిబ్బంది 10 మంది కాగా వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయలేదు. వి.ఓ.సి చిదంబరం ఓడరేవు లో ఉన్న వారి ఓడ నిర్వహణ కోసం వారిని అరెస్టు చేయకుండా అట్టే పెట్టారు. వారిలో కెప్టెన్ ఒకరు. నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని, వారికి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. చెన్నైలోని పుఝల్ సెంట్రల్ జైలులో ఉంచనున్నారని పత్రికలు తెలిపాయి.

గార్డులుగా చెబుతున్న 25 మందిలో అత్యధికులు అమెరికా, బ్రిటన్, నాటో ప్రత్యేక దళాలలో పని చేసి రిటైర్ అయినట్లు చెప్పుకున్నారని ది హిందు తెలిపింది. అయితే జాతీయత వారీగా పత్రికలు ఇచ్చిన లెక్కలో అమెరికా పౌరులు ఎవరూ ఉన్నట్లు చెప్పలేదు. అరెస్టు గురించిన సమాచారాన్ని బ్రిటన్, ఎస్తోనియా, ఉక్రెయిన్ దేశాల ఎంబసీలకు రాయబార మార్గాల ద్వారా అందస్తారు.

అమెరికా పౌరులు ఎవరూ అరెస్టు కానప్పటికీ ఓడ అమెరికా ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీకి చెందినందున భారత ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య చిన్నపాటి సాహసమే కావచ్చు. తమవాళ్లు తప్పు చేసినా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విడిపించుకుపోవడం తమ ఆజన్మ హక్కుగా పశ్చిమ దేశాలు భావిస్తాయని అనేక ఉదాహరణలు చెబుతాయి. భోపాల్ ఫ్యాక్టరీ యాండర్సన్, ఇద్దరు పాక్ జాతీయులను కాల్చి చంపిన రేమాండ్ డేవిస్, ఆఫ్ఘన్ స్త్రీలు పిల్లలను ఊచకోత కోసి కూడా ఆఫ్ఘన్ చట్టాలనుండి తప్పించుకోగలిగిన క్రిస్టఫర్… వీళ్ళు కొన్ని ఉదాహరణలు మాత్రమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s