బానిసత్వంలో 3 కోట్ల మంది, సగం ఇండియాలోనే


bonded labour

బానిస సమాజం అంతరించిందని గొప్పగా చెప్పుకుంటాం. అది నిజం కాదన్న చేదు నిజం మనం అంగీకరించాల్సిందే. వర్తమాన ప్రపంచంలో 3 కోట్ల మంది బానిసలుగా బతుకుతున్నారని ‘గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2013’ (జి.ఎస్.ఐ 2013) సర్వేలో తేలింది. గత సంవత్సరం సర్వే చేసిన ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’ (ఐ.ఎల్.ఓ) బానిస బతుకులు నెట్టుకొస్తున్నవారి సంఖ్య 2.1 కోట్లని తెలిపింది. వాస్తవం దానికంటే ఘోరమని జి.ఎస్.ఐ 2013 సర్వేలో స్పష్టం అయింది. ప్రపంచంలోని మొత్తం బానిసత్వంలో సగం బానిసత్వాన్ని సొంతం చేసుకుని మన ‘కర్మ భూమి’ పుణ్యం కట్టుకుంది.

పెట్టుబడిదారీ దశకు సమాజం అభివృద్ధి చెందింది కనుక ప్రపంచంలో ఇక బానిసత్వపు ఆనవాళ్ళు కనపడకూడదు. కానీ ఆనవాళ్లేమి ఖర్మ, చక్కగా లెక్కించగలిగిన సంఖ్య కంటే ఎక్కువగానే బానిసలు కొనసాగుతున్నారని జి.ఎస్.ఐ 2013 సర్వే నిర్వహించిన ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ సంస్ధ ద్వారా వెల్లడి అవుతోంది.

బానిసత్వం అంటే రోమన్, అమెరికన్ బానిసత్వాలే కానక్కరలేదు. బానిసత్వ పరిస్ధితుల్లో, కొండొకచో బానిసత్వం కంటే మించిన పరిస్ధితుల్లో జీవిస్తున్నవారిని బానిసలుగా ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ సంస్ధ నిర్వచించింది. అప్పు వల్ల రుద్దబడిన వెట్టి చాకిరీ, బలవంతపు పెళ్లిళ్లు, స్త్రీలు-పిల్లల అక్రమ రవాణా మొదలయిన దురాగతాలకు గురయినవారందరిని బానిసలుగా ఈ సంస్ధ పరిగణించింది. “హింస, బలవంతం, మోసాల ద్వారా లాభార్జన కోసం, లైంగిక దోపిడి కోసం వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ స్వాధీనంలో లేదా నియంత్రణలో ఉంచుకోవడం”గా బానిసత్వాన్ని ‘వాక్ ఫ్రీ’ నిర్వచించింది.

“నేడు కొంతమంది ఇంకా వంశపారంపర్యంగా బానిసలుగా పుడుతున్నారు. అనుమానంగా ఉన్నప్పటికీ ఇది కఠిన వాస్తవం. ముఖ్యంగా పశ్చిమ ఆఫ్రికా, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో ఇది ఇంకా నిజం” అని 162 దేశాలను సర్వే చేసి తయారు చేసిన జి.ఎస్.ఐ 2013 నివేదిక పేర్కొంది. వైవిధ్య రూపాల్లో బానిసత్వం దాగి ఉన్నదని నివేదిక తెలిపింది. దానికి ఆధునిక బానిసత్వం అని పేరిడింది. ఇండియాలో బానిసలకు మాత్రం బహుశా ఈ ‘ఆధునిక’ అనే విశేషణం అవసరం లేకపోవచ్చు.

జి.సి.ఐ 2013 సర్వే ప్రకారం ప్రపంచ వ్యాపితంగా ఉన్న 29.8 మిలియన్ల బానిసల్లో 14 మిలియన్లు భారత దేశంలోనే ఉన్నారు. అంటే దాదాపు సగం మంది! ‘సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం’ అని ఒక స్టేట్ మెంట్ పడేయ్యొచ్చు గానీ, దేశంలో స్పష్టంగా విజయం సాధించిన విప్లవం అంటూ ఏమీ లేదన్న సంగతి గుర్తెరిగితే సిగ్గుపడాల్సిన అవసరం కనిపించదు. దానర్ధం బానిసత్వాన్ని సమర్ధించడం కాదు. అరుంధతీ రాయ్ అన్నట్లు దేశం ఏకకాలంలో అనేక సామాజిక దశల్లో నివసిస్తున్నపుడు ప్రపంచానికి పట్టిన సగం బానిసత్వం మన దేశానికి పట్టడంలో సిగ్గుపడడానికి ఏముంటుంది, దాన్ని ఎలా నిర్మూలించాలో ఆలోచించి అందుకు కంకణం కట్టుకోవాలి గాని!?

మానవ సమాజం వివిధ దశలుగా ప్రయాణిస్తూ వచ్చిందని శాస్త్రం (సోషియాలజీ) చెబుతుంది. ఆదిమ సమాజం అనంతరం ఏర్పడ్డ బానిస సమాజం మొట్టమొదటి దోపిడి సమాజం. ప్రఖ్యాత రోమన్ సామ్రాజ్యంలో బానిసల వెతలు, పోరాటాలు ఎల్లరెరిగినదే. బానిసల తిరుగుబాటుతో బానిస సమాజాలు కూలిపోయి భూస్వామ్య సమాజాలు ఏర్పడ్డాయి. ఇందులో రైతులు అర్ధ బానిసలుగా బతికారు. బానిసలు, అర్ధ బానిసల శ్రమని మిగులు పెట్టుబడిగా పోగుచేసిన పెట్టుబడి సొంతదారులు తమ కంపెనీలకు కార్మికులు లభించక ఫ్యూడల్ సమాజాన్ని కూల్చి రైతాంగాన్ని విముక్తం చేయాల్సి వచ్చింది. బ్రిటన్, ఫ్రెంచి, అమెరికా, జర్మనీ విప్లవాలు ఆ కోవలోనివే.

పెట్టుబడిదారీ సమాజంలో కార్మికుడికి శ్రమను అమ్ముకునే స్వేచ్ఛ తప్ప మరే స్వేఛ్ఛా ఉండదు. పెట్టుబడిదారీ సమాజం ఆధునిక దోపిడి వ్యవస్ధగా మన కళ్ల ముందు ఉన్నది. రష్యా, చైనా, తూర్పు యూరప్ దేశాలలో దానిని కూడా కూల్చి కార్మికులు సోషలిస్టు సమాజాన్ని ఏర్పరచుకున్నారు. అయితే సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణ క్రమంలో పెట్టుబడిదారీ వర్గం తిరిగి పై చేయి సాధించడంతో సోషలిస్టు వ్యవస్ధలు తాత్కాలిక ఓటమిని ఎదుర్కోవడం వేరే విషయం.

కానీ భారత దేశంలో బానిసత్వాన్ని మతం-దైవం అనే శంఖంలో పోసి సిద్ధాంతీకరించడం ద్వారా, బానిసత్వ శ్రామిక వ్యవస్ధను అనేక దొంతరల కుల వ్యవస్ధగా పటిష్టంగా నిర్మించడం ద్వారా బందోబస్తు చేయడంతో ఇక్కడ విప్లవాలకు ఆదిలోనే మహా ఆటంకం ఏర్పడింది. కొన్ని చోట్ల బానిస సమాజ దశను దాటుకుని ఫ్యూడల్ సమాజ దశలోకి అడుగుపెడుతుండగానే తెల్లవాడు చొరబడి భారత దేశపు సహజ సామాజిక పరిణామ క్రమాన్ని తీవ్రంగా ఆటంకపరిచాడు. వాడి పుణ్యాన అటు బానిసత్వమూ, అర్ధ బానిసత్వమూ పోలేదు, ఇటు విప్లవాలూ రాలేదు. ధనికవర్గాలు మాత్రం రాజులుగా, ప్రభు వర్గాలుగా, భూస్వాములుగా, దళారీ పెట్టుబడిదారులుగా, బ్యూరోక్రట్లుగా అభివృద్ధి చెంది విదేశీ సామ్రాజ్యవాదుల సేవలో తరించిపోతున్నారు. అందుకే ఇక్కడ బానిసలు అంతమంది ఉండడం. 

కానీ చైనాలో బానిసత్వం మళ్ళీ తలెత్తడం మహా ఘోరం. పెట్టుబడిదారీ దశను దాటుకుని మూడు దశాబ్దాల పాటు సోషలిజాన్ని నిర్మించుకున్న వ్యవస్ధలో బానిసలను తిరిగి పునరుద్ధరించగలిగారంటే అక్కడి పెట్టుబడిదారీ వర్గం పోషించిన పరమ నీచమైన పాత్ర ఎంత తీవ్రంగా ఉన్నదో ఎవరికి వారు అర్ధం చేసుకోవాల్సిందే. జి.ఎస్.ఐ 2013 లెక్క ప్రకారం ఇండియా తర్వాత అత్యధిక సంఖ్యలో బానిసలున్నది చైనాలోనే. అక్కడ 2.9 మిలియన్ల మంది, లేదా 29 లక్షల మంది బానిసత్వంలో మగ్గుతున్నారు.

“ఇతర బాధితులను పట్టుకెళ్లాడమో, కిడ్నాప్ చేయడమో చేసి అమ్మేస్తున్నారు. ఆ తర్వాత అత్యంత దీన పరిస్ధితుల్లో దోపిడీకి గురవుతున్నారు. అది ‘పెళ్లి’ రూపంలో కావచ్చు. చేపల నౌకల్లో చెల్లింపుకు నోచుకోని గొడ్డు చాకిరీ కావచ్చు. లేదా ఇంటి నౌకరులుగా కావచ్చు. కొంతమందిని మంచి ఉద్యోగం ఇప్పిస్తామనో, చదువు చెప్పిస్తామనో మోసపు హామీలతో ఆకర్షించి ఆ తర్వాత తప్పించుకోవడానికి వీల్లేని పరిస్ధితుల్లో పడేస్తున్నారు” అని నివేదిక పేర్కొంది.

సాంద్రత పరంగా చూస్తే మారిటానియా ప్రధమ స్ధానంలో ఉన్నదని నివేదిక తెలిపింది. అక్కడ బానిసల సంఖ్య మొత్తం జనాభాలో 4.2 శాతం. ఇండియా ఇక్కడా వెనకబడకుండా నాలుగో స్ధానంలో ఉన్నది. అప్పు తీర్చలేక ఉచిత శ్రమకు కట్టుబడడం, వెట్టిచాకిరి… ఈ రెండూ ఇండియాలో ప్రధానంగా పని చేస్తున్నాయని తెలిపింది. మారిటానియా తర్వాత సాంద్రతలో హైతీ, పాకిస్ధాన్ లు రెండవ, మూడవ స్ధానాల్లో ఉన్నాయి. 162 దేశాల్లో అత్యంత తక్కువ మంది (100) బానిసలు ఐస్ లాండ్ లో ఉన్నారు. ఐస్ లాండ్ పైన ఐర్లాండ్, బ్రిటన్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, నార్వే, లగ్జెంబర్గ్, ఫిన్లాండ్ ఉన్నాయి. ఇవన్నీ తమను తాము గొప్పగా అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునేవే.

One thought on “బానిసత్వంలో 3 కోట్ల మంది, సగం ఇండియాలోనే

  1. ప్రపంచం లో ఎక్కడైనా భానిసత్వం ఉంటుందేమో కానీ, అవ్వా! ….అవ్వా! …. ఇక్కడా! ఈ దేశంలోనా అదీ భారత దేశంలోనా మీరెక్కడొ పొరపడి ఉంటారు, <> అని ఢంకా బజాయించి మరీ చెపుతున్నారు. ఆ జి.ఎస్‌. ఐ. కాస్త ఏ కమ్యునిస్టులో లేక సోకాల్డ్‌ లౌకిక వాదులో కల్పించిన సంస్థ అయ్యుంటుంది సరిగ్గా చూసుకోండీ! అల్లాంటి వాల్లంతా అంతేలెండీ మన దేశం పరువు తీయ్యాలనుకుంటారు. మీరు ఉన్నది ఉన్నట్లు ఇక్కడ రాస్తే ఎల్లాగండీ! మన పరువేం కాను? ఎందుకైన మంచిది ఇంకా ఏమైన రెఫ్‌ రెన్స్‌ లేమైనా దొరుకుతాయేమో చూడండీ అలాంటిది లేదని చెప్పటానికి. మనలో మాట అసలు ఉన్నాయే పో! ఉంటెమాత్రం ఇలా పబ్లిక్‌ గా చెపుతారా ఏంటండీ?

    ( వాస్తవాన్ని అంగీక రించ నిరాకరించే వారినుద్దేశించి మాత్రమే)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s