అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతుండడంతో పాకిస్ధాన్-ఇరాన్ పీస్ పైప్ లైన్, నిధుల లేమితో సతమతమవుతోంది. ఇరాన్ సహజ వాయు నిక్షేపాలతో పాక్ ప్రజల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ పైప్ లైన్ తలపెట్టి దశాబ్దం దాటిపోయింది. పాకిస్ధాన్ మీదుగా ఇండియాకి కూడా గ్యాస్ సరఫరా చేయడానికి పీస్ పైప్ లైన్ ను మొదట ఉద్దేశించారు. కానీ అమెరికా బెదిరింపులతో ఇండియా ఈ ప్రాజెక్టును వదులుకుంది. పాకిస్ధాన్ మాత్రం అమెరికా హెచ్చరికలను త్రోసిరాజని ముందుకు వెళుతోంది. గత మార్చి నెలలో పాక్ భూభాగంపై పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్ధాపన చేసింది. అయితే నిధుల కొరత కావడంతో ఇరాన్ ఇస్తానన్న నిధులను ఇంకా పెంచాలని పాక్ కోరుతోంది.
(చూడండి: భారత్ బెదిరింది; పాక్ సాధించింది)
నిధుల కొరత రావడానికి ప్రధాన కారణం అమెరికా ఆంక్షలు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని సాకుగా చూపి ఆ దేశ చమురు, సహజవాయువు వాణిజ్యంపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి లోక విదితమే. అమెరికా-బ్రిటన్-ఫ్రాన్స్-ఇజ్రాయెల్ దేశాల దుష్ట కూటమి ఐరాస పై ఒత్తిడి చేసి విధింపజేసిన అంతర్జాతీయ ఆంక్షలు ఇరాన్ తో పాటు పాక్, ఇండియా దేశాల ప్రజల పాలిటా శాపంగా మారాయి. ఈ ఆంక్షలకు జడిసి పీస్ పైప్ లైన్ నిర్మాణానికి ఫైనాన్స్ వనరులు సమకూర్చడానికి కంపెనీలు ముందుకు రావడం లేదు. దానితో పాకిస్ధాన్ ఇరాన్ నే ఆశ్రయిస్తోంది.
ఇరాన్ భూభాగంలో పైప్ లైన్ నిర్మాణాన్ని ఆ దేశం పూర్తి చేసినప్పటికీ నిధుల కొరతతో అది పాకిస్ధాన్ లో ఇంకా ఊపందుకోలేదు. పీస్ పైప్ లైన్ కోసం 500 మిలియన్ డాలర్లు ఇస్తానని ఇరాన్ ఇప్పటికే వాగ్దానం ఇచ్చింది. నిర్మాణానికి మొత్తం మీద 2 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. మిగిలిన నిధులను కూడా ఎలాగో ఇరానే సర్దాలని పాకిస్ధాన్ కోరుతోంది. అమెరికా ఆంక్షల వల్ల ఎవరూ ముందుకు రాని పరిస్ధితుల్లో ఇరానే ఆ నిధులు ఇవ్వగలదని పాక్ చమురు, సహజవాయువు శాఖ మంత్రి షాహిద్ ఖాన్ చెప్పారని ది హిందు తెలిపింది. ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేయాలని ఇరాన్ ని కోరామని ఇంకా ఏ సమాచారం లేదని ఆయన తెలిపారు.
1990ల్లో రూపు దిద్దుకున్నపుడు ఇండియా కూడా పీస్ పైప్ లైన్ లో భాగస్వామి. 2014లో దానిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇరాన్ తన భాగం పూర్తి చేసి పాకిస్ధాన్ భాగం నిర్మాణం కోసం ఎదురు చూస్తోంది. పాక్ భూభాగం పైన దాదాపు 780 కి.మీ మేర పైప్ లైన్ నిర్మించాల్సి ఉందని తెలుస్తోంది. 2010 నాటి ఒప్పందం ప్రకారం ప్రారంభంలో రోజుకు 750 మిలియన్ ఘనపుటడుగుల సహజవాయువు పాక్ కి సరఫరా చేయాలి. ఆ తర్వాత దానిని రోజుకు 1 బిలియన్ ఘనపుటడుగులకు పెంచాలి.
పాకిస్ధాన్ లో పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించి డిజైన్ వరకు పూర్తయిందని తెలుస్తోంది. 500 మిలియన్లకు మించి నిధులు ఇవ్వడం తమకూ సవాలేనని ఇరాన్ చెబుతోంది. ఇప్పుడు మొదలు పెట్టినా గడువులోపు పూర్తి చేయడం పెద్ద కష్టం కాదని అయితే నిధుల లభ్యతే ప్రధాన సమస్య అని ఇరాన్ ప్రతినిధులు చెప్పారని పత్రిక తెలిపింది.
మరో పది రోజుల్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటించనున్నారు. ఒబామాతో ఆయన జరిపే సమావేశంలో పీస్ పైప్ లైన్ అంశం చర్చకు రావచ్చని పత్రికలు ఊహిస్తున్నాయి.
బలూచిస్తాన్, సింధ్ రాష్ట్రాలలో సహజవాయు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొనడంతో పాకిస్ధాన్ వాటిపై దృష్టి సారించింది. ఇక్కడ పరిస్ధితులు అనుకూలంగా ఉన్నట్లయితే పాకిస్ధాన్ కు సహజ వాయువు కోసం దిగుమతులపై ఆధారపడే అవసరం తప్పుతుందని తెలుస్తోంది. కానీ బలూచిస్ధాన్ అనాదిగా తిరుగుబాట్లకు నిలయం అయినప్పటికీ ఇప్పటికీ రోజుకు 4 బిలియన్ ఘనపుటడుగుల సహజ వాయువును వెలికి తీస్తున్నారు. అయితే పాక్ కి రోజుకు 6 బిలియన్ ఘనపుటడుగుల సహజవాయువు అవసరం. వచ్చే 10, 15 సంవత్సరాల్లో ఇది రెట్టింపు అవుతుందని అంచనా. కాబట్టి పాకిస్ధాన్ కి సహజవాయువు దిగుమతులు తప్పనిసరి.
పీస్ పైప్ లైన్ బదులు TAPI పైప్ లైన్ కు ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా పాక్ పై ఒత్తిడి తెస్తోంది. TAPI అంటే తుర్క్ మెనిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్-పాకిస్ధాన్-ఇండియా పై లైన్ అని అర్ధం. ఇందులో ఇండియా కూడా భాగస్వామి. ఇది అమెరికా కంపెనీల ప్రయోజనాలను ప్రమోట్ చేసే పైప్ లైన్. పైగా ఇరాన్ సహజవాయువు కంటే ఖరీదు అని కూడా తెలుస్తోంది. పీస్ పైప్ లైన్ లో తిరిగి చేరుతామని ఇండియా 2011లో ప్రకటించినా ఇంకా ఆ వైపుగా అడుగులు ఏమీ లేవు.
IPI (ఇరాన్-పాకిస్ధాన్-ఇండియా) -ఇదే పీస్ పైప్ లైన్- ప్రతిపాదనలోకి చైనాను కూడా లాక్కురావడానికి పాక్ మొదట ప్రతిపాదించింది. ఇండియా, చైనాలు కూడా ఈ పైప్ లైన్ లో చేరితే పాకిస్ధాన్ కు మరింత లాభం. తమ భూభాగం మీదుగా గ్యాస్ తరలించినందుకు ఆ దేశం అద్దె వసూలు చేయవచ్చు. దానితో పాటు పాక్ ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే చైనా ఇంతవరకు ఆసక్తి చూపలేదు. ‘పాక్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం’ అని చెప్పి ఊరుకుంది. అమెరికాకు అంత త్వరగా కోపం తెప్పించడం చైనాకు ఇష్టం లేదు మరి!
ప్రపంచ సైంధవుడు అమెరికా సామ్రాజ్యవాదం ఉనికిలో ఉన్నంతవరకు పాక్, ఇండియా, ఇరాన్ లాంటి మూడో ప్రపంచ దేశాల అవసరాలపై ఆంక్షల కత్తి వేలాడుతూనే ఉంటుంది.