అమెరికా రుణం: తగిన చర్యలు తీసుకోవాలి -జి20


ఇన్నాళ్లూ ప్రపంచ దేశాలకు ఆర్ధిక వ్యవస్ధలను సవరించుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా ఇప్పుడు సరిగ్గా దానికి విరుద్ధ పరిస్ధితిని ఎదుర్కొంటోంది. వాషింగ్టన్ లో సమావేశమైన జి20 దేశాల ప్రతినిధులు ఋణ పరిమితి పెంపుదలపై తగిన చర్యలు తీసుకోక తప్పదని దాదాపు హుకుం జారీ చేసినంత పని చేశాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సవాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్ధితిలో తన స్వల్పకాలిక కోశాగార అవసరాలు తీర్చుకోడానికి వెంటనే  తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే గడ్డు పరిస్ధితి రానున్నదని జి20 విడుదల చేసిన కమ్యూనిక్ స్పష్టం చేసింది.

“స్వల్ప కాలిక కోశాగార అస్ధిరతలను సవరించడానికి అమెరికా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని జి20 కమ్యూనిక్ పేర్కొంది. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల బోర్డ్ ఆవ్ గవర్నర్స్ వార్షిక సమావేశం వాషింగ్టన్ లో జరగనున్న నేపధ్యంలో జి20 దేశాల ప్రతినిధులు వివిధ అంశాలను చర్చించడానికి సమావేశం అయ్యారు.

పెరుగుతున్న వర్ధమాన దేశాల ఆర్ధిక శక్తికి దీటుగా ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులలో ఓటింగు హక్కులు ఇవ్వాలని చైనా, రష్యా, ఇండియా లాంటి దేశాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ ని అమెరికా, ఐరోపాలు పట్టించుకోక పోవడంతో బ్రిక్స్ కూటమి (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) ఈ యేడు ‘బ్రిక్స్ బ్యాంక్’ కు రూపకల్పన చేశాయి. దానితో ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ సంస్కరణలు మరోసారి రంగం మీదికి వచ్చాయి.

ఈ నేపధ్యంలో ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల వార్షిక సమావేశం జరుగుతున్న సమయంలోనే అమెరికా ఋణ పరిమితి పెంపుదలపై అమెరికా రాజకీయ పార్టీలు చేస్తున్న చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడింది. దానితో అమెరికా దీన ఆర్ధిక పరిస్ధితి అనివార్యంగా ప్రపంచ వేదికల చర్చల్లోకి వచ్చింది.

తాము అమెరికా ఋణ పరిమితికి సంబంధించి ప్రకటన చేయాల్సి ఉంటుందని జి20 కి ఈ సంవత్సరం అధ్యక్షరికం వహిస్తున్న రష్యా కొన్ని రోజులుగా చెబుతూ వచ్చింది. దానికి తగినట్లుగానే కమ్యూనిక్ లో అమెరికాకు హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ గమనం అమెరికా ఆర్ధిక పరిస్ధితిపై ఆధారపడి ఉన్న పరిస్ధితి కొనసాగుతున్నందున విషయాన్ని తేలికగా తీసుకోరాదని జి20 ప్రతినిధులు ప్రకటించారు.

జి20 ఆర్ధిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి ఇండియా నుండి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కూడా హాజరయ్యారు. అమెరికా, ఐరోపా దేశాలతో సహా అనేక దేశాల్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నదని జి20 సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా మాంద్యం కొనసాగుతోందని ప్రకటించారు. శక్తివంతమైన, స్ధిరమైన వృద్ధి సాధిస్తే సాధారణ ద్రవ్య విధాన పద్ధతులకు తిరిగి చేరుకోవడం సాధ్యపడుతుందని చెబుతూనే పెట్టుబడుల ప్రవాహంలో అస్ధీరత ఒక ముఖ్యమైన సవాలుగా నిలిచిందని కమ్యూనిక్ పేర్కొంది.

అమెరికాలో పాలక, ప్రతిపక్షాల మధ్య ఒప్పందం ఏదీ కుదరకపోవడంతో ఫెడరల్ ప్రభుత్వం ఇప్పటికే మూతపడిపోయింది. అనేక శాఖల్లో ఉద్యోగులు వీధుల్లో లేరు. చివరికి ఎన్.ఎస్.ఏ గూఢచారుల్లో అనేకమందిని ఇంటికి పంపాల్సివచ్చిందని ఆ సంస్ధ అధిపతి సైతం వాపోయారు. ఇటువంటి విపత్కర పరిస్ధితిలోనూ రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీల మధ్య చర్చల్లో మెరుగుదల కనిపించలేదు. ఆరు వారాల వరకు ప్రభుత్వ అవసరాలు తీరేలా ఋణ పరిమితి పెంచడానికి ప్రతిపక్ష రిపబ్లికన్లు సిద్ధపడినప్పటికీ అధ్యక్షుడు అందుకు ఒప్పుకోలేదు. ఫెడరల్ ప్రభుత్వాన్ని వెంటనే బేషరతుగా తెరవాలనీ, ఆరు వారాల కాలం చాలా తక్కువ కాలం అని ఒబామా అభ్యంతరం తెలిపాడు.

ఇరు పార్టీల మధ్య పీట ముడి పడడానికి ప్రధాన కారణం ఒబామా ప్రవేశ పెట్టిన ఆరోగ్య భీమా చట్టం. ఒబామా కేర్ గా పిలుస్తున్న ఈ చట్టాన్ని అక్కడి సుప్రీం కోర్టు కూడా ఆమోదముద్ర వేసింది. అయినా దానికి నిధులు ఇవ్వకుండా సంవత్సరం వాయిదా వేయాలని రిపబ్లికన్ పార్టీ కోరుతోంది. బడ్జెట్ లోటు పెరగకుండా ఉండాలంటే పేద ప్రజలకు ఆరోగ్య భీమా కేటాయింపులు ఉండరాదని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. సంపన్న వర్గాలకు ఇస్తున్న పన్ను రాయితీలు కాస్తయినా తగ్గిస్తే బడ్జెట్ లోటు పెరగకుండానే ఆరోగ్య భీమా చట్టం అమలు చేయవచ్చని ఒబామా చెబుతున్నారు. ఇరు పక్షాలు రాజీ పడడం లేదు. దానితో పీటముడి పడిపోయింది.

అమెరికా పత్రికలేమో ‘అదిగో ఒప్పందం కుదిరింది, ఇదిగో సంక్షోభం ముగిసినట్లే’ అని రాస్తున్నాయి. చర్చల్లో పాల్గొన్నవారు ‘సానుకూలంగా చర్చలు జరిగాయి’ అని మాత్రమే చెబుతున్నారు. మళ్ళీ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s