కరెంటు ఖాతా లోటు, రెవిన్యూ లోటు అంటే?


ప్రశ్న (చందు అరవింద్): … … మీ బ్లాగ్ ని నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. మీ విశ్లేషణలు చాలా అర్ధవంతంగా ఉంటాయి. మీరు ఇటీవల రేపో రేటు, సి.ఆర్.ఆర్ ని తెలుగులో సాధారణ వ్యక్తికి కూడా అర్ధం అయ్యే విధంగా వివరించారు. అలాగే CURRENT ACCOUNT DEFICIT, REVENUE DEFICIT, LIQUIDITY ADJUSTMENT FACILITY ల గురించి కూడా వివరించగలరని నా మనవి. నేను… …

సమాధానం: అరవింద్ గారు మీ ప్రశ్నలో అవసరం లేని భాగాన్ని తొలగించాను.

కరెంటు ఖాతా లోటు: కరెంటు ఖాతా అనేది ప్రభుత్వాలతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు, సంస్ధలు కూడా నిర్వహిస్తాయి. ప్రస్తుతం (current) జరుగుతున్న కాలంలో నిర్వహించే లావాదేవీల ఖాతా కనుక దీనిని కరెంటు ఖాతా అంటారు.

దేశాలకు సంబంధించినంతవరకు కరెంటు ఖాతా అనేది ఇది మూడు అంశాల మొత్తం. వాణిజ్య లోటు లేదా మిగులు + విదేశీ పెట్టుబడులపై ఆదాయ వ్యయాల మొత్తం + సహాయం, వితరణ తదితర రూపాల్లో అందే డబ్బు (కేష్ ట్రాన్స్ ఫర్స్)

ఈ మూడు భాగాలను ప్రత్యేకంగా చూడాలి.

వాణిజ్య లోటు లేదా మిగులు: ఇది సరుకులు + సేవల ఎగుమతులు, దిగుమతుల మధ్య ఉండే తేడా. ఎగుమతులు ఎక్కువగా ఉంటే వాణిజ్య మిగులు ఉన్నట్లు. దిగుమతులు ఎక్కువగా ఉంటే వాణిజ్య లోటు ఉందని అర్ధం. ఇండియాకి వాణిజ్య మిగులు ఉన్న సంవత్సరం బహుశా లేదనుకుంటాను. నెలవారిగా చూస్తే అరుదుగా వాణిజ్య మిగులు కనిపిస్తుంది గానీ మరో నెల దాటితే అది హరించుకుపోతుంది. ప్రస్తుతం చైనా, జపాన్, జర్మనీలు తరచుగా వాణిజ్య మిగులు ప్రకటించే దేశాలు. విదేశాలతో జరిపే లావాదేవీలు గనుక విదేశీ మారకద్రవ్యంలోనే మిగులు, లోటు ఉంటాయి.

విదేశీ పెట్టుబడుల ఆదాయ, వ్యయాల మొత్తం: ప్రతి దేశం విదేశాల్లో పెట్టుబడులు పెడుతుంది. వాటి నుండి లాభాలు ఆర్జిస్తుంది. అలాగే దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ మదుపుదారులకు చెల్లింపులు చేస్తుంది. ఈ రెండింటి తేడాను కూడా కరెంటు ఖాతాలో భాగంగా చూస్తారు.

కేష్ ట్రాన్స్ ఫర్స్: ఇందులో మారకం అనేది ఉండదు. సహాయం, డొనేషన్ల రూపంలో దేశంలోకి వస్తే దానిని కరెంటు ఖాతాలో కలుపుతారు. అప్పుడప్పుడూ పశ్చిమ దేశాలు ప్రకటించే ఎయిడ్, ఆసిస్టెన్స్ లాంటివి కేష్ ట్రాన్స్ ఫర్స్ గా పరిగణిస్తారు.

ఈ మూడు కలిపి కరెంటు ఖాతాలో మిగులు లేదా లోటుగా కనిపిస్తాయి. కరెంటు ఖాతాలో లోటు ఉందంటే దాని అర్ధం ఒక దేశం తాను ఉత్పత్తి చేసేదాని కన్నా ఎక్కువ వినియోగిస్తున్నదని అర్ధం. అదే కరెంటు ఖాతాలో మిగులు ఉన్నట్లయితే ఆ దేశం తన వినియోగం కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నదనీ, అలా ఎక్కువ ఉత్పత్తి చేసేదాన్ని విదేశీ వాణిజ్యం ద్వారా సొమ్ము చేసుకోగలుగుతున్నదనీ అర్ధం. అంటే ఒక దేశ కరెంటు ఖాతా అనేది ఆ దేశ ఆర్ధిక శక్తికీ, కరెన్సీ సామర్ధ్యానికీ నిదర్శనంగా ఉంటుంది.

స్ధూలంగా చూస్తే కరెంటు ఖాతా లోటు దానికదే ప్రతికూల సూచకం కాకపోవచ్చు. స్వల్పకాలికంగా లోటు చూపిస్తూ దానిని ఉత్పాదక కార్యకలాపాలకు ఖర్చు చేస్తే దీర్ఘకాలికంగా ఆదాయం పెంపుకూ, ఆర్ధిక శక్తి మెరుగుదలకూ వినియోగించుకోవచ్చు. కానీ దానికి దేశ ప్రయోజనాల పట్ల నిబద్ధత, జాతీయ భావోద్వేగాల పట్ల గౌరవం, వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ఎక్కువ అన్న దృఢ నిశ్చయం ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నవారికి ఈ లక్షణాలు లేనట్లయితే దేశ ఆర్ధిక ప్రయోజనాలు స్వార్ఢ ప్రయోజనాలకు తాకట్టు పెట్టబడతాయి. కరెంటు ఖాతా లోటు దేశం అవసరాల కోసం కాకుండా కొద్దిమంది స్వార్ధపరుల ప్రయోజనాల కోసం పెరుగుతూ పోతుంది.

రెవిన్యూ లోటు: ఇది అవడానికి లోటే అయినా వాస్తవంలో మిగులు కావచ్చు. అంచనా వేసిన నికర రెవిన్యూ ఆదాయం కంటే, వాస్తవ నికర రెవిన్యూ ఆదాయం తక్కువగా ఉంటే అది రెవిన్యూ లోటు.

ఉదాహరణకి, ఒక ఆర్ధిక సంవత్సరానికి 5 లక్షలు రెవిన్యూ ఆదాయం, 4 లక్షలు ఖర్చులు అంచనా వేశారనుకుందాం. అంటే నికర రెవిన్యూ 1 లక్ష గా అంచనా వేశారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి రెవిన్యూ ఆదాయం 4.5 లక్షలు గానూ ఖర్చులు 3.75 లక్షలుగాను లెక్క తేలితే అప్పుడు వాస్తవ నికర రెవిన్యూ 0.75 లక్షలు మాత్రమే. అంటే అంచనా కంటే 0.25 లక్షలు తక్కువ. దీనిని రెవిన్యూ లోటు అంటారు.

లిక్విడిటీ అడ్జస్టుమెంట్ ఫెసిలిటీ (ఎల్.ఎ.ఎఫ్): ఇది ఆర్.బి.ఐ లేదా ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు మానిటరీ పాలసీ -ద్రవ్య విధానం/ద్రవ్య పరపతి విధానం- లో వినియోగించే ఉపకరణం. ఇది దానికదే ప్రత్యేక ఉపకరణం కాదు. రెపో రేటు, రివర్స్ రెపో రేటు ల రెండింటి నిర్వహణను కలిపి లిక్విడిటీ అడ్జస్టుమెంట్ ఫెసిలిటీ అంటారు. బ్యాంకుల యొక్క తద్వారా ఆర్ధిక వ్యవస్ధ లోని ద్రవ్య చలామణిని నియంత్రించడానికి వీటిని ఆర్.బి.ఐ వినియోగిస్తుందని చెప్పుకున్నాం.

రెపో అంటే రీ పర్చేజ్ అని అర్ధం. రోజువారీ ద్రవ్య అవసరాలలో తేడా వస్తే బ్యాంకులు ఆర్.బి.ఐ ని ఆశ్రయిస్తాయి. వాటి అవసరాన్ని ఆర్.బి.ఐ ఎలా తీరుస్తుంది? బ్యాంకులు తమ వద్ద ఉన్న సెక్యూరిటీలను (ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్స్ మొ.వి) ఆర్.బి.ఐ కి తాత్కాలికంగా అమ్మకానికి పెట్టి నిర్దిష్ట కాలం తర్వాత తిరిగి కొనుక్కునే విధంగా కాంట్రాక్టు కుదుర్చుకుంటాయి. దీనిని రీ పర్చేజింగ్ కాంట్రాక్ట్ అంటారు. ఇలాంటి కాంట్రాక్టు కింద బ్యాంకులకు కల్పించిన లిక్విడిటీ పైన కొంత వడ్డీ వసూలు చేస్తుంది ఆర్.బి.ఐ. దీనినే రెపో రేటు అంటారు. రెపో ఆపరేషన్ అనేది వ్యవస్ధలోకి లిక్విడిటీని ఇంజెక్ట్ చేస్తుంది.

అలాగే వ్యవస్ధలో ఎక్కువ డబ్బు చలామణీలో ఉంది అనుకుంటే దానిని తనలోకి లాక్కునే చర్యలు ఆర్.బి.ఐ తీసుకుంటుంది. తన సెక్యూరిటీలను బ్యాంకుల వద్ద పెట్టి డబ్బును తానే అప్పు కిందికి తీసుకోవడం వాటిలో ఒకటి. దీనిని రివర్స్ రెపో ఆపరేషన్ అంటారు. దీని ద్వారా వ్యవస్ధలోని లిక్విడిటీని/ద్రవ్య చలామణిని ఆర్.బి.ఐ తగ్గిస్తుంది.

కాబట్టి రెపో, రివర్స్ రెపో ఆపరేషన్ల మొత్తమే ఎల్.ఎ.ఎఫ్.

4 thoughts on “కరెంటు ఖాతా లోటు, రెవిన్యూ లోటు అంటే?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s