లిబియాలో అమెరికాకు మరో ఎదురు దెబ్బ?


లిబియాలో సెక్యులర్ నేత గడ్డాఫీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసి ఆ దేశాన్ని ఆల్-ఖైదా టెర్రరిస్టులకు ఆవాసంగా మార్చినందుకు అమెరికా తగిన ప్రతిఫలం అనుభవిస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ 11 తేదీన తాము మద్దతు ఇచ్చి అధికారంలోకి తెచ్చిన ముస్లిం ఉగ్రవాద తిరుగుబాటు సంస్ధల చేతుల్లోనే తమ రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్ దారుణ హత్యకు గురి కావడాన్ని చూడవలసి వచ్చిన అమెరికా తాజాగా తమ నమ్మిన బంటు అయిన లిబియా ప్రధాన మంత్రి ఆలీ జీదన్ అరెస్టు కావడంతో చేష్టలుడిగి పోయింది. నాలుగు రోజుల క్రితం లిబియాపై కమెండో దాడి చేసిన అమెరికా ఆల్-ఖైదా నాయకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటనకు లిబియా ప్రధాని సహకరించినందుకే ఆయనను అరెస్టు చేశామని పాలక గ్రూపుల్లోని అల్-ఖైదా సంస్ధ ప్రకటించింది. అలీ అరెస్టుతో అమెరికా, బ్రిటన్ లు ఆగ్రహం ప్రకటించాయి.

అమెరికా కమెండోలు లిబియా లోనే కాక సోమాలియాలోనూ దాడులు నిర్వహించారు. సోమాలియాలో ఆల్-షబాబ్ నాయకుడి ఇంటిపై చేసిన దాడిని మిలిటెంట్లు తిప్పికొట్టడంతో అది సఫలం కాలేదు.

అలీ జిదాన్ కిడ్నాప్ కి గురయ్యాడని మొదట పశ్చిమ పత్రికలు ప్రకటించాయి. ఆయనను తామే అరెస్టు చేశామని ఆ తర్వాత ఆల్-ఖైదాకు చెందిన లిబియా గ్రూపు ప్రకటించింది. గడ్దాఫీపై ఆల్-ఖైదా తదితర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్ధలు చేసిన తిరుగుబాటుకు మద్దతు ఇచ్చి గడ్దాఫీ హత్యానంతరం వారిని అధికారంలో కూర్చుండబెట్టింది అమెరికా-బ్రిటన్-ఫ్రాన్స్ దుష్ట త్రయమే. ఈ దుష్టత్రయానికి ఇజ్రాయెల్ సహకారం ఇవ్వడం మామూలే. క్రిస్టఫర్ స్టీవెన్స్ హత్యకు ప్రతీకారంగా (ట్రిపోలిలో నివశిస్తున్న) ఆల్-ఖైదా నాయకుడు నజీ అబ్దుల్-హమీద్ రుకాయ్ అలియాస్ అబు అనాస్ ఎల్-లిబి ఇంటిపై అమెరికా కమెండోలు దాడి చేశారు. పాక్ లో దాగినట్లు చెప్పిన ఆల్-ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ ఇంటిపై దాడి చేసిన నేవీ సీల్ -6 కమెండోలే ఆల్-లిబి ఇంటిపై కూడా దాడి చేయడం గమనార్హం.

ఆల్-లిబి ని కిడ్నాప్ చేసిన అమెరికా కమెండోలు ఆయనను మధ్యధరా సముద్రంలోని తమ సైనిక నౌకలో బంధించారు. 1998లో కీన్యా, టాంజానియాలలోని అమెరికా ఎంబసీలపై జరిగిన టెర్రరిస్టు దాడులకు బాధ్యుడిగా ఆల్-లిబిని అరెస్టు చేశామని అమెరికా ప్రకటించింది. అయితే ఆల్-లిబి, లిబియా కిరాయి తిరుగుబాటులో గడ్డాఫీ ప్రభుత్వం కూలిపోయే ముందువరకూ బ్రిటన్ లోనే నివసించాడని పత్రికల ద్వారా తెలుస్తోంది. ఆయనను చక్కగా రాచమర్యాదలతో గౌరవించి నివాస వసతి కల్పించింది బ్రిటన్ ప్రభుత్వమే. గడ్దాఫీ కూల్చివేతలో సహకరించిన ఆల్-ఖైదా గ్రూపు నేత ఆల్-లిబి తమకు కంటిలో నలుసుగా మారాడో లేక అమెరికా ప్రజలకు తమ వీరత్వాన్ని చూపదలిచారో గాని వారికి హఠాత్తుగా 1998 నాటి టెర్రరిస్టు దాడి గుర్తుకు వచ్చింది.

ఆల్-లిబి కిడ్నాప్ కు ప్రతీకారంగా ఆల్-ఖైదా గ్రూపు అమెరికా, బ్రిటన్ ప్రయోజనాలకు ప్రతినిధి అయిన ఆల్ జిదాన్ ను అరెస్టు చేశాయి. “అబు అనాస్ ఆల్-లిబి పట్టివేతలో లిబియా ప్రభుత్వ సహకారం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించిన తర్వాతే మేము ఆయనను (ఆలీ జీదన్) అరెస్టు చేశాం” అని ఆల్-ఖైదా గ్రూపు ప్రతినిధి ప్రకటించారని రష్యా టుడే (ఆర్.టి) తెలిపింది. ఈ గ్రూపు తమను తాము ‘ఆపరేషన్ రూప్ ఆఫ్ లిబియా రివల్యూషనరీస్’ అని చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా కమెండో దాడికి సహకరించినవారందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని కూడా ఈ సంస్ధ ప్రకటించింది.

ఆల్-లిబి కిడ్నాప్ తర్వాత దానిని వ్యతిరేకిస్తున్నట్లు లిబియా ప్రధాని ఆల్ జీదన్ ప్రకటించాడు. ఆల్-లిబి కిడ్నాప్ లో తన పాత్ర/సహకారం ఉందంటూ అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించిన తర్వాత తాను ప్రభుత్వంలోని ఇస్లామిక్ భాగస్వాములతో ఘర్షణ తప్పదని భయాలు కూడా వ్యక్తపరిచాడు. ఆయన ఊహించినట్లే జరిగింది. అయితే ఆయన భయపడినట్లు ఘర్షణతో వారు సరిపెట్టుకోలేదు. ఏకంగా అరెస్టే చేసారు. బహుశా తమ నాయకుడిని వదిలితేనే జీదన్ కూడా విడుదల అవుతాడని ఆల్-ఖైదా గ్రూపు బేరం పెట్టవచ్చు.

ఆల్-లిబి కిడ్నాప్ అనంతరం ఇస్లామిక్ సంస్ధల నుండి ప్రతిఘటన ఎదురవుతుందన్న అంచనాతోనే అమెరికా ఇటలీ లోని తమ సైనిక స్ధావరంలో సైనికులను అప్రమత్తం చేసింది. మధ్యధరా సముద్రానికి అవతల ఇటలీ ఉంటే ఇవతల లిబియా ఉంటుంది. 200 మంది సైనికులను అవసరమైతే లిబియా తరలించడానికి వీలుగా సర్వసన్నద్ధం చేసినట్లు కూడా అమెరికా పత్రికలు తెలిపాయి. వారిని ఇప్పటికే మధ్యధరా సముద్రంలోని సైనిక నౌకకు తరలించినట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆల్-లిబి నిజానికి రహస్యంగా ఏమీ నివసించడం లేదు. ఆయన నివాసం ఎక్కడో, ఆయన ఎవరో అందరికీ తెలుసు. కానీ ఆయనను పట్టుకోడానికి తాము అనేక నెలలుగా పధకాలు రచించామని అమెరికా ఆడంబరంగా ప్రకటించింది.

సిరియా విషయంలో రష్యాతో రసాయన ఆయుధాల అప్పగింత/వినాశనం కు ఒప్పందం చేసుకున్న అమెరికా ఆ తర్వాత లిబియాపై దృష్టి పెట్టిందన్నమాట! ఆ దేశానికి ఎప్పుడూ ఘర్షణలు కావాలి. కెలుకుడు కావాలి. ప్రతి నిమిషం ఎక్కడో ఒక చోట వేలు పెట్టి కెలికితేగాని అమెరికాలోని మిలట్రీ-పారిశ్రామిక సమ్మేళనం (Military-Industrial Complex) కు లాభాల ప్రవాహం లీకవుతున్న మునిసిపల్ పంపు తరహాలో కారుతూ ఉండదు. కాకపోతే మునిసిపల్ పంపు కట్టేస్తే ఆగుతుంది. కట్టేయ్యాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ అమెరికన్ మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లాభ ప్రవాహానికి ఆ సౌకర్యం/అవసరం ఉండదు. ఉండకూడదు కూడా.

ఆలీ జిదాన్ అరెస్టు పట్ల అమెరికా, బ్రిటన్ లు ప్రకటించిన ఆగ్రహాన్ని ఈ నేపధ్యంలోనే అర్ధం చేసుకోవాలి. “(ఆలీ జీదన్ అరెస్టు అయ్యాడన్న) వార్తలను మేము పరిశీలిస్తున్నాం. అమెరికా, లిబియా అధికారులతో సంబంధంలో ఉన్నాం. మరిన్ని వివరాలు సంపాదించే పనిలో ఉన్నాం. ట్రిపోలిలోని మా ఎంబసీ సిబ్బంది వరకు క్షేమమే” అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్నిఫర్ సాకి ప్రకటించింది.

బ్రిటన్ అయితే తీవ్ర స్ధాయి ఖండన జారీ చేసింది. ఆ దేశ విదేశీ మంత్రి తీవ్ర స్వరంతో అలీ జీదన్ అరెస్టును ఖండించాడు. “లిబియా ప్రధాన మంత్రిని ట్రిపోలిలో పట్టుకుపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను. మధ్యంతర ప్రభుత్వం లోని ఇతర సభ్యులతో మా రాయబారి సంబంధలో ఉన్నాడు. లిబియాలో రాజకీయ పరివర్తన సవ్యంగా సాగడం ముఖ్యం” అని ఒక అమాయక ఫోజు పెట్టాడు. వాస్తవంలో లిబియాలో ప్రశాంతంగా సాగుతున్న ప్రజా జీవనంలో చిచ్చు పెట్టిందీ, ఆ దేశంలోని సర్వ ప్రజా, ప్రభుత్వ వ్యవస్ధలను, మౌలిక నిర్మాణాలను కార్పెట్ బాంబింగులతో నాశనం చేసిందీ తామే అన్న విషయాన్ని ఆయన మరుగుపరుస్తున్నాడు.

దుష్టత్రయం ప్రోద్బలంతో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్ధలు సాగించిన కిరాయి తిరుగుబాటు దరిమిలా గడ్డాఫీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత లిబియా అరాచకాలకు కాణాచిగా మారిపోయింది. అనేక గ్రూపుల కలగూర గంప ఆ దేశంలో తలా ఒక భాగాన్ని తమ తమ ఏలుబడిగా మార్చుకుని ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పశ్చిమ దేశాలు, పత్రికలు చెప్పే మధ్యంతర ప్రభుత్వం అక్కడ కేవలం నామమాత్రం. ఆ దేశానికి దేశభక్తియుత సైన్యం అంటూ ఇప్పుడు ఏమీ లేదు. ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపుల కిరాయి సైనికులే ఎవరి ఆధిపత్య ప్రాంతాన్ని వారు ఏలుకుంటున్నారు.

రాజధాని ట్రిపోలి లోని ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తున్నది ప్రధానంగా ఆల్-ఖైదా గ్రూపు సైనిక విభాగమే. ప్రధాన మంత్రి ఆలీ జీదన్ తనకు రక్షణ ఇవ్వడానికి వేరే సైనిక విభాగాన్ని ఏర్పరచుకున్నాడు. వారికి అనేక నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు నిరాయుధంగా ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేస్తున్నారు. ఈ లోపు అమెరికా ఆల్-లిబిని కిడ్నాప్ చెయ్యడం, దానికి ప్రతీకారంగా ఆలీ జీదన్ కిడ్నాప్ కావడం జరిగిపోయింది.

ఈ కిరాయి మూకల కర్కశ వికృత హేలలో లిబియా ప్రజా సామాన్యం నలిగిపోతోంది. దానితో ప్రజల్లో అంతకంతకూ అసంతృప్తి పెరిగిపోతోంది. ఆ అసంతృప్తి ప్రధానంగా అమెరికా పైనా, ఆ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ లపైనా కేంద్రీకృతం అవుతోంది. ఆల్-లిబి కిడ్నాప్ తో లిబియా ప్రభుత్వంపై ప్రజలు తిరగబడ వచ్చని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే ఆలీ జీదన్ అరెస్టు జరిగిందా లేక నిజంగానే అమెరికా ప్రయోజనాలతో ఆల్-ఖైదా గ్రూపు తలపడుతోందా అన్నది అనుమానాస్పదమే.

‘ఆల్-లిబి అరెస్టు దరిమిలా ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడంలో లిబియా ప్రభుత్వానికి ఉన్న శక్తియుక్తులేమిటో పరీక్షకు గురవుతాయి’ అని న్యూయార్క్ టైమ్స్ చేసిన వ్యాఖ్య ఆల్-ఖైదా, అమెరికా ల కుమ్మక్కును వెల్లడిస్తోంది. అమెరికా తనకు కావలసిన చర్యలను ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటుంది, దానికి లిబియా ప్రభుత్వం అన్నీ విధాలుగా సిద్ధంగా ఉండాలని న్యూయార్క్ టైమ్స్ పరోక్ష సందేశం ఇస్తోంది. గడ్డాఫీ అనంతరం ఇస్లామిస్టు మిలీషియాలు, అమెరికా గూఢచార సంస్ధల ఏజెంట్లతో కూడిన పచ్చి మతతత్వ దళారీ ప్రభుత్వాన్ని అధికారంలో నిలిపిన పశ్చిమ దేశాలు తమ దాసుల విధేయతను పరీక్షిస్తున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మరిన్ని పరిణామాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

అయితే ఆల్-లిబి కిడ్నాప్ గురించి రష్యా చేసిన ప్రకటన ప్రత్యేకంగా ప్రస్తావనార్హం. మంచి టెర్రరిస్టులు, చెడ్డ టెర్రరిస్టులు అనే తేడాలు ఎమీ ఉండవన్న విషయంలో అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం పెరుగుతోందని, కాని టెర్రరిస్టులను పట్టుకోడానికి అంతర్జాతీయ చట్టాల పరిధిలో ప్రయత్నించాలి తప్ప ఏ దేశమూ సొంత పద్ధతిలో వ్యవహరించడానికి వీలు లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ ప్రకటించారు.

“అంతర్జాతీయ సంబంధాలను హ్యాండిల్ చేయాల్సిన పద్ధతి ఇది కాదని మా నమ్మకం. నేరస్ధులతో పోరాడే పద్ధతి ఇది కాదు. చట్టబద్ధమైన కోర్టులో తన నేరాలను విచారించబడే అవకాశం ఇవ్వకుండానే, వారు నేరం చేసినట్లు నిరూపణ కాకుండానే ఇలా చేయడం సరైంది కాదు” అని లావరోవ్ తేల్చి చెప్పారు. “చట్టాలను ఉల్లంఘించడం ద్వారా మీరు చట్టాన్ని శక్తివంతం చేయలేరు” అని ఆయన భేషైన మాట చెప్పారు. దశాబ్దాల క్రితం ఆఫ్ఘనిస్ధాన్ లో స్వాతంత్ర పోరాట యోధులుగా మెచ్చిన ముజాహిదీన్ లే అనంతరం 9/11 టెర్రరిస్టుల దాడుల రూపంలో ఎదురు తిరిగిన సంగతి గుర్తెరగాలని లావరోవ్ గుర్తు చేశాడు. ‘మీరు పెంచి పోషించిన తీవ్రవాదమే మీకు ఎదురు తిరుగుతోంది’ అని లావరోవ్ అమెరికాకు చెప్పకనే చెప్పారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s