లక్షల దళిత నాయకుల్ని సృష్టించే మంత్రదండం! -కార్టూన్


Dalit leaders

రాహుల్: ఒకరో ఇద్దరో కాదు, దళితుల కోసం లక్షల నాయకులు ఉద్భవించాలి…

రాహుల్ నీడలోని కాంగ్రెస్ నేత: ఆ సూత్రం మనక్కూడా వర్తించడం ఎలాగో…

ఒకరూ, ఇద్దరూ కాదు; పదులూ, వందలూ కూడా కాదు; వేలు అసలే కాదు; ఏకంగా లక్షలాది దళిత నాయకుల్ని తయారు చేసే మంత్రదండం ఉన్న సంగతి ఎవరికైనా తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఆ మంత్రదండం మన యువ రాజా రాహుల్ గాంధీ వద్ద భద్రంగా ఉంది. ఆయన దాన్ని త్వరలో బైటికి తీయనున్నారు. దానితో మాయావతి లాంటి దళిత నాయకులు ఇట్టే ఆహుతై పోతారు.

ఈ సంగతి రాహుల్ గాంధీయే స్వయంగా చెప్పారు. జాతీయ ఎస్.సి కమిషన్ మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ దేశంలో దళిత నాయకత్వం లేకపోవడం గురించి ఆందోళన చెందారు. ఒకరూ ఇద్దరూ ఉంటే సరిపోదని దళితుల్లోనుంచి లక్షల మంది నాయకులు పుట్టుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు. మాయావతి లాంటి నాయకులు దళితుల్లో నాయకులు తలెత్తకుండా అడ్డుకుంటున్నారని కూడా ఆయన ఉన్న దళిత నాయకులపై దాడి ఎక్కుపెట్టారు.

అసలు విషయం ఏమిటంటే ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న అత్యంత దీన పరిస్ధితికి కారణం ఆ పార్టీకి సంప్రదాయ ఓటర్లయిన ఎస్.సి లను బహుజన్ సమాజ్ పార్టీ కొల్లగొట్టడమే. బి.సి, ముస్లిం ఓట్లను ములాయం సింగ్ యాదవ్ కొల్లగొడితే దళిత ఓట్లను మాయావతి/కాన్షీరామ్/బి.ఎస్.పి తన్నుకుపోయారు. ఇక అగ్ర కులాల కోసం బి.జె.పి ఎలాగూ ఉంది. దానితో యు.పి లో కాంగ్రెస్ పునాది గల్లంతై కూటమి ప్రభుత్వాలపై ఆధారపడక తప్పలేదు.

రాహుల్ దృష్టిలో భారత దేశంలో దళిత అభివృద్ధి రెండు దశల్లో జరిగిందట. మొదటి దశ బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ రచన జరగడం, ఆయన చేతుల మీదుగా రిజర్వేషన్ల రూపకల్పన జరగడం అట. ఇక రెండో దశ కాన్శీరామ్ నేతృత్వంలో రాజకీయ అధికారం చేపట్టం అట. ఈ రెండో దశలో మాయావతి కూడా పాలు పంచుకున్నప్పటికీ ఆమె మరో దళిత నేతను ఎదగనివ్వకుండా తొక్కి పెట్టిందట.

సరే బాగానే ఉంది. బి.ఎస్.పి లో మరో దళిత నేత ఎదిగి రాలేదే అనుకుందాం. దానికి కారణం మాయావతే అనుకుందాం. మరి కాంగ్రెస్ కి ఏ రోగం వచ్చిందట? ఆ పార్టీకి దళిత నేతలే కరువయ్యారా? ఇప్పుడయినా సోనియా గాంధీ తర్వాత కాంగ్రెస్ పగ్గాలను దళిత నేతకు అప్పగించొచ్చు కదా? రాహుల్ గాంధీయే ఎందుకు కావలసి వచ్చింది?

రాహుల్ గాంధీ ఇచ్చిన వివరాల ప్రకారమే దేశంలో మొత్తం 700 మంది ఎస్.సి ఎమ్మేల్యేలు ఉంటే వారిలో కాంగ్రెస్ ఖాతాలో ఉన్నది కేవలం 120 మంది మాత్రమే. రిజర్వేషన్ నియోజకవర్గాలు ఏర్పాటు చేయబట్టి 700 మందైనా ఉన్నారు గానీ అవే లేకపోతే కలికానికి ఒక్కరైనా కనపడేవారా? వయోజన ఓటు హక్కు ద్వారా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండబట్టి షెడ్యూల్డ్ కులాల ఓట్లు కూడా అవసరం కాబట్టి, వారి కోసం తాము తెగ కృషి చేసేస్తున్నామని చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ నాయకులైనా బలవంతంగా, అవసరం రీత్యా పుట్టుకొచ్చారు గానీ, లేకపోతే వారసలు ఉండేవారా?

కాంగ్రెస్ పార్టీలో ఒక ఎస్.డి డిపార్ట్ మెంటు ని ఏర్పాటు చేసి దానికి మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి కె.రాజు గార్ని అధిపతిగా చేశారు రాహుల్ గాంధీ ఈ మధ్య. దళిత నాయకులని తయారు చేయడానికి ఆయన ఒక బ్లూ ప్రింట్ తయారు చేశార్ట. దాని ప్రకారం దళిత నాయకుల్ని గుర్తించి వారికి కాంగ్రెస్ నాయకత్వంలోని అన్నీ స్ధాయిల్లో తగిన ప్రాతినిధ్యం ఇస్తారట. దళిత చట్టాల తయారీకి వారికే అవకాశం ఇస్తారట. ప్రతి గ్రామంలోనూ దళిత సమస్యలు లేవనెత్తే అవకాశం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారట. ఈ దెబ్బతో కాంగ్రెస్ దళిత దరిద్రం కాస్తా వదిలిపోయి ఇక ఓట్లే ఓట్లు!

దళిత నాయకులు ఎదగాలంటే ప్రత్యేకంగా ఎస్.సి డిపార్ట్ మెంటు సృష్టించారు సరే. కానీ ఆ విధంగా దళిత నాయకులు దళితులకే నాయకత్వం వహిస్తారు తప్ప ఇతరులకి కాదు కదా? ఇక అది దళితులనేం ఉద్ధరిస్తుంది? వాళ్ళ ఓట్ల ద్వారా కాంగ్రెస్ ని ఉద్ధరించడం తప్ప! అదీ రాహుల్ మంత్రదండం పని చేస్తేనే లెండి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s