సి.ఎం పై మాజీ డి.జి.పి దినేష్ రెడ్డి సంచలన ఆరోపణలు


dinesh reddy

తన పదవీ కాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేసి విఫలమయిన మాజీ డి.జి.పి దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన సంచలన రీతిలో ఆరోపణలు చేశారు. పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అక్కసుతోనే అబద్ధపు ఆరోపణలకు దిగారని మంత్రులు దినేష్ ఆరోపణలను తిప్పి కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ వారి సమాధానాల్లో పెద్దగా విషయం లేదు. దానితో కిరణ్ కుమార్ రెడ్డి పనితీరుపై పలు అనుమానాలు ముసురుకున్నాయి. ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి దినేష్ కృషి చేశారని తెలంగాణ వాదులు ఆరోపించగా ఆశ్చర్యకరంగా సి.ఎం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చేసిన ప్రయత్నాలను తాను ప్రతిఘటించానని చెప్పడం ఒక సంచలనం!

సుప్రీం కోర్టు, రాష్ట్రాల డి.జి.పి ల పదవీకాలం కనీసం 2 సంవత్సరాలు ఉండేలా చూడాలని ఇటీవల తీర్పు చెప్పింది. ఈ నియమం ప్రకారం తన పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించాలని దినేష్ రెడ్డి కోరుతూ వచ్చారు. దినేష్ రెడ్డి చానెళ్లతో చెప్పినదాని ప్రకారం సి.ఎం అలాగే అని చెబుతూ వచ్చారు. కానీ పొడిగింపు జి.ఓ ఇవ్వడానికి బదులు చివరి నిమిషంలో హఠాత్తుగా పదవీ విరమణ జి.ఓ ఇచ్చారని ఆ సంగతి ముందే చెబితే తాను గౌరవప్రదంగా పదవి నుండి తప్పుకునేవాడినని చెప్పారు. సి.ఎం తనను అవమానించారని, వెన్నుపోటు పొడిచారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. 

దినేష్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ముఖ్యమైనది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం – నక్సలిజంకు సంబంధించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే నక్సలిజం బలపడుతుందని నివేదిక ఇవ్వాల్సిందిగా సి.ఎం తనపై ఒత్తిడి తెచ్చారని మాజీ డి.జి.పి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందా లేదా అని కేంద్ర ప్రభుత్వం (హోమ్ శాఖ) తనను నివేదిక కోరిందని ఆ నివేదికలు తాను ‘అవన్నీ ఊహాగానాలే’ అని స్పష్టం చేశానని దినేష్ రెడ్డి తెలిపారు. దీనిని మార్చి రాయలవలసిందిగా కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. సి.డబ్ల్యు.సి తీర్మానానికి ముందే ‘తెలంగాణ ఇస్తే రెండు ప్రాంతాల్లో మావోయిస్టులు బలం పుంజుకుంటారని ప్రకటన ఇవ్వాల్సిందిగా తనపై సి.ఎం ఒత్తిడి తెచ్చారని కాని తాను లొంగలేదని తెలిపారాయన.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా ఎ.పి.ఎన్.జి.ఒ లకు సహకరించాల్సిందిగా కూడా సి.ఎం తనపై ఒత్తిడి తెచ్చారని దినేష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుకు సి.డబ్ల్యు.సి నిర్ణయం తీసుకున్నాక ఎ.పి.ఎన్.జి.ఒ లు ఎల్.బి స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకూడదని తాను నిర్ణయించానని కానీ సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి తనపై ఒత్తిడి తెచ్చి అనుమతి ఇచ్చేలా చేశారని తెలిపారు. రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతంలో అసంతృప్తి చెలరేగడంతో తాను మరిన్ని కేంద్ర బలగాలు పంపాల్సిందిగా కేంద్రాన్ని కోరాననీ, దానిని కూడా సి.ఎం తప్పు పట్టారని దినేష్ సంచలన రీతిలో ఆరోపించారు.

దినేష్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాధానాల్లో ఒక్కటీ సవ్యంగా లేదు. అన్నింటికీ డి.జి.పి పదవికి పెద్దగా అధికారం లేదన్నట్లుగా, అధికారాలన్నీ మంత్రులవే అన్నట్లుగా, డి.జి.పి పదవి నామమాత్రం అన్నట్లుగా ఆయన సమాధానాలు ఇచ్చారు. పరోక్షంగా దినేష్ రెడ్డి ఆరోపణలను పరోక్షంగా అంగీకరిస్తున్నట్లుగా ఆనం సమాధానాలు ఉండడం గమనార్హం.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు – నక్సలిజం అంశానికి సంబంధించిన ఆరోపణకు బదులిస్తూ ఆనం “అసలు కేంద్ర హోమ్ శాఖ మంత్రి డి.జి.పి ని ఎందుకు నివేదిక కోరుతుంది? కేంద్ర హోమ్ శాఖ వద్ద లేని సమాచారం డి.జి.పి వద్ద ఉంటుందా?” అంటూ ఆయన విచిత్రంగా అడిగారు. రాష్ట్రాల్లో ఏమన్నా సంఘటనలు జరిగితే ఆ రాష్ట్రాల అధికారుల నుండి కేంద్రం సమాచారం తెప్పించుకోవడం అందరికీ తెలిసిన విషయమే. సమాచారం సమయానికి అందకపోతే ‘రాష్ట్రం నుండి ఇంకా సమాచారం లేదని’ చెప్పడం కేంద్ర మంత్రులకు రివాజు. రాష్ట్ర మంత్రులు ఆయా విభాగాల అధిపతుల నుండి సదరు సమాచారం తెప్పించుకోవడం కూడా తెలిసిందే.

జిల్లాల్లో జరిగే సంఘటనల సమాచారాన్ని కలెక్టర్, ఎస్.పి ల దగ్గర్నుండి, కలెక్టర్, ఎస్.పి లేమో తమ కింది అధికారుల నుండి సమాచారం తెప్పించుకోవడం సాధారణం. మంత్రి ఆనం చెప్పిన అంశాలు ఇందుకు సరిగ్గా విరుద్ధంగా ఎందుకు ఉన్నాయి? సి.ఎం ను వెనకేసుకు వచ్చే తొందరలో వాస్తవాలను విస్మరించారా? గ్రౌండ్ లో ఉన్న సమాచారం ఎప్పుడూ కింది అధికారులు, ఉద్యోగులూ సేకరించాలే తప్ప ఏకా ఎకీన కేంద్రం సేకరిస్తుందా? ఈ విషయాన్ని అక్కడ ఉన్న విలేఖరులు కూడా ప్రశ్నించలేదా? అంతా విచిత్రంగా ఉంది.

దినేష్ రెడ్డి చేసిన మరో ఆరోపణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు సంతోష్ రెడ్డి భూ కబ్జాలను తాను సమర్ధించలేదనీ, అందుకే తన పదవీ కాలాన్ని పొడిగించకుండా సి.ఎం జాగ్రత్త తీసుకున్నారని తెలిపారు. చివరి నిమిషం వరకూ ఏమీ చెప్పకుండా సి.ఎం నాన్చారని ఆరోపించారు. ఇది తీవ్రమైన ఆరోపణ. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి లెక్చర్లు దంచుతూ మరో పక్క సొంత తమ్ముడి అవినీతిని, రౌడీయిజాన్ని సి.ఎం సమర్ధించడం, దానికి సహకరించాలని డి.జి.పి ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కోరడం నిజమే అయితే చాలా తీవ్రంగా తీసుకోవలసిన విషయం. “ఆయన తమ్ముడు సంతోష్ కుమార్ రెడ్డి అనేక సందర్భాల్లో భూ తగాదాల్లో తనకు అనుకూలంగా సెటిల్ చేయాలని కోరారు. నేను తిరస్కరించాను. తాను చెప్పిన అధికారులకు నిర్దిష్ట పోస్టింగులు ఇవ్వాలని నన్ను పదే పదే ఆయన (సి.ఎం) కోరేవారు. నేను అంగీకరించేవాడిని కాదు. మరోవైపు నేను పోస్టింగులు ఇచ్చినపుడు ఆ ఫైళ్లపై నెలల తరబడి తిష్టవేసుకుని కూర్చునేవారు” అని దినేష్ ఆరోపించారని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. 

సమైక్యాంధ్ర ఉద్యమ రంధిలో ఈ ఆరోపణలు కొట్టుకుపోవచ్చేమో గానీ ఆ తర్వాతయినా ఇతర పార్టీలు, సంఘాలు దీనిని తీవ్రంగా పరిగణించి తదనుగుణమైన చర్యలకు దిగాలి. మంత్రి ఆనం ఈ ఆరోపణకు చెప్పిన సమాధానం “ఈ సంగతి పదవిలో ఉన్నపుడు ఎందుకు అడ్డుకోలేదు. అప్పుడే వెల్లడి చేయవచ్చు కదా?” అని. అంటే ఆరోపణలను ఆయన ఖండించలేదు. అప్పుడే ఎందుకు ఎదుర్కోలేదు అని ప్రశ్నిస్తున్నారు అంతే. సరే, ఇప్పుడైనా చెప్పారు గదా, విచారణకు ఆదేశాలు ఇవ్వగలరా?

దినేష్ రెడ్డి మరో ఆరోపణ: జిల్లా అధికారులను (ఎస్.పి, డి.ఎస్.పి తదితరులు) పదే పదే బదిలీ చేయమని సి.ఎం ఒత్తిడి తేగా తాను అందుకు సహకరించలేదు అని. దీనికి ఆనం ఇచ్చిన సమాధానం షరా మామూలే. “అసలు ఎస్.పి, డి.ఎస్.పి లను మార్చడం మా పని కదా! మీతో ఏం పని?” అని ఆయన ప్రశ్నించారు. ఈ లెక్కన డి.జి.పి గారి పనులేమిటసలు? రాష్ట్ర నక్సల్ సమస్య గురించి ఢిల్లీ స్ధాయిలో సమావేశాలు జరిగితే దానికి డి.జి.పి వెళ్తారు. కానీ నక్సల్ సమస్య పెరుగుతుందా లేదా అన్న దానిపై నివేదిక మాత్రం డి.జి.పి ఇవ్వరట! డి.జి.పి లు ఇవ్వకకుందే కేంద్రం వద్ద ఆ సమాచారం ఉంటుందట. సిబ్బంది బదిలీలు, ప్రమోషన్ల విషయంలో కూడా పూర్తి అధికారం మంత్రులదే ఆట. డి.జి.పి కి అధికారం ఏమీ ఉండదట. ‘మేం చెప్పింది చేయడమే మీ పని’ అని చెప్పినట్లుగానే ఆనం మాటలు ఉండడం మహా విడ్డూరం.

తన సమాధానాల ద్వారా ఆనం రామనారాయణ రెడ్డి, దినేష్ రెడ్డి ఆరోపణలను మరింత బలం చేకూర్చారు. రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన వ్యక్తి పనిగట్టుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, వారిపై పాశవిక నిర్బంధానికి తెగించడం, అదే సమయంలో ఎ.పి.ఎన్.జి.ఒ లకు పూర్తిగా సహకరించడం తీవ్ర గర్హనీయం. దీనిపై చెలరేగే రగడ ఏ వైపుకు దారి తీస్తుందో, అసలు రగడ రేగుతుందో లేక గప్ చుప్ గా అణగదొక్కడంలో ఛానెళ్లు, పత్రికలు సహకరిస్తాయో వేచి చూడాల్సిందే. కొన్ని ఛానెళ్లు ఇదేదో ప్రాధాన్యం లేని విషయంగా వెనక్కి నెట్టి స్వల్ప రిపోర్టుతో తొక్కి పెట్టాలని కూడా ప్రయత్నించడం స్పష్టంగా కనిపిస్తోంది.

తమ ప్రయోజనాలపై సీమాంధ్ర నాయకులు, సంస్ధలు, వ్యాపారులు, మంత్రులు, అధికారులు వివక్షతో వ్యవహరిస్తున్నారన్న తెలంగాణ ప్రజల ఆరోపణలకు దినేష్ రెడ్డి చెప్పిన విషయాలు బలం చేకూర్చాయనడంలో సందేహం లేదు. తెరచాటు రాజకీయాలను, తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఈ మాత్రం బైట పెట్టినందుకు మాజీ డి.జి.పి దినేష్ రెడ్ది అభినందనీయులు.

2 thoughts on “సి.ఎం పై మాజీ డి.జి.పి దినేష్ రెడ్డి సంచలన ఆరోపణలు

  1. కదా విశేఖర్ గారు. అదే సీమాంధ్ర ఉద్యమానికి సంబంధించిన వార్త అయ్యి ఉంటే చింపి చాట చేసే సీమాంధ్ర మీడియా ఛానెళ్లు..ఇటీవలే రాజీనామా చేసిన డీజీపీ ముఖ్యమంత్రిపై అన్ని ఆరోపణలు చేస్తే దాన్ని ఏదో చిన్న వార్తగా చూపించాయి. అన్ని రంగాల లాగే మీడియాలోనూ ప్రాంతీయ వివక్ష అధికం అన్న సంగతి మరోసారి నిరూపితమైంది.
    కాకుంటే దినేశ్ రెడ్డి పదవిలో ఉండగా ఆరోపణలు చేసి ఉంటే పరిస్థితి ఇంకా బాగుండేది. కానీ ఆయన తన పదవిని పొడిగిస్తారని ఆశపడ్డట్లున్నాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s