ఉగ్రవాదం కాదు స్వార్ధం కోసమే అమెరికా గూఢచర్యం -బ్రెజిల్


ప్రపంచంలో ఉగ్రవాద ప్రమాదాన్ని అరికట్టడానికే తాను ప్రపంచ ప్రజలందరిపైనా గూఢచర్యం సాగిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పుకున్నాడు. వాస్తవంలో అమెరికా బహుళజాతి కంపెనీల వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాల కోసమే అమెరికన్ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం జరుగుతోందని తాజా స్నోడెన్ పత్రాలు స్పష్టం చేశాయి. అమెరికాతో పాటు కెనడా కూడా ఈ గూఢచర్యంలో భాగం పంచుకుందని, ముఖ్యంగా బ్రెజిల్ లోని మైనింగ్ పరిశ్రమలో తమ కంపెనీల ప్రయోజనాల కోసం ఎన్.ఎస్.ఏ గూఢచర్యాన్ని కెనడా వినియోగించుకుందని బ్రిటిష్ పత్రిక ది గార్డియన్ యొక్క అమెరికా విలేఖరి గ్లెన్ గ్రీన్ వాల్డ్ వెల్లడించిన పత్రాల ద్వారా వెల్లడయింది.

తమ దేశంపైనా, ప్రజలపైనా అమెరికా సాగిస్తున్న గూఢచర్యం పట్ల ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలమై మండుతున్న బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ తాజా వెల్లడితో మరింతగా మండి పడుతోంది. ఎన్.ఎస్.ఏ గూఢచర్యం వాస్తవానికి అమెరికా దాని మిత్ర దేశాల కంపెనీల ఆర్ధిక ప్రయోజనాల కోసమే అన్న తమ ఆరోపణలు రుజువయ్యాయని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో వెల్లడయిన స్నోడెన్ పత్రాల ప్రకారం అమెరికా గూఢచర్యంలో ఐదు దేశాలు పాత్రధారులు. అవి: అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు. ఈ ఐదు దేశాలను ‘ఐదు కళ్ళు’ (Five Eyes) గా ఎన్.ఎస్.ఏ పేరు పెట్టుకుంది.

సో కాల్డ్ ‘ఐదు కళ్ళు’ ప్రపంచ దేశాలపై సాగిస్తున్న గూఢచర్యాన్ని వెంటనే ఆపేయాలని దిల్మా రౌసెఫ్ డిమాండ్ చేశారు. “భాగస్వాములం అని ఒక పక్క చెబుతూ మరో పక్క మా పైన గూఢచర్యం సాగించడం బొత్తిగా ఆమోదనీయం కాదు. వెంటనే దీనికి స్వస్తి పలకాలి. ఈ సైబర్ యుద్ధాన్ని మేము తిరస్కరిస్తున్నాం” అని దిల్మా రౌసెఫ్ ట్విట్టర్ బ్లాగ్ లో పేర్కొన్నారు. కెనడా గూఢచర్య కార్యకలాపాలను తీవ్రంగా దునుమాడుతూ ఆమె వరుసగా 9 టపాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

గ్లెన్ గ్రీన్ వాల్డ్ వెల్లడి చేసిన వివరాల ప్రకారం బ్రెజిలియన్ ఇంధన మంత్రిత్వ శాఖల కంప్యూటర్లను అమెరికా, కెనడాలు జల్లెడ పట్టాయి. ఈ గూఢచర్యం ద్వారా సేకరించిన సమాచారాన్ని ఐదు కళ్ళు పంచుకున్నాయి. కెనడా గూఢచార సంస్ధలు బ్రెజిల్ ఇంధనం మరియు మైనింగ్ మంత్రిత్వ శాఖలపై విస్తృత గూఢచర్యం నెరిపాయి. కెనడాలో అమెరికన్ ఎన్.ఎస్.ఏ కి సమానమైన ‘కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ మెంట్ కెనడా’ (సి.ఎస్.ఆర్.సి) గత సంవత్సరం జూన్ నెలలో ‘ఒలింపియా’ అనే ప్రోగ్రామ్ ద్వారా బ్రెజిలియన్ మంత్రిత్వ శాఖ ఏర్పరచుకున్న ఎన్ క్రిప్షన్ ని ఎలా ఛేదించిందీ తన ‘ఐదు కళ్ల’ మిత్రులకు వివరించింది. అలా వివరించిన పత్రాన్ని స్నోడెన్ ద్వారా గ్లెన్ గ్రీన్ వాల్డ్ వెల్లడి చేశాడు. ఒలింపియా ద్వారా సేకరించిన బ్రెజిల్ సమాచారాన్ని అనంతరం మిగిలిన నాలుగు కళ్ళకు అందజేసిందని ఈ వెల్లడి ద్వారా తెలిసింది.

“వాళ్ళు (ఐదు కళ్ళు) తాము సేకరించిన సమాచార పత్రాలు అన్నింటిని తమలో తాము పంచుకుంటారు. తద్వారా తాము సరిగ్గా ఏమేమి చేస్తున్నారో మిగిలిన వారికి కూడా తెలిసిపోతుంది” అని గ్రీన్ వాల్డ్ చెప్పారని రష్యా టుడే తెలిపింది.

కెనడా తన గూఢచర్యం ద్వారా బ్రెజిల్ మంత్రిత్వ శాఖల వివరణాత్మక నిర్మాణాన్ని, మేప్ ను తయారు చేసుకుంది. ఈ మెయిళ్ళు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లు, ఇతర టెలిఫోన్ సంభాషణలు అన్నింటిపైనా నిఘా పెట్ట గలిగింది. చివరికి ఏయే మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఫోన్ తయారీలు ఎవరెవరివో కూడా గుర్తించేటంత స్ధాయిలో నిఘా పెట్టగల విధంగా ఒలింపియా అవకాశం కల్పించింది. కెనడాలో బ్రెజిల్ రాయబారి పైన కూడా నిఘా పెట్టింది.

కెనడా ప్రభుత్వం తన గూఢచర్యం పై వెల్లడయిన అంశాలపై స్పందించడానికి ఇప్పటివరకు నిరాకరించింది. ఏం మొఖం పెట్టుకుని స్పందిస్తుంది. అమెరికా-కెనడా-బ్రిటన్-ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ ఈ జాతంతా ఒకటే రకం. మానవ నాగరికతా వికాసంలో ఇంకా మునుపటి దశల్లోనే ఉన్న జాతుల భూములపై వెళ్ళి వారిని చంపి, నాశనం చేసి అక్కడి భూములను, వనరులను స్వాయత్తం చేసుకున్న చరిత్ర ఈ జాతిది. ఈ దేశాల చరిత్రలను వెలికి తీస్తే ఒక్కొక్క దేశానిదీ ఒక్కొక్క హింసాత్మక చరిత్ర. జాతులను, తెగలను మూకుమ్మడిగా నిర్మూలించిన చరిత్ర. ఇంకా మిగిలినవారిని బానిసలుగానూ, బలహీనులుగానూ మిగిల్చిన దుర్మార్గ చరిత్ర. ఇలాంటి జాతికి పక్కవాడి ఇంట్లోకి తొంగి చూడడం, మీ భద్రత కోసమే తొంగి చూశానని అసహ్యకరమైన కూతలు కూయడం పెద్ద కష్టం కాదు.

ఒబామా చెప్పిందీ ఆదేగా! ఎన్.ఎస్.ఏ నీతిమాలిన గూఢచర్యం వెల్లడి అయినప్పుడు ప్రపంచ భద్రత కోసమే మా గూఢచర్యం అని సిగ్గు లేకుండా ప్రకటించాడు. ‘ఆర్ధిక గూఢచర్యంలో అమెరికా పాల్గొనలేదు’ అని ప్రకటించాడు. అమెరికా జాతీయ భద్రత కోసమే గూఢచర్యం అని కూడా ప్రకటించాడు. అమెరికా ఇంటి భద్రత పరాయి ఇంట్లోకి తొంగి చూడడంలో ఉంటుందని చెప్పడం ఏ నీతి కిందకి వస్తుంది? ఆ మాటకొస్తే తొంగి చూసేవారి వల్లనే బాధిత దేశాల భద్రతకు ప్రమాదం వస్తుంది.

బ్రెజిల్ లో పెట్రోబాస్ అనే కంపెనీ ఆ దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ చమురు కంపెనీ. ఆ కంపెనీ పైన కూడా ఎన్.ఎస్.ఏ తీవ్రమైన నిఘా పెట్టి పూర్తి వివరాలు సేకరించింది. కంపెనీ ఆర్ధిక కార్యకలాపాలన్నింటినీ సేకరించి పెట్టుకుంది. కంపెనీ అధికారుల ఫోన్, నెట్, మొబైల్ సంభాషణలన్నింటినీ రికార్డు చేసింది. పెట్రోబాస్ పై పెట్టిన నిఘా అమెరికా జాతీయ భద్రతను ఎలా కాపాడుతుందో ఒబామా ఇంతవరకూ చెప్పలేదు.

న్యూయార్క్ లో కొద్ది రోజుల క్రితం ముగిసిన ఐరాస జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశాలలో ప్రసంగిస్తూ బ్రెజిల్ అధ్యక్షురాలు ఈ విషయమే నేరుగా అడిగింది. పెట్రోబాస్ పై నిఘాకీ అమెరికా జాతీయ భద్రతకీ సంబంధం ఏమిటని సూటిగా ప్రశ్నించింది. పెట్రోబాస్ పై గూఢచర్యం ఆర్ధిక గూఢచర్యం కాకుండా ఇంకేమవుతుందని ప్రశ్నించింది. “పెట్రోబాస్ వలన ఏ దేశ జాతీయ భద్రతకూ ముప్పు లేదు సరికదా, ప్రపంచ చమురు అన్వేషణ వారసత్వంలోనూ, బ్రెజిల్ ప్రజల్లోనూ అత్యంత గొప్ప ఆస్తికి ప్రతినిధి” అని ప్రకటించింది.

దిల్మా రౌసెఫ్ అంతటితో ఆగలేదు. బ్రెజిలియన్ ప్రజల ఏకాంతానికీ, వ్యక్తిగత భద్రతకూ అమెరికా ఇంటర్నెట్ సంస్ధల నుండి వాటిల్లుతున్న ప్రమాదాన్ని నివారించడానికి వెంటనే బిల్లు తయారు చేసి పార్లమెంటు ముందు ఉంచింది. ఆ బిల్లుపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చట్టం అవుతుంది. అంతేకాకుండా స్వంతగా దేశీయంగా ఇంటర్నెట్ సంస్ధలను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారామే. ఫేస్ బుక్, గూగుల్ లాంటి అమెరికా కంపెనీలు తమ పౌరుల సమాచారాన్ని అమెరికా ప్రభుత్వానికి అందిస్తున్న విషయంపై విచారణకు సైతం ఆదేశించారు. అమెరికా ద్వైపాక్షిక అధికారిక పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. అర్జెంటీనాతో కలిసి సంయుక్త ఇంటర్నెట్ రక్షణ వ్యవస్ధను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

దిల్మా రౌసెఫ్ తీసుకున్న చర్యలు అనేకమంది ఇంటర్నెట్ పరిశీలకుల్లోనూ, నిపుణుల్లోనూ సరికొత్త ఆశలు  చిగురించడానికి దోహదం చేసింది. పశ్చిమ దేశాల గూఢచర్యం నుండి ప్రపంచ దేశాల ప్రజలు, ప్రభుత్వాల ఏకాంత, జాతీయ హక్కులను కాపాడడానికి దిల్మా ప్రతిపాదించిన చర్యలపై ఇప్పటికే అనేక చర్చోప చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్యల సాధ్యాసాధ్యాలపై ఎన్ని అనుమానాలు ఉన్నప్పటికీ అసలైతే ప్రయత్నాలు ముదలయినందుకు బహుధా ప్రశంసిస్తున్నారు.

ఎన్.ఎస్.ఏ గూఢచర్యం గురించి మాట్లాడుతూ “ఇదంతా మామూలే” అని ప్రకటించిన భారత పాలకులను ఒక్కసారి బ్రెజిల్ పాలకులతో పోల్చి చూడండి. సిగ్గుతో తలదించుకోవడం తప్ప మరేమీ చేయలేము.

3 thoughts on “ఉగ్రవాదం కాదు స్వార్ధం కోసమే అమెరికా గూఢచర్యం -బ్రెజిల్

  1. యాకయ్య గారు మీకు తెలుగు పుస్తకాలు కావాలో…ఇంగ్లీష్ పుస్తకాలు కావాలో స్పష్టంగా రాయలేదు. తెలుగులో ఐతే మీకు ప్రజాశక్తి వాళ్లు వేసిన” దేశాల చరిత్ర” అనే పుస్తకం కొంత ఉపయోగపడవచ్చు. ప్రజాశక్తి షాపుల్లో దొరుకుతుంది చూడండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s