ఇంత రాక్షసత్వమా? -వసంత్ కుంజ్ కేసులో కోర్టు


ఢిల్లీ పోష్ లోకాలిటీ ‘వసంత్ కుంజ్’ లో ఒక మైనర్ బాలిక ను పనిలో పెట్టుకుని హింసించిన కేసులో నిందితురాలికి కోర్టు బెయిలు నిరాకరించింది. నోయిడాలో ఒక పేరు పొందిన బహుళజాతి సంస్ధలో కమ్యూనికేషన్ విభాగాని అధిపతిగా పని చేస్తున్న వందన ధీర్ కు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 18 సంవత్సరాల జార్ఖండ్ బాలిక ఆర్తనాదాలు విని పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక స్వచ్ఛంద సంస్ధ, పోలీసుల సాయంతో బాలిక విముక్తి పొందిన సంగతి తెలిసిందే.

వివిధ సెక్షన్ల కింద వందన ధీర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె బెయిల్ ధరఖాస్తును తిరస్కరిస్తూ కోర్టు ‘మనిషి అన్నవారెవ్వరూ పాల్పడలేని రాక్షసత్వానికి వందన పాల్పడిందని, ఎంతో వికృత మానసిక వైకల్యానికి గురయితే తప్ప ఇంత ఘోరంగా ప్రవర్తించలేరని’ వ్యాఖ్యానించింది. న్యాయ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఆమెకు మానసిక వైద్యం అత్యవసరంగా అందించాలని చెబుతూ బెయిల్ నిరాకరించింది. తీర్పు సందర్భంగా కోర్టు కొన్ని విలువైన వ్యాఖ్యలు చేసింది.

“శ్రీమతి వందన ధీర్ ఒక విధమైన వ్యక్తిత్వ సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులోని వాస్తవాలు నిందితురాలియొక్క రోగగ్రస్తమైన, సమస్యాత్మక మానసిక స్ధితిని వెల్లడిస్తున్నాయి” అని కోర్టు పేర్కొంది. జార్ఖండ్ బాలికను వందన వద్ద పనికి కుదిర్చిన ఏజెంటు డోరోతిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

వందన తన ఇంట్లో పని చేస్తున్న బాలికపైన అమానుషమైన రీతిలో హింసకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాకుండా వేడి వేడి బాణలితో వంటి నిండా వాతలు పెట్టినట్లు తెలిసింది. మొఖము, చెవులు, ముక్కు, కళ్ళు ఇలా అనేక చోట్ల గాయాలతో ఎక్కడికక్కడ వాచిపోయి పచ్చి పుండుగా మారిన శరీరంతో ఆ బాలిక రక్షించబడింది. తన చేత రెండు సార్లు బలవంతంగా యూరిన్ తాగించిందని బాలిక పోలీసులకు తెలిపింది. బాలిక పరిస్ధితిని డాక్టర్ నివేదిక ద్వారా, మిజిస్ట్రేట్ స్టేట్ మెంట్ ద్వారా తెలుసుకున్న కోర్టు ఎంతగా చలించిపోయిందటే ‘పని పిల్లలను కుదిర్చి పెట్టే ప్లేస్ మెంట్ ఏజన్సీలను నియంత్రించడానికి వెంటనే చట్టం తేవాలని కోర్టు కోరింది.

“ఈ రోజు ఉనికిలో ఉన్న ప్లేస్ మెంట్ ఏజన్సీలు దోపిడీకి ఆశ్రయాలుగా మారాయి. తమ ద్వారా నియమితులయిన వర్కర్ల సంక్షేమాన్ని అవి ఏమాత్రం పట్టించుకోడం లేదు. ఇవి నియమించే వారిలో అనేకమంది బాల బాలికలు భౌతిక, లైంగిక హింసకు, అత్యాచారాలకు గురవుతున్నారు” అని కోర్టు పేర్కొంది.

“ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా సానుకూల మార్పు తీసుకురావాలన్నా, భారీ సంఖ్యలో అత్యంత ఘోరంగా దోపిడీకి గురవుతూ బలహీన పరిస్ధితుల్లో ఉన్న శ్రామిక వర్గానికి రక్షణ కల్పించాలన్నా తగిన చట్టం అత్యవసరం తీసుకురావాల్సి ఉంది. ప్లేస్ మెంట్ ఏజన్సీలను తప్పని సరిగా రిజిస్టర్ అయి ఉండేలా ఈ చట్టం నిర్దేశించాలి. పనివార్లకు, శ్రామికులకు కనీస వేతనం చెల్లించేలా, గౌరవప్రదమైన జీవన మరియు పని పరిస్ధితులు దక్కేలా, ఆరోగ్యవంతమైన ఆహారం పొందేలా ఈ చట్టంలో అవకాశం కల్పించాలి. భౌతిక, లైంగిక హింసలకు, దోపిడీకి గురికాకుండా తగిన భద్రత, రక్షణ కల్పించాలి” అని మేజిస్ట్రేట్ తన తీర్పులో పేర్కొన్నారు.

దేశ రాజధానిలో మంచి తిండి, జీవనం దొరుకుందన్న ఆశతో జార్ఖండ్ లాంటి అటవీ, పల్లె ప్రాంతాల నుండి వచ్చే శ్రామికులకు ఆధునిక సమాజాలు, జిలుగు వెలుగుల నగరవాసాలు ఎలాంటి జీవితాన్ని ప్రతిఫలంగా ఇస్తున్నాయో మేజిస్ట్రేట్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దేశాన్ని పాలించే అధునాతన ప్రజాస్వామ్యపు వ్యవస్ధలైన పార్లమెంటు, అనేకానేక మంత్రులు, అధికారుల నివాసాలు కొలువు తీరిన చోటనే కడుపు నింపుకోవడానికి తరలి వచ్చిన సామాన్య శ్రామిక జనానికి ఏమి ఉన్నాయో, అంతకంటే ముఖ్యంగా ఏమి లేవో మేజిస్ట్రేట్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి.

పాలకులు గొప్పగా చెప్పుకునే కనీస వేతన చట్టం రాజధాని ఢిల్లీలో ఏ మాత్రం పని చేయదని, గౌరవప్రదమైన జీవనం ఉండదని, కనీసం ఆరోగ్యవంతమైన ఆహారం కూడా డక్కదని, మీదు మిక్కిలి భౌతిక, లైంగిక దోపిడి సర్వ సామాన్యమని మేజిస్ట్రేట్ పరోక్షంగా అంగీకరిస్తున్నారు.

మైనర్ పిల్లలను ఇంటి పనివారుగా నియమించకుండా చూడాలని మేజిస్ట్రేట్ ఆకాంక్షించారు. “అలాంటి ఉపాధి అవకాశాలను మొత్తంగా రద్దు చేయడానికి బదులుగా ఈ ప్లేస్ మెంట్ ఏజన్సీలను నియంత్రించే చట్టం అవసరం చాలా ఉంది. ఉపాధి ఇచ్చేవారి ప్రయోజనాలతో పాటు ఉపాధి కోసం వచ్చేవారి ప్రయోజనాలకు కూడా రక్షణ ఉండే ఒక వ్యవస్ధాగతమైన ఏర్పాటు ఉండాలి. ముఖ్యంగా మైనర్ పిల్లలు ఇంటిపనివారుగా నియమించకుండా జాగ్రత్తలు ఈ చట్టం జాగ్రత్త తీసుకోవాలి.” అని ఆయన పేర్కొన్నారు.

ఘోరం ఏమిటంటే బాలికను అత్యంత దారుణంగా హింసించిన వ్యక్తిని వదిలి పెట్టి బాధితురాలికే మతి భ్రమించిందని డిఫెన్స్ లాయర్ వాదించడం. బాలికకు మతి భ్రమించిందని, ఆ స్ధితిలో ఆమె తనకు తానే గాయపరుచుకుని ఉండవచ్చని డిఫెన్స్ లాయర్ వాదించినట్లు ది హిందు తెలిపింది. ఇటువంటి మతిమాలిన వాదనలకు అవకాశం ఇచ్చే న్యాయ సూత్రాల ద్వారా  న్యాయం ఎంతవరకు దక్కుతుందో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.

వందన ధీర్ చర్యలపై వ్యాఖ్యానిస్తూ ఢిల్లీ మేజిస్ట్రేట్ ఇలా వ్యాఖ్యానించారు. “ఆమె తన చర్యల ద్వారా ఎంతటి రాక్షసత్వాన్ని ప్రదర్శించిందంటే ఒక మామూలు మనిషి ప్రవర్తనగా దానిని ఎంతమాత్రం చెప్పలేము… ఆమె ఒక విధమైన వ్యక్తిత్వ లోపంతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ లోపం ఆమెను తీవ్ర ప్రతిచర్యలకు, కోపానికి, తిరస్కరణకు, ఉగ్రత్వానికి రెచ్చగొట్టి దానినంతటిని ఒక బలహీన, నిస్సహాయ లక్ష్యాన్ని ఎంచుకునేందుకు పురిగొల్పుతోంది… ఎప్పుడో ఒకప్పుడు నిందితురాలు జైలు నుండి బైటికి రాక తప్పదు. కానీ, ఆ లోపుగా ఆమెకు తగిన మానసిక చికిత్స ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. తద్వారా ఆమె బైటికి వచ్చినపుడు మానసికంగా మరింత స్ధిరత్వంతో ఉండాలి” అని జడ్జి తీర్మానించారు.

బాధితురాలు మేజిస్ట్రేట్ వద్ద ఇచ్చిన స్టేట్ మెంటుకు జడ్జి తగిన విలువ ఇచ్చారు. బాధితురాలికి మతి భ్రమించిందన్న వందన్ ధీర్ లాయర్ వాదనను ఆయన తోసిపుచ్చారు. బాలిక మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన స్టేట్ మెంటుకు బాలికకు చికిత్స అందించిన డాక్టర్ స్టేట్ మెంటు సరిగ్గా సరిపోయిందని ఆయన గుర్తు చేశారు. వందన లాంటి వ్యక్తులు ఎలాంటి సౌమ్యం భావనకు తగరని, ఆమె బాలిక పట్ల అత్యంత క్రూరంగా, దయావిహీనంగా వ్యవహరించిందని జడ్జి పేర్కొన్నారు.

సెప్టెంబర్ 30 తేదీన వెలుగులోకి వచ్చిన వెంటనే వందన అరెస్టు కాగా, బాలికను పనికి కుదిర్చిన డోరోతి అక్టోబర్ 3 తేదీన అరెస్టు అయింది. డోరోతి ఏజెన్సీ యజమానురాలు డోరోతి కూడా జార్ఖండ్ నుండే వచ్చినట్లు తెలుస్తోంది. 20,000 కమిషన్ తీసుకున్న డోరోతి ఆ తర్వాత బాలిక సంగతే పట్టించుకోలేదు. జార్ఖండ్ లోని సాహెబ్ గంజ్ కి చెందిన బాలికకు తల్లి తప్ప తండ్రి లేదు. ఏదో జబ్బుతో చనిపోయాడు. దానితో పిల్లల భారం ఒక్క బాలిక తల్లిపైనే పడింది. నాలుగేళ్ల క్రితం లఖి రామ్, తల్జాఃరి అనే దంపతులు తమ వద్దకు వచ్చారని నగరంలో పని కోసం చూసేవారికి తాము పని ఇస్తామని చెప్పారని వారికి తమ పెద్ద అమ్మాయిని అప్పగించామని బాలిక తల్లి చెప్పిందని ది హిందు తెలిపింది.

బాలిక ఢిల్లీ వెళ్ళాక ఇక మళ్ళీ తమ కూతురిని ఆమె తల్లి చూడలేదు. అడిగినప్పుడల్లా అడ్రస్ మర్చిపోయామని చెప్పేవారని, దానితో ఎన్నిసార్లు ప్రయత్నించినా తమ కూతురిని చూడలేకపోయామని ఆమె తెలిపింది. ఈ నాలుగేళ్లలో బాలిక పనికి సంబంధించిన డబ్బు కూడా వాళ్ళకి చేరలేదు. మొదట ఇచ్చిన 15,000 తప్ప వారికి ఇక డబ్బూ దక్కలేదు, అమ్మాయినీ చూపలేదు. మొదట నోయిడా, లజపత్ నగర్ లలో పని చేసిన బాలిక సంవత్సరం క్రితం వందన ధీర్ దగ్గర నియమించబడింది. బాలిక పని చేసిన డబ్బు ఆమె తల్లికి చేరక, బాలికకు దక్కక ఎవరు తీసుకున్నట్లు? బహుశా డోరోతి ప్లేస్ మెంట్ ఏజన్సీకి దక్కి ఉండాలి.

దేశ రాజధాని ఎన్నెన్ని ఘోరాలకు నిలయమో తెలుసుకోవాలంటే ఓపిక సరే, ధైర్యం కూడా తప్పనిసరి అవసరమేనేమో!

2 thoughts on “ఇంత రాక్షసత్వమా? -వసంత్ కుంజ్ కేసులో కోర్టు

  1. అమానవీయం….రాక్షసత్వం, దారుణం….ఇటువంటి ఘటనను ఎలా ఖండించాలో కూడా మాటలు రావడం లేదు.
    దోషులనే కాదు కారకులను కూడా కఠినంగా శిక్షించాలి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s