విజయనగరంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర కేబినెట్, నోట్ ఆమోదించడానికి నిరసనగా విజయ నగరం అట్టుడుకుతోంది. ఏ.పి.ఎన్.జి.ఓ సంఘం ఇచ్చిన 48 గంటల బంద్ పిలుపు ముగిసినప్పటికీ మూడో రోజు కూడా అక్కడ ప్రజలు ఆగ్రహంతో వీధులకెక్కారు. కర్ఫ్యూ ప్రకటించినప్పటికి పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ అయినట్లు ది హిందు తెలిపింది. ప్రజల ఆగ్రహం ప్రధానంగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణపై కేంద్రీకృతం అయింది.

పి.సి.సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోనియా గాంధీకి ఇచ్చిన తప్పుడు నివేదిక వల్లనే కేబినెట్ నిర్ణయం తీసుకుందని, విజయవాడ ఎం.పి లగడపాటి పరోక్షంగా ఇచ్చిన సంకేతంతో తెలంగాణ వ్యతిరేక ఆగ్రహం బొత్సపై కేంద్రీకృతం అయినట్టు పత్రికలు చెబుతున్నాయి. ఎన్.జి.ఓల సంఘం ఇచ్చిన రెండు రోజుల బందు పిలుపు శనివారంతో ముగిసింది. ఆదివారం ఉదయం 6 గంటలతో తమ బందు పిలుపు ముగిసిందని ఎన్.జి.లో నేత అశోక్ బాబు ప్రకటించారు కూడా. అయితే విజయనగరం ప్రజలు మాత్రం దానిని పట్టించుకున్న జాడ లేదు. విజయనగరంలో చెలరేగిన హింసలో ఎన్.జి.ఓ లు ఎవరూ లేరని అశోక్ బాబు వివరణ ఇవ్వడం గమనార్హం.

‘తెలంగాణ నోట్ విషయంలో మంత్రులు, ఎం.ఎల్.ఏ లు అందరూ అధిష్టానం మాటకు కట్టుబడి ఉన్నారని, కాబట్టి నోట్ ఆమోదించవచ్చని ఒక పెద్ద మనిషి మాండ్యా (కర్ణాటక) వెళ్ళి తప్పుడు నివేదిక ఇచ్చారు. ఆ పెద్ద మనిషి ఎవరో ప్రజలందరికీ తెలుసు. దానివల్లనే కేబినెట్ హడావుడిగా సమావేశం అయ్యి తెలంగాణ నోట్ ఆమోదించారు’ అని విజయవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ ప్రకటించారని వివిధ పత్రికలు, ఛానెళ్లు తెలిపాయి.

దానితో విజయనగరంలోని బొత్స ఇళ్ళు, బార్, కాలేజీ తదితర ఆస్తులను సమైక్యాంధ్ర ఆందోళనకారులు టార్గెట్ చేసుకున్నారు. మంత్రి నివాసం ముందు పెద్ద సంఖ్యలో గుమికూడి ఆందోళన నిర్వహించారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున సమీకృతులై ఆందోళనకారులు శృతి మించకుండా అడ్డుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. ఆందోళన శనివారం రోజు కూడా కొనసాగడంతో ఐ.జి ద్వారకా తిరుమలరావు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ పరిస్ధితి అదుపులోకి రాలేదు.

“భారీ ఎత్తున హింస జరిగినట్లు రిపోర్టు వచ్చింది. ఆందోళనకారులు లూటీ, దహనాలకు పాల్పడ్డారు. ఒక బ్యాంకుకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించారు. ఈ హింసాత్మక పరిస్ధితిని దృష్టిలో పెట్టుకుని గత రాత్రి అధికారులు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు” అని ద్వారకా తిరుమలరావు (ఐ.జి, ఉత్తర కోస్తాంధ్ర) చెప్పారని ది హిందు తెలిపింది.

పత్రిక ప్రకారం విజయనగరం పోలీసులకు ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు ఇచ్చారు. అనుమతి లేకుండా వీధుల్లోకి రావద్దని ప్రజలకు సూచనలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఐ.జి ప్రకటించారు. పరిస్ధితి సద్దుమణిగితేనే కర్ఫ్యూలో సడలింపు ఉంటుందని ఆయన తెలిపారు. “ప్రజలు వీధుల్లో తిరగకుండా చూడడానికి మేము ప్రయత్నిస్తున్నాం” అని ఐ.జి తెలిపారు.

గురువారం రోజే విజయనగరంలో పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలు చెలరేగాయి. శుక్రవారం ప్రారంభం అయిన బొత్స ఇంటి ముట్టడి శనివారం కూడా కొనసాగింది. పోలీసులు అడపాదడపా భాష్పవాయువు ప్రయోగించి లాఠీ చార్జి చేసినప్పటికీ తాత్కాలికంగా వెనక్కి తగ్గుతూ ప్రజలు మళ్ళీ మళ్ళీ గుమి కూడారు. ఈ ఘర్షణల్లో శనివారం తాత్రి తమ పోలీసులు అనేకమంది గాయపడ్డారని ఐ.జి తెలిపారు. కర్ఫ్యూ కొనసాగినప్పటికీ ఆదివారం కూడా హింస కొనసాగింది. జిల్లా పాలనా యంత్రాంగం కోరికతో పట్టణానికి సాయుధ బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి.

ఉదయం ట్యాంకర్ల నుండి నీరు పట్టుకోవడానికి ఇళ్లనుండి బైటికి వచ్చిన కొందరు మహిళలపై సాయుధ బలగాలు చేయి చేసుకున్నారని దానితో ప్రజలు తిరగబడ్డారని తెలుస్తోంది. సాయుధ బలగాలపై జనం రాళ్ళు రువ్వారని ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారని తెలుస్తోంది. తాము గాలిలోకి కాల్పులు జరిపామని పోలీసులు చెబుతుండగా వారు జనంలోకి కాల్పులు జరిపారని ఒక ఆందోళనకారునికి గాయాలు కూడా అయ్యాయని ప్రజలు చెబుతున్నట్లు పత్రిక తెలిపింది. ఈ ఘటనల దరిమిలా పట్టణానికి మరింత మంది పోలీసులు చేరుకున్నారు. ప్రజలు మాత్రం వెనక్కి తగ్గే పరిస్ధితి కనపడడం లేదని తెలుస్తోంది.

గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం పట్టణాలలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. టైర్లు కాల్చి రాస్తా రోకోలకు దిగడం, దిష్టి బొమ్మలను తగలబెట్టడం, ధర్నాలు నిర్వహించడం తదితర ఆందోళనలు చేపట్టారు. గుంటూరులో మంత్రి కన్నా లక్ష్మి నారాయణ ఇంటిని ఆందోళనకారులు చుట్టుముట్టారు.

విద్యుత్ సమ్మె

ఇదిలా ఉండగా విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రారంభించడంతో అనేక సర్వీసులకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. ముఖ్యంగా రైలు సర్వీసులు దెబ్బతినగా గృహ విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ-గూడూరు-రేణిగుంట సెక్షన్ లో దాదాపు ప్రతి రైలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకూ ఈ సెక్షన్ లో దాదాపు ప్రతి రైల్వే స్టేషన్ ఎమర్జెన్సీ విద్యుత్ సౌకర్యంతో నడిచాయని ది హిందు తెలిపింది. సమ్మె రీత్యా గూడ్సు రైళ్ల ప్రయాణాన్ని నిలిపివేస్తున్నామని, పాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఎక్స్ ప్రెస్ రైళ్ళకు ప్రాధాన్యం ఇస్తున్నామని వారు తెలిపారు.

ఒంగోలు, వెంకటగిరి, తెనాలి రైల్వే స్టేషన్లకు విద్యుత్ అందలేదని అధికారులు రంగంలోకి దిగి పక్క స్టేషన్ల నుండి విద్యుత్ తీసుకున్నారని తెలుస్తోంది. డీజిల్ ఇంజన్లను కూడా వాడకంలోకి తెస్తున్నామని, డీజెల్ నిల్వలను పెంచుకుంటున్నామని రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే కేంద్ర కార్యాలయం అయిన హైదరాబాద్ లో ప్రత్యేక ‘కేంద్ర కంట్రోల్ రూమ్’ ఏర్పాటు చేసి, దానిని సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

10 thoughts on “విజయనగరంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు

  1. మాకు నచ్చనిది ఏదైనా గది మీరు చెప్పినా, శ్రీక్రిష్ణ చెప్పినా, గా దేవుడే దిగివచ్చి చెప్పినా అభద్దాలు, పక్షపాతం అంతే.

    మమ్మల్ని అవమానిచారంటూనే అందర్ని తిట్టడానికి, తక్కువ చేసి ,అవమానించి గేలి చేస్తూనే ఉంటాం. ఎవ్వరు నిజం మాట్లాడొద్దు. ఊరుకొము. బొంద పెడతం.ఇంకా ………..

  2. ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్మా లేదూ, శ్రాద్ధమూ లేదు. శ్రీకాకుళంలో మా మూడు ఇళ్ళలోనూ అద్దెకి ఉంటున్నవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్ళు ఏమాత్రం సమయం అడగకుండా మాకు అద్దెలు కడుతున్నారు. వాళ్ళకి నిజంగా జీతాలు రాకపోతే అద్దెలు కట్టడం ఆలస్యం చేసేవాళ్ళు కదా. సమ్మె పేరుతో ప్రభుత్వమే ఉద్యోగుల చేత నాటకం ఆడిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s