ఆమె డిప్రెషన్ బాధితురాలు. సంవత్సరంన్నర వయసు పాపకు తల్లి. డెంటల్ హైజీన్ నిపుణురాలు. బాలింతలకు వచ్చే డిప్రెషన్ తో బాధపడుతోంది. డిప్రెషన్ వల్లనే యేమో అక్టోబర్ 3 తేదీన వాషింగ్టన్ కేపిటల్ హిల్ ఏరియాలో వేగంగా కారు నడుపుతోంది. అధ్యక్ష భవనం దరిదాపుల్లో ఇలా ఓ కారు వేగంగా వెళ్ళడంతో పోలీసుల అప్రమత్తం అయ్యారు. ఒక పోలీసు కారును పక్కకు మళ్లించి ఆపాలని కోరాడు. ఆమె ఆగలేదు.
ఇక మొదలైంది వేట. పోలీసులు వీరావతారం ఎత్తారు. కారును వెంబడిస్తూ కాల్పులు జరిపారు. ఆ కాల్పులు విని మరింతమంది పోలీసులు భారీ ఆయుధాలు ధరించి రోడ్డు మూసేశారు. సందు, గొందుల్లో పొజిషన్లు తీసుకుని నక్కారు. వీరి హడావుడి చూసి జనం గగ్గోలు పెట్టారు. భయాందోళనలకు గురై చాటుమాటు కోసం పరుగులు పెట్టారు. కొందరు రోడ్డుపై పడుకొని కాల్పుల నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే మరికొందరు పరుగులేత్తుతూ హాహాకారాలు చేశారు.
ఈ హడావుడితో కారు నడుపుతున్న ఆవిడ ఎంత ఖంగారు పడిందో గాని బ్యారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ ఆందోళన నుండి బైటపడేలోపు పోలీసులు కాల్పులు జరపడంతో మరింత ఖంగారు పడి రివర్స్ చేసుకుని వెళ్లబోతూ ఇంకో బ్యారీకేడ్ ఢీ కొట్టి ఆగిపోయింది. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసు వీరులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఒక పోలీసైతే తెరిచి ఉన్న కారు విండో నుండి తుపాకి దూర్చి మరీ కాలుపులు జరిపాడు. దానితో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇంతా చేసి ఆమె వద్ద ఎలాంటి ఆయుధమూ లేదు. కాబట్టి ఆమె కాల్పులు జరిపే అవకాశమే లేదు. అనగా ఆమె నుండి ఎలాంటి ప్రమాదమూ పోలీసులకు ఎదురయ్యే అవకాశం లేదు. ఆ సంగతి తెలిసినా (వేగంగా కారు నడపడం తప్ప, ఆమె నుండి ఎటువంటి కాల్పులు ఎదురు కాకున్నా) విచక్షణారహితంగా కాల్చి చంపడానికే వారు మొగ్గు చూపారు. (కారు ఛేజింగ్ వీడియోను కింద వీడియోలో చూడవచ్చు.)
బాధితురాలు ఒక నల్లజాతి యువతి. దానితో జాతి వివక్షతోనే పోలీసులు కాల్పులు జరిపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత జూన్ నెలలో ఇదే తరహాలో జోసెఫ్ రీల్ అనే ఒక తెల్లజాతి పురుషుడు వైట్ హౌస్ సమీపంలోనే కారు నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతూ పోలీసుల్ని గాయపరిచాడు. నేరుగా సీక్రెట్ సర్వీస్ కాపు కాసే గేటునే గుద్దేశాడు. కానీ ఆయనపై పోలీసులు కాల్పులు జరపలేదు. తాను నిర్లక్ష్యంగా కారు నడిపానని, తప్పు తనదేననీ ఆయన కోర్టులో అంగీకరించాడు. కానీ ఆయన బతికున్నాడు కనుక ఏం జరిగిందీ లోకానికి తెలిసింది. కానీ మిరియం కేరి (బాధిత మహిళ పేరు) కి తన తప్పును అంగీకరించే అవకాశం దొరకలేదు. పోలీసులు ఆ అవకాశాన్ని ఆమెకు నిరాకరించారు. తెల్లజాతి పురుషుడు తప్పు చేస్తే ఒక విధమైన స్పందన, నల్లజాతి స్త్రీ తప్పు చేస్తే సరిగ్గా దానికి విరుద్ధమైన స్పందనా పోలీసులు ఎందుకు చూపారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఫాక్స్ న్యూస్, ఎం.ఎస్.ఎన్.బి.సి లాంటి పత్రికలు ఛానెళ్ళు మిరియం కేరిని కాల్చి చంపడాన్ని నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. వారి వాదన ప్రకారం వైట్ హౌస్ ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంది. ఆ ప్రమాదాన్ని పోలీసులు సమర్ధవంతంగా నిరోధించారు. కానీ అదే సమర్ధత జోసెఫ్ రీల్ విషయంలో ఎందుకు పని చేయలేదో వారు చెప్పరు. మిరియం కేరి హత్య విషయంలో అమెరికా పత్రికలు పెద్దగా పట్టించుకోలేదని, పట్టించుకున్న పత్రికలేమో సమర్ధనలకు దిగాయని రష్యా టుడేతో మాట్లాడిన విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
మిరియం కేరి సోదరిల్లో ఒకరు న్యూయార్క్ లో పోలీసు విభాగంలో పని చేస్తోంది. ఒక నిరాయుధ మహిళ కారు వేగంగా నడిపితే న్యూయార్క్ పోలీసులు ఆమెను అంతం చేసేవిధంగా స్పందించరని, కానీ వాషింగ్టన్ డి.సి పోలీసులు ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్’ కు విరుద్ధంగా ఎందుకు స్పందించారని ప్రశ్నించారు.
పోలీసుల చర్యను సమర్ధిస్తున్నవారిని ప్రశ్నిస్తూ ‘ఇంటర్నేషనల్ యాక్షన్ సెంటర్’ ప్రతినిధి కేలేబ్ మాపిన్ ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. (రష్యా టుడే)
“ఈ దేశంలో బడా మీడియా వ్యాపార సంస్ధలు -ఫాక్స్, ఎం.ఎస్.ఎన్.బి.సి – జరిగిన ఘోరాన్ని సమర్ధిస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడూ చేసే పని అదే. (అమెరికా చేసే) యుద్ధాల్ని సమర్ధించినట్లో ఈ ఘోరాన్ని కూడా సమర్ధిస్తున్నారు. వైట్ హౌస్ లో ఉన్నవాళ్ళు ప్రమాదంలో ఉన్నారని చెబుతూ దీన్ని సమర్ధిస్తున్నారు. కానీ ప్రతి రోజూ వైట్ హౌస్ లో జరిగేదేమిటి? డ్రోన్ విమానాలతో ఎవరెవర్ని చంపాలో వైట్ హౌస్ లో ఉన్న వ్యక్తులు ప్రతి రోజూ చర్చిస్తూ ఉంటారు. ఇప్పటికిప్పుడు చూస్తే ‘ప్రభుత్వ మూసివేత’ ద్వారా కాంగ్రెస్ దేశంలోని ప్రజలందరినీ ప్రమాదంలో పడేసింది. ప్రబుత్వ సామాజిక పధకాలపై ఆధారపడి ఉన్న వృద్ధులు, కుటుంబాలు అందరినీ వారు ప్రమాదంలో పాడేశారు. దానికి ఎవరు జవాబుదారీ? కాబట్టి ఒక కారు, వెళ్లకూడని చోటుకు వెళ్లింది కాబట్టి, ఆ కారు నడుపుతున్న వ్యక్తిని చంపేస్తారు! ఈ ప్రభుత్వం నిజంగా ఎవరికి సేవ చేస్తోందో అర్ధం కావడం లేదా?”
కేలేబ్ మాపిన్ తో ఏకీభవించకుండా ఉండలేము.
ఈ ఫోటోలను రష్యా టుడే, యాహూ న్యూస్ నుండి సేకరించినవి.