ఒబామా కేర్ – అమెరికా మూసివేత -కార్టూన్


US health care - GOP

అక్టోబర్ 1 తేదీ నుండి అమెరికా ప్రభుత్వం పని చేయడం లేదు. బారక్ ఒబామా ప్రభుత్వం 2010లో ఆమోదించిన ఆరోగ్య భద్రతా చట్టం అమలు మరో సంవత్సరం వాయిదా వేయాలని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పట్టుబడుతోంది. దానికి పాలక డెమోక్రటిక్ పార్టీ ససేమిరా అంటోంది. అమెరికా ఆరోగ్య రంగానికి ఆక్సిజన్ అందకుండా అడ్డం పడుతూ తాను మాత్రం అన్ని సౌకర్యాలు అనుభవిస్తోందని రిపబ్లికన్ పార్టీని ఈ కార్టూన్ విమర్శిస్తోంది.

చట్టం అమలు వాయిదా వేయడం గానీ లేదా సవరణలు చేయడం గానీ చేస్తే తప్ప అక్టోబర్ 1 నుండి ప్రారంభం అయిన నూతన ఆర్ధిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ అంగీకరించేది లేదని రిపబ్లికన్ పార్టీ చెప్పడంతో ప్రభుత్వం నడవడానికి బడ్జెట్ లేకుండా పోయింది. దానితో ప్రభుత్వ నిధులతో నడిచే సంస్ధలన్నీ మూసివేతకు గురయ్యాయి. దీనినే ‘అమెరికా ప్రభుత్వ మూసివేత’ (The US Government Shutdown) అని పిలుస్తున్నారు.

షట్ డౌన్ పట్ల ఇప్పటికే వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు ఆందోళన ప్రకటించాయి. ఇరు పార్టీల మధ్య రెండు విడతలు చర్చలు జరిగినా అవి నామమాత్రంగానే జరిగి విఫలం అయ్యాయి. మూసివేతకు కారణం ‘మీరంటే మీరేనని’ ఇరు పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. అయితే ప్రజల్లో మాత్రం ఎక్కువ మంది రిపబ్లికన్ పార్టీయే మూసివేతకు కారణం అని భావిస్తున్నారని పత్రికలు చెబుతున్నాయి.

‘ఎఫర్డబుల్ కేర్ యాక్ట్’ (ఎ.సి.ఎ) పేరుతో రూపొందించిన ఆరోగ్య భీమా చట్టాన్ని ‘ఒబామా కేర్’ అని పిలుస్తున్నారు. ప్రజల ఆరోగ్య ఖర్చులను ప్రభుత్వము, ప్రైవేటు రంగాలు ఇరువురు భరించేలా ఈ చట్టం వీలు కల్పిస్తోందని, ఆరోగ్య భీమా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని సమర్ధకులు వాదిస్తున్నారు.  ఒబామా కేర్ వలన ప్రభుత్వంపై విపరీతమైన భారం పడుతుందని, బడ్జెట్ లోటు పెరిగిపోతుందని చట్టం వ్యతిరేకిస్తున్నవారు చెబుతున్నారు. బడా భీమా కంపెనీల ప్రయోజనాల కోసమే రిపబ్లికన్ పార్టీ చట్టాన్ని వ్యతిరేకిస్తోందని విశ్లేషకులు అభిప్రాయం.

అయితే వాస్తవంలో ఒబామా కేర్ చట్టం వలన ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదన్నది విమర్శకులు విశ్లేషిస్తున్నారు. మరింత మందిని ఆరోగ్య భీమా పరిధిలోకి తెచ్చేందుకు చట్టం వీలు కల్పిస్తుందని చెప్పినా నిజానికి అనేక షరతులు విధించారని వారు విమర్శిస్తున్నారు. ప్రజల పేరు చెప్పి కంపెనీలకు లబ్ది చేకూరేందుకు వక్ర మార్గాలు ఏర్పరిచారని వెల్లడించారు.

చట్టంలో ఉన్న ‘ఇండివిడ్యువల్ మాండేట్’ నిధులు ఇవ్వకుండా ఉండడానికి అంగీకరిస్తే తాత్కాలిక బడ్జెట్ ఆమోదానికి సహకరిస్తామని రిపబ్లికన్ పార్టీ చెబుతోంది. ఈ మాండేట్ ప్రకారం ప్రభుత్వ (మెడిక్ ఎయిడ్, మెడికేర్, ట్రైకేర్ మొ.వి) ఆరోగ్య పధకంలో గానీ లేదా ప్రైవేటు భీమా కంపెనీలలో ఎవరి దగ్గరా ఆరోగ్య భీమా పొందని వ్యక్తులు తప్పనిసరిగా ఆరోగ్య భీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆర్ధికంగా బలహీనులైన పేదలకు భీమా ఖర్చులో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీల ద్వారా ఇండివిడ్యువల్ మాండేట్ ను పూర్తి చేయడానికి చట్టం తలపెట్టింది. ఈ సబ్సిడీనే ఇవ్వరాదని రిపబ్లికన్ పార్టీ వత్తిడి తెస్తోంది. దీనివల్ల ప్రభుత్వ బడ్జెట్ లో కొంత భాగం కంపెనీల నుండి ప్రజలకు తరలించబడుతుందని ఆ పార్టీ భయంగా కనిపిస్తోంది.

కానీ ఒబామా కేర్ వలన భీమా కంపెనీలకు విస్తృత మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. మార్కెట్ అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషిస్తూనే జనానికి ఇచ్చే సబ్సిడీలను మాత్రం రద్దు చేయాలని రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రిపబ్లికన్ పార్టీని ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ’ గా పిలుస్తారు. ఈ పార్టీ గుర్తు ఏనుగు. అందుకే కార్టూన్లలో రిపబ్లికన్ పార్టీని ఏనుగుగా చిత్రిస్తారు. (డెమొక్రాట్ పార్టీ గుర్తు గాడిద). ఈ కార్టూన్ లో కూడా GOP పేరుతో ఉన్న ఏనుగు రిపబ్లికన్ పార్టీకి సంకేతం.

ప్రభుత్వ మూసివేత వలన మ్యూజియంలు, పబ్లిక్ పార్క్ లు మూసేశారు. మాన్యుమెంట్ సందర్శనలు రద్దయ్యాయి. ఒబామా ఆసియా పర్యటించాల్సి ఉండగా అదీ రద్దయ్యింది. దాదాపు 8 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులను వేతనాలు లేని సెలవులోకి పంపేశారు. పర్యావరణ పరిరక్షణ సంస్ధ, విద్యా విభాగాలు తమ ఉద్యోగుల్లో 90 శాతం మందిని తాత్కాలికంగా ఇంటికి పంపాయి. చివరికి జాతీయ భద్రతా సంస్ధ (ఎన్.ఎస్.ఎ) ఉద్యోగుల్లో 70 శాతం మంది ఉద్యోగులు ఇళ్ళలో గడుపుతున్నారని, దానివల్ల జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని సంస్ధ అధిపతి జేమ్స్ క్లాపర్ ప్రకటించాడు.

ప్రభుత్వ మూసివేత ఒత్తిడి పాలక పక్షం కంటే ప్రతిపక్షం పైనే ఎక్కువగా కనపడుతోంది. మూసివేత ఒక ప్రమాదం కాగా అక్టోబర్ 17 తేదీతో ప్రభుత్వ ఋణ పరిమితి (16.7 ట్రిలియన్ డాలర్లు) మించనుండడం మరొక ప్రమాదం. ఋణ పరిమితిని పెంచితే తప్ప ప్రభుత్వ ఖర్చులు అసలుకే నడవ్వు. ఋణ పరిమితిని పెంచడానికి రిపబ్లికన్లు అంగీకరించకపోతే అమెరికా ఋణ సంక్షోభంలోకి జారిపోనుంది. అదే జరిగితే ప్రపంచం మొత్తం సంక్షోభంలోకి వెళ్ళడం ఖాయం అని ఐ.ఎం.ఎఫ్ ఇప్పటికే హెచ్చరించింది.

అమెరికా రోగులకు ఆక్సిజన్ అందకుండా చేస్తున్న రిపబ్లికన్ పార్టీ, తాను మాత్రం ఉన్న కొద్ది ఆక్సిజన్ మార్గాన్ని పూర్తిగా ఆక్రమించిందని తద్వారా తాను కులాసాగా ఉంటూ ప్రజల్ని కష్టపెడుతోందని కార్టూన్ సూచిస్తోంది.

1870ల్లో హార్పర్ వీక్లీ పత్రికలో నాస్ట్ అనే కార్టూనిస్టు రిపబ్లికన్ పార్టీని ఏనుగు గానూ, డెమొక్రటిక్ పార్టీని పులి చర్మం కప్పుకున్న గాడిద గానూ అభివర్ణించాడు. అప్పటి నుండి పార్టీల గుర్తులు ఏనుగు, గాడిదలుగా స్ధిరపడ్డాయి.

1870ల్లో హార్పర్ వీక్లీ పత్రికలో నాస్ట్ అనే కార్టూనిస్టు రిపబ్లికన్ పార్టీని ఏనుగు గానూ, డెమొక్రటిక్ పార్టీని సింహం చర్మం కప్పుకున్న గాడిద గానూ అభివర్ణించాడు. అప్పటి నుండి పార్టీల గుర్తులు ఏనుగు, గాడిదలుగా స్ధిరపడ్డాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s