కొత్త బట్టలా? కాదులే – ఇది మన కొత్త మహారాజు గారిని తయారు చేయడానికి…
–
మహారాజు గారి కొత్త బట్టల కధ అందరికీ తెలిసిందే. తమ పదవులకు, హోదాకు తగని వ్యక్తులకు తప్ప అందరికీ కనిపించే బట్టలు నేసి తెస్తామన్న నేతగాళ్ల చేతిలో రాజు, మంత్రి, వారి పరివారం అంతా ఫూల్స్ అయిన కధను కార్టూనిస్టు జ్ఞప్తికి తెస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలు నేస్తున్నది యువరాజు వారి కొత్త బట్టలను కాదు. పాత మహారాజు స్ధానంలో కొత్త రాజునే వారు నేయదలిచారు.
కధలో మహారాజు కోరిన బట్టలను తొడుగుతున్నట్లు నటించిన నేతగాళ్ళు తమ తమ పదవులకు తగనివారికి తాము నేసిన బట్టలు కనిపించవు అని చెప్పడంతో రాజు గారు తనకు బట్టలు కనిపించడం లేదని చెప్పలేకపోతారు. మంత్రికీ అదే సమస్య. సేనానులూ, రాజ భటులకూ అదే సమస్య! అసలే లేని కొత్త బట్టలు ధరించి ఊరేగింపుకు బయలుదేరిన మహారాజుని చూసి అందరూ ‘ఆహా, భలే బట్టలు’ అంటూ మెచ్చలేక మెచ్చుకుంటుంటే, పాపం పుణ్యం తెలియని ఓ పిల్లాడు ‘మహారాజు నగ్నంగా ఉన్నారని’ గట్టిగానే ఎగతాళి చేస్తాడు. అప్పటికి గాని తనను అందరూ మోసం చేస్తున్నారన్న విషయం గుర్తించని మహారాజు తెలిసాక కూడా తన ఊరేగింపును కొనసాగించక తప్పలేదు.
కాంగ్రెస్ పార్టీకి కొత్త నేతను తయారు చేయడం కూడా అలాగే ఉందని కార్టూనిస్టు చెబుతున్నారు. దేశ ప్రజలను ఆకర్షించగల కొత్త నేత కాంగ్రెస్ కి కావాలి. ఆ నేత యువరాజే అయుండాలి. కానీ మన యువరాజు దగ్గర సరుకు లేదు. అయినా ఆయనే మహారాజు వారసుడని అంగీకరించక తప్పదు. అలాగని సరుకులేని నేతను ప్రజల ముందు నిలబెట్టలేరు. దానితో లేని సరుకుని ‘ఆహా భలే సరుకు’ అని అదేపనిగా మెచ్చుకునే పనిలో కాంగ్రెస్ నేతలు మునిగిపోయారు.
లేకపోతే కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను సమర్ధించుకోడానికే ప్రెస్ మీట్ పెట్టిన అజయ్ మాకేన్ రాహుల్ గాంధీ ఇలా వచ్చి అలా వెళ్ళగానే పూర్తిగా మాట మార్చడం ఏమిటి? ఒకసారి కాదు, రెండు సార్లు కేబినెట్ లో చర్చించామన్న ప్రధాని మన్మోహన్, అలా చర్చించిన ఆర్డినెన్స్ నే ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం ఏమిటి?