కేబినెట్ ఆమోదంతో తెలంగాణ ప్రక్రియ ప్రారంభం


ప్రధాని నివాసం వద్ద సీమాంధ్ర ఆందోళనకారుల అరెస్టు -ది హిందు

ప్రధాని నివాసం వద్ద సీమాంధ్ర ఆందోళనకారుల అరెస్టు -ది హిందు

ఎట్టకేలకు తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. గురువారం సాయంత్రం సమావేశమయిన కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోమ్ మంత్రి ప్రవేశ పెట్టిన నోట్ ను తీర్మానంగా ఆమోదించింది. టి.వి ఛానెళ్లు చెబుతున్నదాని ప్రకారం సి.డబ్ల్యూ.సి తీర్మానాన్ని కేబినెట్ యధాతధంగా ఆమోదించింది. హైద్రాబాద్ 10 యేళ్లపాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కొత్త రాజధాని ఎక్కడన్నదీ కేబినెట్ నియమించే మంత్రుల బృందం నిర్ణయిస్తుందని హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు.

కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇస్తుందని హోమ్ మంత్రి ప్రకటించారు. నీళ్ళు, ఉద్యోగాలు, అప్పులు, ఆదాయాలు తదితర అంశాల విభజనను మంత్రుల బృందం చూసుకుంటుందని చెప్పారు.

గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశం చర్చకు రాదని, చర్చించనున్నారన్న వార్తలు ఊహాగానాలేనని నిన్న, ఈ రోజు కూడా చెప్పిన సుశీల్ కుమార్ షిండే అందరిని నిరుత్తరులను చేస్తూ తెలంగాణ ఏర్పాటును కేబినెట్ ఆమోదించిందన్న విషయాన్ని ప్రకటించారు. రాష్ట్ర విభజన వార్త సహజంగానే సీమాంధ్రలో ఖేదాన్ని, తెలంగాణలో మోదాన్ని కలుగజేసింది.

కాగా ప్రజలు అధైర్య పడాల్సిన అవసరం లేదని, అసెంబ్లీలో బిల్లును ఓడిస్తామని ఎ.పి.ఎన్.జి.ఓ నేత అశోక్ బాబు నమ్మబలుకుతున్నారు. విభజనకు నిరసనగా 48 గంటల బందుకు పిలుపిచ్చారు. రెండు నెలలు వేతనాలు లేక ఆకలి కేకలతో అల్లాడుతున్న సీమాంధ్ర ఉద్యోగులు మరిన్ని రోజుల ఆందోళనకు సహకరిస్తారా అన్న టి.వి9 ప్రశ్నకు ఆయన చిన్న ఉద్యోగులకు బ్యాంకు రుణాలు ఇచ్చే ఏర్పాటు చేశామనీ, చివరి నిమిషం వరకూ పోరాటం ఆపేది లేదని బింకం ప్రదర్శించారు.

తెలంగాణపై కేంద్రం వెనక్కి వెళ్లకపోవచ్చు గానీ, ముందుకు వెళ్ళే పరిస్ధితి కూడా లేదని చెబుతూ వచ్చిన అశోక్ బాబు గారు ఇకనైనా వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజకీయ నేతల తరహాలో లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చెప్పడం ప్రజా నేతల లక్ష్యం, లక్షణం కారాదు. అసంబద్ధమైన డిమాండ్ వదిలి, సీమాంధ్ర ప్రజలకు, ఉద్యోగులకు మేలు చేసే ఆచరణ సాధ్యమైన డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచాల్సిన అవసరం ఉన్నది.

కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం మొదలయింది. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నలుగురు ఎం.పిలు ప్రకటించగా, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ముగ్గురు మంత్రులు ప్రకటించారు. అనంత వెంకట్రామి రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, సబ్బం హరిలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కావూరి సాంబశివరావు, పళ్లం రాజు, చిరంజీవి మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాజీనామాలు ఎంతవరకు వాస్తవమో అప్పుడే చెప్పలేము. రాజీనామాలు ఆమోదం పొందితే తప్ప వాటిలో వాస్తవం ఎంతో ప్రజలకు అర్ధం కాదు.

వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి గారు మనసు బాష మాట్లాడుతున్నారు. ఈ రోజు తన మనసుకు ఎంతో బాధ కలిగిందని, 18 నెలల జైలు జీవితంలో కూడా ఇంతగా ఎప్పుడూ బాధ కలలగలేదని ఆయన వాపోయారు. ఓట్లు, సీట్లు లెక్క చూసుకుని రాష్ట్రాన్ని విభజించినవారు మనుషులేనా అని ప్రశ్నించారాయన. రాష్ట్ర విభజనకు నిరసనగా 72 గంటల బందుకు పిలుపిచ్చారు. చివరికి విభజించినవారిని వదిలి, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడే విభజనకు ప్రధాన కారణం అని ఆయన ముక్తాయించారు.

సి.డబ్ల్యూ.సి నిర్ణయం తీసుకున్నాక కేబినెట్ నిర్ణయానికి కేంద్రం రెండు నెలలు ఎందుకు ఆగింది? బహుశా విభజన నిర్ణయం ప్రకటించాక ఎలాగూ ఆందోళనలు తప్పవు గనుక అదుపు తప్పనంతవరకూ వాటికి అనుమతి ఇవ్వాలని కేంద్ర పెద్దలు భావించి ఉండవచ్చు. తెలివిగా సీమాంధ్ర ఉద్యోగులు రెండు నెలల సమ్మెలో అలసిపోయే వరకూ ఆగింది. ఇప్పుడిక, రెండు నెలల వేతనాలు ఆగిపోయాక, వేతన కష్టాలు అనుభవంలోకి వచ్చాక, ముందుకు వెళ్లడానికే ప్రభుత్వం నిర్ణయించుకుందని జనానికి అర్ధం అయ్యాక ఇక ఆందోళనలు చేసే ఓపిక నశించవచ్చని కేంద్రం ఆశించి ఉండవచ్చు.

అదీ గాక రాజకీయంగా కూడా తాలు ఎవరో తప్ప ఎవరో తెలుసుకునే అవకాశం కూడా కాంగ్రెస్ నేతలకు/అధిష్టానానికి ఈ సందర్భంగా వచ్చింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుగుబాటును ఆనం-బొత్స-మాణిక్యంల ప్రతి తిరుగుబాటు ద్వారా తిప్పి కొట్టిన కాంగ్రెస్ అధిష్టానం అదును చూసి వేటు వేసింది కాబోలు! మరి కొద్ది రోజులు పోతేగాని కిరణ్ కుమార్ తిరుగుబాటు వాస్తవమో కాదో అర్ధం కాకపోవచ్చు.

కానీ ‘అసెంబ్లీ ఉంది కదా! అక్కడ తీర్మానాన్ని ఓడిస్తే, కేంద్రం ఆలోచించవచ్చు’ అంటూ సీమాంధ్ర ప్రజలకు చెప్పడం మోసం అవుతుంది. ఈ మాటలను ఎన్.జి.ఓ నేత అశోక్ బాబు టి.వి9తో మాట్లాడుతూ చెప్పారు. ‘ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ ఆమోదం లేకపోయినా, కేంద్రం విభజనను అమలు చేసే అవకాశం ఉండవచ్చు గానీ, అసెంబ్లీయే తిరస్కరించాక విభజనతో ముందుకు వెళ్ళే నియంతృత్వానికి కేంద్రం పాల్పడదని నమ్ముతున్నాను’ అని ఆయన అన్నారు. ఈ మాటలు సందర్భ రీత్యా అన్నా, సీరియస్ గా అన్నా అవాంఛనీయం. ఇలాంటి మాటలతో ప్రజల్ని మభ్యపుచ్చడం తగని పని. దానికి బదులు నిర్ధిస్థ డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచి వాటిని ఆమోదింపజేసుకోవడం ఉత్తమమైన పని.

తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తే ఎం.పి పదవికి రాజీనామా చేస్తాననీ, అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటానని లగడపాటి రాజగోపాల్ చెబుతూ వచ్చారు. కానీ సి.డబ్ల్యూ.సి నిర్ణయం తర్వాత కూడా ఆయన ఆ మాటే ఎత్తలేదు. సి.డబ్ల్యూ.సి నిర్ణయం అమలు కాదనీ, అమలయితే రాజీనామా చేస్తానని చెప్పారు. అదీ అయింది గానీ రాజీనామా మాత్రం జరగలేదు. అయితే కేబినెట్ నిర్ణయం పై కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఆయన ఉన్నారని ఛానెళ్లు చెబుతున్నాయి. అది ఆయన హక్కు. కానీ రాజీనామా చేస్తానన్న ఆయన ప్రతిజ్ఞ గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు?

9 thoughts on “కేబినెట్ ఆమోదంతో తెలంగాణ ప్రక్రియ ప్రారంభం

 1. మీ ఉద్దేశం ఆంధ్ర నెల లో వున్నా అన్నికులాలు మతాలూ నాస్తికుకులు ఆస్తికులు,తిండి లేనోళ్ళు,వునోల్లు,
  అమాయకులు ఇంకా ఇంకా ,అందరూ,దోపిడీ దారులు
  తెలంగాణాలో నెల లో వున్నా వాళ్ళంతా మంచివార్న్నాటు వున్నాది .తీర్పు ఇచ్చారుకడా,
  మీరు చెప్పే పోరాటాలు ఉద్యమాలు లో నిజాయతి కనపడుటలేదు,

 2. నిజమే విశేఖర్ గారు. అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే తీసుకుంటారని…..అసెంబ్లీ ఆమోదించాల్సిన అవసరం లేదని రాష్ట్రాల ఏర్పాటు గురించి ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్లైనా చెబుతారు. కానీ ఈ విషయం సీమాంధ్ర నాయకులు ఎందుకు దాచి పెట్టి….అసెంబ్లీలో ఓడిద్దాం అని అంటున్నారో అర్థం కాదు.
  ఇక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి..గురువారం రాత్రి కేబినెట్ నోట్ ప్రకటన తర్వాత కూడా తెలంగాణ ఏర్పాటును అసెంబ్లీలో ఓడిద్దాం అంటున్నాడు. సాధారణ ప్రజలకు అవగాహన లేదంటే ఏమో అనుకోవచ్చు కానీ….ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబుకు, రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా తెలీదా…?
  తెలిసీ మాయమాటలు చెప్పడం సీమాంధ్ర ప్రజలని మోసపుచ్చడమే.
  ఏదో ఒకటి చేసి తెలంగాణ ఆపేస్తాం అంటూ ఉత్తర కుమారుల్లా ప్రగల్భాలు పలికిన లగడపాటి, ఉండవల్లి, కావూరి లాంటి నేతలు
  ఇప్పుడు చల్లగా రాజీనామాలు చేస్తున్నారు. ఇకనైనా సీమాంధ్ర ప్రజలు వాస్తవాన్ని గుర్తించి తమకు రాజధాని, నిధులు నీళ్లు, ఇతర రక్షణల గురించి మాట్లాడాలి.
  అలా కాకుండా కేవలం సమైక్యాంధ్ర అంటూ ఉద్యమం చేస్తే ప్రయోజనం ఉండదు.
  ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రజల ప్రయోజనాల కన్నా…తమ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తాయి.
  అరవై రోజుల ఉద్యమం అదే విషయాన్ని తెలియజేస్తోంది.

 3. సీమాంద్రలో జరిగిన అందోళనలకు అర్ధం లేకుండా చేశారు.మద్రాస్ లో జరిగిన అవమానమే మళ్ళీ జరగనుందా?తెలుగు మీడియాను,రాష్త్ర కాంగ్రేస్ నాయకులను మభ్యపెట్టి టేబుల్ అంశంగా తెలంగణా నోట్ ను ప్రవేశపెట్టి ఆమొదింపచేసుకోవలసిన అవసరం ఏముంది?ఈ నిర్ణయాన్ని సీమంధ్ర ప్రజలు(ఆందోళనలు చెస్తున్నవాళ్ళు) ఎందుకు అంగీకరించాలి?అన్యాయానికి గురైన తెలంగణా ప్రాంతానికి ప్రత్యేక పాకేజి ప్రకటించకుండా సీమంధ్రప్రాంతానికి ఎందుకు ప్రకటించారు?తెలంగణా రాష్త్రానికి జాతీయహోదాకలిగిన ప్రొజెక్ట్ ప్రకటించకుండా సీమంధ్రకు ఎందుకు ప్రకటించారు? అన్నివిదాలుగా దోపిడికి లోనైన తెలంగాణా కు ప్రత్యేక సౌకర్యాలు ప్రకటించకుండా దోచుకున్న సీమాంధ్రకు ఎందుకు ప్రకటించారు?సీమాంధ్ర ప్రాంతానికి బిస్కట్స్ వేస్తున్నరా?తెలంగాణా రాష్త్ర ఏర్పాటు సర్వరోగనివారిణి కాకపోతే వాళ్ళకు పాకేజ్ ఎందుకు ప్రకటించలేదు?సీమంధ్ర ప్రత్యేక రాష్త్రన్నే కోరనప్పుడు రాజదాని ఏర్పాటుకు ఆర్ధిక సాయం చేయమని ఎవరు అడిగారు? తెలంగాణా రాష్త్ర ప్రజలకు శుభాకాంక్షలు.

 4. ఈ పోస్టుకు పెట్టిన కార్టూన్ తిమ్మిని బమ్మి చేసినట్లుంది. 1956లో మెజారిటీ తెలుగు ప్రజానీకం సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కావాలని కోరుకున్నారు. అలా జరిగింది. అంతేకాని తెలంగాణని దోచుకోవడానికి ఆంధ్ర ప్రాంతం వారు ఇక్కడికి వచ్చారనడం సరికాదు. వాస్తవానికి నిజాం నిరంకుశ పాలనలో దిక్కులేని తెలంగాణ వారిని నిజాం నిరంకుశ పాలననుండి విడిపించడానికి ఆంధ్ర ప్రాంతం వారి క్రుషి కూడా చాలా ఉందని మరచిపోరాదు.

 5. నేతల కోణంలో కాక సీమాంధ్ర ప్రజల కోణం లో రాస్తే బావుండెది. నేతలను అసహ్యించుకునే సమయంలో వారి గురుంచి ఆలోచించే స్థితి లో ప్రజలు లేరు.సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగింది. గుడ్డిగా ఇతర ప్రాంతాల వారిని నాయకుల్ని చేసి నెత్తిన పెట్టుకున్న వారికి ఈ శాస్తి జరగాల్సిందే.

 6. aaa గారు,
  మీరు మరీ బాధ పడిపోతున్నారు. గత మీ వ్యాఖ్యలో చాలా బాధ కనిపించింది. అది మీ అర్ధం లేని బాధ అని నేను అనుకుంటూన్నాను. మీరు హైదరాబాద్‌ అది పరాయి నేల అవుతుందేమో నని బాధ పడ్డం వాస్తవాన్ని చూడ నిరాకరించడమే అవుతుంది. పుట్టిన నేలలో బ్రతుకు దెరువు దొరక్క ఇతర రాష్ట్రాలకు లేక ఇతర దేశాలకు ( విదేశాల వాల్లను వదిలేయండి) ఎంత మంది వలస పోయి బ్రతుకుతున్నారో తెలుసా మీకు? వాల్లు ఎంత ఇంకెంత బాధ పడాలి? అంతెందుకూ నేను కూడా స్వరాష్ట్రం లో లేను. ఏ ప్రాణి అయినా ఆహారం కోసం ఎంత దూరమైనా వెతుక్కుంటూ పోవాలసిందే. అందుకు మనుషులు మినహాయింపు కాదు. మొదట బ్రతుకుతున్న చోట మనుషుల మధ్య పరస్పర భావ పంపకం కోసం భాష పుట్టింది. ఒక చోట ఉన్న వారంతా ఒక భాష మాట్లాడటం యాదృచ్చికమైన అవసరం. అంత మాత్రాన ఆ మాట్లడే వారంత బ్రతకలేక పోతే బ్రతుకు దెరువు వెతుక్కుంటూ పోవలసిందే! భాష కడుపు నింపదు కదా? మనము ఎక్కడ బ్రతుకుతుంటామే అదే మన నేల, అదే మన భాష కూడా. ఈ బ్రతుకు మీద ఆధార పడే కదా ఇన్ని రాజకీయాలు, ఇన్ని పోరాటాలు మానవ మనుగడ కొనసాగుతున్నది?
  మీ వ్యాక్యల్లో బాధను చూసి నేను ఈ వ్యాక్య రాస్తున్నాను మరేమీ అనుకోకండీ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s