కీన్యా మారణకాండ: సైన్యమే మాల్ ని కూల్చేసిందా?


కీన్యా రాజధాని నైరోబిలో జరిగిన మారణకాండలో వాస్తవాలేమిటో చెప్పడానికి కీన్యా ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. సోమాలియా నుండి వచ్చిన ఆల్-షబాబ్ టెర్రరిస్టులు ఈ దురాగతానికి పాల్పడ్డారని, పిరికిపందలను తరిమికొట్టామని ఆర్భాటంగా ప్రకటనలు ఇవ్వడం తప్ప దాడి ఎలా జరిగింది, అసలు మాల్ ఎందుకు, ఎలా కూలిపోయిందీ చెప్పడం లేదు. పేలుళ్ళ వేడికి భవనం బలహీనపడి కూలిపోయిందని కీన్యా ప్రభుత్వం చెబుతుండగా ఆల్-షబాబ్ ఇందుకు విరుద్ధంగా ప్రకటించింది.

తమ సభ్యుల నుండి మాల్ ను విముక్తి చేయలేక కీన్యా ప్రభుత్వం రసాయన ఆయుధాలు ప్రయోగించిందని, దానిని కప్పిపుచ్చుకోడానికి సైన్యమే మాల్ ని కూల్చేసిందని ఆల్-షబాబ్ ప్రకటించింది. దాడి జరిగిన రోజే మాల్ లో అమెరికా సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యక్షం అయ్యి తమ పౌరులను రక్షించడంతో దాడి గురించి అమెరికాకు ముందే తెలుసని స్పష్టం అవుతోందని బ్రిటిష్ పత్రికలు వెల్లడించడంతో దాడిలో అమెరికా పాత్రపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

నైరోబిలో సంపన్న వర్గాలు ఉపయోగించే వెస్ట్ గేట్ మాల్ పై దాడి చేసిన మిలిటెంట్లు గ్రెనేడ్లు తదితర పేలుడు పదార్ధాలు విసిరారని, ఈ పేలుళ్ళ ధాటికి మాల్ మూడు అంతస్ధులు కూలిపోయాయని కీన్యా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ది హిందు పత్రిక ప్రకారం మాల్ కూలిపోవడానికి కారణం కీన్యా ప్రభుత్వమేనని ఆల్-షబాబ్ సంస్ధ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. “మాల్ లో ఉన్న ముజాహిదీన్ లను ఓడించలేక, ముట్టడిని అంతం చేయడానికి కీన్యా ప్రభుత్వం రసాయన ఆయుధాలను లోపలికి ప్రయోగించింది” అని ఆల్-షబాబ్ ప్రకటించిందని ది హిందు తెలిపింది.

రసాయన ఆయుధాలు ప్రయోగించిన తర్వాత తన నేరాన్ని కప్పిపుచ్చుకోడానికి మాల్ కూల్చివేతకు ప్రభుత్వం తెగించిందని ఆల్-షబాబ్ ను ఉటంకిస్తూ పత్రిక తెలిపింది. భవనం కూల్చివేత ద్వారా రసాయన ఆయుధాలు ప్రయోగించిన సాక్ష్యాలను రూపుమాపడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆల్-షబాబ్ తెలిపింది. భవనం కూల్చివేత ద్వారా లోపల ఉన్న అనేకమంది పౌరుల చావుకు కిన్యా ప్రభుత్వం బాధ్యురాలయిందని ప్రకటించింది.

కీన్యా ప్రభుత్వం ఈ వాదనను తిరస్కరించింది. మిలిటెంట్లు మాల్ లోపల మంటలు రగిలించారని ఈ మంటల వేదిక మూడో అంతస్ధులోని వాహన పార్కింగ్ విభాగం బలహీనపడిందని కీన్యా ప్రభుత్వ ప్రతినిధి మనో ఎసిపీసు తెలిపాడు. దానితో మూడో అంతస్ధు కూలిపోయి రెండో అంతస్ధుపై పడిందని, ఆ బరువు మోయలేక రెండో అంతస్ధు, పై రెండు అంతస్ధుల బరువు మోయలేక ఒకటో అంతస్ధు కూలిపోయిందని ఎసిపిసు తెలిపాడు. ఈ వివరణ చూస్తే అమెరికాలో జరిగిన 9/11 టెర్రరిస్టు దాడి గుర్తుకు రాక మానదు. అప్పుడు కూడా అమెరికా ప్రభుత్వం డబ్ల్యూ.టి.ఓ జంట టవర్లు గంటల వ్యవధిలోనే కూలిపోవడానికి ‘ఆకుకు అందని, పోకకు పొందని’ కారణాలు చెప్పింది. నిర్మాణ నిపుణులు వెలిబుచ్చిన అనేక ప్రశ్నలకు అమెరికా ప్రభుత్వం నుండి ఇంతవరకు సమాధానం లేదు.

ఆల్-షబాబ్ ప్రకటన మేరకు దాడి చేసిన టెర్రరిస్టులలో అమెరికా, ఐరోపా దేశాల పౌరులు కూడా ఉన్నారు. 10 నుండి 15 వరకు మిలిటెంట్లు దాడి చేశారని కీన్యా ప్రకటించింది. దాడి చేసినవారిలో ముగ్గురు అమెరికన్లు, ఇద్దరు సోమాలియా పౌరులు, కెనడా, ఫిన్లాండ్, కిన్యా, బ్రిటన్ ల నుండి ఒక్కొక్కరు ఉన్నారని ఆల్-షబాబ్ ప్రకటించడం విశేషం. అమెరికా, ఐరోపా దేశాల పౌరులు కూడా దాడి చేసినవారిలో ఉన్నారని, మిలిటెంట్లను ఎదుర్కోకోడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సెక్యూరిటీ సంస్ధలు సహాయం చేశాయని కీన్యా అధ్యక్షుడు ప్రకటించాడు. అయితే విదేశీ బలగాల సహాయంపై పూర్తి వివరాలను ఇవ్వడానికి ఆయన నిరాకరించాడు. కాగా ఇజ్రాయెల్ బలగాలు కూడా చురుకుగా పాల్గొన్నాయని ఫ్రెంచి వార్తా సంస్ధ ఎ.ఎఫ్.పి తెలిపింది. కీన్యా అధికారులు దీనిని దృవీకరించారని డెయిలీ మెయిల్ తెలిపింది.

బ్రిటిష్ పత్రికలు వెల్లడించిన కొన్ని వాస్తవాలు కీన్యా ప్రభుత్వ నిరాకరణ ఎందుకన్నది వివరిస్తున్నాయి. ది గార్డియన్ పత్రిక ప్రకారం వెస్ట్ గేట్ మాల్ పై దాడి చేయడానికి ఆల్-షబాబ్ మిలిటెంట్లు పధకం వేస్తున్నారని కీన్యా ప్రభుత్వానికి ముందే సమాచారం ఉంది. దాడి జరగడానికి కొన్ని గంటల ముందు కీన్యా బద్రతా బలగాలు మాల్ వద్ద తచ్చాడుతూ కనిపించాయని కూడా గార్డియన్ తెలిపింది. సోమాలియాలో కొనసాగుతున్న కీన్యా బలగాలను మరింత కాలం కొనసాగించాలంటే ఆల్-షబాబ్ దాడులు కూడా కొనసాగాలని కీన్యా ప్రభుత్వం కోరుకుంటోందని అందుకే అది వెస్ట్ గేట్ మాల్ పై దాడి సమాచారం ఉన్నా నిరోధించడానికి ఎలాంటి ప్రయత్నము చేయలేదని కీన్యా నిపుణులను ఉటంకిస్తూ గార్డియన్ తెలిపింది.

అంటే కీన్యా ప్రభుత్వానికి కావలసింది వెస్ట్ గెట్ మాల్ పై దాడిని నిరోధించడం కాదు. దాడి జరగాలన్నదే దాని కోరిక. తద్వారా సోమాలియాపై తాను చేసిన సైనిక దాడి, అక్కడ తన సైన్యం కొనసాగింపుకు న్యాయబద్ధత దక్కడం కీన్యాకు కావాలి. కానీ సోమాలియా పై కిన్యా చేసిన దాడికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాల మద్దతు ఉందన్న సంగతి మరువరాదు. వెస్ట్ గేట్ మాల్ దాడిని ఎదుర్కోడంలో ఈ దేశాల భద్రతా బలగాలు స్వయంగా పాల్గొన్నాయని కిన్యా అధ్యక్షుడు అంగీకరించిన సంగతి కూడా మరువరాదు. కాబట్టి మాల్ దాడి ఒక్క కీన్యాకే కాదు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలకు కూడా కావాలి. ఈ నాలుగు దేశాలను దుష్ట చతుష్టయం అని పిలుద్దాం కాసేపు.

ఇప్పుడు మరో బ్రిటన్ పత్రిక డెయిలీ మెయిల్ వార్త చూద్దాం. ఈ పత్రిక ప్రకారం కీన్యా మాల్ పై దాడి జరిగినప్పుడు ప్రపంచ బ్యాంకు లాయర్, హార్వర్డ్ యూనివర్సిటీ ఉత్పత్తి అయిన బెండిత మలాకియా అక్కడే ఉన్నారు. మాల్ లో ఉన్న ఒక హోటల్ లో ఆమె తన మిత్రులతో కలిసి ఉండగా దాడి జరిగింది. మరో 15 మందితో కలిసి ఒక స్టోర్ రూమ్ లో ఆమె దాక్కున్నారు. నాలుగు గంటల పాటు అలా దాక్కున్న తర్వాత అమెరికా సెక్యూరిటీ బృందం వచ్చి ఆమెనూ, ఆమెతో ఉన్న 15 మందిని రక్షించారని డెయిలీ మెయిల్ తెలిపింది. “ఈ సమయంలో తప్పించుకుపోవడం అంటే ప్రమాదమే. కానీ మీరు ఇక్కడి నుండి బైటపడాలంటే మాత్రం ఇప్పుడే అది జరగాలి. ఇప్పుడు బైటపడకపోతే ఇక ఎప్పటికీ బైటికి రాలేరు” అని అమెరికా సెక్యూరిటీ బృందం తనతో చెప్పారని మలాకియా ఎన్.బి.సి వార్తా సంస్ధకు తెలిపింది.

‘ఇక ఎప్పటికీ బైటపడలేరు’ అని అమెరికా భద్రతా బలగాల సభ్యుడు/సెక్యూరిటీ బృందం సభ్యుడు మలాకీయాతో అన్నాడు. అంటే మాల్ పూర్తిగా కూలిపోతుందని అమెరికా బలగం సభ్యుడికి ముందే తెలుసా? మాల్ పై దాడి చేసింది 10 నుండి 15 మంది మాత్రమే. వారిని ఎదుర్కోవడానికి మాత్రం మొత్తం ఐదు దేశాల (అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్, కీన్యా) భద్రతా బలగాలు వచ్చి చేరాయి. అయినా ఇక ఎప్పటికీ బయటపడలేరని ఎలా చెప్పగలిగాడు?

ఆఫ్రికా ఖండంలో అమెరికా దాని మిత్ర దేశాలకు ఉన్న ప్రాక్సీ ప్రభుత్వాల్లో కీన్యా ముఖ్యమైనది. ప్రాక్సీ అంటే అమెరికా బదులు అమెరికా చేయదలచిన పనిని కీన్యా ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నమాట. ఉదాహరణకి సోమాలియాపై కీన్యా చేసిన దురాక్రమణ అమెరికా ప్రయోజనాల రీత్యా జరిగిందే. సోమాలియా దేశం పశ్చిమ దేశాలకూ, ఆఫ్రికాలోని వారి దళారీ ప్రభుత్వాలకు ఒక పెద్ద గని. భౌగోళికంగా ఆ దేశం ఒక కీలకమైన స్ధానంలో ఉంది. సోమాలియాని గుప్పెట్లో ఉంచుకుంటే పర్షియా అఖాతం నుండి ప్రపంచం నలుమూలలకీ జరిగే చమురు రవాణాను నియంత్రించవచ్చు.

సోమాలియాలో సైన్యాలను ఉంచడం ద్వారా కిన్యా దళారి పాలకులకు అమెరికా, ఐరోపాల నుండి డాలర్లు వస్తాయి. (ఆఫ్ఘన్ యుద్ధం కోసం పాకిస్ధాన్ పాలకులకు వచ్చినట్లు). ఈ భౌగోళిక రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో అంతిమ బాధితులు సోమాలియా ప్రజలు. కిన్యా, మాలి తదితర దేశాల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు కూడా ఇందులో నలిగి నాశనం అవుతున్నాయి. వారిపై ముస్లిం టెర్రరిస్టులు అన్న ముద్ర వేసి ఆ దేశాలను శాశ్వతంగా కబళించడానికి ఆ ముద్ర బాగా పనికొస్తుంది.

పైకి కనిపించేవన్నీ నిజాలు కాదు. పత్రికల్లో కనిపించేదంతా కూడా నిజం కాకపోవచ్చు. ప్రపంచ మీడియా సామ్రాజ్యం ప్రధానంగా పశ్చిమ దేశాల చేతుల్లో ఉంది. అది ఏమి రాస్తే అదే వాస్తవంగా చెలామణి అవుతోంది. కానీ పశ్చిమ మీడియా పశ్చిమ బహుళజాతి కంపెనీల చేతుల్లో పనిముట్టు. కాబట్టి భారత దేశ పత్రికలే కాదు, ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి. పాలు, నీళ్లూ వేరు చేసే హంసలాగా వార్తల్లో నిజం ఎంతో అబద్ధం ఎంతో వేరు చేసి చూడగల అవగాహనను, జ్ఞానాన్ని అలవరుచుకోవాలి.

3 thoughts on “కీన్యా మారణకాండ: సైన్యమే మాల్ ని కూల్చేసిందా?

  1. మొన్నటికి మొన్న జరిగిన సిరియా ఉదంతానికి, ఈ కెన్యా ఉదంతానికి ఎంత విత్యాశం? ఈ సామ్రాజ్య వాద దుర్మార్గులకు ప్రపంచ ప్రజల దృస్టిని మసి పూసి మారేడు కాయ చేసి పక్క దారి పట్టించడంలో అందే వేసి చేతులు. వీల్ల మాయాజాలాన్ని అర్దం చేసుకోవడంలో ప్రజలు ఎంత అప్రమత్తంగా వుండాలో ఈ రెండు ఉదాంతాలు తెలియ జేస్తున్నాయి.

  2. చాలా చక్కగా రాసారు సార్ . మరి ముక్యంగా చెప్పాలి అంటే బహుళజాతి సంస్థల లాభాల వేటలో ఈ సంఘటన ఒక మచ్చుతునక మాత్రమే .

  3. ప్రత్రికల్లొ రాశేదంతా నిజం కాదని ఇండియన్ ప్రత్రికలకుకుడా తెలుసు అవి కుడా ఆపనిచేస్తూవుంటాయి కాబట్టి. ప్రభుత్వాన్ని బట్టి ప్రత్రికలు వుంటాయి ఇండియన్ ప్రభుత్వం అమెరికాను వెతిరేకంగా ఒక్క మాటా మాట్లాడవు . ప్రభుత్వాన్ని బట్టి ప్రత్రికలునూ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s