తీవ్ర ఆకలితో (chronic hunger) అలమటిస్తున్నవారు ప్రపంచంలో 84.2 కోట్లమందని ఐరాస ప్రకటించిన నివేదిక ఒకటి తెలిపింది. 2010-12 కాలంలో ఈ సంఖ్య 86.8 కోట్లని, 2011-13 కాలంలో అది 2.6 కోట్లు తగ్గిందని సదరు నివేదిక తెలిపింది. కాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తీవ్రంగా ఆకలిగొన్నవారు 1.57 కోట్లమంది ఉండడం గమనార్హం. ‘ప్రపంచంలో ఆహార అబధ్రత పరిస్ధితి’ అన్న నివేదికలో ఐరాస ఈ అంశాలను తెలియజేసింది.
ఐరాసలోని ఆహార విభాగం ఎఫ్.ఎ.ఓ (Food and Agricultural Organisation) ప్రతి సంవత్సరం ఈ నివేదికను ప్రచురిస్తుంది. అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (IFAD), ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) సంస్ధలు కూడా ఈ నివేదిక తయారీ, ప్రచురణలో భాగస్వాములు. ‘తీవ్ర ఆకలి’ అంటే ‘చురుకైన, ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి తగిన ఆహారం లేకపోవడం’ గా నివేదిక నిర్వచించింది.
జి.డి.పి వృద్ధి?
నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్ధిక వృద్ధి కొనసాగుతుండడం వలన ఆహార లభ్యత పెరిగిందట. వ్యవసాయ ఉత్పాదకత పెరగడం, వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగడమే కాక ప్రైవేటు కంపెనీలకు ఆసక్తి మళ్ళీ పెరగడం వలన కూడా ఆహార లభ్యత పెరిగిందని నివేదిక చెప్పింది. కానీ ఇవేవీ భారత దేశంలో కనపడవు. ఆర్ధిక వృద్ధి కొనసాగకపోగా గత రెండేళ్లలో ఇక్కడ జి.డి.పి వృద్ధి రేటు పడిపోయింది. 2011-12లో ఇండియా జి.డి.పి వృద్ధి రేటు 6.5 శాతం కాగా 2012-13లో 5 శాతానికి తగ్గిపోయింది. 2013-14 మొదటి త్రైమాసికంలో అయితే అది ఇంకా తగ్గి 4 శాతానికి చేరింది.
ప్రపంచంలోనే అత్యధికంగా వృద్ధి చెందుతున్న చైనా వృద్ధి కూడా 7.5 శాతానికి పడిపోయింది. అమెరికా, ఐరోపాల్లోనైతే వృద్ధి రేటు 1 లేదా 1.5 శాతం దాటడమే కనాకష్టంగా మారిపోయింది. ప్రపంచ బ్యాంకు గానీ, ఐ.ఏం.ఎఫ్ గానీ ప్రపంచ ఆర్ధిక వృద్ధి పడిపోయిందని చెప్పాయే గానీ పెరిగిందని చెప్పలేదు. ఇండియాలో వ్యవసాయ వృద్ధి ఆశాజనకంగా లేదని, వృద్ధి క్షీణతను అడ్డుకోవాలని భారత ప్రధాని కూడా అనేకసార్లు వాపోయారు. ఇక కొనసాగుతున్న ఆర్ధిక వృద్ధి, వ్యవసాయ ఉత్పాదకత పెంపుదల అని ఐరాస ఏ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్లు?
బహుళ సంస్కృతి సఫలం?
దారిద్ర నిర్మూలనలో ఇతర దేశాలకు వలస వెళ్ళినవారు తమవారికి పంపుతున్న నిధులు ఒక ముఖ్యపాత్ర పోషించాయని నివేదిక తెలిపింది. అంటే కార్మికుల వలసలు వారి జీవన పరిస్ధితులు మెరుగుపరచడానికి దోహదం చేసాయేగానీ నష్టం కలిగించలేదని అర్ధం అవుతోంది. కానీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, బ్రిటిష్ ప్రధాని కామెరాన్, ఫ్రెంచి మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ అదేపనిగా కూసిన కూతలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ‘మల్టీ కల్చరలజిమ్’ లేదా ‘బహుళ సంస్కృతి విధానం’ విఫలం అయిందని వారు తమ తమ దేశాల్లో ఎన్నికల సందర్భంగా ప్రకటనలు గుప్పించారు.
ఈ ఐరోపా పాలకులకి పెట్టుబడులు నిరాటంకంగా ఎల్లలుదాటి ప్రవహించడానికి ‘ప్రపంచీకరణ’ కావాలి గానీ, కార్మికులు ఎల్లలు లేకుండా ప్రవహించడానికి మాత్రం అవసరం లేదు. కంపెనీల లాభదాహం, ప్రభుత్వాలు అనుసరించిన పొదుపు విధానాలు… మొదలయినవాటి కారణంగా నిరుద్యోగం, ఆకలి, దరిద్రం పెరిగుతుంటే దానికి కారణం వలస వచ్చినవారే అని వారు సిద్ధాంతాలు ప్రచారం చేశారు. అవి తప్పుడు సిద్ధాంతాలని ఐరాస నివేదిక స్పష్టం చేస్తోంది.
విధానాలు వదిలేసి…
వ్యవసాయ రంగంలో పోషక పదార్ధాలు కలిగిన ఆహారాలను మరింత ఉత్పత్తి చేసే వైపుగా దృష్టి పెడితే దరిద్రం విస్తారంగా ఉన్న చోట్ల కూడా ఆకలిని తగ్గించవచ్చని నివేదిక తెలిపింది. ప్రజారోగ్యం, విద్యా రంగాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా నిర్ధారించింది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పాదకత, ఆహార లభ్యత పెంచితే ఆకలి తగ్గుతుందని తెలిపింది. దానికి తగిన మార్గాలను ప్రభుత్వాలు అనుసరించడమే ఇప్పుడు కావలసింది.
కానీ ఇండియాలాంటి దేశాల్లో ప్రభుత్వాలు చేస్తున్నదేమిటి? అమెరికా, ఐరోపా రాజ్యాల ఆహార ఉత్పత్తికి మార్కెట్ లను తయారు చేసే విధానాలను వారు అనుసరిస్తున్నారు. అంటే రైతులకు ప్రభుత్వ మద్దతు తగ్గిస్తున్నారు. ఫిస్కల్ లోటు లక్ష్యం చేరేపేరుతో రైతులకు అరకొరగా ఇస్తున్న సబ్సిడీలను సైతం తగ్గిస్తున్నారు. రైతులు శతాబ్దాల తరబడి అభివృద్ధి చేసుకున్న సాంప్రదాయక విత్తన పంపిణీ వ్యవస్ధను ప్రమాదంలోకి నెట్టివేస్తూ మాన్సాంటో లాంటి బహుళజాతి విత్తన కంపెనీలకు పూర్తి అవకాశాలు ఇచ్చేస్తున్నారు.
బి.టి వంగడాలను ప్రవేశపెట్టి కీటక నాశనం బదులు కీటక వృద్ధికి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఫలితంగా రైతాంగం అంతకంతకూ ఎక్కువగా పురుగు మందులపై ఆధారపడుతూ పతనమవుతున్న దిగుబడులతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే పూనుకుని బి.టి పత్తితో పాటు బి.టి వంకాయ లాంటి ఆహార పంటలను కూడా బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడానికి బృహత్పధకం రచించి అమలు చేస్తోంది. ఐరాస నివేదికలో పేర్కొన్నట్లు పోషక ఆహార పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం బదులు పట్టి, పొగాకు లాంటి వాణిజ్య పంటలవైపు రైతులు ఆకర్షితులయ్యే విధానాలు అవలంబిస్తున్నారు. వ్యవసాయానికి ప్రభుత్వ ప్రాత్సాహాన్ని తగ్గిస్తూ కనీసం భూసారాన్ని పెంచే పరీక్షలను కూడా రైతులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు.
రైతుల చెంతకు మరిన్ని భూములను చేర్చే భూ సంస్కరణలకు దశాబ్దాలుగా అతీ గతీ లేదు. పైగా అభివృద్ధి పేరుతో రైతుల భూములను లాక్కొని ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు అప్పజెపుతున్నారు. ఇక ఆహార ఉత్పాదకత ఎలా పెరుగుతుంది? ఆహార లభ్యత ఎలా సాధిస్తారు?
ఇటువంటి విధానాల జోలికి పోకుండా ఐరాస ఎన్ని నివేదికలు వెలువరిస్తే మాత్రం ఏమి ప్రయోజనం?

Source: whitehouse.gov
అమెరికా లెక్క వేరు
అమెరికా ప్రభుత్వం లెక్క ప్రకారం ప్రపంచంలో తీవ్ర ఆకలి బాధితులు వంద కోట్లకు పైనే. అమెరికా ప్రభుత్వ వెబ్ సైటే స్వయంగా ఒకటిన్నర సంవత్సరం క్రితం ఈ సంగతి ప్రకటించింది. దరిద్రం ఆకలికి ప్రధాన కారణం అని తాము గుర్తించినట్లు సదరు వెబ్ సైట్ గొప్ప సిద్ధాంతం కనిపెట్టినట్లు చెప్పింది. ఆ మాత్రం చెప్పడానికి వైట్ హౌసే కావాలా?
విచిత్రం ఏమిటంటే ఆకలి వల్ల ప్రజాస్వామ్య వ్యవస్ధలు విఫలం అవుతాయనీ, అల్లర్లు పెరుగుతాయనీ, పౌరుల్లో అలజడి పెరుగుతుందనీ, ఘర్షణలు జరుగుతాయని అమెరికా ప్రభుత్వం గుర్తించడం. అమెరికాలో అస్సలు ప్రజాస్వామ్యం లేదని మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కొద్ది నెలల క్రితం ప్రకటించాడు. తమ ఏలుబడిలో ప్రజాస్వామ్యం మృగ్యం కావడానికి కూడా ఆకలే కారణమా? అమెరికా సమాధానం చెప్పాల్సి ఉంది.
ఈ నివేదిక ప్రకారం ఆహార సమస్యకు ప్రదానకారణం సమాజంలొ తగినన్ని తిండిగింజలు లేకనే అలమటిస్తున్నారని చెపుతుంది. అదేనిజమైతే మరి ఆ సమస్య ధనికవర్గానికి కుడా వెంటాడాలికదా?. బుర్జువా వాదం ఎప్పుడూ తలకిందులుగా వుంటుంది. సంక్షొభాల సమయంలొ సమాజం హఠార్తుగా ఆటవికదశలొకి వెళ్ళిపొయినట్లు అయిపొతుంది.కారణం మితిమీరిన ఉత్పత్తి కావలసిన పదార్తాలు వాళ్ళకళ్ళముందరే వుంటాయి. కాని అవి తమ విలువరూపాన్ని నిరూపించుకుంటే గాని అవికదలవు . ఈ కాలంలొనే ధనిక వర్గం మితిమీరిన విలాసాలతొ గడుపుతూ వుంటుంది.త్వరగా పాడయ్యె పడార్తాలను సముద్రాలలొ పారపొస్తారు లేదా వాటిని తినడానికి వీలులేకుండా విషం కలిపి పారేస్తారు. ఆ విధంగా తమ లాభాలను నిలబెట్టుకుంటారు.
డి. జి.పి. వౄద్ది చెందితే లేదా పెట్టుబడులు అధికంగా పెడితె తద్వరా పనిదొరుకుతుందని లేదా జీతాలు పెరుగుతాయని చెబుతారు. అంటె శత్రువు భలాన్ని ఎంత అధికంగా పెంచితే అన్ని ఎంగిలిమెతుకులు ఏరుకొవచ్చునని. వాడి అధికారాన్ని ఎంతగా పెంచితే లేదా వాడి ఆర్దిక శక్తిని ఎంతగా పెంచితే అంతగా బానిసబతుకులు బతకవచ్చునని. చెప్పటమే. కార్మిక వర్గానికి కావలసింది వాడి ఆర్దిక శక్తిని పెంచి తద్వరా బానిసజీతాలకొసం కాదు వాళ్ళుచెయ్యవలసింది. జీతాల వ్యవస్తనే రద్దు చెయ్యటం.