ప్రశ్న: రెపో రేటు, రివర్స్ రెపో రేటు గురించి వివరించగలరా?
జవాబు: ఈ ప్రశ్నకు సమాధానం వివిధ సందర్భాల్లో వివరించాను. కానీ అలాంటి సందర్భం మళ్ళీ వస్తే గుర్తు తెచ్చుకోడానికి పాఠకులకు ఇబ్బంది ఉన్నట్లు కనిపిస్తోంది. బహుశా వివరణలో కాకుండా, టపాలోనే ఈ పేర్లు ఉన్నట్లయితే వెతుక్కోడానికి కొంత సులభంగా ఉండవచ్చని మళ్ళీ వివరిస్తున్నాను. గతంలో ఇచ్చిన వివరణను విస్తృతం చేస్తున్నాను.
రిజర్వ్ బ్యాంకు నియంత్రణలో ఉండే వడ్డీ రేట్లను దేశంలో ద్రవ్య చలామణిని అదుపులో ఉంచడానికి ఉపయోగిస్తారు. అందుకే ద్రవ్య విధాన సమీక్ష జరిగినప్పుడల్లా ఏదో ఒక రేటు తగ్గించామనో, పెంచామనో లేదా పాతదే కొనసాగిస్తున్నామనో చెబుతారు. ద్రవ్య చలామణి నియంత్రణ కోసం ఆర్.బి.ఐ ప్రధానంగా మూడు రేట్లను వినియోగిస్తుంది.
కేష్ రిజర్వ్ రేషియో (సి.ఆర్.ఆర్): ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా తాను ప్రజల నుండి వసూలు చేసే డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంకు వద్ద జమ చేయాలి. అలా ఆర్.బి.ఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ చేయవలసిన కేష్ ని కేష్ రిజర్వ్ రేషియా అంటారు. ఇది చట్టబద్ధ ఏర్పాటు. డిపాజిటర్ల రక్షణ కోసం ఆర్.బి.ఐ ఈ చర్య తీసుకుంటుంది. సి.ఆర్.ఆర్ ను తగ్గిస్తే మరిన్ని నిధులు బ్యాంకులకు అందుబాటులోకి వస్తాయి. వివిధ కంపెనీలకు, వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అవకాశం వస్తుంది. సి.ఆర్.ఆర్ పెంచితే బ్యాంకుల వద్ద అందుబాటులో ఉండే నిధులు తగ్గిపోతాయి. ఆ మేరకు రుణాల జారీ కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం సి.ఆర్.ఆర్ 4 శాతం. (ఫిబ్రవరి 9 వరకు ఇది 4.25 శాతంగా ఉండేది.) సి.ఆర్.ఆర్ ను పక్షానికి ఒకసారి లెక్కిస్తారు.
రేపో రేటు: ఆర్.బి.ఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు ఆర్.బి.ఐ వసూలు చేసే రేటును రేపో రేటు (Repurchase rate) అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్.బి.ఐ ఈ రేపో రేటు నిర్ణయిస్తుంది. ఆర్.బి.ఐ యొక్క ద్రవ్య పరపతి విధానానికి ఇది ప్రధాన ఉపకరణం.
రేపో రేటు తగ్గితే వాణిజ్య బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద రుణాలు తీసుకోడానికి ఉత్సాహం చూపుతాయి. తద్వారా కంపెనీలకు, వ్యక్తులకు కూడా రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆర్.బి.ఐ రేపో రేటు తగ్గించినా దానిని జనానికి తరలించడానికి బ్యాంకులు ఆసక్తి చూపకపోవచ్చు. తద్వారా ఆదాయం పెంచుకోవాలని అవి చూడవచ్చు. రెపో రేటు విషయంలో ఆర్.బి.ఐ కీ, ప్రభుత్వానికీ మధ్యా, అలాగే ఆర్.బి.ఐ కీ పరిశ్రమ వర్గాల మధ్యా వైరుధ్యాలు ఉంటూ ఉంటాయి.
ప్రస్తుతం రేపో రేటు 7.5 శాతం. సెప్టెంబర్ 20, 2013 వరకు ఇది 7.25 శాతం మాత్రమే. ద్రవ్యోల్బణం పెరగడంతో సెప్టెంబర్ 20 తేదీనాటి ద్రవ్య సమీక్షలో ఆర్.బి.ఐ దీనిని పెంచింది.
రివర్స్ రేపో రేటు: బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉంది అనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వవచ్చు. అలా వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్.బి.ఐ చెల్లించే వడ్డీ రేటు రివర్స్ రేపో రేటు. ఇది ఎల్లప్పుడూ రెపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. ఆర్.బి.ఐ వద్ద ఉన్న డబ్బు పదిలంగా ఉంటుంది అనేది ఒక నిశ్చిత(నిశ్చింత) అవగాహన. మార్కెట్లో అస్ధిరర పరిస్ధితులు ఉన్నపుడు బ్యాంకులు తమ అదనపు డబ్బును ఆర్.బి.ఐ వద్ద ఉంచడానికి ఇష్టపడతాయి. తద్వారా తక్కువే అయినా నమ్మకమైన, స్ధిరమైన వడ్డీ ఆదాయాన్ని అవి పొందుతాయి.
రివర్స్ రెపో రేటు గతంలో స్వతంత్రంగా ఉండేది. అంటే రెపో రేటుతో సంబంధం లేకుండా నిర్ణయించేవారు. మే 3, 2011 తేదీన ద్రవ్య విధానాన్ని సమీక్షిస్తూ ఆర్.బి.ఐ దీనిని రెపో రేటుతో అనుసంధానం చేసింది. అంటే రెపో రేటు మారినప్పుడల్లా ఇది ఆటోమేటిక్ గా 1 శాతం (100 బేసిస్ పాయింట్లు) తక్కువ ఉండేలా నిర్ణయించింది. అప్పటినుండి ఆ విధానం అమలవుతోంది. మళ్ళీ ఆర్.బి.ఐ ఈ లింకును తొలగించాలనుకుంటే తొలగించవచ్చు కూడా.
ఈ మూడు కాకుండా మరో రెండు రేట్లు ఆర్.బి.ఐ ఆధీనంలో ఉన్నాయి. అవి:
ఎస్.ఎల్.ఆర్ (Statutory Liquidity Ratio): వాణిజ్య బ్యాంకులు తాము సేకరించిన డిపాజిట్లలో నిర్దిష్ట మొత్తాన్ని బంగారం తదితర విలువైన లోహాల రూపంలోనూ, ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలోనూ ఉంచాలి. ఇది గరిష్టంగా 40 శాతం కనిష్టంగా 23 శాతం ఉండవచ్చు. ఎంత ఉండాలనేది ఆర్.బి.ఐ నిర్ణయిస్తుంది. ప్రభుత్వం జారీ చేసే బాండ్లు తదితర సెక్యూరిటీల కంటే తక్షణ లాభాలు వచ్చే షేర్ మార్కెట్లలో మదుపు చేయడానికే వాణిజ్య బ్యాంకులు ఎక్కువ ఆసక్తి చూపుతాయి. కానీ ఎక్కువ లాభాలు వచ్చే మార్కెట్లు స్ధిరంగా ఉండవు. అప్రమత్తంగా లేకపోతే నష్టాలు తధ్యం. ఈ పరిస్ధితిని నివారించడానికి ఉద్దేశించినదే ఎస్.ఎల్.ఆర్. వాణిజ్య బ్యాంకుల్లోని డిపాజిట్ల స్వభావాన్ని బట్టి ఎస్.ఎల్.ఆర్ ని ఆర్.బి.ఐ నిర్ణయిస్తుంది.
ప్రస్తుతం ఎస్.ఎల్.ఆర్ 23 శాతం. అంటే ఒక వాణిజ్య బ్యాంకు తన డిపాజిట్లలో 23 శాతాన్ని బంగారం + ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో తప్పనిసరిగా ఉంచాలి. ఎస్.ఎల్.ఆర్ ద్వారా డిపాజిట్ దారుల సొమ్ముకు సాపేక్షిక భద్రతను ఆర్.బి.ఐ కాపాడుతుంది.
ఎం.ఎస్.ఎఫ్ (Marginal Standing Facility Rate): ఇది గతంలో లేదు. మే 3, 2011 తేదీ నుండి బ్యాంకుల సౌకర్యం కోసం ఆర్.బి.ఐ దీనిని ఉనికిలోకి తెచ్చింది. దీని గురించి చెప్పాలంటే ముండూ కొన్ని అంశాలను చూడాలి.
వాణిజ్య బ్యాంకులు ప్రధానంగా రెండు పద్ధతుల్లో డిపాజిట్లు సేకరిస్తాయి. ఒకటి Time Liabilities. అంటే నిర్దిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేస్తే నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట వడ్డీ కలిపి చెల్లిస్తామని చెప్పి డిపాజిట్ సేకరిస్తుంది. ఉదా: ఫిక్స్ డ్ డిపాజిట్లు. రెండు Demand Liabilities. అంటే ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు తిరిగి ఇచ్చేస్తామని చెప్పి డిపాజిట్లు సేకరించడం. ఉదా: సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, కరెంటు ఖాతా.
ఈ విధంగా సేకరించిన డిపాజిట్లలో రెండు పక్షాల కిందటి (నెల క్రిందటి) నికర Time + Demand మొత్తంలో (Net Demand and Time Liabilities) 2 శాతం మేర రుణాలుగా వాణిజ్య బ్యాంకులు తీసుకోవచ్చని ఆర్.బి.ఐ ప్రతిపాదించి అమలు చేస్తోంది. ఈ రుణం పైన ఆర్.బి.ఐ వసూలు చేసే వడ్డీ రేటును ఎం.ఎస్.ఎఫ్ రేటుగా పిలుస్తారు. ఇది రెపో రేటు కంటే ఎప్పుడూ 200 బేసిస్ పాయింట్లు (2 శాతం) ఎక్కువ ఉండేలా చూస్తారు. మొదట 3 శాతంగా ఉంటే దానిని 2 శాతానికి తగ్గించారు.
ఎం.ఎస్.ఎఫ్ ద్వారా ప్రధానంగా అదనపు లబ్దిపొందేదీ కంపెనీలు, ధనికులు.
పింగ్‌బ్యాక్: సి.ఆర్.ఆర్, రెపో, రివర్స్ రెపో రేట్లు అంటే? | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ | తుమ్మెద
వడ్డీ రేటు రివర్స్ రేపో రేటు. ఇది ఎల్లప్పుడూ రివర్స్ రేపో రేటు కంటే తక్కువగా ఉంటుంది.ikkaDa repo kantE takkuva ani unDaalanukuntaa…
అవును. సవరించాను. ధన్యవాదాలు ఎఎఎ గారూ.
sir eng translation unte chala baguntundi . so, I kindly requesting you, please translate into eng.this is very usefull website to know about world
sir not only this an essay but other an essays also please sir
యాకయ్య గారు, చాలా విచిత్రమైన కోరిక కోరారు. ‘నెట్ లో నాలెడ్జ్ అంతా ఇంగ్లీష్ లోనే ఉంది. అందువల్ల ఈ తెలుగు బ్లాగ్ వల్ల చాలా ఉపయోగంగా ఉంది’ అని చాలామంది చెప్పారు. మీరేమో ఇంగ్లీష్ లో కావాలంటున్నారు! మీకు తెలుగు అర్ధం కాదా లేక ఇంకేమన్నానా?
ఇంగ్లీష్ లో వీటిని వివరించే సైట్లు చాలా ఉన్నాయి. వెతికితే తప్పకుండా దొరుకుతాయి. ఓ సారి ట్రై చెయ్యండి.
ఎం.ఎస్.ఎఫ్ ద్వారా ప్రధానంగా అదనపు లబ్దిపొందేదీ కంపెనీలు, ధనికులు.sir, can u elaborate it, how it is?
Exalent telugu blog sir
Very very thank u
Archaka
Sln temple Kadiri
adak1730 గారు ఆలయ అర్చకులు అయిన మీకు ఈ బ్లాగ్ చూసే అవసరం లేదా రెపో రేటు గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ఎలా, ఎందుకు వచ్చింది?
క్యూరియాసిటీతో మాత్రమే అడుగుతున్నాను. ఇతరత్రా ఏమన్నా అర్ధం వస్తే దానిని స్వీకరించవద్దని కోరుతున్నాను.
ధన్యవాదాలు!
-విశేఖర్