మన్మోహన్: రాహుల్ గాంధీ బరువు తూచే యంత్రం?


Manmohan, a weighing machine

అధికారం, హోదా అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయని/చేయలేని వ్యక్తిని ‘ఉత్సవ విగ్రహం’గా చెప్పుకోవడం పరిపాటి!అవడానికి ప్రధమ పౌరుడే అయినా ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలూ లేని, కేవలం కేంద్ర మాంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలపైన సంతకం మాత్రమే పెట్టగల రాష్ట్రపతిని ‘రబ్బర్ స్టాంప్’ గా సంభోధించడమూ తెలిసిందే. ప్రధాన మంత్రి పదవి వీటికి భిన్నం. అది భారత దేశంలో అత్యున్నత అధికారం కలిగిన పదవి. ఆ పదవిని అమెరికా కంపెనీలకు తప్ప భారత దేశ ప్రజలకు ఉపయోగించని మన్మోహన్ తాజాగా రాహుల్ గాంధీ బరువు తూచే యంత్రంగా మారిపోయారని కార్టూన్ సూచిస్తోంది.

కాంగ్రెస్ నేతృత్వంలోని పాలకవర్గాలకు రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీని నిలబెట్టడానికి అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి పెద్దగా ఫలించడం లేదు. ఉత్తర ప్రదేశ్ లాంటి చోట్ల పార్టీకి పునరుజ్జీవనం సాధించడం ద్వారా ఆయనను తిరుగులేని నాయకుడుగా చేద్దామనుకుంటే అదీ కుదరలేదు. రాహుల్ రంగం మీదికి వచ్చాక ఉన్న బలం కూడా అక్కడ పడిపోయింది. రాహుల్ వల్లనే బలహీనపడింది అనలేమ్ గానీ ఆయన వల్ల పార్టీ ఎక్కడా బలపడిన చరిత్ర లేదు మరి!

పోనీ పార్లమెంటు చర్చల్లో భారీ ఎత్తున ప్రసంగాలు చేసి ప్రతిపక్షాలను ఇరుకున పెట్టగల నేతా అంటే అదీ కాదు. పదేళ్లుగా అధికారంలో ఉన్నందున ప్రజా సమస్యలను లేవనెత్తే ఛాంపియన్ గా అవతరించే అవకాశం ఆయనకు దక్కలేదు. నోరూ, వాయా లేని వ్యక్తి ప్రధాని పదవిలో ఉన్నారు గనక సరిపోయింది గానీ లేకపోతే పదేళ్ళు ప్రధాని పదవిలో కూర్చుని కూడా దేశాన్నీ, ప్రజలనూ ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోవడం ఎలా సాధ్యం అవుతుంది? చివరికి తెలుగు సరిగ్గా మార్లాడలేని కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ‘సమైక్యాంధ్ర’ ఛాంపియన్ గా కొద్దో గొప్పో పేరు తెచ్చుకుంటున్న పరిస్ధితి!

రాహుల్ గాంధీ బరువును కృత్రిమంగా పెంచడానికి అనేక ప్రయత్నాలు గతంలో సాగాయి. ఉదాహరణకి గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రెడిట్ రాహుల్ కి ఆపాదించడానికి ప్రయత్నం జరిగింది. ఆ పధకాన్ని మొదట ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లోనే అమలు చేశారు. అనంతరం కేంద్ర కేబినెట్ కూర్చుని దాన్ని దేశం అంతా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాన్ని అప్పటి గ్రామీణ శాఖా మంత్రి రఘువంశ ప్రతాప్ సింగ్ (అనుకుంటా) ప్రకటించాక రాహుల్ గాంధీ హడావుడిగా ఒక యువ ఎం.పిల బృందాన్ని వెంటేసుకుని వెళ్ళి ప్రధాని మన్మోహన్ ని ‘ఉపాధి హామీ పధకాన్ని దేశం అంతా అమలు చేయాలని’ డిమాండ్ చేశారు.  తద్వారా రాహుల్ వల్లనే అది జరిగిందని చెప్పడానికి ప్రయత్నించారు.

యు.పి.ఏ కూటమి రెండోసారి అధికారంలోకి రావడానికి ఉపాధి హామీ పధకమే కారణమని చెబుతారు. అందులో నిజం లేకపోలేదు. కానీ ఆ పధకం క్రెడిట్ రాహుల్ కి ఆపాదించాలన్న ప్రయత్నం ప్రజల్లో పెద్దగా వెళ్లలేదు. రెండు రోజుల క్రితం శిక్ష పడిన ప్రజా ప్రతినిధులను కాపాడే ఆర్డినేన్సు పట్ల రాహుల్ గాంధీ తలవని తలంపుగా వచ్చి ఫైర్ కావడంలో కూడా ఇలాంటి వ్యూహమే ఉన్నది. ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి వెనక్కి తిప్పి పంపే పరిస్ధితి కనిపించడం, మొదట సహకరిస్తామని చెప్పిన బి.జె.పి ఆర్డినెన్స్ పై విమర్శలు గుప్పించడం తదితర పరిణామాల నేపధ్యంలో ఆర్డినెన్స్ ను రద్దు చేసుకోక తప్పని పరిస్ధితి ఎదురయింది. కానీ రద్దు చేసుకుంటే ఆ క్రెడిట్ ప్రతిపక్షాలకో, రాష్ట్రపతికో వెళ్ళే బదులు కాంగ్రెస్ కి ఎందుకు రాకూడదు? కాంగ్రెస్ కి వచ్చే క్రెడిట్ ఎవరో ఒకరికి వెళ్ళే బదులు రాహుల్ గాంధీకి ఎందుకు రాకూడదు? ఈ ప్రశ్నలకు సమాధానమే రాహుల్ ‘నాన్సెన్స్’ వ్యాఖ్య!

ఒక గీతను చెరిపివేయకుండానే చిన్నది చేయాలంటే దాని పక్కన మరో పెద్ద గీత గీసే సూత్రం అందరికీ తెలిసిందే. ఈ ఒరవడిలోనే రాహుల్ గాంధీ ప్రధాని పదవికి తగిన అభ్యర్ధి అని రుజువు కావాలంటే ఉన్న ప్రధానిని తగని వ్యక్తిగా చూపడం ఒక మార్గం. ఫలితంగా మన్మోహన్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదించిన ఆర్డినేన్సు ‘నాన్సెన్స్’ గానూ, ‘చించి పారేయాల్సిన కాగితం’గానూ రాహుల్ నోట పలికించారు. ఈ దెబ్బతో రాహుల్ గాంధీ బరువు అమాంతం పెరిగిపోవాలని ఆశించారు. ఆ ఆశ నెరవేరిందో లేదో తెలియదు గానీ మన్మోహన్ పాత్ర ఏమిటో మరోసారి లోకానికి రుజువయింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s