‘ఎంకి చావు, సుబ్బు చావుకొచ్చింది’ అని కొత్త సామెత రాసుకోవాలి. అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహాలకు గేట్లు తెరిచిన ‘ప్రపంచీకరణ’ విధానాలు ఆర్ధిక వ్యవస్ధలను అతలాకుతలం చేయగల శక్తిని సంతరించుకోగా, పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్కల్లాగా షేర్ల వ్యాపారంలో అదృష్టం పరీక్షించుకుంటున్న మధ్యతరగతి జనం చివరకు దురదృష్ట జాతకులై తేలుతున్నారు. లేకపోతే అమెరికాలో రిపబ్లికన్-డెమోక్రటిక్ పార్టీల సిగపట్లు, ఇటలీలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అవినీతి సామ్రాట్లు ఇండియా షేర్ మార్కెట్లను కుదేయడం ఏమిటి?
సోమవారం బి.ఎస్.ఇ సెన్సెక్స్ 350 పాయింట్లు కోల్పోయింది. ఇది 1.8 శాతం పతనంతో సమానం. అక్టోబర్ 1 తో ప్రారంభం కానున్న కొత్త ఆర్ధిక సంవత్సరానికి కనీసం తాత్కాలిక బడ్జెట్ ఆమోదించడానికి కూడా అమెరికా పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో ఆ ప్రభావం భారత షేర్ మార్కెట్లపై పడిందని రాయిటర్స్ వార్తా సంస్ధ చెప్పింది. బడ్జెట్ ఆమోదం పొందకపోతే అమెరికాలో అత్యవసర సర్వీసులు మినహా ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసేస్తారు. చాలా ఆఫీసుల్లో పని చేస్తున్నవారికి మూతపడినన్ని రోజులు వేతనాలు ఇవ్వరు.
అటువంటి పరిస్ధితి వల్ల ప్రధానంగా నష్టపోయేది వేతన జీవులు, వారిపై ఆధారపడి ఉండే చిన్న వ్యాపారులే. బడా కంపెనీలకు పోయేదేమీ లేదు. అందుకేనేమో రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీల్లో ఏదీ కూడా చర్చించుకుని సమస్యను పరిష్కారం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్ధితి మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పనులు జరగని మేరకు ఉత్పత్తి ఆగిపోయి జి.డి.పి తగ్గుతుంది. అసలే జి.డి.పి వృద్ధి లేమితో సతమతం అవుతున్నందున అదనపు నష్టం అంతిమంగా ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు. అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో భయం జొరబడితే అది ఇతర దేశాల కాళ్ళు వణికిస్తుంది కదా!
ఇటలీలో అవినీతి సామ్రాట్టుగా పేరు పొందిన సిల్వియో బెర్లుస్కోని ప్రభుత్వం నుండి అర్ధాంతరంగా వైదొలగడంతో అక్కడి ప్రభుత్వం కాస్తా కుప్పకూలే ప్రమాదం ఎదుర్కొంటోంది. ఇది కూడా భారత షేర్ మార్కెట్ పై ప్రభావం చూపిందని పత్రిక తెలిపింది. ప్రభుత్వాలని కూల్చేసే బలాన్ని ఇచ్చాక అవినీతి పరులు ఊరకనే కూర్చోరు కదా! అనేక అవినీతి కేసులు ఎదుర్కొంటున్న బెర్లుస్కోని తనకు కేసుల నుండి విముక్తి కల్పించేందుకు చేస్తున్న బేరసారాలు అక్కడి ప్రభుత్వాన్ని బలహీనపరిచాయి.
ఇటలీలో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. అందులో ఎవరికీ మెజారిటీ రాలేదు. బెర్లుస్కోని నేతృత్వంలోని మితవాద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లు రాకపోయినా కూల్చేసే సీట్లు మాత్రం దండిగా వచ్చాయి. బెర్లుస్కోని పార్టీతో పొత్తు పెట్టుకుని మధ్యేవాద కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం కూలిపోవడం అంటే ఇటలీపై ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు రుద్దిన పొదుపు విధానాలు, సంస్కరణ విధానాలు అమలు చేసేందుకు స్ధిరమైన ప్రభుత్వం లేకపోవడం. అంటే ఋణ సంక్షోభం సాకుతో పొదుపు విధానాల ద్వారా వేతన జీవుల కష్టార్జితాన్ని లాభాలుగా తరలించుకుంటున్న కంపెనీల లాభాలకు గ్యారంటీ లేకపోవడం.
యూరో జోన్ లో ఇటలీ మూడో పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. యూరప్ లో నాలుగో పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. అలాంటి ఆర్ధిక వ్యవస్ధలో రాజకీయ అస్ధిరత చేరితే సహజంగానే ఆర్ధిక భయాలు తలెత్తుతాయి. దానితో ముడిపడి ఉన్న ఇతర ఆర్ధిక వ్యవస్ధలు కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కొంటాయి. ఆ విధంగా ఇటలీలో రాజకీయ సంక్షోభం ఇండియా షేర్ మార్కెట్లపై ఒక చూపు చూసింది.
అమెరికా, ఇటలీలే కాక ఆర్.బి.ఐ గవర్నర్ ఇటీవల ద్రవ్య విధానాన్ని సమీక్షిస్తూ వడ్డీ రేటును పెంచిన ప్రభావం కూడా భారత షేర్లను వీడలేదని రాయిటర్స్ చెబుతోంది. అలాగయితే గత వారం షేర్లు ఎందుకు పెరిగినట్లు?