హృదయం ద్రవించుకుపోయే కీన్యా మాల్ రక్తపాతం -ఫోటోలు


కీన్యా రాజధాని నైరోబిలోని ‘వెస్ట్ గేట్ మాల్’ పైన నాలుగు రోజుల పాటు జరిగిన రక్తపాతం నాగరిక ప్రపంచాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ అయిన ఆల్-షబాబ్, ఈ దాడికి తానే బాధ్యురాలినని ప్రకటించింది. దాడిలో 61 మంది సాధారణ పౌరులు చనిపోగా ఇంకా 63 మంది జాడ తెలియలేదు. చనిపోయినవారిలో కిన్యా అధ్యక్షుడు కీన్యెట్టా రక్త సంబంధీకులు కూడా ఉన్నారు. ఆల్-షబాబ్ టెర్రరిస్టులు విసిరిన గ్రెనేడ్ల ధాటికి నాలుగు అంతస్ధుల మాల్ లోని మూడు అంతస్ధులు పాక్షికంగా కూలిపోయాయి. జాడ తెలియనివారు ఈ శిధిలాల్లో ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.

దాడి చేసిన టెర్రరిస్టుల్లో అమెరికా, బ్రిటిష్ పౌరులు కూడా ఉన్నారని అధ్యక్షుడు కీన్యెట్టా ప్రకటించాడు. చనిపోయినవారిలో కూడా పశ్చిమ దేశాల పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్-షబాబ్ సంస్ధ సోమాలియా ఆధారంగా పని చేస్తున్న ముస్లిం టెర్రరిస్టు సంస్ధ. దీని మాతృ సంస్ధ ఆల్-ఖైదా కాగా లిబియా టెర్రరిస్టు సంస్ధ LIFG తోనూ, మరో ఆల్-ఖైదా పిల్ల సంస్ధ AQIM తోనూ అన్నిరకాల సంబంధాలు ఉన్నాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ల మద్దతుతో సిరియాలో సాగుతున్న ‘కిరాయి తిరుగుబాటు’కోసం ఈ సంస్ధలన్నీ జిహాదిస్టులను సరఫరా చేస్తున్నాయి. సిరియాలో ఎవరికైతే డబ్బు, ఆయుధాలను పశ్చిమ దేశాలు సరఫరా చేస్తున్నాయో అవే సంస్ధలు కిన్యా మాల్ దాడికి ప్రధాన బాధ్యులు.

కీన్యా మాల్ పై దాడికి తక్షణ కారణం 2011లో సోమాలియాపై కిన్యా జరిపిన దురాక్రమణ దాడి. అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఈ దాడికి సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. ఆయుధాలు, మందుగుండు సరఫరా చేశాయి. స్వయంగా తమ మిలట్రీ సలహాదారులను కూడా దింపాయి. ఈ మేరకు కీన్యా ప్రభుత్వమే అంగీకరించిందని బ్రిటిష్ పత్రిక ఇండిపెండెంట్ తెలిపింది. ఆల్-షబాబ్ మిలిటెంట్లపై తాము చేసిన దాడికి అమెరికా, ఫ్రాన్స్ లు సహకరించాయని తగిన సహాయం ఇచ్చాయని కీన్యా ప్రభుత్వం తెలిపింది. సోమాలియా దాడి సందర్భంగా తమ దేశంలో అమెరికా, ఫ్రాన్స్ మిలట్రీ సలహాదారులు ఉండడం వలన అప్పట్లో కీన్యా అధ్యక్షుడు, ప్రధానుల మధ్య విభేదాలు కూడా తలెత్తాయి. విదేశీ మిలట్రీ సలహాదారుల ఉనికి పట్ల దేశాధ్యక్షుడు తన అసంతృప్తి ప్రకటించినట్లు పత్రికలు తెలిపాయి.

ఇస్లామిక్ టెర్రరిస్టు సంస్ధ ఆల్-ఖైదా పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవంలో ఆ సంస్ధ పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు వ్యూహాత్మక మిత్రుడు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ప్రత్యర్ధిగా ఎదుగుతున్న చైనా-రష్యా కూటమిని ఎదుర్కోవడానికి ఆల్-ఖైదా అమెరికాకు సహకరిస్తుంది. అయితే ఈ సహకారం నేరుగా కనపడదు. దాని పని అమెరికా మిలట్రీ జోక్యానికి తగిన పరిస్ధితులను సృష్టించడం. చైనా, రష్యా లేదా ఇతర ప్రత్యర్ధి దేశాల ప్రాబల్యం పెరుగుతున్న చోట ఎక్కడైనా అమెరికా జోక్యం చేసుకోవాలంటే ఆల్-ఖైదా, దాని అనుబంధ సంస్ధలు మొదట అక్కడ టెర్రరిస్టు చర్యలకు దిగుతాయి. ఆ తర్వాత ఆల్-ఖైదా బూచిని చూపి అమెరికా, ఐరోపాలు మిలట్రీ చర్యలకు దిగుతాయి. ఇది గత రెండు, మూడు దశాబ్దాలుగా జరుగుతున్న తంతు.

ఆఫ్రికాలో చైనా ప్రాబల్యం విస్తృతం అవుతోంది. అనేక ఆఫ్రికా దేశాల్లో చైనా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఐ.ఎం.ఎఫ్ ఇచ్చే రుణాల కంటే సరసమైన వడ్డీకి, షరతులు ఏమీ లేకుండానే చైనా ఇబ్బడి ముబ్బడిగా రుణాలు మంజూరు చేస్తోంది. చైనా ప్రాబల్య విస్తరణకు అడ్డుకోవడానికి, ఉత్తర ఆఫ్రికా అంతటా విస్తరించిన తౌరెగ్ గిరిజన తెగల స్వాతంత్ర్య పోరాటాన్ని అణచివేయడానికి మాలి దేశంపై గత సంవత్సరం ఫ్రాన్స్ దాడి చేసింది. ఆ దాడికి ముందు కూడా లిబియా నుండి వచ్చిన AQIM (Al-Qaeda in Islamic Maghreb) తీవ్రవాదులు ఉత్తర మాలిని ఆక్రమించారు. వారిని చూపి ఫ్రాన్స్ ఆ దేశంపై దాడి చేసింది. ఇప్పుడా దేశంలో ఫ్రాన్స్ బలగాలు స్ధావరం ఏర్పరచుకుని చైనా ప్రాబల్య విస్తరణను అడ్డుకునే పనిలో ఉన్నాయి.

ఇదే వ్యూహాన్ని సోమాలియాపై అమలు చేయడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు పన్నిన పధకంలో భాగమే కీన్యా వెస్ట్ గేట్ మాల్ పై జరిగిన దాడి. కీన్యా మాల్ దాడి అనంతరం సోమాలియాపై పూర్తిస్ధాయి దాడి చేయాలని అమెరికా, ఐరోపా పత్రికలు ప్రచారం ప్రారంభించాయి. నిజానికి సోమాలియాపై అమెరికా ఇప్పటికే రెండు సార్లు దాడి చేసింది. బుష్ అధ్యక్షరికంలో 2006లో ఒకసారి, ఒబామా అధ్యక్షరికంలో 2011లో మరోసారి సోమాలియాపై అమెరికా దాడి చేసింది. ఆ దాడులు కాకుండా అమెరికా డ్రోన్ లు నిత్యం సోమాలియాపై క్షిపణి దాడులు జరుపుతుంటాయి. ఈ దాడుల్లో వందలాది అమాయక పౌరులు చనిపోతున్నా ప్రపంచానికి, ముఖ్యంగా పశ్చిమ పత్రికలకు పట్టదు.

ఆల్-షబాబ్ జరిపిన దాడికి తక్షణ బాధ్యులు జిహాదిస్టులే. కానీ టెర్రరిస్టు దాడులను తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం సాగిస్తున్న అమెరికా పాత్రను విస్మరించడం మహా దోషం అవుతుంది. పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద ఎత్తుగడలు ఎలా ఉంటాయంటే ఒక ప్రాంతంలో జరుగుతున్న యుద్ధంలో రెండువైపులా వారు సహాయం చేస్తుంటారు. ఆ యుద్ధం అలా కొనసాగుతూ ఉంటూనే అక్కడ తమ పాత్ర అవసరం ఏర్పడుతుంది. ఈ యుద్ధాలకు ఫైనాన్స్ చేసేది వాల్ స్ట్రీట్, ద సిటీ (లండన్), ఫ్రాంక్ ఫర్ట్ (జర్మనీ) తదితర బడా బడా బహుళజాతి ఫైనాన్స్ కంపెనీలే. ఉదాహరణకి ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలకు 4 నుండి 6 ట్రిలియన్ల వరకు ఖర్చయ్యాయని ఒక అంచనా. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళినట్లు? పశ్చిమ దేశాల రుణాల రూపంలో ఫైనాన్స్ కంపెనీలు దీనిని సొమ్ము చేసుకున్నాయి. (పాఠకుల్లో ఎవరికైనా ఆసక్తి ఉంటే The International అనే హాలీవుడ్ సినిమాను చూడవచ్చు. ఇందులో వాల్ స్ట్రీట్ కంపెనీలు తమ లాభాల ప్రవాహం కోసం యుద్ధాలను ఎలా రేపుతాయన్నది చూపారు)

కాబట్టి ఆల్-షబాబ్ దాడి దుర్మార్గమే. కానీ వారి వెనుక ఉన్న అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, కతార్, టర్కీ తదితర దేశాల పాలకులది ఇంకా పచ్చి దుర్మార్గం.

ఈ ఫోటోలను బోస్టన్ పత్రిక అందించింది. హాలీవుడ్ సినిమా ఫైటింగ్ దృశ్యాలను తలదన్నుతున్న ఈ పోరాట దృశ్యాలు పౌరుల ఆవాసాల్లోకి చొచ్చుకు వచ్చిన సామ్రాజ్యవాద యుద్ధాన్ని మన కళ్లముందు ఉంచుతాయి.

One thought on “హృదయం ద్రవించుకుపోయే కీన్యా మాల్ రక్తపాతం -ఫోటోలు

  1. హృదయవిదారకంగా…గుండెలు తరుక్కుపోయేలా ఉన్నాయి ఫోటోలు.
    బహుశా ఇటువంటి సందర్భంలోనే మహాకవి దాశరథి రాసి ఉంటాడు…..
    దుర్మార్గుల అకృత్యాలకు బలికాని పవిత్రులెందరో……. అని

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s