హార్డ్ డిస్క్ సహా ఇండియా జాతకం అమెరికా గుప్పిట్లో -స్నోడేన్ పత్రాలు -1


Indian Embassy in Washington DC

Indian Embassy in Washington DC

అమెరికా నీతిమాలిన గూఢచర్యం గురించి కళ్ళు తిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండియా తనకు ఎంతో కావలసిన మిత్రుడు అని ప్రపంచానికి చాటే అమెరికా, తన గడ్డపై (వాస్తవానికి అది రెడ్ ఇండియన్ల గడ్డ)  ఇండియాకు సంబంధించి ఏ కార్యాలయాన్నీ గూఢచర్యం నుంచి మినహాయించలేదు. చివరికి, భారత దేశం యొక్క ప్రపంచ స్ధాయి దౌత్య కార్యకలాపాలకు గుండెకాయ లాంటివి అయిన న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ డి.సి లోని భారత ఎంబసీ లను కూడా ఎన్.ఎస్.ఏ గూఢచర్యానికి లక్ష్యాలుగా అమెరికా ఎంచుకుంది. ‘తన ఆగర్భ మిత్రులయిన ఐరోపా దేశాల పైనే గూఢచర్యం చేయగా లేనిది అమెరికాకి ఇండియా ఒక లెక్కా’ అని రహస్యంగా నిట్టూర్చడం తప్ప భారత అధికారులు నోరు మెదపడం లేదు. కాగా ‘అందరూ చేసేదే, మేమూ చేస్తున్నాం’ అంటూ అమెరికా తన చర్యలను సిగ్గువదిలి సమర్ధించుకుంటోంది.

అమెరికా గూఢచారి సంస్ధలు సి.ఐ.ఏ, ఎన్.ఎస్.ఏ లలో పని చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ విడుదల చేసిన పత్రాల కలకలం ఇంకా ముగియలేదు. ప్రపంచవ్యాపితంగా ఉన్న వివిధ పత్రికల్లో వరుసపెట్టి ప్రచురితం అవుతున్న కధనాలు అమెరికా ఆధిపత్య దాహాన్నీ, అంతర్జాతీయ చట్టాలను పాటించడం పట్ల ఆ దేశానికి ఉన్న విముఖతని, నిత్యం డబ్బాలు కొట్టుకునే దాని ప్రజాస్వామ్యపు డొల్లతనాన్ని పచ్చిగా ఆరబెడుతున్నాయి. దాని సామ్రాజ్యవాద దాహానికి మిత్రుడు, శత్రువు అన్న తేడా లేనే లేదని స్నోడెన్ పత్రాలు చాటి చెబుతున్నాయి. అమెరికా మాకు వ్యూహాత్మక మిత్రుడు అంటూ గొప్పలు పోయే మన్మోహన్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్ లాంటి ఓటి మాటల బోలు తనాన్ని కూడా అవి చెవులు చిల్లులుపోయేలా వినిపిస్తున్నాయి.

స్నోడెన్ పత్రాలలో ఇండియాకు సంబంధించి దాగిన అమెరికా దుర్మార్గాలను ది హిందు పత్రిక వరుసగా వెల్లడి చేస్తోంది. ఈ వరసలో అమెరికాలో ఉన్న అత్యంత ముఖ్యమైన భారత రాయబార కార్యాలయాలపైన ఎన్.ఎస్.ఏ (నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ) సారించిన డేగ కన్ను లోతునుగని అత్యున్నత భారత రాయబార అధికారులే ముక్కున వేలు వేసుకుంటున్న పరిస్ధితి! ది హిందూ సేకరించిన ఒక రహస్య పత్రం ప్రకారం న్యూయార్క్ లో ఐరాస ఆవరణలో ఉన్న శాశ్వత భారత కార్యాలయంలోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్ మొత్తాన్ని కాపీ చేసే రహస్య సౌకర్యాన్ని ఎన్.ఎస్.ఏ ఏర్పరచుకుంది. అలాగే వాషింగ్టన్ డి.సిలోని భారత దేశపు ప్రధాన ఎంబసీలో కూడా కంప్యూటర్ లలో, కమ్యూనికేషన్ పరికరాల్లో బగ్స్ (సాంకేతిక క్రిములు?) ను నెలకొల్పింది.

ఫలితంగా భారత ఆర్ధిక, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, రాయబార, అంతర్జాతీయ సంబంధాల సమస్త రహస్యాలు అమెరికా గుప్పిట్లో చేరిపోయాయి. దీనివల్ల అంతర్జాతీయ వేదికలపైనా, డబ్ల్యూ.టి.ఓ లాంటి ప్రధాన అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లోనూ, జి20 లాంటి ముఖ్యమైన అంతర్జాతీయ కూటముల సంభాషణల్లోనూ ఇండియా ఏమి మాట్లాడబోతోందో ఎప్పటికప్పుడు తెలిసిపోయే అవకాశం అమెరికా దొరకబుచ్చుకుంది.

ఆర్ధిక, వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయా దేశాల ప్రభుత్వాలు నిత్యం కొన్ని వ్యూహాలు, ఎత్తుగడలు అమలు చేస్తాయి. ప్రత్యర్ధి లేవనెత్తగల అంశాలను ఊహించి ముందే కొన్ని ఎత్తులను రూపొందించుకుంటాయి. ఇవి రహస్యంగా ఉంటేనే ఆయా దేశాలకు చర్చల్లో గానీ, వేదికలపై గానీ అవి నెరవేరే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యూహాలు, ఎత్తులు ముందే ప్రత్యర్ధికి తెలిసిపోతే చర్చల్లోనూ, వేదికల్లోనూ తెల్లబోయి ఓటమిని ఎదుర్కోవడమే మిగిలేది. అమెరికా ఎప్పటికప్పుడు వాణిజ్య, రాజకీయ చర్చల్లో పై చేయి సాధిస్తూ, ప్రత్యర్ధి దేశాలను పరిహసించే స్ధాయిలో ఉండడానికి కారణం ఏమిటో ఇండియా లాంటి దేశాలు ఇప్పటికైనా గ్రహించాలి.

ది హిందూ వద్ద ఉన్న టాప్ సీక్రెట్ పత్రం ప్రకారం ఎన్.ఎస్.ఏ, భారత దేశపు ఐరాస కార్యాలయాన్ని, ఎంబసీని ‘లొకేషన్ టార్గెట్ గా ఎంచుకుంది. అంటే ఎక్కడో దూరంగా ఉంటూ ఇంటర్నెట్ హ్యాకింగ్ ద్వారా గూఢచర్యం చేసేబదులు ఆయా కార్యాలయాలు ఉండే లొకేషన్ లోనే అత్యంత అధునాతనమైన సాంకేతిక క్రిములను నెలకొల్పి సమాచారం సేకరించే లక్ష్యం పెట్టుకోవడం. ఈ పరికరాల ద్వారా భారత కార్యాలయాల ద్వారా భారీ మొత్తంలో జరిగే ఇంటర్నెట్ ట్రాఫిక్, టెలిఫోనిక్ సంభాషణలు, ఈ మెయిళ్ళు, చివరికి అధికారిక పత్రాలను కూడా ఎన్.ఎస్.ఏ సంపాదించింది.

ఎన్.ఎస్.ఏ రహస్య గూఢచర్యం గురించి స్నోడెన్ పత్రాల ద్వారా వెల్లడి కావడం మొదలు పెట్టిన దగ్గర్నుండి అమెరికా అధ్యక్షుడు ఒబామా గానీ, ఇతర అధికారులు గానీ చెప్పింది ఒకటే. తమ గూఢచర్యం ఏకైక లక్ష్యం టెర్రరిస్టు కార్యకలాపాలను నిరోధించడం. కానీ భారత రాయబార కార్యాలయాలపై నిఘా పెడితే అది టెర్రరిస్టు నిఘా ఎలా అవుతుంది? ‘భారత రాయబారులు, ప్రభుత్వం, అధికారులు, మంత్రులు, ప్రధాని, విదేశీ మంత్రి… వీళ్ళంతా టెర్రరిస్టులే అనా అమెరికా ఉద్దేశ్యం?’ అని అమెరికాని అడిగే ధైర్యం చేసే నాయకులు ఇండియాకు లేరు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ తమ దేశంపై నిఘా పెట్టినందుకు అమెరికాని కడిగి పారేసింది. అంతర్జాతీయ చట్టాలంటే అమెరికాకి లెక్క లేదని తెగనాడింది. మన్మోహన్ ప్రసంగం ఇంకా కాలేదు. దిల్మా రౌసెఫ్ చూపిన ధైర్యం మన్మోహన్ చూపగలరా? అనుమానమే.

కొమింట్ పత్రం

2010 కొమింట్ (Communication Intelligence) పత్రం ప్రకారం భారత రాయబారుల కార్యాలయాలు, ఈ కార్యాలయాల్లో నియమితులయిన మిలట్రీ అధికారులు అమెరికాకు చెందిన నాలుగు రకాల గూఢచార ఎలక్ట్రానిక్ పరికరాలకు టార్గెట్లు. అవి:

  • లైఫ్ సేవర్: ఇవి కంప్యూటర్ల హార్డ్ డిస్క్ ల పూర్తి ఇమేజ్ ను రికార్డు చేస్తాయి
  • హై లాండ్స్: ఇవి కంప్యూటర్ లాంటి పరికరాల లోపల నెలకొల్పబడి డిజిటల్ సమాచారాన్ని సేకరిస్తాయి
  • వాగ్రంట్: ఇవి బహిరంగంగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్ ల నుండి డేటా సేకరిస్తాయి.
  • మేగ్నటిక్: ఇవి డిజిటల్ సిగ్నల్స్ ను సేకరిస్తాయి

ఈ సాధనాల ద్వారా అప్పటివరకూ ఎంత మేరకు సమాచారం సేకరించిండీ ఈ పత్రంలో లేదు. కానీ అమెరికాలోని ప్రతి ఇండియా కార్యాలయాన్ని టార్గెట్ గా నిర్దేశించినట్లు పత్రం తెలిపింది. ఇండియా నుండి ఎటువంటి టెర్రరిస్టు భయాలు లేనప్పుడు ఆ దేశ కార్యాలయాల్ని ఎన్.ఎస్.ఏ ఎందుకు టార్గెట్ చేసుకుందని ది హిందు అడిగినప్పుడు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటలిజెన్స్ ప్రతినిధి ఇలా చెప్పాడు. “(ఈ విషయంలో) మా భాగస్వాములకు, మిత్రులకు రాయబార మార్గాల ద్వారా అమెరికా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. ప్రతి గూఢచార కార్యకలాపం పైనా బహిరంగంగా మేము నిర్దిష్టంగా వ్యాఖ్యానం చేయము. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం చేయదలిచాము. అన్ని దేశాలకు మల్లెనే అమెరికా కూడా విదేశీ గూఢచార సమాచారం సేకరిస్తుంది. పరస్పర సంబంధం ఉన్న అంశాల్లో అన్ని దేశాలతో మాకు ఉన్న సహకార సంబంధానికి మేము విలువ ఇస్తాము” అంటూ ఒక నీతిబోధ చేశాడు.

ఏమిటి దీనర్ధం? ‘మేము చేసేది చేస్తాం. మీరేమన్నా పత్తిత్తులా? సహకారం ఉన్న అంశాల్లో సహకరిస్తాం. లేని అంశాల్లో గూఢచర్యం చేసి తీరతాం’ అని చెప్పడమే ఇది. కానీ అమెరికా చేసే పనికిమాలిన పనులు ఇండియా చేయడం లేదు కదా? అబద్ధాలు చెప్పి ఇరాక్ పైకి దాడికి వెళ్ళి ఆ దేశాన్ని సర్వనాశనం చేసింది ఇండియా కాదు కదా? ఇరాన్ అణు విధానం పైన పచ్చి అబద్ధాలు ప్రచారం చేసేది అమెరికాయే గానీ ఇండియా కాదు కదా? అమెరికాలో భారతీయులపై జాతి వివక్ష దాడులు జరుగుతున్నాయి గానీ ఇండియా లో అమెరికన్లపై దాడులు లేవు కదా? మన పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసింది, అక్కడి ప్రజల్ని -స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా- చంపుతోంది అమెరికాయే గాని ఇండియా కాదుగదా? ప్రపంచ వ్యాపితంగా, మన హిందూ మహా సముద్రంలోని డిగో గార్షియా ద్వీపంతో సహా- వందలాది సైనిక స్ధావరాలు నిర్వహిస్తున్నది అమెరికాయే గాని ఇండియా కాదు కదా? అసలు అమెరికాకీ, ఇండియాకి  సాపత్యం ఎక్కడ? మీరు చేసేదే మేము చేస్తున్నాం? అనడానికి నోరెలా వస్తుంది? తెగిస్తే తప్ప!

……………..ఇంకా ఉంది

One thought on “హార్డ్ డిస్క్ సహా ఇండియా జాతకం అమెరికా గుప్పిట్లో -స్నోడేన్ పత్రాలు -1

  1. ఇక నైనా భారత ప్రభుత్వం మెలుకొంటె మంచిది. ఇలాంటి అమెరికా-భారత సంబంధాలు గురుంచి మరిన్ని కధనాలు మీరు వ్రాయలి అని కొరుతున్నను సార్.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s