స్నోడేన్ పత్రాలు: హార్డ్ డిస్క్ సహా అమెరికా గుప్పిట్లో ఇండియా జాతకం 2


From Google Street view

From Google Street view

మొదటి భాగం తరువాత………

కొమింట్ పత్రంలోని వివరాలు భయంకరమైన నిజాలని మనముందు ఉంచాయని ది హిందూ పత్రిక వ్యాఖ్యానించింది. మన్ హట్టన్ (న్యూయార్క్) లోని ఐరాస భారత శాశ్వత కార్యాలయం ఎన్.ఎస్.ఏ టాప్ టార్గెట్లలో ఒకటి. ఇక్కడ ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, ఉప శాశ్వత ప్రతినిధి, ఒక మంత్రి, ఒక రాజకీయ సమన్వయకర్త, ఆరుగురు కౌన్సిలర్లు, ఒక కల్నల్ ర్యాంకులోని మిలట్రీ సలహాదారు, ఇంకా ప్రపంచ దేశాలతో ఇండియాకు ఉండే వివిధ సంబంధాలకు సంబంధించిన అనేకమంది కార్యదర్శులు ఉంటారు.

ఈ భవనంలో ఎన్.ఎస్.ఐ, మొదటి భాగంలో ఉదహరించిన నాలుగు రకాల పరికరాలతో గూఢచర్యం నిర్వహించింది. ఆఫీసు కార్యాలయాల్లోని కంప్యూటర్ల హార్డ్ డిస్కుల కాపీలు సేకరించే లైఫ్ సేవర్ల నుండి కంప్యూటర్ స్క్రీన్ ల నుండి నేరుగా డేటా సేకరించే వాగ్రంట్ ల వరకూ అన్నీ ఇక్కడ అమర్చారు.

ఈ విషయమై న్యూయార్క్ లోని ఇండియా ఎంబసీకి ది హిందూ పత్రిక ఈ మెయిళ్ళు పంపినా స్పందన లేదు. అయితే ఒక ఇండియా రాయబారి పేరు చెప్పకుండా ఎన్.ఎస్.ఏ కార్యకలాపాలు భారత ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించి ఉండాలని చెప్పుకొచ్చాడు. ఐరాస భద్రతా సమితిలో సంస్కరణల కోసం డిమాండ్ చేస్తున్న అంశం దగ్గర్నుండి వివిధ దేశాల్లో భారత్ సాగిస్తున్న శాంతి సంస్ధాపన కార్యకలాపాల వరకు ఇండియాకు తీవ్ర నష్టం కలిగి ఉంటుందని ఆయన చెప్పాడు.

“యూరోపియన్ యూనియన్ ఆఫీసుల్లో కూడా వాళ్ళు బగ్స్ పెట్టి, కమ్యూనికేషన్స్ కేబుల్స్ ను కూడా ట్యాప్ చేస్తున్నారంటే ఇక మనపైన చేయకుండా ఉండడానికి వారికి ఏ కారణం ఉంటుంది? నష్టం ఎంతమేర జరిగిందో మేము అంచనా వేసే పనిలోనే ఇంకా ఉన్నాం. మన హార్డ్ డ్రైవ్ లను కాపీ చేసి ఉంటే ఇక మన ఊహలకి మిగిలేదేమీ ఉండదు” అని ఆయన వివరించాడు.

ఐరాస శాశ్వత కార్యాలయం తర్వాత ఎన్.ఎస్.ఏ టార్గెట్ చేసుకున్న మరో కార్యాలయం వాషింగ్టన్ డి.సి లోని భారత ఎంబసీలో భాగమైన చాన్సరి. మసాచుసెట్స్ ఎవెన్యూలో ఉండే ఈ కార్యాలయానికి రెండు భవనాలు ఉన్నాయి. ఒకటి 1885లో నిర్మించింది కాగా మరొకటి 1901లో నిర్మించింది. భారత రాయబారి, రాయబార కార్యాలయం ఉప అధిపతి, రాజకీయ, ఆర్ధిక, రక్షణ మరియు పారిశ్రామిక రంగాల లాంటి విభాగాలకు నేతృత్వం వహించే అనేకమంది మంత్రులు మరియు కార్యదర్శుల కార్యాలయాలు ఈ భవనాల్లో ఉన్నాయి. భారత ఆర్మీకి ప్రతినిధ్యం వహిస్తూ ముగ్గురు రక్షణ రంగ అనుబంధ అధికారులు (సైన్యం, వాయు సేన, నౌకా సేన) కూడా ఇక్కడే ఉన్నారు.

Click to enlarge

Click to enlarge

అమెరికాతో ఇండియా నెరిపే రాయబారయుత, వాణిజ్య మరియు వ్యూహాత్మక సంబంధాల కార్యకలాపాలు ఇక్కడి నుండే జరుగుతాయి. ఈ భవనాల్లో మూడు రకాల బగ్స్ ను స్ధాపించడానికి ఎన్.ఎస్.ఏ టార్గెట్ గా పెట్టుకుంది. హార్డ్ డ్రైవ్ ఇమేజిలను కాపీ చేయడం, డిజిటల్ సంకేతాలను ఒడిసిపట్టడం, కంప్యూటర్ స్క్రీన్ ల నుండి డేటా సేకరించడం… ఇలా మూడు రకాల బగ్స్ ను ఈ భవనాల్లో నెలకొల్పారని స్నోడెన్ లీక్ చేసిన రహస్య పత్రం తెలిపింది.

ఎన్.ఎస్.ఏ టార్గెట్ చేసుకున్న మూడో భవనం భారత ఎంబసీ అనెక్స్ (అనుబంధ కార్యాలయం). ఇది కూడా మసాచుసెట్స్ అవెన్యూ లోనే చాన్సరికి కొంత దూరంగా ఉంది. ఈ భవనంలో మూడు ముఖ్యమైన కార్యాలయాలు ఉన్నాయి: ఒక మంత్రి నేతృత్వంలోని కాన్సలరీ సెక్షన్, వీసా సేవలను చూసే వీసా సెక్షన్, మంత్రి నేతృత్వంలోని వాణిజ్య విభాగం. ఇక్కడి వాణిజ్య విభాగానికి విస్తృతమైన బాధ్యతలు ఉంటాయి. వివిధ రకాల వాణిజ్య అంశాలు, వాణిజ్య చర్చలను ఇది పర్యవేక్షిస్తుంది. భారతీయుల వ్యాపారాలకు ఇది సహాయం అందజేస్తుంది.

రాయబార కార్యాలయాల ప్రధాన ఉద్దేశ్యం ఆయా దేశాల్లోని తమ ఆర్ధిక, వాణిజ్య ప్రయోజనాలకు ఆటంకం లేకుండా చూసుకోవడమే. రాజకీయ కార్యకలాపాలనేవి వీటికి అనుబంధంగా జరిగేవే. కాబట్టి వాణిజ్య విభాగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతర్జాతీయ వేదికలపైనా, జి20, డబ్ల్యూ.టి.ఓ లాంటి అంతర్జాతీయ ఆర్ధిక, వాణిజ్య సంస్ధల చర్చలలోనూ అనుసరించవలసిన వ్యూహ, ప్రతివ్యూహాలు ఈ కార్యాలయాల్లో రూపొందుతాయి. ముఖ్యంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (Indian Space Research Organization) కూడా ఇక్కడ కార్యాలయం కలిగి ఉంది. అంతరిక్ష పరిశోధనా రంగంలో అమెరికా-ఇండియాల సహకారాన్ని ఇది పర్యవేక్షిస్తుంది.

భారత ప్రయోజనాలకు ఎంతో ముఖ్యమైన, రహస్యం కూడా అయిన ఈ భవనాన్ని కూడా ఎన్.ఎస్.ఏ టార్గెట్ చేసుకుంది. హై లాండ్స్, వాగ్రంట్ బగ్స్ ను ఇక్కడ నెలకొల్పింది. మొదటిది ఏకంగా కంప్యూటర్లు తదితర కమ్యూనికేషన్ పరికరాలలోనే ఇంప్లాంట్స్ ను నెలకొల్పితే రెండోది కంప్యూటర్ స్క్రీన్ ల నుండి డేటా సేకరిస్తుంది. ఎన్.ఎస్.ఏ రూపొందించిన ‘ప్రిజమ్’ ప్రోగ్రామ్ కి కూడా ఇస్రో ఒక ముఖ్యమైన లక్ష్యంగా ఉందన్న సంగతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. 

ఇంత ఘోరం వెల్లడి అయినా భారత అధికారులు మాత్రం అసలేమీ జరగలేదు అనడానికే ఇష్టపడుతున్నారు. ‘భారత జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్నీ చర్యలు తీసుకోబడ్డాయి’ అని భారత ఎంబసీ ప్రతినిధి ఒకరు ది హిందూ పత్రికకు ఇచ్చిన ఈ మెయిల్ స్పందనలో పేర్కొన్నారు. బహిరంగంగా ‘అలాంటిదేమీ లేదు’ అని చెబుతున్నా అధికారులు రహస్యంగా మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు బగ్స్ సహాయంతో ఎన్.ఎస్.ఏ సాగిస్తున్న గూఢచర్యం అన్నిరకాల అంతర్జాతీయ చట్టాలకు బద్ధ విరుద్ధం అని వారు అంగీకరిస్తున్నారు.

“మన మెషిన్లలో, టెలిఫోన్లలో, కంప్యూటర్లలో ఈ బగ్స్ ను భౌతికంగా నెలకొల్పినట్లయితే అది మన భద్రతను తీవ్రంగా ఉల్లంఘించినట్లే. వారి తరపున ఈ పని ఎవరు చేశారు? ఇది చాలా ఆందోళనకరమైన విషయం. ఎక్కడో దూరంగా ఉంటూ (ఇంటర్నెట్ ద్వారా) మన డేటా దొంగిలించినా అది చాలా ఘొరం. ఇక మన కార్యాలయాల్లోనే మన మెషిన్లలోనే బగ్స్ పెట్టడం ఇంకా ఘోరం. మన సిస్టమ్ లను రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉంటాము. అయినా బగ్స్ పెట్టగలగడం ఆందోళనకరం” అని ఒక ఎంబసీ అధికారిని ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. ‘వారి తరపున ఈ పని ఎవరు చేశారు?’ అన్న అధికారి ప్రశ్న ప్రత్యేకంగా గమనార్హం. ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని ఆ అధికారి పరోక్షంగా సూచిస్తున్నట్లు కనిపిస్తోంది.

యూరోపియన్ యూనియన్ (బ్రసెల్స్) లోని భారత ఎంబసీల్లో సాధారణ ఫాక్స్ మిషన్లలో సైతం అమెరికన్ ఎన్.ఎస్.ఏ బగ్స్ నెలకొల్పిందని ఇప్పటికే కొన్ని స్నోడెన్ పత్రాల ద్వారా వెల్లడి అయింది. ఒక్క భారత ఎంబసీల్లోనే కాకుండా ఐరోపా దేశాల ఎంబసీల్లో కూడా ఎన్.ఎస్.ఏ గూఢచర్యం చేసింది. ఈ సంగతి బైటికి వచ్చాక ఐరోపా దేశాలు అమెరికాపై మండిపడ్డాయి. అవి ఎంత దూరం వెళ్లాయంటే ఇక అమెరికా ఇంటర్నెట్ కంపెనీలపై ఆధారపడడం తగ్గించాలని నిర్ణయించాయి. సొంత కంపెనీలను అభివృద్ధి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాయి. కానీ భారత దేశం మాత్రం ‘అబ్బే, అలాంటిదేమీ జరగలేదు’ అంటూ నిరాకరించడంతోనే సరిపుచ్చుకుంది. సాక్ష్యాత్తూ ఒబామాయే స్వయంగా ‘అవును, ఎన్.ఎస్.ఏ గూఢచర్యం నిజమే, కానీ టెర్రరిజం నిర్మూలన కోసం చేస్తున్నాం’ అని ఒప్పుకున్నా మనవాళ్లలో కదలిక లేదు. ‘మేము టెర్రరిస్టులమా?’ అని కనీసం ప్రశ్నించే సాహసం కూడా మనవారికి లేదు.

ఎన్.ఎస్.ఏ గూఢచార్యానికి ఆపాలజీ చెప్పాలని ఐరోపా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. తాము ఆపాలజీ చెప్పేది లేదని అమెరికా స్పష్టం చేస్తోంది. అందుకే ఐరోపా దేశాలు తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు. అంతర్జాతీయ చర్చల్లోనూ, వేదికల్లోనూ ఈ అంశాలను లేవనెత్తుతూ అమెరికాను ఇరకాటంలో పడేయడానికి ప్రయత్నిస్తున్నారు. చివరికి ఈక్వడార్ లాంటి చిన్న దేశాలు కూడా అమెరికాను నిలదీస్తున్నాయి. భారత పాలకులు ఎప్పటికైనా ఆ పని చేయగలరా?

………..(అయిపోయింది)

5 thoughts on “స్నోడేన్ పత్రాలు: హార్డ్ డిస్క్ సహా అమెరికా గుప్పిట్లో ఇండియా జాతకం 2

 1. హమ్మో…..అమెరిఖానా….ఎదిరించాలా….?
  ఇంఖా నెయం, యుద్ధం సేసెత్తామని పెకటన ఇవ్వాలన్నారు కాదు….దీని సిగ దరగ
  అయినా అమెరికా పెబువులు చేసిన పెద్ద నేరం ఏటండీ..?
  ఏదో వాళ్లకు కావాల్సిన పత్రాలు వాళ్లు తీసుకున్నారు…అంతే కదా.
  ఎవుళ్లకి అవసరమైనవి ఆళ్లు తీసుకుంటే మనకేంటి ఇబ్బంది…హి…హ్హి…హ్హి. ( నా లాజిక్కు బావుంది కదా….)
  అదీ ఒహ్క… మన దేశానియే కాదు కదా…..పెపంచకంలోని అన్ని దేశాలతో పాటూ….మన మీద కూడా ఏదో వాళ్ల అలవాటు కొద్దీ గూఢచర్యం చేశారు.
  ఆ మాత్రానికే అమెరిఖాను కండిస్తూ పెకటన ఇమ్మంటారా….ఆయ్…!

  ఏంటి…? దచ్చిణమెరికాలోని దేశాలు అమెరిఖాను కండించాయా….?
  ఆళ్లు కండిత్తే మనమూ కండిచాలా… ఆళ్లు చేసిందే మనం సేసెత్తే మన సారబవుమత్వం కరేబియన్ సముద్రంలో కలిసిపోదూ…?
  మనకో పెచ్చే….కమైన ఇదేషాంగ ఇదానం ఉంది కదా..దాని పెకారం మనం కండించకూడదు.
  ఐనా ఆ బుడ్డ దేశాల నాయకులకు …… ఓ సంపాదించుకోవడం తెలుసా పాడా….?
  అసలు సిస్సు బేంకు ఎక్కడుందో అడ్రస్సన్నా తెలుసా…?

  దమ్ముంటే మీరే చెప్పండి…?
  హీనపచ్చం ఓ లచ్చ కోట్లు సంపాదించిన రాజకీయ నాయకుడు ఓ…ళ్ దచ్చిణమెరెకా కండం మొత్తం ఒక్కడంటే ఒక్కన్ని చూపించండి.
  మరి మన దేశంలోనో….జార్ఖండ్ లాంటి సిన్నా సితక రాఠ్టాల వాళ్లే బ్రహ్మాండంగా సంపాదించారు, ఇక మన ఆంధ్రా సంగతి సెప్పేదేముంది…హి..హి..హ్హి.
  అలాంటిది ఆళ్లకూ మనకూ పోలికేటండీ బాబూ……
  అలాంటి బుడ బుడ్డ దేశాలతో మనల్ని పోల్చుకుంటే మనకెంత అగమానం…అస్సలు మన సార బవుమత్వం ఏమై పోవాలా…?

  మొత్తంగా సెప్పొచ్చేదేటంటే…..మనం శానా తొందరగా అబిరుద్ది కావాలంటే అమెరిఖా సాయం చాలా చాలా కావాల….
  ఆల్ల సాయం వల్లే కదా…మన దేశంలో అన్నవస్త్రాలకు గతి లేకున్నా అణ్వస్త్రాలు, ఆటితో కరెంటు ప్యాక్టరీలు పెట్టుకుంటున్నాం.

  మరి వాళ్లు ఎప్పుడో వాడి పారేసిన పాత యుద్ద ట్యాంకులు, యుద్ద ఇమానాలు గట్రా….. కొంచెం కరీదు ఎక్కువకే ఐనా మనకే ఇత్తున్నారు కదా…?
  మనకు అమెరికా లాంటి దరమ ప్రభువులు సహాయాలు…సలహాలు కావాలా…వద్దా…. ?

  ఏదో నాలుగు కాయితాలు అయ్యి ఆళ్లకు అవసరమైనవి తీసుకుంటే,
  గూడసెర్యం….దూడ చర్మం అంటూ ఓ…..చెవి కోసేసిన మేక లాగా తెగ మొత్తుకుంటారేమిటి…?

  మీకో బెమ్మాండమైన రగస్యం సెప్పనా… అమెరిఖా వాళ్లు ఏదో మొహమాటానికి అడగలేకపోయారు కానీ…
  అసలు నేరుగా అడిగి ఉంటే… మేమే అన్ని రకాల ఖాయితాలు….. డాలర్లలో పెట్టి బద్రంగా అప్పగించేవాళ్లం…

  ఇగో అమెరికా వోళ్లు…ఇక నుంచి మీకేదన్నా కావాలసి వొత్తే మమ్మల్నే నేరుగా అడగండి బాబూ…ఈ పెతిపచ్చాలు, పేపరోళ్ల గొడవ పడలేక పోతున్నాం.

  ఐనా ఈ ఇషయం బయటపెట్టిన అసాంజే సంగతి అమెరిఖా సూసుకుంటుంది…
  ఇహ మనం ఇక్కడ ఇందూ పేపరోళ్ల సంగతి సూడాల…!

  ఐనా ఈ ఇందూ పేపరోల్లను మొన్ననే జైలుకు పంపించినా ఇంకా భయం రాలేదయ్యా…
  సెగరట్రీ…మన దేశానికి సెందిన ఇలాంటి శానా శానా ఇమ్ పార్టెంటు ఇషయాలు బయటపెట్టినందుకు ఏఏ సెచ్చన్ల కింద ఆళ్లను బొక్కలో తొయ్యొచ్చో మన లాయర్నడిగి కనుక్కో….

 2. …మన దేశంలో అన్నవస్త్రాలకు గతి లేకున్నా అణ్వస్త్రాలు, ఆటితో కరెంటు ప్యాక్టరీలు పెట్టుకుంటున్నాం.చందు గారు చలా అద్బుతంగా రాసారు.ఈ వాఖ్య నాకు మరీ నచ్చింది.ఈలాగే కొనసాగించంది.

 3. ప్రవీణ్ గారూ..అన్న వస్త్రాలు, అణ్వస్త్రాలు పదబంధం చాలా పాతదే. ఇప్పటికే చాలా మంది రాశారు. నాకేదో టైమ్ కి గుర్తొచ్చింది. అందులో నేను కొత్తగా రాసిందేమీ లేదు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ సూచన పాటిస్తాను

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s