ఆహా రాహుల్! ఏమి మీదు నాటకంబు?


rahul-maken

“కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు” ఇది మన రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్య. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ధనిక రాజకీయవేత్తలకు వర్తించేది మాత్రమే’ అన్న నిర్వచనం ఏమన్నా ఉన్నట్లయితే ఆయన చెప్పిందాంట్లో సందేహం అనేదే లేదు. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వమే హడావుడిగా ఒక ఆర్డినెన్స్ తయారు చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపితే, మరోపక్క ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే, తమ పార్టీలోని మరోనేత ఆ ఆర్డినెన్స్ కు మద్దతుగా ప్రసంగిస్తున్న పత్రికా సమావేశంలోకి స్వయంగా దూసుకొచ్చి ఆ నేత చెబుతున్నదానికి ఖచ్చితంగా విరుద్ధంగా విరుద్ధంగా చెప్పడమే కాక ‘అది తన వ్యక్తిగత అభిప్రాయం’ అని చెప్పి చక్కా పోయే ప్రజాస్వామ్యం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి?

ఈ అపూర్వ నాటకం నేడు ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ లో చోటు చేసుకుంది. నేర నిర్ధారణ జరిగిన ఎం.పిలు, ఎం.ఎల్.ఏలు తక్షణమే తమ పదవుల నుండి తప్పుకోవాలని, నేర నిర్ధారణతోనే వారికి పదవిలో కొనసాగే హక్కు రద్దయిపోతుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు పైన దాదాపు రాజకీయ పార్టీలన్నీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ప్రత్యర్ధి పార్టీలు కక్షతో కేసులు పెడితే అలాంటి కేసుల వల్ల నీతిమంతుల రాజకీయ భవిష్యత్తు దెబ్బతినిపోతుందంటూ పార్టీలు హాహాకారాలు చేశాయి. దీన్ని తిప్పి కొట్టడానికి వెంటనే ప్రయత్నాలు ఆరంభించాయి. సుప్రీం కోర్టు తీర్పును పూర్వపక్షం (nullify) చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బిల్లు తయారు చేసింది. కానీ ఇది ప్రవేశపెట్టేలోపు పార్లమెంటు సమావేశాలు కాస్తా ముగిసిపోయాయి.

దానితో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు బ్రహ్మాండమైన దూ(దు)రాలోచన తట్టింది. అర్జెంటుగా కేబినెట్ సమావేశం అయ్యి ఆర్డినెన్స్ ఆమోదించారు. నేరచరితుల హక్కులను సంరక్షించే బృహత్తర కార్యక్రమానికి ఆ ఆర్డినెన్సులో చోటు కల్పించారు. కింది కోర్టులో శిక్ష పడితే గనక వాళ్ళు 90 రోజుల్లోపల హై కోర్టుకు అప్పీలు చేసుకుంటే, దానిని హై కోర్టు అనుమతీస్తే, వారి పదవి భద్రంగా ఉండేలా బ్రహ్మ రాత రాసేశారు. దోష నిర్ధారణ పైనా, శిక్ష పైనా హై కోర్టు స్టే విధించినా పదవిని అంటి పెట్టుకుని ఉండవచ్చని కూడా రాసుకున్నారు.

అయితే అందులో జనానికి కొంత సడలింపు ఇస్తున్నట్లు నటించారు. ఎలాగంటే, శిక్ష పడిన నేరస్ధ నాయకులు హై కోర్టులో చేసిన అప్పీలుపై విచారణ జరుగుతుండగా చట్ట సభల్లో ఓటింగులో పాల్గొనే హక్కు ఉండదట. వేతనాలు, అలవెన్సులు పొందే హక్కు కూడా ఉండదట. అక్కడికి ఎం.పిలు, ఎం.ఎల్.ఏలు ఆధారపడుతున్నది వారి వేతనాలపైనే అయిన్నట్లు! ఓటింగులో పాల్గొనకపోయినా చర్చల్లో మాత్రం వారికి హక్కు కొనసాగుతుందిట.

ఈ ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఆమోదం పొందడానికి వెళ్లింది లగాయితు దేశంలో ఒకటే సందడి! ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ నటనా వైదుష్యాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. బీహార్ ఆర్.జె.డి నేత లాలూ ప్రసాద్ యాదవ్ నిందితుడుగా ఉన్న 1996 నాటి పశువుల గడ్డి కేసు తుది తీర్పు సెప్టెంబరు 30 తేదీన వెలువడనున్న తరుణంలో ఈ ఆర్డినెన్సు రూపొందడంతో ప్రతిపక్షాలకు మహా గొప్ప అవకాశం లభించింది. యు.పి.ఏలో భాగస్వామిగా గానీ లేదా బైటినుండి మద్దతు ఇచ్చే మిత్రుడుగా గానీ ఆర్.జె.డిని చేర్చుకుని ఎన్నికల్లో లబ్ది పొందడానికే కాంగ్రెస్ ఈ ఆర్డినెన్స్ తెచ్చిందన్న ప్రచారం చేసుకునే అవకాశాన్ని ఇతర ప్రతిపక్షాలు చూశాయి.

దాదాపు ఇలాంటి బిల్లునే చట్టంగా రూపొందించడంలో ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో బి.జె.పి, కాంగ్రెస్ కి సహకరించిన సంగతి ఈ సందర్భంగా గమనించాలి. “ప్రజాప్రాతినిధ్య (సవరణ, మూల్యాంకన) చట్టం -2013” పేరుతో పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం ప్రకారం కస్టడీలో ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించడానికి వీలు లేదు. రాజకీయాల్లో ప్రత్యర్ధుల పైన కేసులు పెట్టడం సహజం కాబట్టి సుప్రీం కోర్టు తీర్పు తీవ్రం నష్టం తెస్తుందని పార్టీలన్నీ వాదించాయి. ఆ విధంగా ప్రజా సేవ పేరుతో తాము ఒకరిపై ఒకరు తప్పుడు కేసులు పెట్టుకుంటామని వారు చక్కగా అంగీకరించారు.

ఈ చట్టం కాకుండా నేర నిర్ధారణ జరిగిన కేసుల్లో కూడా తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో రాజకీయులు తాజా బిల్లును రూపొందించారు. దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టినా సమావేశాలు ముగియడంతో ముందుకు సాగలేదు. ఈ లోపు ఆర్డినెన్సుకు కాంగ్రెస్ పధక రచన చేసింది. కాంగ్రెస్ పెద్దల ప్రకారం ఆర్డినెన్సుకు సహకరిస్తామని బి.జె.పి చెప్పింది కూడా. అయితే ఆ తర్వాత ప్రమాదం గుర్తించి విమర్శలు మొదలు పెట్టింది. బీహార్ లో జె.డి(యు) మిత్రుడిని కోల్పోయిన బి.జె.పి లాలూ+కాంగ్రెస్ కూటమి పట్ల ఆందోళనతో ఉన్నది. గడ్డి మేసిన కేసులో లాలూకి శిక్ష ఖాయం అని దాదాపు అందరూ భావిస్తున్న తరుణంలో ఆర్డినెన్సు ద్వారా తన భవిష్యత్తు మిత్రుడిని కాపాడుకోడానికి కాంగ్రెస్ పధకం వేసిందని బి.జె.పి గ్రహించడం వల్లనే ఈ విధంగా బి.జె.పి అడ్డం తిరిగిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

బి.జె.పి తో పాటు సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకించి, సదరు తీర్పు రాజకీయ నాయకుల హక్కులను కాలరాస్తుందంటూ వాపోయిన ప్రతిపక్ష పార్టీలన్నీ హఠాత్తుగా ఆర్డినెన్సును వ్యతిరేకించడం ప్రారంభించారు. సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీల నాయకులు కూడా కాంగ్రెస్ ఆర్డినెన్సును తూర్పారబట్టారు. విచిత్రం ఏమిటంటే నేర నిర్ధారణ అయి శిక్ష పడినవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదని ఇప్పటికే చట్టం ఉంది. తాజాగా తలపెట్టిన ఆర్డినెన్సు ఉన్న పదవిని కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపేది కాదు. 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అయితే ఆర్డినెన్స్ పైన ఆమోద ముద్ర వేయకుండా నిన్న (గురువారం, సెప్టెంబర్ 27) మంత్రులను పిలవనంపారు. హోమ్ మంత్రి షిండే, న్యాయ మంత్రి కపిల్ సిబాల్ లను తన కార్యాలయానికి పిలిపించుకున్న ప్రణబ్ ఆర్డినెన్స్ అవసరం ఏమిటని ప్రశ్నించారని పత్రికలు చెబుతున్నాయి. ఆర్డినెన్సును వెనక్కి తిప్పి పంపాలని కోరుతూ అంతకుముందు రోజే బి.జె.పి ప్రతినిధి వర్గం రాష్ట్రపతిని కలిసిన నేపధ్యంలో ప్రణబ్ వేసిన అడుగు (మంత్రులను పిలవనంపడం) కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసింది. అప్పటికే కాంగ్రెస్ నుండి వినిపిస్తున్న అసంతృప్తి ధ్వనులు మరి కొంచెం బిగ్గరగా వినిపించడం మొదలయింది.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ప్రతినిధి అజయ్ మాకేన్ ప్రసంగిస్తున్న విలేఖరుల సమావేశంలోకి ఆ పార్టీ యువరాజు దూసుకొచ్చారు. అలా దూసుకురావడానికి ముందు అజయ్ మాకేన్ కు ఫోన్ చేసి ‘ఏం జరుగుతోంది?’ అని (గద్దించి) ప్రశ్నించారట. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గం రాష్ట్రపతికి పంపిన ఆర్డినేన్సును సమర్ధిస్తూ విలేఖరులతో మాట్లాడుతున్నానని అజయ్ మాకేన్ సమాధానం ఇచ్చారట. వెంటనే ఆఘమేఘాల మీద రాహుల్ గాంధీ ఢిల్లీ ప్రెస్ క్లబ్ లోకి దూసుకొచ్చారు. అజయ్ మాకేన్ స్ధానాన్ని లాగేసుకుని మాట్లాడడం మొదలు పెట్టారు.

“నేను ఇక్కడికి రాకముందు అజయ్ మాకేన్ ను అడిగాను, ఏం జరుగుతోంది అని. ఆర్డినెన్స్ కు సంబంధించిన రాజకీయ పంధా గురించి చెబుతున్నానని, కాంగ్రెస్, బి.జె.పిలతో సహా అన్నీ పార్టీలు దీనిని సమర్ధిస్తాయని ఆయన నాకు చెప్పారు. ఇప్పుడు నేను ఈ ఆర్డినెన్స్ పైన నా అభిప్రాయం ఏమిటో మీకు చెప్పదలిచాను. అది పూర్తిగా అసంబద్ధం (nonsense). దాన్ని చించి అవతల పారేయాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం” అని వడిగా చెప్పేసిన రాహుల్ అంతే వడిగా లేచి పోబోయారు. విలేఖరులు గొల్లుమంటూ ప్రశ్నల పరంపర సంధించడంతో మళ్ళీ కూర్చుని మరికొంత వివరణ ఇచ్చారు.

“రాజకీయ అవసరాల రీత్యా మనం ఇది చేయాలి అని మా సంస్ధలో చెబుతున్నారు. అందరూ ఇదే చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ చేస్తోంది, బి.జె.పి చేస్తోంది, సమాజ్ వాదీ పార్టీ చేస్తోంది, జె.డి(యు) చేస్తోంది అని చెప్పారు. కానీ ఈ నాన్సెన్స్ ను ఇంతటితోనైనా ఆపేయాలని నేను చెప్పదలిచాను. రాజకీయ పార్టీలు, మా పార్టీ, ఇతరులు కూడా…. దేశంలో అవినీతితో పోరాడాలని మీరు భావిస్తే, అది కాంగ్రెస్ అయినా, బి.జె.పి అయినా మనం ఇలాంటి చిన్న చిన్న రాజీలు చేసుకుంటూ పోవడం సరికాదు. ఇక మనం అన్నీ చోట్లా రాజీ పడుతూనే ఉంటాం. ఈ ఆర్డినెన్స్ ద్వారా మా ప్రభుత్వం చేసింది శుద్ధ తప్పు” అని చెప్పి లేచిపోయారాయన.

అప్పటిదాకా ఆర్డినెన్స్ కు సమర్ధనగా విలేఖరులకు వివిధ వాదనలు వినిపిస్తున్న అజయ్ మాకేన్ వెంటనే గొంతు మార్చారు. “రాహుల్ గాంధీ మా పార్టీ నాయకుడు. ఆయన ఏమి చెబితే అదే పార్టీ అవగాహన” అని నిమిషాల్లోనే నాలిక మడతేశారు. అన్నీ పార్టీలు ఆర్డినెన్స్ కు మద్దతు ఇచ్చాయనీ, అందుకే ఆర్డినెన్స్ తెచ్చామని చెబుతున్నా అజయ్ మాకేన్ ఆ విధంగా రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం ధాటికి పార్టీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తోక్కేశారు.

రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్ చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నట్లయితే అది ఒక్క రాహుల్ గాంధీకే వర్తిస్తుందా లేక అందరికీనా అన్నది ప్రశ్నార్ధకం. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయించిన తర్వాత సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు కట్టగట్టుకుని ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం వెంకటేష్ దృష్టిలో ప్రపంచంలోనే ఎక్కడా లేని ప్రజాస్వామ్యం! కానీ తెలంగాణ ప్రజలు ఐదారు దశాబ్దాలుగా తమపై సాగిన వివక్ష, నిర్లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉద్యమించి తమ రాష్ట్రం తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే అది ప్రజాస్వామ్యం కాదు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు సీమాంధ్ర ప్రజల భయాందోళనలను పోటీగా నిలబెట్టడమే టి.జి.వెంకటేష్ లాంటివారి దృష్టిలో అతి గొప్ప ప్రజాస్వామ్యం?

ఇంతకీ ఆర్డినెన్స్ తయారవుతున్నన్నాళ్లూ రాహుల్ గాంధీ ఏమి చేస్తున్నట్లు? రాహుల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నా చెప్పుల్లో కాళ్ళు దూర్చొచ్చు అని ఆహ్వానం పలుకుతున్న మన్మోహన్ సింగ్ ఆయన మాట విననన్నారా? నిజానికి అజయ్ మాకేన్ చెప్పిందే అసలు నిజం. కాంగ్రెస్, బి.జె.పి. ఎస్.పి, బి.ఎస్.పి తదితర పార్టీలన్నీ నేర చరితులకు, నిందితులకు, దోషులకు తేడా లేకుండా టిక్కెట్లు ఇస్తున్నదే అసలు నిజం. కానీ ఆర్డినెన్స్ కు సహకరిస్తామన్న బి.జె.పి హఠాత్తుగా ప్లేటు ఫిరాయించడంతో ప్రమాదం గ్రహించిన కాంగ్రెస్ పార్టీ తాను కూడా ప్లేటు ఫిరాయించడానికి సిద్ధపడింది.

నేరస్ధులకు మద్దతు ఇవ్వబోమన్న ఉదాత్తమైన ప్రకటన చేస్తే అలాంటి ప్రకటన వల్ల క్రెడిట్ కాంగ్రెస్ లో ఎప్పుడూ అగ్రనేతలకే వెళ్లాలనేది ఒక అప్రకటిత సూత్రం. ఆ సూత్రం ప్రకారం అజయ్ మాకేన్ ఆర్డినెన్స్ ను సమర్ధిస్తుంటే యువరాజా వారు దూసుకొచ్చి దానికి వ్యతిరేకంగా మాట్లాడి బి.జె.పి సంపాదించాలనుకున్న క్రెడిట్ ని తానే కొట్టేసే ప్రయత్నం చేశారు. మధ్యలో అజయ్ మాకేన్ ఒక పిచ్చోడుగా మిగిలాడు. అందుకు అజయ్ మాకేన్ కు కూడా అంగీకారమే. పార్టీ నేతలకు వెళ్ళే మంచి పేరు అంతిమంగా పార్టీకి, తద్వారా అధికారం సంపాదించడానికి ఉపయోగపడుతుంది గనక, ఆ అధికారం తనకూ కావాలి గనుక, పిచ్చోడుగా కనిపించడానికి ఆయనేమీ అవమానపడరు.

ఆహా రాహుల్ జీ! ఏమి మీదు నాటకంబు! లెస్సగా రక్తి కట్టినట్లేయున్నది సుమా! భారత రాజకీయాలు మీకు ఇంత త్వరగా వంటబడతాయని ఊహించలేదు మరి!

One thought on “ఆహా రాహుల్! ఏమి మీదు నాటకంబు?

  1. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు…రాహుల్ గారు ఇప్పుడే బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడుతున్నారు.
    ఐనా అప్పుడే ఏమైంది..ఇన్ ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివల్ ( ముందుంది మొసళ్ల పండగ)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s