పదవీ విరమణ చేశాక ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ విశ్రాంత కాలాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ జనరల్ వి.కె.సింగ్ పదవీ విరమణ చేశాక తన కాలాన్ని ఎంజాయ్ చేస్తున్న తీరు మాత్రం ప్రత్యేకం అనే చెప్పుకోవాలి. ఒకసారి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారే పక్కన కనిపిస్తారు. మరోసారి ఆర్మీ కుంభకోణాలపై గొంతెత్తుతారు. మరోసారేమో ఏకంగా బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తోనే వేదిక పంచుకుంటారు.
జనరల్ వి.కె.సింగ్ ఎంజాయ్ మెంటు ఎలా ఉన్న దానివల్ల కాంగ్రెస్ కి మాత్రం అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. తన పుట్టిన రోజును ఒక సంవత్సరం ఎక్కువగా చూపించడం వలన ఆయన ఆ మేరకు అత్యున్నత ఆర్మీ పదవిని అనుభవించే అవకాశం కోల్పోయారు. ఆ లోపాన్ని సవరించాలని శతపోరిన వి.కె.సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ముందు ఓడిపోయారు. సుప్రీం కోర్టులో కూడా పోరాడినప్పటికీ ఆయనకు కోర్టు నుండి మొట్టికాయలే ఎదురయ్యాయి. బహుశా ఆ అనుభవం వల్లనేనేమో తన విశ్రాంత కాలాన్ని ‘సద్వినియోగం’ చేసుకోడానికే ఆయన నిశ్చయించుకున్నారనుకుంటాను.
పదవీకాలం చివరి రోజుల్లో ఆర్మీ ట్రక్కుల కుంభకోణాన్ని వెలికి తీసి కాంగ్రెస్ అవినీతి రాచపుండును కెలికిన వి.కె.సింగ్ పైన ప్రతీకారం తీర్చుకోడానికా అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఆయన్ను బద్నామ్ చేసే ఒక విచారణ నివేదికను లీక్ చేసింది. దాని ప్రకారం వి.కె.సింగ్, ఆర్మీలో ఏర్పాటు చేసిన ఒక విభాగం ‘టెక్నికల్ సర్వీసెస్ డివిజన్’ (టి.ఎస్.డి) కోసం కేటాయించిన నిధుల్ని జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడానికి వినియోగించారంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ ఆరోపణల ద్వారా వి.కె.సింగ్ కూడా అవినీతికి పాల్పడ్డాడని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.
కానీ ప్రభుత్వం ప్రయత్నాలు పెద్దగా సఫలం కాలేదు. పైగా వి.కె.సింగ్ నింపాదిగా ప్రారంభించిన ఎదురుదాడి ఇటు కేంద్ర ప్రభుత్వానికి అటు జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పులో రాయిలా మారిపోయింది. అసలు టి.ఎస్.డి అనేది పేరులో ఉన్నట్లు సాంకేతిక విభాగం కాదనీ, జమ్ము కాశ్మీర్ యువతను మిలిటెన్సీ వైపుకు మరలకుండా నివారించడానికి ఉద్దేశించిన కార్యకలాపాలకు దానిని ఉద్దేశించారని, ఇది ప్రభుత్వానికి తెలిసిన విషయమేనని ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు.
ఆయన అంతటితో ఆగలేదు. టి.ఎస్.డి ఖర్చు పెట్టిన నిధులను జమ్ము కాశ్మీర్ లోని ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వంలోని అనేకమంది మంత్రులకు పంపిణీ చేశారని బాంబు పేల్చారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఈ ఆరోపణలతో ఇరకాటంలో పడిపోయింది. వి.కె.సింగ్ ఆరోపణలపై విచారణ చేయాలని అబ్దుల్లాయే కోరాల్సి వచ్చింది. పనిలో పనిగా టి.ఎస్.డి నివేదికపై మొదట స్టోరీ రాసిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ఎడిటర్ పైన కూడా వి.కె.సింగ్ నిప్పులు చెరిగారు. యు.పి.ఏ మోచేతి నీళ్ళు తాగుతున్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ పెద్ద అవినీతిపరుడని, అనేక పేపర్ కంపెనీలు పెట్టి నిధుల్ని బొక్కాడనీ, దానికి తగిన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని వి.కె.సింగ్ సంచలన రీతిలో ట్విట్టర్ లో ఆరోపించారు.
ఇలాంటి రిటైర్ మెంట్ మజా కొందరికే దక్కుతుంది!