అక్కడ ప్రతీకారం అంటే ఆమెను వివస్త్రను చేయడం!


Saritha Deviఇది మరో భారత స్త్రీ కధ! కాదు, కాదు, మరో దళిత స్త్రీ కధ!! చాతుర్వర్ణాలలో ఆమె పుట్టిన కులం/వర్ణం లేదు గనక ఆమెను భారత స్త్రీ అనడానికి మనువాదులు ఒప్పుకుంటారో లేదో? అందుకే ఆమె భారత స్త్రీ కాదు, దళిత స్త్రీ. ఉత్తర ప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులంగా గుర్తించబడిన దోబి కులానికి చెందిన ఆమె కొడుకు చేసిన (నిజానికి చెయ్యని) పాపానికి ఆమెను అగ్ర కులస్ధులు ఇంటినుండి వీధిలోకి ఈడ్చుకొచ్చి చీర, రవికె ఊడబెరికారు. చిత్తం వచ్చినట్లు చావబాదారు. నగ్నంగా రోడ్ల వెంట ఊరేగించారు. కలగజేసుకోబోయిన సర్పంచిని ‘దోబీదానికి మద్దతా?’ అని చీత్కరించారు. ఆమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయబోతే ‘పేదరాలివి, ఏం చేయగలవు? తీసుకునేది లేదు పొమ్మ’న్నారు. సంఘాల దన్నుతో వెళితే తప్ప ఫిర్యాదు తీసుకోలేదు.

బీహార్ రాజధాని పాట్నాకు సమీపంలోని గ్రామంలో నివసించే సరితా దేవి (అసలు పేరు కాదు) దోబి కులానికి చెందిన వ్యక్తి. అక్కడ అగ్రకులంగా గుర్తింపు పొందిన యాదవులదే ఆ గ్రామంలో పెత్తనం. రెండు కుటుంబాలు మాత్రమే దోబి కులానికి చెందినవి. యాదవుల్లోని ఒక కుటుంబం తమ అమ్మాయితో సరితా దేవి కొడుకు (15 సం.) సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆరోపణల్లో నిజం ఎంతో గానీ ఒకరోజు ఆ పిల్లలు తగువులాడుకున్నారు. ఒక నిమ్న కులస్ధుడు ఇంతకు తెగిస్తాడా అనుకుంటూ ప్రతీకారం చూస్తున్న యాదవ కుటుంబం అదే అదనుగా ఎంచారు.

ఆరోజు ఫిబ్రవరి 17. ఉదయం దాదాపు 7 గంటల సమయం. సరితా దేవి పళ్ళు తోముకుంటోంది. ప్రతీకారంతో రగిలిపోతున్న యాదవ కుటుంబంలోని ఆరుగురు పురుషులు నిర్దిష్ట లక్ష్యంతో ఆమెపై దాడి చేశారు. అనేక మంది దళిత కుటుంబాలకు మల్లెనే సరితా దేవి కుమారుడు చేశాడని భావిస్తున్న తప్పుకు ఆమె గౌరవమే టార్గెట్ ఆయింది. ఈ అరాచక వ్యవస్ధ ఒక స్త్రీకి గౌరవం ఎక్కడ ఉంటుందని నిర్ధారించిందో వారికి తెలుసు.

ఒంటరిగా ఉన్న సరితా దేవి పైన వారు తోడేళ్ళ లెక్కన దాడి చేశారు. ఆమె చేతులు, కాళ్ళు పట్టి వీధిలోకి ఈడ్చుకొచ్చారు. చుట్టుపక్కల అనేకమంది చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేశారు. బట్టలు లేకుండా రోడ్డు మీద కొట్టుకుంటూ ఊరేగింపు మొదలు పెట్టారు. వారిలో ఒకరు కత్తి పట్టుకుని నడుస్తుంటే మిగిలినవారు దుడ్డు కర్రలు పట్టుకుని తమ వికృత దుశ్శాసన పర్వానికి కాపలా కాశారు. ఆ దుశ్శాసనుల పేర్లు నావల్ రాయ్, ఆత్మా రాయ్, పరమాత్మా రాయ్, మనోజ్ రాయ్, సంజయ్ రాయ్.

“వాళ్ళు దాడి చేసి నన్ను పట్టుకున్నపుడు నేను పెరట్లో పళ్ళు తోముకుంటున్నాను. వాళ్ళు “దోబీదానివి నీకెంత ధైర్యమే?” అని అరుస్తున్నారు. నన్ను లాక్కెళ్లి బట్టలు ఊడదీశారు. నన్ను ఇంకా అవమానించడానికి వాళ్ళ ఇంటికి లాక్కెళ్తున్నారు. నా భర్త యేడని, కొడుకు ఎక్కడని గద్దిస్తూ నన్ను చంపుతామని బెదిరించారు. మనోజ్ కత్తి చేత బట్టుకుని ఉన్నాడు. మిగిలినవాళ్లు దుడ్డు కర్రలు తెచ్చారు. నా చీర, రవికె ఊడబీకుతుంటే అందరూ చూస్తూనే ఉన్నారు. నా శరీరం అంతా రక్కి పెట్టారు” అని సరితా దేవి వివరించిందని ది హిందు తెలిపింది.

సరితా దేవి కేకలు విని 12 యేళ్ళ కూతురు పరుగెత్తుకుంటూ వచ్చింది. “మా అమ్మాయిని చూశాక వాళ్ళు తనను కూడా తీసుకెళ్తామని బెదిరించారు. ఆమెను కొట్టి నేలకు నెట్టారు. ఆ పిల్ల ఎలాగో తప్పించుకుని పారిపోయింది” అని సరితా దేవి తెలిపింది. “ఇది చూసిన నా మరిది కూడా పరుగెత్తుకు వచ్చాడు. అతన్ని దుడ్డు కర్రలతో చావబాదారు. నా భర్త వస్తే ఏం చేస్తారోనని మా పొరుగువాళ్లు నా దగ్గరికి రాకుండా అడ్డుకున్నారు” అని తేలిపిందామె.

ఈ లోగా ఆ ఊరి సర్పంచి చూడలేక కలుగజేసుకున్నాడు. దాడి చేస్తున్న కీచకులను వారించబోయాడు. ఆయనా యాదవుడే. యాదవుడై ఉండీ నీచ కులం దానికి మద్దతు వస్తావా అంటూ ఆయన్ని నిలదీశారు. తిట్లకు లంకించుకున్నారు. సర్పంచివైపు వాళ్ళు దృష్టి మరల్చడం గమనించిన సరితా దేవి చేతికి అందిన గుడ్డ ముక్కను కప్పుకుంది. పరుగెత్తుకుంటూ వెళ్ళి పంచాయితీ భవనం పక్కనే ఉన్న ఇంట్లో నక్కింది. ఆ ఇంట్లో వాళ్ళు ఆమెకు ఒక శాలువా, దుప్పటి ఇచ్చి శరీరాన్ని కప్పడానికి సహాయం చేశారు.

తనకు జరిగిన అవమానాన్ని దిగమింగి ఊరుకోదలుచుకోలేదామె. ధైర్యం చేసి పోలీసు ఠాణాలో అడుగు పెట్టింది. ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. నిరాశపరిచి ఇంటికి పంపడానికే ఉత్సాహం చూపారు. “ఎందుకమ్మా కేసు? పేద దానివి. కనీసం తినడానికి తిండయినా ఉందా నీకు? చచ్చిపోతావ్! కేసు లేదు ఏమీ లేదు పో” అన్నారు. సంఘాలోళ్ళు వచ్చి మీడియాలో గగ్గోలు పుట్టాకనే కేసు పెట్టారని సరితా దేవి తెలిపింది.

ఇంత జరిగినా వైద్యులు కూడా కీచకుల పక్షానే నిలిచారు. ఆమె శరీరం పైన ఒక్క గాయం కూడా లేదని సర్టిఫికేట్ ఇచ్చారు. వారిచ్చిన సర్టిఫికేట్ ఈ దేశ మేధావుల ఆలోచనా ధోరణికి, తాకట్టు పెట్టబడిన మెదళ్ళకు, డబ్బుకు అమ్ముడుబోయే ఉన్నత చదువులకు నిదర్శనం. ఆమె శరీరం నిండా చీరుకుపోయిన గాయాలున్నా వారి మేధస్సు మాత్రం కళ్లులేని గుడ్డిదయింది. అగ్రకులస్ధుల నోట్ల కట్టల మెరుపుల ముందు బాధాసర్పద్రష్టుల వ్యధార్తి తేలిపోయింది.

పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కానీ సరితా దేవి శరీరం పై జరిగిన దాడి ఆ సెక్షన్లలో చోటు దొరకలేదు. చట్టం ఎలాగూ కలవాడి చుట్టమే. సరితా దేవి విషయంలో అది అగ్రకులానికి తోబుట్టువు అయింది. బీహార్ యాదవుల పలుకుబడికి లొంగిపోయింది. పోలీసుల దృష్టిలో ఆమె గౌరవంపై దాడి ఏమీ జరగలేదు. ఒక దొబీ దానికి అసలు గౌరవం అంటూ ఉంటే కదా, దాడి జరగడానికి? పంచమ కులానికి గౌరవం ఎక్కడిదీ పుణ్య భూమిలో?

విశ్వ నరుడు గుర్రం జాషువా వాపోయినట్లు: “ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలువురు కుమారులనుట విన్నాముగాని పసరము కన్న హీను డభాగ్యుడైన యైదవ కులస్థు డెవరమ్మా! సావిత్రి?” అని వాపోవడమే ఇప్పటికీ పంచములకు మిగిలింది! భారత దేశ అభివృద్ధి పధానికి దిక్సూచిగా బీహార్ ని నిలబెట్టానంటున్న నితీశ్ కుమార్ తన ప్రభుత్వ దివాణానికి కూత వేటు దూరంలోనే సాగిన కీచక పర్వం తెలుసుకునే తీరిక ఉన్నదో లేదో గాని ఆ కీచకులు మాత్రం నిర్భయంగా తిరుగుతున్నారు.

ఏప్రిల్ లో ఛార్జీ షీటు దాఖలయినా సరితా దేవి కుటుంబానికి శాంతి, రక్షణ కరువయింది. భయం ఆమె కుటుంబాన్ని నిత్యం వెంటాడుతోంది. దళిత మానవ హక్కుల కోసం కృషి చేస్తున్నఆల్ ఇండియా దళిత అధికార్ మంచ్ నిందితులకు బెయిల్ ఇవ్వడం చట్ట సమ్మతం కాదని వాదిస్తోంది. “షెడ్యూల్డ్ కులాలు తెగల అత్యాచార నిరోధక చట్టం ప్రకారంకింది కోర్టు గానీ, హై కోర్టు గానీ బెయిలు ఇవ్వడానికి వీలు లేదు. అయినా బెయిలు ఇచ్చారంటే తప్పుడు పద్ధతుల్లో బెయిల్ దొరికిందని అర్ధం. స్త్రీల గౌరవానికి భంగంకలిగించినవారిపై మోపే సెక్షన్ ను కూడా ఈ కేసులో ఉపయోగించలేదు” అని ఆ సంస్ధ తెలిపింది.

ఒక దళిత కులాన్ని అవమానించాలంటే ఆ కులానికి చెందినస్త్రీలను అవమానించడం ఒక శక్తివంతమైన మార్గం అయిపోయిందని సదరు సంస్ధ చెబుతోంది. నిజమే కదా.

సరితా దేవి కొడుక్కి ఇప్పుడా ఊర్లో అడుగుపెట్టడానికి ధైర్యం లేదు. ఇటుక బట్టీలో కూలీ అయిన అతని తండ్రి చీకటి పడకుండానే ఇంటికి రావడం అలవాటు చేసుకున్నాడు. ఆ కుటుంబానికి దారిద్ర రేఖకు దిగువన ఉండేవారికి ఇచ్చే కార్డు లేదు. తాము బట్టలకు అంటిన మురికిని శుభ్రం చేస్తామని సరితా దేవి చెబుతుంది. కానీ ఆమెకు తనకు జరిగిన అవమానాన్ని శుభ్రం చేసుకోగల శక్తి ఉన్నదా?

ఈ దేశంలోచట్టబద్ధ పాలన అనేది ఉన్నది నిజమే అయితే అది మొదట అందాల్సింది సరితా దేవి లాంటివారికే. కానీ ప్రస్తుత వ్యవస్ధలో జరగనిది అదే. కులాధిపత్యం, పురుషాధిపత్యం జంటగా పెనవేసుకుపోయి మరీ వికటాట్టహాసం చేసిన సరితా దేవి విషయంలో అది జరిగే అవకాశం ఇంకా తక్కువ.

3 thoughts on “అక్కడ ప్రతీకారం అంటే ఆమెను వివస్త్రను చేయడం!

  1. మనది ఒక బతుకేనా, మనకన్నా కుక్కలు నయం. ఆ నీచులను ఏమి చెయ్యలేని నిస్సహాయతలో ఉన్నందుకు తల దించుకోవడం భారతీయులకు(దళిత సోదరులు) భాధాకరం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s