ఈ కార్టూన్ చూసి నవ్వని, కనీసం నవ్వుకోని వారు ఎవరన్నా ఉంటే వారికి ఏదో సమస్య ఉన్నట్లే అనుకోవాలి.
‘మాట తప్పని, మడమ తిప్పని’ వంశం అని చెప్పుకున్నవారు సోనియాగాంధీ కాళ్ళు పట్టుకుని బెయిల్ ఇప్పించుకున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పక్క ఆరోపిస్తున్నారు. టి.డి.పి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి అయితే ఒకడుగు ముందుకేసి వై.ఎస్.ఆర్ భార్య వై.ఎస్.విజయ నిన్న సోనియాగాంధీకి ఫోన్ చేసి ‘బెయిల్’ ఇప్పించినందుకు ధన్యవాదాలు కూడా చెప్పారని ఆరోపించారు. అదే నిజమైతే భారత దేశంలో అవినీతిపరులైన రాజకీయ నాయకులకు బెయిలు ఇప్పించేది ఎవరో ప్రజలకు తెలిసిపోయినట్లే.
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుపుతోంది గనక, ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్న సోనియా ‘బెయిల్’ ఇప్పించారని ఆరోపణలు వస్తున్నాయి. రేపు బి.జె.పి అధికారంలోకి వస్తే ఆమె స్ధానంలో ఉండేవారు ఆ పాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. గుజరాత్ అల్లర్లలో దోషులుగా రుజువై ఆజన్మ ఖైదు అనుభవిస్తున్న వారికి ‘పెరోలు’ లభించినా లభించవచ్చు. తధాస్తు దేవతలు ఈ బ్లాగ్ వైపు రాకుండు గాక!
‘కొన్నాళ్లు ఆగమని’ చెప్పినా ఆగకుండా ‘ముఖ్యమంత్రి పీఠం కావాల్సిందే’ అంటూ మారాం చేసిన వై.ఎస్.జగన్మోహన రెడ్డి అరెస్టు వెనుక దేశంలో బడా బడా రాజకీయార్ధిక ఘర్షణలు, ఎత్తులు పై ఎత్తులే నడిచాయి. వై.ఎస్.ఆర్ నాయకత్వంలో బలమైన పారిశ్రామిక వర్గంగా ఎదిగిన ఆంధ్ర పెట్టుబడిదారులు జాతీయ స్ధాయి పెట్టుబడి సంపద, వ్యాపారాల్లో వాటా కోసం పట్టుబట్టారు. అందులో భాగంగా కృష్ణా-గోదావరి బేసిన్ లో బయల్పడిన సహజవాయు సంపదలో వాటా కోసం వై.ఎస్.ఆర్ గట్టిగా డిమాండ్ చేశారు.
కానీ వై.ఎస్.ఆర్ అర్ధాంతరంగా తనువు చాలించడంతో (ఆయన హత్యకు గురయ్యారన్న ఆరోపణలను ఈ నేపధ్యంలో చూడొచ్చు) ఆంధ్ర పెట్టుబడిదారులకు మరో బలమైన రాజకీయ ఆధారం అవసరం అయింది. ఆ పాత్ర పోషించడానికి ముందుకు వచ్చిన జగన్ సహజంగానే వారికి ఆప్తనాయకుడయ్యారు. జగన్ అధికార దాహాన్ని జగన్ వరకే వ్యక్తిగతంగా పరిమితం చేసి చూస్తే కొన్ని విషయాలు అర్ధం కాకపోవచ్చు. ఆనాడు మంత్రివర్గ సహచరుల్లో అనేకమంది జగన్ కు వత్తాసుగా సోనియాకు లేఖ ఇవ్వడం వెనుక ఆంధ్ర సంపన్న వర్గం ఉన్నది.
ప్రాంతీయ సంపన్నవర్గం తమ ప్రయోజనాలకు, వ్యాపారాలకు పోటీకి రావడం జాతీయ స్ధాయి సంపన్నవర్గం సహించలేదు. వారి రాజకీయ ఆధారం ఈ రోజు కాంగ్రెస్ (రేపు బి.జె.పి కావచ్చు). కాబట్టి కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతోనే వారు తమ పనులు చక్కబెట్టుకున్నారు. ఆంధ్ర సంపన్నులను తోక్కేసే పని కోసం ఎదురు చూస్తున్న బడా సంపన్నులకు వై.ఎస్.ఆర్ మరణం కలిసొచ్చింది. అదే అదనుగా ఆంధ్ర రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పావులు కదిపారు. అందులో ఎంతవరకు సఫలం అయ్యారో తెలియదు గానీ (తెలంగాణ ఏర్పాటుకు కిరణ్ సహాయ నిరాకరణ వల్ల ఈ అనుమానం!) జైలు పాలు చేయడం ద్వారా జగన్ నీ పోటీకి వచ్చిన ఆంధ్ర సంపన్నులని దారికయితే తెచ్చుకున్నారని జగన్ బెయిల్ ద్వారా అర్ధం అవుతోంది.
సి.ఎం కిరణ్ కుమార్ పాత్ర ఏమిటన్నదీ స్పష్టం కాలేదు. చిదంబరం గారి రికమండేషన్ తోనే ఆయన సి.ఎం అయ్యారని పత్రికలు చెప్పాయి గనుక కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి ఆయన వ్యతిరేకం అని ఇప్పుడే భావించలేము. ‘నేను సమైక్యాంధ్ర వాదినే’ అని చెప్పడం ద్వారా సి.ఎం కిరణ్ తమ నాయకత్వాన్ని ఎదిరిస్తున్నారా లేక నాయకత్వం చెప్పినట్లు వింటూ సీమాంధ్ర ఓట్ల పోలరైజేషన్ లో భాగం అవుతున్నారా అన్నది కొద్ది వారాల్లో లేదా నెలల్లో తేలే విషయం. తెలంగాణ నాయకురాలు కొండా సురేఖను స్వయంగా తోడ్కొని వెళ్ళి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేర్పించిన కిరణ్ తమ నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటే అనుమానమే.
బి.జె.పికి తాను దగ్గర అవుతున్నట్లు చంద్రబాబు నాయుడు అప్పుడే సంకేతాలు ఇస్తున్నారు. ఆయన త్వరలో మోడితో కలిసి వేదిక పంచుకుంటారని ఛానెళ్లు చెబుతున్నాయి. అదే సమయంలో రెండు సార్లు వరుసగా ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ లో ‘ప్రభుత్వ వ్యతిరేకత’ (anti-incumbency factor) ఎదుర్కొంటోంది. తెలంగాణ ప్రకటన ద్వారా దీనిని మాపుకున్న (nullify) కాంగ్రెస్, సీమాంధ్రలో మరో ఎత్తుగడ కోసం చూసింది. కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు టి.డి.పి వైపుకు వెళ్లకుండా ఉండాలంటే మరో శత్రువైన మిత్రుడిని అది ఎంచుకోవాలి. ప్రజలకు వాళ్ళు కాంగ్రెస్ శత్రువులా కనపడాలి. అదే సమయంలో తనకు మిత్రులుగా ఉండాలి. సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో ఆ పాత్రలో వైకాపా చక్కగా ఒదిగిపోతోంది.
ఈ నేపధ్యంలో రాష్ట్ర రాజకీయాలకు ఈ కార్టూన్ ఎంత చక్కగా అమరిందో ప్రత్యేకంగా చెప్పాలా? మొత్తం పరిస్ధితిని నాలుగైదు గీతల్లో చెప్పడం అంటే మాటలు కాదు! సురేంద్ర గారికి అభినందనలు!
నేను చేస్తే సరసం నువ్వు చేస్తే వ్యభిచారం ఇదీ అన్ని రాజకీయ పార్టీల తీరు. సరసమైనా వ్యభిచారమైనా చూసే దుర్-అదృష్టం ప్రజలది. తిప్పికొడదామంటే సమర్థ ప్రత్యామ్నాయం లేక పోవడం దురదృష్టమే.