ఈ పాటను నేను చాలాసార్లు విన్నాను. పాడటంలో అనుభవం ఉన్నవారి నోట విని తన్మయం చెందాను. వారిలో చాలా మంది చూసి పాడేవాళ్లు. చూడకుండా పాడితే తప్పులు పాడేవాళ్లు. కొంతమంది పాడుతూ ఉండగానే శృతి తప్పేవాళ్లు. మళ్ళీ అందుకోడానికి యాతన పడేవాళ్లు.
కానీ మొదటి సారి ఈ పాటని ఒక శ్రమ జీవి నోటి నుండి వింటున్నాను. పాటలోని పదజాలం పుస్తకాల్లో మాత్రమే దొరికేది. జానపదం లాగా పల్లె పదాలు కావవి. సంస్కృత పదాలు కలిసి ఉన్న ఈ పాటను గుర్తు పెట్టుకుని కాగితం చూడకుండా పాడడం మాటలు కాదు. ఆ పాటంటే ఎంతో ఇష్టం ఉంటే తప్ప గుర్తు పెట్టుకోవడం ఒకింత కష్టం.
విన్న వెంటనే అర్ధం అయ్యే పాటయితే గుర్తు పెట్టుకోవడం తేలిక. చమత్కారాలతో, విరుపులతో, నిత్య జీవితానుభవంలోని సంఘటనలతో నిండి ఉండే పాటలను కూడా తేలికగా గుర్తు పెట్టుకోవచ్చు. కానీ ఈ పాట చాలా బరువైనది. ఎంతో లోతైన అర్ధం కలిగిన పాట. ఒక్కో పదబంధంలో మానవ జాతి చరిత్ర, మానవ పరిణామ క్రమం, విశ్వం నిర్మాణం తదితర శాస్త్రీయ విజ్ఞానం తొణికిసలాడుతూ ఉంటుంది. కాబట్టి దీనిని గుర్తు పెట్టుకోవడం కష్టం.
ఈ పాట పాడేవాళ్లలో చాలామంది చేసే తప్పు “కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో” అన్న పాదంలో వాస్తవానికి ఉండాల్సింది ‘బలియైన’ కాదు, ‘బలిగాని’ అని. కుల, మత ఘర్షణలను అపవిత్రంగా రచయిత చూశారు. బలికావడం అనేది కేవలం చనిపోవడం మాత్రమే కాదు, కుల మతాలకు లోబడడం కూడా. అలా లోబడని వారిని పవిత్రులుగా చూసిన రచయిత అలాంటివారు తక్కువే ఉంటారని వ్యంగ్యంగా చెప్పదలిచారు.
ఈ పాట ఒరిజినల్ ను నేను తొంభైల మొదట్లో విన్నాను. అందులో ‘బలిగాని’ అనే ఉంది తప్ప ‘బలియైన’ అని కాదు. కానీ విన్నవారు ఆ పాడినవారే తప్పు పాడారన్న ఉద్దేశ్యంతో సవరించి పాడుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ వీడియోలోని వ్యక్తి చూడబోతే డ్రైవర్ లా ఉన్నారు. పాట పాడుతున్న పద్ధతి చూస్తే పాటంటే ఎంత ఇష్టమో, ఆ పాట తనకి ఎంత బాగా అర్ధం అయిందో ఆయన చెబుతున్నట్లుగానే ఉంది. అందుకే ఈ వీడియోని చూసిన వెంటనే నాకు ఇష్టం ఏర్పడిపోయింది. బ్లాగ్ పాఠకులతో పంచుకోవాలన్న కోరిక బలంగా కలిగింది.
ఒకే ఒక్క చోట తడబడినా మొత్తం మీద బాగా పాడారు. ముఖ్యంగా ముడి గొంతుతో, ముడి పనిలో ఉండగా దాదాపు అన్ని రకాలుగా పాలిష్ పట్టిన పాటను పాడిన ఈ వ్యక్తికి అభినందనలు!
పాట సాహిత్యం చూస్తే ఎవరైనా ఇట్టే భళా అనకుండా ఉండలేరు. రాసింది ఎవరో నాకు తెలియదు. దాశరధి అని ఎవరో చెప్పినట్లు గుర్తు. చివరి చరణంలో కవి వ్యక్తం చేసిన ఉదాత్తమైన భావన ఎంతో హృద్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ చివరి పాదం కవి యొక్క అనివార్య కర్తవ్యం ఏమిటో చెప్పిన తీరు పాటకే హై లైట్. “కష్టజీవి కి ఇరువైపులా నిలిచేవాడే నిజమైన కవి” అని శ్రీ శ్రీ ఇచ్చిన సందేశానికి ఇది మరో రూపం.
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ॥ఆ చల్లని॥
–
భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో
కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో ॥ఆ చల్లని॥
–
మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో
రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాధమెంతో
ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ॥ఆ చల్లని॥
–
అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ॥ఆ చల్లని॥
మీరు చెప్పిన ‘బలిగాని’ పదం విషయమే కాకుండా, ఈపాట రెండవ లైన్ లోని ‘ కానరాని భాస్కరులెందరో’ కూడా దాశరథి గారి ‘పునర్నవం’ కవితా సంపుటి ( ప్రచురణ 1956)లో ‘కానరాని భానువు లెందరో’ అని వుంటుంది.. కవిత శీర్షిక ‘?’. బహుశా తర్వాత రచయితే భాస్కరులెందరో అని మార్చి ఉండవచ్చు.
శేఖర్ గారు,
చాలా మంచి పాటను అందించారు! అభినందనలు.
శ్రీ శ్రీ ‘ దేశ చరిత్రలు ‘ వట్టి చారిత్రక ఘట్టాలను ఉటంకించితే
ఈ కవిత్వం మానవ పరిణామ క్రమాన్ని రెండు మాటల్లో అద్బుతంగ వర్ణించారు
@ భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో @
ఖగోళ శాస్త్రాన్ని,జీవ శాస్త్రాన్ని రెండు వాక్యాల్లో చెప్పినట్లుంది.
ఒక్కొక్క పంక్తి చారిత్రక బౌతిక వాధాన్ని కళ్ళముందు ఉంచినట్లుంది.
ఈ కవి పేరు తెలిస్తే బావుండు.
పాడిన వ్యక్తి ఎవరో తెలియక పోయినా ఆయనకు అభినందంలు!
బ్రహ్మం గారు
హమ్మయ్య! రచయిత ఎవరన్న విషయంలో నాకు గుర్తున్నది కరెక్టే అన్నమాట. మీ ద్వారా ‘పునర్నవం’ కవితా సంపుటి గురించి తెలిసింది. రచనా కాలం కూడా తెలిసింది. బహుశా ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని రాసిన రోజుల్లో దాశరధి గారు దీన్ని రాసి ఉంటారు. మీరన్నట్లు రచయితే భాస్కరులెందరో అని మార్చి ఉంటారు. ఆ పదమే అక్కడ బాగా అమరింది.
తిరుపాలు గారు, నిజం. చారిత్రక భౌతికవాదమే ఇది. కవి దాశరది గారే అని బ్రహ్మంగారు నిర్ధారించారు.
బ్రహ్మం గారు చాలా ధాంక్సండీ!
ఈ కవితను ధాశరధి గారు రాసి నట్లు చెప్పినందుకు.
Hats off to the singer – he brought sweetness to it
విశేఖర్ గారు. మంచి పాటను అందించినందుకు చాలా థ్యాక్సండి.
ఈ పాట దాశరథి గారు రాసిందే..
ప్రజా గాయకురాలు విమల ఈ పాట పాడడం లో చాలా ప్రసిద్ధి చెందింది. ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిన పాట ఇది.
ఈ పాట ప్రభాకర్ రెడ్డి తీసిన కామ్రేడ్ అనే సినిమా లో వాడుకున్నారు.
ఇలాంటి పాటలు కష్ట జీవులు పాడితేనే అందం వస్తుంది.
మొత్తానికి మీరు మంచి విశ్లేషకులే కాదు… మంచి రస హ్రుదయులు, కళాపిపాసి అన్నమాట.
అర్ధవంతమైన పాట దానికి సరితూగే గానం. ధన్యవాదాలు విశేఖర్ గారు.
Thanks for the good one. I am going to present this song in coming Detroit telugu association meeting
ee patalo oka aavedana dagundi. aa avedanani ippudu paadina gayakudi bhava vyakthikarana chaala baagundi. srama jeevulu padithene ee pataku andam vasthundi.
ఈ వీడియోని చూసిన వెంటనే నాకు ఇష్టం ఏర్పడిపోయింది. Great…