ఒరిగి మునిగిన భారీ ఓడను నిలబెట్టారు -ఫోటోలు


ఈ ఓడ పేరు కోస్టా కంకార్డియా. దాదాపు రెండేళ్ల క్రితం ఈ ఓడ పొరపాటునో, గ్రహపాటునో ఇటలీ లోని ఒక ద్వీపం ఒడ్డుకు దగ్గరగా వచ్చి అడుగును ఢీ కొట్టడంతో పక్కకు ఒరిగిపోయింది. ఆ సందర్భంగా ప్రయాణీకులు, సిబ్బందిలో 32 మంది చనిపోయారు. 600 రోజులకు పైగా ఇలా పక్కకు ఒరిగి ఉండడంతో ఓడ బరువుకు ఒరిగిన వైపు మొత్తం అణిగిపోయి దెబ్బతింది.

‘కోస్టా కంకార్డియా’ను దీనిని తిరిగి నెలబెట్టడానికి ఇటలీ ప్రభుత్వం, కంపెనీలు అప్పటి నుండీ ప్రయత్నిస్తూ ఉన్నాయి. చివరికి మొన్న సెప్టెంబర్ 17 తేదీన తమ ప్రయత్నంలో సఫలం అయ్యారు. నిలబెట్టడానికి కేవలం 19 గంటలే పట్టినా దానికి కావలసిన ఏర్పాట్లు పాత్రం నెలల తరబడి చేశారు. 500 కు పైగా ఇంజనీర్లు శ్రమించారు.

వాలిపోయిన పై భాగంలో పెద్ద పెద్ద ఇనప ట్యాంకులను బరువులుగా కేబుళ్లతో వేలాడ గట్టారు. ఆ ట్యాంకుల్లో నీళ్ళు నింపుతూ 36కు పైగా బలమైన కేబుళ్లతో, హైడ్రాలిక్ మిషన్ల సహాయంతో అవతలివైపు నుండి లాగుతూ కోస్టా కంకార్డియాను మొత్తం మీద నిలబెట్టారు. ఒరిగిపోయిన ఓడలను ఇలా తిరిగి నెలబెట్టే ప్రక్రియను ‘పార్ బక్లింగ్’ (parbuckling) అంటారట. అమెరికా, ఇటలీ దేశాలకు చెందిన కంపెనీలు ఈ పారా బక్లింగ్ లో పాల్గొన్నాయి. ఇందుకు మొత్తం 865 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఓడను భీమా చేసిన కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల తుప్పు వదలనుంది.

జనవరి 13, 2012 తేదీన ఒరిగిపోయిన ఓడ తిరిగి సెప్టెంబర్ 17 తేదీన నిటారుగా నిలబడింది. ఇలా 613 రోజులు ఒరిగి ఉండడం వలన ఓడ బరువుకు ఒరిగిన భాగం 3 మీటర్ల మేర లోపలికి ఒత్తుకు పోయిందని పారా బక్లింగ్ సిబ్బంది చెప్పారు. ఇంత భారీ ఓడను తిరిగి నెలబెట్టడం చరిత్రంలో ఇదే మొదటిసారి అని ‘ది అట్లాంటిక్’ పత్రిక తెలిపింది. టైటానిక్ కంటే పొడవైనదే (290 మీటర్లు) కాక రెండింతలు బరువైనది (114,500 టన్నులు) కూడా అయిన కోస్టా కంకార్డియాను తిరిగి లేపడం అంటే, నిజంగా చారిత్రాత్మకమే కదా!.

ఇటలీ ద్వీపం ‘ఇసోలా డెల్ గిగ్లియో’ ఈ చారిత్రక కార్యక్రమానికి సాక్షీభూతంగా నిలిచింది. సముద్రం అడుగు ఢీకొని ఒరిగిపోయినప్పుడు అందులోని సిబ్బంది, ప్రయాణీకులు 32 మంది సముద్రంలో మునిగి చనిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు ఓడలో మొత్తం 70 దేశాలకు చెందిన 4229 మంది ప్రయాణీకులు ఉన్నారు. మిగిలినవారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఒడ్డున ఒరిగింది కాబట్టి సరిపోయింది గానీ అదే లోపల అయితే టైటానిక్ ని మించిన ఉపద్రవం జరిగుండేది. ప్రయాణీకులు ఇంకా ఓడలో ఉండగానే దూకి పారిపోయిన ఓడ కెప్టెన్ ‘కెప్టెన్ కౌవర్డ్’ బిరుదాంకితుడు కావడం ఈ ప్రమాదంలో ఒక విశేషం. ఆయనపై కోర్టులో విచారణ సాగుతోంది.

తిరిగి నిటారుగా నిలబడినప్పటికీ ఓడ ఇంకా పాక్షికంగా మునిగే ఉంది. ఓడను పూర్తిగా వదులుకుని విడి భాగాలుగా అమ్మేస్తారా లేక రిపేర్ చేస్తారా అన్నది తెలియలేదు. పారాబాక్లింగ్ సిబ్బంది నాయకుడు గాబ్రియేల్లి చెప్పిందాన్ని బట్టి రిపేరుకు అవకాశాలు తక్కువ. వచ్చే సంవత్సరానికల్లా స్క్రాప్ కింద అమ్మేసే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s