పాలస్తీనా: ఐరోపా రాయబారులపై ఇజ్రాయెల్ దాడి


ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనాలో యూదు ప్రభుత్వ దాష్టీకానికి బలైన పాలస్తీనీయులకు సహాయం అందించడానికి పూనుకోవడమే నేరమయింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం బెడోవిన్ పాలస్తీనీయుల ఇళ్లను కూల్చివేయడంతో వారికి సహాయ కార్యక్రమాలు అందించడానికి వివిధ ఐరోపా దేశాల రాయబారులు సహాయ సామాగ్రితో సహా అక్కడికి వెళ్లారు. నిరాశ్రయులైన పాలస్తీనీయులకు సహాయం చేస్తే ఒప్పుకునేది లేదంటూ ఇజ్రాయెల్ సైనికులు ఐరోపా రాయబారులపై దాడి చేసి వారు తెచ్చిన సామాగ్రిని లాక్కున్నారు. ఆక్రమిత పాలస్తీనాలో పాలస్తీనీయుల ఇళ్లను కూల్చివేసి యూదు సెటిల్మెంట్లను నిర్మిస్తున్న ఇజ్రాయెల్ తమ అక్రమాలకు అడ్డువస్తే ఎవరినైనా సహించేది లేదని తాజా చర్య ద్వారా తేల్చి చెప్పింది.

ఫ్రెంచి రాయబారి మారియోన్ కాస్టింగ్ ను ఆమె ప్రయాణిస్తున్న ట్రక్కు నుండి బైటికి ఈడ్చివేసి నేలపైకి తోసేయడం పట్ల అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ రాయబారుల పట్ల హింసాత్మకంగా ప్రవర్తించినందుకు వివరణ ఇవ్వాలని ఐరోపా దేశాలు డిమాండ్ చేశాయి. అయితే ఇజ్రాయెల్ నుండి అధికారికంగా ఇంతవరకు ఎటువంటి వివరణా అందలేదు. పైగా తమ సైనికులపైనే ఐరోపా రాయబారులు దాడి చేశారని ఆరోపిస్తూ వారిపై ఆయా దేశాల ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించింది. రాయబారులు తగిన విధంగా ప్రవర్తించాలని సుద్దులు చెప్పింది.

బెడోవిన్ పాలస్తీనీయుల ఇళ్లను కూల్చివేయడం ఇజ్రాయెల్ కు ఇదే మొదటిసారి కాదని, ఆగస్టు నుండి ఇప్పటివరకూ ఇది మూడోసారని ఐరాస ‘మానవతా వ్యవహారాల సమన్వయ సమితి’ కార్యాలయం ప్రకటించిందని ఇజ్రాయెల్ పత్రిక హారెట్జ్ తెలిపింది. హారెట్జ్ ప్రకారం ఖిర్బత్ ఆల్-మఖుల్ గ్రామ బెడోవిన్ పాలస్తీనీయులు తమ గ్రామంలో నిర్మించుకున్న ఇళ్ళు చట్ట విరుద్ధం అని ఇజ్రాయెల్ హై కోర్టు తీర్పు చెప్పింది. తమ దురాక్రమణ విధానాలకు కోర్టులను అడ్డం పెట్టుకోవడం ఇజ్రాయెల్ కి మామూలే. అంతర్జాతీయ చట్టాలను, ఐరాస తీర్మానాలను తుంగలో తొక్కడానికి ఇజ్రాయెల్ తమ కోర్టుల అక్రమ తీర్పులను అడ్డం పెట్టుకుంటుంది. చాలాసార్లు ఆ మాత్రం కూడా చేయదు.

హై కోర్టు తీర్పు అమలు చేసే పేరుతో నిరాశ్రయులయిన వారికి అంతర్జాతీయ సహాయాన్ని అనుమతించడానికి కూడా ఇజ్రాయెల్ సైన్యం ఒప్పుకోలేదు. తరాల నుండి తమ పశు సంపదతో సహా తామక్కడ నివసిస్తున్నామని, బెడోవిన్ పాలస్తీనీయులు చెప్పుకున్నా కోర్టు పట్టించుకోలేదు. పాలస్తీనా భూభాగాలను క్రమంగా దురాక్రమించి అక్రమ సెటిల్మెంట్లు నిర్మించే ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే హై కోర్టు తీర్పు చెప్పిందన్నది స్పష్టమే.

బెడోవిన్ పాలస్తీనీయులకు సహాయం అందించకుండా రెడ్ క్రాస్ సంస్ధను కూడా ఇజ్రాయెల్ సైనికులు అడ్డుకున్నారు. సోమవారం పాలస్తీనీయుల ఇళ్ళు, పశువుల కొట్టాలు, పిల్లల పాఠశాలలు అన్నీ కూల్చివేశారు. కూల్చివేత జరిగినప్పటికీ అక్కడి నుండి వెళ్లడానికి పాలస్తీనీయులు నిరాకరించారు. వారికి అత్యవసర సహాయం అందించడానికి మంగళవారం (సెప్టెంబర్ 17, 2013) ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సిబ్బంది, సహాయ సామాగ్రితో అక్కడికి వెళ్లారు. ఆహార పదార్ధాలు, గుడారాలు, పాత్రలు తదితర సామగ్రి ఇవ్వబోగా ఇజ్రాయెల్ సైనికులు అడ్డుకున్నారు. బుధవారం ఎలాగో కొన్ని గుడారాలు నిర్మించడంలో రెడ్ క్రాస్ సఫలం అయింది. కానీ ఐ.డి.ఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) బలగాలు వచ్చి వాటిని కూల్చివేశాయి.

దానితో ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు, కూటముల రాయబారులు వారి సిబ్బందితో కలిసి సహాయం అందివ్వడానికి మరిన్ని సరఫరాలతో శుక్రవారం స్వయంగా వెళ్లారు. వచ్చీరాగానే ఐ.డి.ఎఫ్ బలగాల వాహనాలు వారిని చుట్టుముట్టాయి. రాయబారులు తాము తెచ్చిన సామాగ్రిని కిందకి దించడానికి వీలులేదని ఐ.డి.ఎఫ్ సిబ్బంది హుకుం జారీ చేశారు. రాయబారులు ప్రతిస్పందించే లోపుగానే దాష్టీకం ప్రారంభించారు. సహాయ ట్రక్కుల్లో ఉన్న సిబ్బందిని బైటికి ఈడ్చివేశారు. ఫ్రాన్స్ రాయబారిని ట్రక్కులోనుండి బైటికి లాగిపారేశారు. రాయబారులు, నిరాశ్రయులు కూడి ఉండగా వారి మధ్యకు స్టన్ గ్రెనేడ్లు విసిరారు. ఈ ఘర్షణలో స్ధానికులు గాయపడగా ఒక పెద్దాయన స్పృహ కోల్పోయాడు.

“ఇది నిజంగా షాకింగ్, దౌర్జన్య పూరితం. అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారమే మేము ఇక్కడ ఉన్నాము. ఈ విషయం మా ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తాము. జెనీవా సదస్సు ఆదేశాల ప్రకారం ఆక్రమించిన దేశం ఆక్రమిత ప్రాంత ప్రజల అవసరాలు తీర్చాలి. కానీ వీరిని రక్షించేవారే లేరు” అని ఇ.యు రాయబారి ఒకరు చెప్పారని హారెట్జ్ తెలిపింది.

“వాళ్ళు నన్ను ట్రక్కు నుండి బైటికి ఈడ్చేశారు. నేలమీదికి బలంగా నెట్టారు. రాయబార హోదాలో నాకు ఉన్న రక్షణను వారు అతిక్రమిస్తూ దౌర్జన్యానికి తెగించారు. ఇక్కడ అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించే పద్ధతి ఇదే” అని ఫ్రెంచి రాయబారి మేరియోన్ కేస్టింగ్ అన్నారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. తమ పశువుల మేతకు వినియోగించే చారిత్రక పచ్చిక బయళ్లను కూడా ఇజ్రాయెల్ తమ నుండి లాక్కుంటున్నదని ఈ సందర్భంగా పాలస్తీనీయులు చెప్పారు. మిలట్రీ వినియోగం కోసం అని కొన్నిసార్లు తీసుకుంటున్నారని అవి చివరికి ఇజ్రాయేలీయులకు అక్రమ సెటిల్మెంట్లు నిర్మించడానికి వినియోగిస్తున్నారని వారు తెలిపారు.

గత నెలలోనే ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతి చర్చలు తిరిగి ప్రారంభం అయ్యాయని అమెరికా ప్రకటించింది. ఈ చర్చలపై పాలస్తీనా ప్రజలకు భ్రమలేమీ లేవు. సిరియాపై దురాక్రమణ దాడికి తెగిస్తున్న నేపధ్యంలో అమెరికా మధ్యప్రాచ్యంలో శాంతికి కట్టుబడి ఉన్నామని చెప్పుకోడానికి మళ్ళీ చర్చల నాటకం ప్రారంభించింది.

తాజా ఘటన శాంతి చర్చలకు ఏ మాత్రం దోహదపడదని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. ఫ్రాన్స్ రాయబారి పట్ల వ్యవహరించిన తీరును బ్రిటన్ ఖండించింది. “ఇలాంటి కూల్చివేతల పట్ల మా అసంతృప్తిని ఇజ్రాయెల్ అధికారులకు పదే పదే వెల్లడిస్తూ వచ్చాము. అవి పాలస్తీనీయులకు అనవసర కష్టాలను కలిగిస్తున్నాయి. శాంతి ప్రక్రియకు హానికరంగా పరిగణించాయి. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం కూడా” అని జెరూసలేం లోని బ్రిటన్ రాయబార కార్యాలయం ప్రకటించిందని రష్యా టుడే తెలిపింది.

అయితే వాస్తవం ఏమిటంటే బ్రిటన్ వెలిబుచ్చే అసంతృప్తి కూడా అలంకార ప్రాయమే. ఇజ్రాయెల్ దురహంకార, జాత్యహంకార, దురాక్రమణ చర్యలన్నింటికీ ఐరోపా దేశాలు పరోక్ష మద్దతు అందిస్తున్నాయి. నిజానికి పాలస్తీనా గడ్డపై ఇజ్రాయెల్ దేశాన్ని సృష్టించిందే బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలు. ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు అక్రమం అని ఐరాసలో తీర్మానం ఆమోదించాయి కానీ, దానిని అమలు చేయడానికి ఐదు దశాబ్దాలుగా అవి చేసిందేమీ లేదు. పాలస్తీనీయుల ఇళ్ల కూల్చివేతను కేవలం ‘కష్టాలు కలిగించేవి’ గానే బ్రిటన్ రాయబార కార్యాలయం అభివర్ణించడంలోనే దాని నిర్లక్ష్యం, వంచన స్పష్టం అవుతోంది.

అయితే ఇజ్రాయెల్ కుమ్మక్కుదారుల ద్వారానే ఇజ్రాయెల్ దాష్టీకం ప్రపంచానికి తెలియాల్సి రావడం ఒక కోణంలో దురదృష్టకరం కాగా, మరో కోణంలో పాలస్తీనీయులు అనుభవిస్తున్న నిస్సహాయ పరిస్ధితిని వెల్లడిస్తోంది.

3 thoughts on “పాలస్తీనా: ఐరోపా రాయబారులపై ఇజ్రాయెల్ దాడి

  1. యాకయ్య గారు

    పాలస్తీనా-ఇజ్రాయెల్ సమస్య మీద భారీ గ్రంధాలే ఉన్నాయి. ప్రారంభం నుండి చరిత్ర ఇవ్వడం సాధ్యం అయ్యేది కాదు.

    ఒక సూచన. కింద సర్చ్ బాక్స్ (వెతుకు) లో పాలస్తీనా అని టైప్ చేసి వెతికితే కొన్ని ఆర్టికల్స్ వస్తాయి. ఇక మీ ఓపిక! తెలుగు టైపింగ్ కోసం కుడిపక్కన లేఖిని లింక్ ఇచ్చాను. అయినా వీలు కాకపోతే ఈ వ్యాఖ్యలోని పదాన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చెయ్యొచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s